డైలీ సీరియల్

పూలకుండీలు -38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లిదండ్రుల మాటల్లోని వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ఓ వంక ప్రయత్నిస్తూనే మరోవంక ‘‘మొత్తానికది ముసలోళ్లను బాగానే బుట్టలో వేసుకుంది. వీళ్ళతోటి లాభం లేదుగాని, నేనే ఒకసారి ఆ ఆర్‌ఎంపిగాడి ఇంటికెల్లి వాణ్ణి పట్టుకొని గట్టిగా నాలుగు ఉతుకులు వుతకుతా. అప్పుడు వాడే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కడుపులో వున్నదంతా కక్కుతాడు’’ అనుకుంటూ ఆలోచన చెయ్యసాగాడు.
ముసలోళ్ళిద్దరూ ‘కొడుకు ఏం చెబుతాడో’’ అనుకుంటూ ఆదుర్దాగా అతని వంకే చూడసాగారు.
అయితే ఎల్లయ్య వాళ్ళతో ఏమీ మాట్లాడకుండానే లేచి ‘‘ఇప్పుడే వస్తా’’ అంటూ బయటికి నడిచాడు.
‘‘ఇంత పొద్దునే్న యాడికి పోతావ్‌రా! ముందు మొకం కడుక్కుని ఇంత చాయన్నా తాగిపోదువుండు’’ అంటూ కొడుకును బ్రతిమాలారు.
వాళ్ళ మాటలను ఏ మాత్రం విన్పించుకోకుండా బయటకు వెళ్లిన ఎల్లయ్య నేరుగా ఆర్‌ఎంపి లింగయ్య ఇంటికి చేరుకున్నాడు.
కానీ అప్పటికే హైదరాబాద్ హాస్పిటల్లో ఎల్లయ్య చేసిన హంగామా అంతా వెంకటరెడ్డి ద్వారా ఫోన్లో తెలుసుకున్న ఆర్‌ఎంపి లింగయ్య ‘‘ఆ ఎల్లయ్యగాడు హైదరాబాద్ నుండి నేరుగా ఇక్కడికే రావచ్చు. వాడు వచ్చాడంటే మాత్రం కచ్చితంగా నా ఇంటిమీదికొచ్చి నానా బీభత్సం చేస్తాడు. వాడు రాకముందే ఓ నాలుగు రోజులపాటు ఎటన్నా జెండా ఎత్తేస్తే మంచిది’’ అన్న ముందుచూపుతో ఆ ముందు రాత్రే పిట్ట ఎగిరిపోయినట్టు ఎటో వెళ్లిపోయాడు.
గబగబా ఆర్‌ఎంపి లింగయ్య ఇంటికి చేరుకున్న ఎల్లయ్యకు అతను ఊళ్ళో లేడని తెలియడంతో ‘‘అబ్బా! వీడు నేనొస్తానని ముందుగానే పసిగట్టి ఎటో కొమ్ము తప్పించాడు!’’ అనుకుంటూ తిరిగి ఇంటికి కూడా వెళ్ళకుండా అటునుండి అటే భద్రాచలం పిల్లల దగ్గరికి బయలుదేరి వెళ్లాడు.

12
చాలా రోజుల తరువాత తండ్రి కన్పించడంతో పిల్లలంతా ‘‘నాన్నా! నాన్నా!’’ అంటూ పరుగెత్తుకొచ్చి అతని కాళ్ళకు చుట్టుకుపోయారు.
పిల్లలు అలా కాళ్ళకు చుట్టుకుపోవడంతో కడుపులోతుల్లోనుండి దుఃఖం సముద్రపు అలల మాదిరిగా కెర్లుకొస్తుంటే బలవంతాన అదిమి పట్టుకుంటూ వాళ్ళను దగ్గరికి తీసుకుని తను తీసుకుపోయిన అరటిపండ్లు తలో రెండు చేతిలో పెట్టాడు.
పిల్లలు ఆనందంగా అరటిపండ్లు వలుచుకు తింటుంటే ‘మీ అమ్మేది?’ ఆవిడను గురించి వాళ్ళేం చెబుతారో నన్న ఉద్దేశ్యంతో తెలివిగా అడిగాడు.
ఎల్లయ్యను చూడడంతోనే ముఖం చిట్లించుకుని చూస్తున్న అత్త జానకమ్మ ఆ మాటలు వినడంతోనే ‘‘పాపం! చిన్న పిల్లలు వాళ్లనడిగితే వాళ్ళేం చెబుతారు? నన్నడుగు చెబుతా’’ అంటూ ఒక్కసారిగా గొంతెత్తి గలగలా మాట్లాడసాగింది.
ఆవిడ ఎందుకలా ఒక్కసారిగా నోరు నెత్తిన పెట్టుకుని అరుస్తుందో అర్థంగాని ఎల్లయ్య ‘‘నేనేదో పిల్లలను అడుగుతుంటే మధ్యలో నువ్వెందుకట్లా మొరుగుతున్నావ్!’’ తన చుట్టూ గుమిగూడి వున్న పిల్లలను మెల్లగా పక్కకు జరుపుతూ అన్నాడు.
‘‘కాటికి కాల్లు సాపుకున్న ముసలోల్లను, అన్నానికి, మన్నుకు తేడా తెలవని పసిపోరగాల్లను తన ఎదానగొట్టి మగడు దేశాలమీద బోతే ఏ ఆడిదైనా ఏంజేస్తదో నా బిడ్డ కూడా అదే జేసిందిలే’’ అంటూ కస్సున లేసింది జానకమ్మ.
అత్త మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక నిలువుగుడ్లేసుకుని నిల్చుండిపోయాడు ఎల్లయ్య.
అల్లుని నిస్సహాయతను ఆసరాగా తీసుకున్న అత్త అదే అదనుగా భావించి ‘‘దాని తిప్పలేవో అది పడి పిల్లలను సాదుకుంటుంది. నీకిష్టమైతే వుండు లేకపోతే మల్లా బొంబాయి పో’’ అంటూ మరింత రెచ్చిపోయింది.
ఎప్పుడూ నోట్లో నాలుక లేనట్టే వుండే అత్తగారు ఆవిధంగా మాట్లాడటాన్ని జీర్ణం చేసుకోలేకపోయిన ఎల్లయ్య ఆఖరికి నోరు విప్పుతూ ‘‘నేనేం అడుగుతున్నా? నువ్వేం మాట్లాడుతున్నావ్’’ అన్నాడు ఆవిడ ముఖంలోకి చూస్తూ.
‘‘నేను బాగనే మాట్లాడుతున్నా, నువ్వే అడ్డగోలుగా మాట్లాడుతున్నావ్. ఐనా అన్నీ వదిలిపెట్టి ఇన్నాల్లు బొంబాయికి పారిపోయినోడివి ఇప్పుడేం కొంప మునగిపోయిందని గోల జేస్తున్నావ్? ఈ గోలంతా ఎందుగ్గాని ఇన్నాల్లు ఆగినోనివి ఇంకో రెండు నెల్లు ఆగరాదు. ఎట్లబోయిందో అట్ల అదే ఇల్లు చేరుద్దిగాని’’ అప్పటిదాకా జరిగిన ప్రతి విషయం తన ప్రమేయంతోనే జరిగినట్టు చెప్పకనే చెబుతూ అల్లునిమీద అదో రకమైన నిరసనను వ్యక్తం చేస్తూ మాట్లాడింది ఎల్లయ్య అత్త జానకమ్మ.
అంతలోనే...
బజారునుండి ఇంటికి వచ్చిన ఎల్లయ్య మామ జగ్గయ్య భార్య మాటలు వింటూనే ‘‘నువ్వు కొంచెం నోరు మూస్తవా లేదా?’’ అంటూ భార్యను గద్దించాడు.
‘‘నా నోరు మూయించడం గాదు గొప్ప, బండెడు సంసారాన్ని, పుట్టెడు అప్పుల్నీ పిల్లమీద వదిలి పూలరంగడి మాదిరిగా బొంబాయి బొయ్యి కూసున్నోని అట్లేందుకు జేసిందో నిలెయ్యి. అదీ మొనగాని తనమనిపించుకుంటది. అంతేగాని వూకె ఆడదానిమీద లేవడంగాదు గొప్ప’’ కంకర రోడ్డుమీద రోలర్ నడిచినట్టు దడ దడ మంటూ మాటల రవ్వలు రువ్వింది జానకమ్మ.
ఆ మాటలన్నీ తననే అన్నదా!? తన మీద పెట్టి అల్లుణ్ణి అన్నదా? అన్న విషయాన్ని ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయిన జగ్గయ్య జుట్టు పీక్కుంటూ ‘‘నీయమ్మ! నీ నోట్లో నోరు బెట్టడం అంటే పీతిలో కాలు పెట్టినట్లే లెక్క.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు