డైలీ సీరియల్

యమహాపురి (కొత్త సీరియల్ ప్రారంభం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నరకపురి రోడ్డు...’’ అరిచాడు కండక్టర్.
బస్సులో లేడీస్ సీట్లోంచి చటుక్కున లేచి నిలబడింది లతిక.
మోకాలు దాటిన క్రీమ్ కలర్ ఫ్రాక్, ఆకుపచ్చ స్టాకింగ్స్, ఎత్తు మడమల జోళ్ళు. భుజానికి ఎయిర్ బ్యాగ్. చేతిలో వానిటీ బ్యాగ్.
కొంత వయసు. కొంత అందం. కొంత ఆధునికత. కొంత మధ్యతరగతి.
లతిక లేవగానే బస్సులో చాలామంది ఆమె వంక చూశారు.
బస్సు ఒక్క కుదుపుతో ఆగింది. లతిక ముందుకు తూలిపడబోయి తమాయించుకుంది. నెమ్మదిగా ముందడుగేసి అడుగుల వేగం పెంచి బస్సు దిగింది.
బస్సు వెళ్లిపోయింది.
లతిక ఒకసారి చుట్టూ చూసింది.
రోడ్డుకి అటూ ఇటూ దట్టంగా చెట్లు. ఆమె దిగిన చోట కాస్త ముందుగా రోడ్డు పక్కనుంచీ దారి.
లతిక ఆ దారిలోకి మళ్లీ ముందుకు నడిచింది. ఐదు నిముషాలు ఆగకుండా నడిచేక- బాట పక్కన ఓ చిన్న బంగళా వుంది. దానికి కంచె లేదు.
లతిక బంగళా గుమ్మం దాకా వెళ్లి తలుపు తట్టింది.
‘‘వస్తున్నా!’’ లోపల్నుంచి ఓ స్ర్తి గొంతు వినిపించింది.
లతిక ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూండగా తలుపు తెరచుకుంది.
చీర కనకాంబరం. జాకెట్టు గులాబి. కుంకుమ బొట్టు ఎరుపు. పళ్లు నలుపు. ఆమె శరీరంమీద ఏదీ దేనికీ మ్యాచ్ కాలేదు.
‘‘బాగున్నావా, కాంచన పిన్నీ’’ అంది లతిక నవ్వుతూ.
‘‘ఈ ప్రపంచంలో నేను కాక ఇంకెవరైనా బాగుంటారా? నిక్షేపంలా ఉన్నాను కానీ- అదేమిటే అంతలా చిక్కిపోయావు. జబ్బు పడ్డావా?’’ అంటూ నవ్విందామె.
కాస్త వికారంగా వున్న ఆమె ముఖానికీ, ఆమె అడిగిన ఆ ప్రశ్నకీ, ఆ నవ్వుకీ- కూడా మ్యాచింగ్ కుదరలేదు. లతిక ఆ ప్రశ్నకి బదులివ్వలేదు. నవ్వి ఊరుకుంది.
కాంచన కూడా తన ప్రశ్నకి జవాబు ఆశించినట్లు లేదు. ‘‘నువ్వు నవ్వితే చాలా బాగుంటావే, పిల్లా! పట్నంలో ఏ కుర్రాడో నీకు పడిపోయే ఉంటాడు’’ అంది.
‘‘ప్రేమా- అంటే ఏమిటి పిన్నీ?’’ అంది లతిక అమాయకంగా ముఖం పెట్టి.
కాంచన నిట్టూర్చి, ‘నరకపురి అమ్మాయిలకి ప్రేమంటే తెలియకూడదని మర్చిపోతూంటానమ్మా! అడిగినందుకు ఏమీ అనుకోకు. వెళ్లి బట్టలు మార్చుకో’’ అంది.
లతిక పక్కనున్న గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.
‘‘ఆ బట్టల్లో నిక్షేపంలా ఉంది పిల్ల. కానీ అవి తీసే తెలుగు సంప్రదాయపు దుస్తుల్లోకి మారిపోవాలి. ఇదేం నియమమో నరకపురికి!’’ అనుకుంది కాంచన. అంతలోనే, ‘‘ఆ నియమంవల్లనే కదా- నాకిక్కడ ఈ డ్యూటీ పడింది. దీంతో తిండి, బట్ట సుఖంగా వెళ్లిపోతోంది. అంతా మన మంచికే’’ అని కూడా అనుకుంది.
పది నిముషాల్లో వెనక్కి వచ్చింది లతిక.
ఆమెని కళ్లప్పగించి చూసింది కాంచన.
బోలెడు బుల్లి బుల్లి చందమామలున్న ఆకాశపు రంగు పరికిణి. అలాంటిదే జాకెట్టు. ఉందో లేదో అనిపించే నడుమును, ఉన్నా కనపడనివ్వకుండా చుట్టిన చీకటి లాంటి ఓణీ. కాళ్లకి సాదా చెప్పులు. హైహీల్సునీ, వ్యానిటీ బ్యాగునీ మింగి కాస్త బరువెక్కినట్లున్న ఎయిర్ బ్యాగ్- భుజానికి!
‘‘నరకపురికి వెడుతోంది, దేవతలా...’’ అనుకుంది కాంచన.
‘‘వస్తాను పిన్నీ’’ అంది లతిక.
‘‘ఊ’’ అని ‘‘పిల్లా- కాస్త లావెక్కవే- నీ డ్రెస్సు నాకూ సరిపోయేది. ఊరి బయటే ఉన్నాగా- ఎవరి డ్రెస్సులైనా సరదాగా ఓసారి వేసుకుని చూడొచ్చు. కానీ, ఏదీ - డ్రెస్సులేసుకునే వాళ్లు నీకులా నాజూగ్గా ఉంటున్నారు. నాకులా ఉన్నవాళ్లు పరికిణిలో, చీరలో తప్ప కట్టరు’’ అంది కాంచన నవ్వుతూ.
లతిక కూడా నవ్వి, సెలవు తీసుకుందుకు చేతులూపింది. బంగళాలోంచి బయటపడి- మళ్లీ నడక కొనసాగించింది. ఐదు నిముషాల్లో ఆమె నరకపురి చెక్‌పోస్టు చేరుకుంది.
ఊళ్లోకి వెళ్లాలన్నా, ఊర్నించి పోవాలన్నా అక్కడ అనుమతి తీసుకోవాలి.
చెక్‌పోస్టు దగ్గిర ఒకడు నిలబడి ఉన్నాడు. వాడు పొట్టిగా నల్లగా వికారంగా యమభటుడిలా ఉన్నాడు.
‘‘బాగున్నావా- అప్పన్నా!’’ అంది లతిక.
అప్పన్న ఆమెని చూసి ‘‘లతిక కదూ! సెలవులకొచ్చావా?’’ అన్నాడు.
‘‘ఊ’’ అంది లతిక.

- ఇంకా ఉంది

వసుంధర