డైలీ సీరియల్

యమహాపురి- 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒరేయ్ గణపతీ- లతిక సెలవులకొచ్చింది. రాసుకో. చేతికి వాచీ ఉందిగా- టైం కూడా వేసుకో’’ అన్నాడు అప్పన్న.
పక్కనే ఓ బల్ల వెనుక కుర్చీలో కూర్చున్న ఓ సన్నని పొడుగాటి వ్యక్తి- తన ముందున్న పుస్తకంలో ఆ వివరాలు రాసుకున్నాడు.
‘‘వెళ్ళొచ్చు’’ అన్నాడు అప్పన్న.
లతిక ఊళ్లో అడుగుపెట్టింది. చుట్టూ ఓసారి చూసి భారంగా నిట్టూర్చింది.
చెట్లు, చెరువులు, పొలాలు, సెలయేరు- ఆ ఊరి ప్రకృతి అందాలు.
పశువులు, పక్షులు, సరీసృపాలు- ఆ ఊరి జీవజాలం.
వృద్ధులు, బాలలు, యువత, శ్రామికులు, కర్షకులు- ఆ ఊరి మనుషులు.
తను అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది. ఆ ఊరి అందాలతో, జీవజాలంతో, మనుషులతో తనకి చెప్పుకోతగ్గ అనుబంధముంది. కానీ తనకి అక్కడుండాలని లేదు. ఆ అనుబంధాన్ని నిలబెట్టుకోవాలని లేదు. ఎందుకు?
‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’’ అన్నాడట శ్రీరాముడు లక్ష్మణుడితో.
మరి తనకలా అనిపించదేం? స్వర్గం మాటటుంచి- తన ఊరి పేరే నరకపురి.
‘‘మన ఊరి పేరు నాకపురి! నాకం అంటే స్వర్గం. కానీ మన ఊరి పెద్దకి ఆ పేరు నచ్చలేదు. నరకపురిగా మార్చేశాడు. ఆయనకి నరకం అంటే ఎంతిష్టమంటే- తన పేరు ధర్మరాజైతే, యమధర్మరాజుగా మార్చుకున్నాడు. అందర్నీ యమా అని పిలవమన్నాడు’’ చెప్పింది చిన్నప్పుడోసారి తల్లి.
నరకం అంటే లతికకి అప్పుడు అంతగా తెలియదు. ‘‘పేరేదైతేనేం?’’ అనుకుంది.
అనుమతి లేకుండా ఊళ్లోకి ఎవరూ రాకూడదంటే- నేరస్థులకి భయపడక్కర్లేదులే అనుకుంది. అనుమతి లేకుండా ఊర్నించి ఎవరూ బయటకు పోకూడదంటే- దొంగలు పారిపోలేరులే అనుకుంది.
ఆ ఊళ్లో నియమాలన్నీ కూడా ఆమెకు బాగానే అనిపించాయి.
ధాన్యం, కాయగూరలు- ఎవరు పండించినా, ఎవరింట పండినా- వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు. అన్నీ ఊరి పెద్దకే ఇవ్వాలని అక్కడ నియమం. ఊరి పెద్ద ప్రతి కుటుంబానికీ ఏ రోజు కారోజు దినవెచ్చాలు ఇస్తాడు. వారి ఇష్టానుసారం కాకపోయినా, తన ఇష్టానుసారం ఊందరి అవసరాలూ తీరుస్తాడు.
ఆ ఊళ్ళో పొలాలు కానీ, ఇళ్లు కానీ, పశువులు కానీ ఎవరికీ స్వంతం కావు. అన్నీ ఊరి పెద్ద యమవి.
తిండికి లోటు లేదు. ఉండడానికి ఇళ్లున్నాయి. కట్టడానికి బట్టలున్నాయి. ఏవీ స్వంతం కాకపోతేనేం- జీవితం బాగానే వెళ్లిపోతోందిగా- అనేది తల్లి. నిజమేగా అనుకునేది లతిక.
ఆ ఊళ్లో ఓ బడి ఉంది. ఆ బడిలో మిగతా సబ్జెక్ట్సుతోపాటు - యమ గురించి చెప్పడానికి ప్రత్యేకంగా ఓ టీచర్ ఉండేవాడు. మిగతా పాఠాలు ఒక రోజుండొచ్చు, ఒక రోజుండకపోవచ్చు కానీ యమ ‘పాఠాలు’ మాత్రం రోజూ వినడం పిల్లలకి తప్పనిసరి.
రోజూ వినడంవల్ల జ్ఞాపకశక్తి తక్కువైన పిల్లలకి కూడా ఆ పాఠం కంఠతా వచ్చేసేది.
‘‘ఈ భూమీద అనంతకోటి జీవాలున్నాయి. వాటన్నింటిలోకీ శ్రేష్ఠుడు మనిషి. కానీ అన్ని ప్రాణులూ సుఖంగా జీవిస్తుంటే మనిషి ఒక్కడూ అష్టకష్టాలూ పడుతున్నాడు. కారణం- ఇది నాది అనుకునే స్వార్థచింతన. ఇది నేను చేశాను అనుకునే అహం. ఈ రెండింటి కారణంగా మనిషి పాపాలకు పాల్పడుతున్నాడు. వాటిని పోగొట్టుకునేందుకు ఆలయాలకు వెడుతున్నాడు. పూజలు చేస్తున్నాడు. కానీ చేసిన పాపాలు అలా పోవు. ప్రతి మనిషీ తను చేసిన పాపాలకు శిక్ష అనుభవించి తీరాలి. అప్పుడే మనిషికి మోక్షం. మనిషిని తగిన విధంగా శిక్షించి, పాప విముక్తుణ్ణి చెయ్యడం కోసం దివి నుంచి భువికి దిగివచ్చిన మహానుభావుడు యమ. నరకపురి వాసుల అదృష్టంకొద్దీ ముందీ ఊరొచ్చాడు. పౌరులంతా ఈ ఊళ్ళో ఉన్నంతకాలం ఆయన్ని దేవుడిగా భావించాలి. తమ సర్వస్వాన్నీ ఆయనకి ధారపోసి ఆయన కరుణకు పాత్రులు కావాలి...’’
ఈ మాటలు గుర్తుండడమే కాదు- చిన్నప్పుడే మనసులో నాటుకుపోయాయి లతికకి. ఆమె క్లాసులో చెప్పిన మిగతా పాఠాలన్నీ, పరీక్షల కోసమే గుర్తుపెట్టుకునేది. ఈ మాటలు మాత్రం నిజాలని నమ్మేది.
యమ ఆ ఊరికి రక్షకుడు, దేవుడు. ఊరి జనం ఆయనకి సేవలు చేస్తారు. స్త్రోత్రాలు చేస్తారు. ఆయన తిట్టినా ఎదురు మాట్లాడరు. కొట్టినా ఎదురు తిరగరు. ఆయన అనుమతి లేకుండా ఏ పనికీ పూనుకోరు. ఆయన ఆజ్ఞాపిస్తే- కష్టనష్టాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా- చెప్పింది చెప్పినట్లు చేస్తారు.
లతిక తల్లి, తండ్రి అలాగే చేస్తున్నారు. అలాగే చెయ్యమని లతికకి చెప్పారు. లతిక చేస్తోంది.
అలా లతిక ఆ ఊరి స్కూల్లోనే టెన్తు చదివి ప్యాసయ్యింది. ఆమెకి ఇంకా చదవాలనుంది. తండ్రికి చెప్పింది.
‘‘దేవుడు దయ తలిస్తే అలాగే చదువుదువుగాని’’ అన్నాడు లతిక తండ్రి.
దేవుడు అంటే యమ. ఆయన దేవుడు కాబట్టి దయ తలుస్తాడనే అనుకుంది లతిక.
లతిక తండ్రి వెళ్లి కూతురికి చదువుపట్ల ఉన్న ఆసక్తి గురించి చెప్పాడు యమకి.
‘‘అలాగంటారు కానీ ఆడపిల్లలకి చదువు కంటే పెళ్లిమీదే దృష్టి ఎక్కువ. ఓ మూడేళ్లు ఇంట్లో కూర్చోమను. అప్పుడు పెళ్లి కావాలంటే పెళ్లి. చదువు కావాలంటే చదువు. సరేనా?’’ అన్నాడు యమ. కానీ మూడేళ్లు గడిచినా లతిక చదువుకే కట్టుబడిందని తెలిసి- యమ ఒకసారి లతికని చూడాలన్నాడు.
తను తండ్రితో కలిసి ఆ దేవుడి దర్శనానికి వెళ్లినప్పటి దృశ్యం ఇప్పటికీ లతిక కళ్లకు కడుతుంది.
అప్పుడు యమ గళ్ల లుంగీ వేసుకున్నాడు. వంటిమీద చొక్కా లేదు. మెడలో బంగారు గొలుసు వేలాడుతోంది. ముఖానికి యమధర్మరాజు మాస్కు ఉంది.
ఆయన ఎదురుగా ముప్ఫై ఏళ్ళ యువకుడున్నాడు. వాడి వంటిమీద గోచీ తప్ప ఏమీ లేదు.
‘‘రోజూ బాగానే పాలిచ్చేదండి. ఎందుకో బర్రె ఈవేళ ఫెడీమని తన్నిందండి. పాలన్నీ నేలపాలయ్యాయి’’ అన్నాడా యువకుడు. వాడాయన ఇంట్లో పాలు తీసే పాలేరు.
‘‘ఎలా తన్నిందిరా, ఇలాగా’’ అంటూ వాణ్ణి ఫెడీమని తన్నాడాయన. పాలేరు ఎగిరి అంత దూరాన పడ్డాడు. లేవడానికి చేతులు నేలకానితే- అక్కడ చిల్లపెంకు ముక్కలున్నాయి. అరచేతులు గీరుకున్నాయి.
ఆ దృశ్యం చూడగానే లతికకి గుండె గుబగుబలాడింది.
పాలేరు ముఖంలో బాధ లేదు సరికదా, చిరునవ్వుంది. వాడు నెమ్మదిగా లేచి ‘‘ఇలా తన్నడానికి బర్రెకు మీ బలమెక్కడిది బాబూ!’’ అని ఆయనకు చేతులు జోడించాడు.
యమ ఇంకా ఏదో అనేవాడేమో- కానీ అప్పుడే లతికని చూశాడు. ‘‘ఇంటర్ చదువుతానంటున్న పిల్ల ఇదేనా?’’ అనడిగాడు లతిక తండ్రిని.
‘‘ఔనండి’’ అన్నాడు లతిక తండ్రి వినయంగా.
‘‘పిల్ల బాగా పెద్దదయిందే, ఏదీ చూస్తాను, ఇలారా!’’ అన్నాడు యమ.
లతిక తలొంచుకుని నెమ్మదిగా అడుగులేసి, కంటికి ఆయన పాదాలు కనపడ్డంతో ఆగి చుటుక్కున వంగి కళ్లకద్దుకుని లేచింది.

ఇంకా ఉంది

వసుంధర