డైలీ సీరియల్

యమహాపురి - 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లతిక మాట్లాడలేదు. తల్లి మాటల్నే తలచుకుంటూ, ‘‘ఓ అసాధారణ వ్యక్తి! నువ్వంటూ ఉన్నావా, ఉంటే ఎక్కడున్నావు?’’ అనుకుంది మనసులో.

2
ఆరడుగల ఎత్తు. పచ్చని ఛాయ. కాకీ యూనిఫాంలో హుందాగా ఉన్న అతడు అక్కడ ఆ బంగళా గేటు ముందు ఆగాడు. ‘మధురాపురి పోలీస్ స్టేషన్, మహానగరం’ అన్న బోర్డు చదివి లోపల అడుగెట్టాడు.
గేటు వద్ద ఉన్న కాపలా జవాన్ చటుక్కున లేచి నిలబడి అతడికి సెల్యూట్ కొట్టాడు.
అతడు ఆగి, ‘‘యూనిఫాం వేసుకొస్తే చాలు, సలాం కొట్టడం అలవాటా నీకు?’’ అన్నాడు.
‘‘అది నా డ్యూటీ సార్!’’ అన్నాడు జవాన్. అతడి ముఖంలో ఏ భావాలూ లేవు.
‘‘ఓ దొంగ పోలీసు యూనిఫాం వేసుకుని, జేబులో బాంబులు పెట్టుకుని ఇక్కడికొచ్చాడనుకో- సెల్యూట్ కొట్టి లోపలికి పంపిస్తావా? చెక్ చెయ్యవా?’’ అన్నాడు శ్రీకర్ గంభీరంగా మొహం పెట్టి.
‘‘దొంగొచ్చినా సరే, పోలీస్ యూనిఫాంలో వుంటే సెల్యూట్ చేస్తాను సార్! నా సెల్యూట్ మనిషికి కాదు, యూనిఫాంకి. ఆ యూనిఫాంని గౌరవించడంలో నాకానందముంది సార్’’ అన్నాడు జవాన్.
‘‘గుడ్’’ అని నవ్వి, ‘‘యూనిఫాంకి సెల్యూట్ చేసినా, స్టేషనుకి కొత్తవాళ్లొస్తే, ముందు మనిషిని చెక్ చెయ్యాలిగా- వాళ్లలో నేరస్థులో, తీవ్రవాదులో ఉండొచ్చు’’ అన్నాడతను.
‘‘కొత్తవాళ్లయినా, స్ట్ఫాని చెక్ చెయ్యను సార్!’’ అన్నాడు జవాన్.
‘‘నేను స్ట్ఫానని నీకెవరు చెప్పారు?’’ ఆశ్చర్యంగా అడిగాడతడు.
‘‘నా మొబైల్‌లో మీ ఫొటో వుంది సార్! ఈ రోజు మీరొస్తారని అందరికీ తెలుసు సార్!’’ జవాన్ ముఖంమీద తొలిసారిగా చిరునవ్వు.
అతడిక మాట్లాడలేదు. చకచకా ముందుకి నడిచి గుమ్మం దగ్గిర ఆగాడు.
సాధారణంగా పోలీస్ స్టేషన్ భవనాలకి పని వేళలో తలుపులు మూసి ఉండవు. కానీ అక్కడ అద్దాల తలుపులుండడం అవి మూసి ఉండడం చూసి ఆశ్చర్యపడి గుమ్మం దగ్గిరే ఆగిపోయాడు శ్రీకర్.
బయటివాళ్ళు లోపలి వాళ్లకి కనిపిస్తారేమో కానీ లోపలివాళ్లు బయటి వాళ్లకి కనిపించని అద్దాలవి.
శ్రీకర్ చూస్తుండగా తలుపులు తెరచుకున్నాయి. ఓ వ్యక్తి గుమ్మం దాటి వచ్చి, ‘వెల్‌కమ్ మిస్టర్ ఇన్స్‌పెక్టర్ శ్రీకర్’ అన్నాడు. శ్రీకర్ అతణ్ణి పరీక్షగా చూశాడు.
ఇంచుమించు తనంత ఎత్తు, కొద్దిగా నెరుస్తున్న జుత్తు, రంగు చామనచాయ. ముఖంలో ఆహ్వానపూర్వకమైన చిరునవ్వు. కరచాలనానికి ముందుకి చాచిన చెయ్యి..
‘‘ఇన్స్‌పెక్టర్ ఈశ్వర్?’’ అంటూ శ్రీకర్ అతడితో కరచాలనం చేశాడు.
ఈశ్వర్ అతణ్ణి లోపలకు తీసుకెళ్ళాడు. తమంత తామే తెరచుకున్న ఆ తలుపులు వాళ్లు గుమ్మం దాటి లోపలకు వెళ్లగానే, వాటంతటవే మూసుకున్నాయి. లోపల అడుగెట్టగానే చల్లగా హాయిగా అనిపించింది.
‘‘మొత్తం స్టేషనంతా సెంట్రలైజ్డ్ ఏసీ. మన దేశంలో ఒక మామూలు పోలీస్ స్టేషన్‌కి ఇన్ని సౌకర్యాలా? హేట్సాఫ్ టు యూ ఈశ్వర్’’ అనుకున్నాడు శ్రీకర్.
లోపల ఓ హాలు. దాన్ని ఆనుకుని అటు రెండు, ఇటు రెండు గదులు. ఎదురుగా ఒక గది. దానికి అటూ ఇటూ రెస్ట్ రూమ్స్- ఎడమ పక్క ఆడవాళ్లకి, కుడి పక్క మగవాళ్లకి.
‘‘ఆ టాయ్‌లెట్స్ స్ట్ఫాతోపాటు, పబ్లిక్ కోసం కూడా. అవికాక ఇక్కడున్న ప్రతి రూంకీ అటాచ్డ్ టాయ్‌లెట్సున్నాయి’’ అన్నాడు ఈశ్వర్.
శ్రీకర్ ఆశ్చర్యంగా చూస్తూ,, ‘‘వారెవా! ఇది పోలీస్ స్టేషన్ కాదు. సాఫ్ట్‌వేర్ ఆఫీసులా వుంది’’ అనుకున్నాడు.
హాల్లో ఒక పక్క విజిటర్స్‌కోసం సోఫాలున్నాయి. మధ్యలో రెండు టేబుల్స్. వాటికి ఎదురుగా కుర్చీలు. ఒక టేబుల్ వెనుక హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం కూర్చున్నాఢు అతడికి సుమారు నలభై ఏళ్లుండొచ్చు. రెండో టేబుల్ వెనుక రైటర్ రాఘవ కూర్చున్నాడు. అతడి వయసు నలభై లోపే అనిపిస్తుంది.
ఇద్దరికీ టేబుల్స్‌మీద కంప్యూటర్ మానిటర్లున్నాయి.
ఈశ్వర్, శ్రీకర్ దగ్గిరకు రాగానే ఇద్దరూ లేచి నిలబడి సెల్యూట్ చేశారు.
‘‘తెలుసుగా, ఇన్స్‌పెక్టర్ శ్రీకర్! ఈరోజునుంచి ఈ స్టేషన్‌కి బాస్. నాకులాగే ఇతడికీ మీరు మీ కోఆపరేషన్ అందివ్వాలి’’ అన్నాడు. వాళ్లు వినయంగా తలలూపారు.
తర్వాత ఇద్దరూ హాలుకి కుడిపక్క మొదటి గదిలోకి వెళ్లారు. అందులో ఓ కంప్యూటర్ టేబుల్. దాని వెనుక ఓ పాతికేళ్లలోపు యువకుడు కంప్యూటరే తన ప్రపంచం అన్నట్లు చాలా బిజీగా ఉన్నాడు.
‘‘మిస్టర్ గంగా!’’ అన్నాడు ఈశ్వర్ గట్టిగా. గంగాధరం ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు.
‘‘మీట్ యువర్ న్యూ బాస్’’ అన్నాడు ఈశ్వర్.
గంగాధరం, శ్రీకర్ కరచాలనం చేసుకున్నారు.
‘‘కంప్యూటర్ ఆపరేటర్ గంగాధరం! బిటెక్ ప్యాసై రెండేళ్లయింది. ఫస్ట్ సర్వీస్ ఇక్కడే! జీనియస్‌లే! ఈ స్టేషన్ని పూర్తిగా కంప్యూటరైజ్ చేసిన ఘనత గంగాదే’’ అన్నాడు ఈశ్వర్.
‘‘మన సార్ మన పీవీ లాంటి మేధావి సార్! నేను చేసే రొటీన్ వర్క్‌కే- నేనో మన్‌మోహన్‌సింగ్ అన్నంత బిల్డప్ ఇస్తారు. తను క్రెడిట్ తీసుకోరు!’’ అన్నాడు గంగాధరం.
‘‘ఈశ్వర్ సార్ మాటల్ని నాకు నేను అనలైజ్ చేసుకుంటాను కానీ, నన్ను బాస్ అనుకోవద్దు. వియార్ జస్ట్ కొలీగ్స్. ఇది పోలీసు డిపార్టుమెంటైనా, అదంతే!’’ అన్నాడు శ్రీకర్.
‘‘నా మాటల్ని కాదు- నువ్వు అనలైజ్ చేయాల్సింది ఈ స్టేషన్లో ఉన్న సౌకర్యాల్ని చూడు. పోలీస్ స్టేషన్ బయటనుంచి లోపల అన్ని గదులకీ కూడా సిసి కెమెరాలున్నాయి. ఎవరెక్కడున్నా ఎప్పటికప్పుడు అందరూ మానిటర్లలో చూసి తెలుసుకోవచ్చు. ఏ గదిలో ఎవరికి చిన్న ప్రమాదమోచ్చినా వెంటనే స్టేషన్ మొత్తం అలర్ట్ ఔతారు.

- ఇంకా ఉంది

వసుంధర