డైలీ సీరియల్

బంగారుకల -51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్నాళ్ళు విజయనగరంతో మిత్రత్వం నటించే పోర్చుగీస్ వాళ్ళు పశ్చిమతీరం నుండి తూర్పు తీరం చేరి శాంథోమ్ దాటి తిరుపతి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఎందరినో క్రైస్తవులుగా మార్చారు. రామరాయలు చేసేది లేక కందవోలుకు వెళ్ళిపోయాడు.
***
తిమ్మయ్య పిలుపుమేరకు అతని సమావేశ మందిరానికి చంద్రప్ప వచ్చాడు.
‘‘నీవేనా తిమ్మరుసుకు వేగుసాయం చేసిన పాటగాడివి?’’ వ్యంగ్యంగా అడిగాడు.
‘‘వారికి నాలాంటివారిది ఉడత సాయమే!’’ వినయంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘ఓహో! మాకు పాఠాలు నేర్పుతున్నావే! అన్నట్లు నీవు మహాగాయకుడివి కదా! నేడు మా గురించి నీ పాట వినాలని కుతూహలంగా ఉంది’’.
చంద్రప్ప మాట్లాడలేదు. అతని వౌనం తిమ్మయ్య అహాన్ని మరింత రెచ్చగొట్టింది.
‘‘తిరస్కారమా’’ హూంకరించాడు.
‘‘లేదు అమాత్యా! కృష్ణరాయల ఆస్థానంలో స్వేచ్ఛగా చేసిన గానాన్ని పంజరంలో బంధించకండి. కళాకారులను నిర్బంధిస్తే కళలు వికసించవు ప్రభూ’’ విన్నవించాడు చంద్రప్ప.
‘‘ఎంత పొగరు. నువ్వు పాడకపోతే నీ ఇల్లాలు...’’ అర్థవంతంగా వికటంగా నవ్వాడు తిమ్మయ్య.
చంద్రప్ప విచలితుడయ్యాడు. పాట పాడటానికి ఆలాపన మొదలుపెటాడో లేదో.. ఎవరూ ఊహించని రీతిలో తటాలున ఛురిక తీసి నాలుక తెగ్గోసుకున్నాడు చంద్రప్ప. రక్తం కారుతూ పడిపోయాడు. కళాకారునికి ఇష్టం లేకుండా కళని దోచుకోవటం ఎంతటి రాజులకైనా సాధ్యం కాదని నిరూపించాడు.
సభ నివ్వెరపోయింది. తిమ్మయ్య ఏమీ మాట్లడలేకపోయాడు.
అంతకుముందే ఆప్తుల వల్ల సభా సమాచారం తెలిసిన మంజరి పరుగు పరుగున చంద్రప్పను చేరింది. అప్పటికే అవసాన ఘడియల్లో వున్న చంద్రప్ప చేతిలోని కైజారుతో తానూ పొడుచుకొని అతని వక్షస్థలంమీద వాలిపోయింది ఆ కళామూర్తి.. ప్రేమమయి.
అమరులయిన ఆ కళాకారుల కోసం, దేశభక్తుల కోసం కన్నీరు పెట్టేవారు కూడా ఆ సభలో కరువైపోయారు. కళలకు కాణాచి అయిన విజయనగర సామ్రాజ్యం ఇద్దరు గొప్ప కళారాధకులను బలిగొన్న దుర్దినం అది.

14
రామరాయలు శయ్యాగృహానికి వచ్చాడు. తిరుమలాంబిక ఆప్యాయంగా ఎదురేగి కౌగిలించుకుంది. ఆపైన ఆయనకేసి చూస్తూ నిట్టూర్చింది.
‘‘దేవీ ఎందుకీ నిట్టూర్పు’’ రామరాయలు కనిపెట్టి అడిగాడు.
‘‘నాకెందుకో భయంగానే వుంది ప్రభూ! మా తండ్రిగారు శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి రాకముందు ఎన్నో కుట్రలు జరిగాయని మా తల్లి చెప్పింది. ఇప్పుడు ఈ విజయనగర అంతఃపురంలో అటువంటి కుట్రలేవో జరుగుతున్నాయనిపిస్తుంది. మిమ్మల్ని....’’
‘‘నా ప్రాణానికి ఏ అపాయం రాదు దేవీ! ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ రామరాయలనేం చేయలేరు’’ మీసము దువ్వాడా వీరుడు.
‘‘అయినా ఎవరిని నమ్మగలం. అంతా విషవలయంలో వున్నట్లుంది. మనం మళ్లీ వెళ్లిపోదాం’’ ఆవేదన వెలిబుచ్చింది తిరుమలాంబిక.
‘‘దేవీ! రాజప్రాసాదంలో కుట్రలు జరుగుతూనే వుంటాయి. ఎవరి మాటలు రూఢి కావు. జాగ్రత్తగా మెలగాలి. అందర్నీ నమ్మకూడదు’’ హితబోధ చేశాడు రామరాయలు.
‘‘అచ్యుతరాయల వారి ఆరోగ్యం సరిగా లేదట గదా’’ తిరుమలాంబిక ఆరా తీసింది.
‘‘అవును వారి భోగలాలసత్వం మితిమీరింది. రాజ్యంలో దొంగల బాధ అధికమయింది. వర్తకం, పరిశ్రమలు వెనుదిరిగాయి. యాత్రికుల కష్టాలకు లెక్కలేదు. పన్నులు పెంచటంవల్ల ప్రజలకు కోపంగా ఉంది. రాజ్య పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి’’.
తిరుమలాంబిక కనుల నీరు నిండింది.
‘‘మా తండ్రిగారు ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యాన్ని స్వర్ణమయం చేశారు. ఈనాడిలా...’’
రామరాయలామె కనుల నీరు తుడిచాడు.
‘‘‘ఇదంతా అచ్యుతరాయల వైఫల్యం. తిమ్మయ్య చేతుల్లో కీలుబొమ్మయినాడు. బీజాపూర్ వార్కి బానిసయ్యాడు. నేడో రేపో అతని చివరి దశ ముగుస్తుంది’’.
‘‘హతవిధీ! మరి విజయనగర సింహాసనానికి వారసులు?’’
‘‘వెంకట రాయలు కుమారుడే’’
‘‘ఆ పసివాడా’’ నిరుత్సాహపడింది తిరుమలాంబిక.
‘‘రాజెవరైనా అన్నిటికీ తిమ్మయ్యే కదా’’ రామరాయలు అసంతృప్తిగా అన్నాడు.
***
‘‘సేనాపతిగారూ వెంకటరాయల మరణాన్నీ, మా రాజ పట్ట్భాషేకాన్ని వెంటనే చాటింపు వేయండి’’ తిమ్మయ్య ఆజ్ఞాపించాడు.
‘‘వెంకట రాయల మరణమా’’ సేనాధిపతి కలవరపడ్డాడు.
‘‘అంతేగాదు. కాదన్నవారిని ఊచకోత కోయండి’’ తిమ్మయ్య క్రూర శాసనం చేశాడు.
సేనాపతి మొహం వెలవెలబోయింది. గత్యంతరం లేదు. తిమ్మయ్య రాజయ్యాడు. సైనికులకు జీతాలు లేవు. ప్రజలు అవసరాలు పట్టవు. తిమ్మయ్య బీజాపూర్ సుల్తాన్‌కు విపరీతంగా కానుకలు పంపి తనవాడిగా చేసుకున్నాడు. అతని చిత్ర విచిత్ర ప్రవర్తనకు ప్రజల రక్తం మరుగుతోంది. సామ్రాజ్యం కోసం ప్రాణాలు త్యాగం చేయగల సైనికులు చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తున్నది. వాళ్ళు అసహనం ప్రకటిస్తున్నారు. తిరుగబడుతున్నారు. తిమ్మయ్య స్వీయ ప్రాణరక్షణకు దక్షిణాన ఉన్న బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షాకు లేఖ పంపాడు. సైన్య సమేతంగా వచ్చి తనకి మద్దతు ఇవ్వమని.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి