సెంటర్ స్పెషల్

రణక్షేత్రం -24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జరిగిన దాన్ని మార్చలేము. జరగవలసిన దాని గురించి ఆలోచించు...’ అన్నాడు ఒక ప్రముఖ నిర్మాత.
‘సినిమా విడుదలకు ఇంకా పదిరోజులుంది. పైరేటెడ్ వెర్షన్ ఇప్పుడు రిలీజయితే, సినిమా రిలీజ్ నాటికి చూడటానికి ఎవరూ మిగలరు’ అన్నాడు భరత్.
‘సినిమా విడుదల ముందుకు జరిపితే...’ నా ఐడియా వివరించాను.
‘ఒకటా, రెండా... 1300 థియేటర్లలో రిలీజ్‌కి ప్లాన్ చేశాం. ఈ శుక్రవారం రిలీజవుతున్న వేరే సినిమాలతో ఆ థియేటర్లన్నీ బుక్ అయి ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు రిలీజ్ చెయ్యాలంటే థియేటర్లు దొరకవు. దొరికినా మంచి థియేటర్లు దొరకవు’
‘అదీగాక బయ్యర్లందరూ ఇంకా మనకు ఇవ్వవలసిన డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు. వాళ్లు ఇచ్చే డబ్బుతో పూర్తి చేయవలసిన ఫార్మాలిటీలు కొన్ని ఉన్నాయి’
చుట్టూ చేరిన వారు తలా ఒక సలహా చెప్తున్నారు.
ఒక బయ్యర్‌తో మాట్లాడి చూశాను. ఈ విషయం అప్పుడే అతనికి తెలిసిపోయిందనుకుంటాను. ‘సారీ చంద్రంగారూ! మనం అగ్రిమెంట్ అయిన మొత్తం కొన్ని షరతులతో కూడుకున్నది. మీరు సినిమాకి మంచి పబ్లిసిటీ ఇవ్వాలి. మేము మంచి థియేటర్లు రెడీ చేసుకోవాలి. అప్పుడు రిలీజ్ ముందుకు జరపటం అంటే, పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేస్తున్నట్లవుతుంది. కాబట్టి ముందు అనుకున్న డబ్బులు ఇప్పుడు ఇవ్వలేను. ఇప్పటికి మీకు ఇచ్చిందే ఎక్కువ కాబట్టి, నా దగ్గర నుండి ఇక డబ్బులు ఆశించకండి...’ అన్నాడు.
‘ఏమన్నాడు?’ అందరూ ఆత్రుతగా అడిగారు.
‘కుదరదన్నాడు’ క్లుప్తంగా చెప్పాను.
‘అయితే మరో మార్గం ఏదైనా చూడండి...’ మరో వ్యక్తి సలహా ఇచ్చాడు.
‘ఏదో ఒకటి చేసి బ్లాక్‌మెయిలర్ అడిగిన డబ్బులు ఇస్తే...’ ఇంకో సలహా వచ్చింది.
‘ప్రస్తుతం మరో పైసా కూడా పుట్టించే పరిస్థితుల్లో నేను లేను. అలాంటిది పది కోట్లు తేవటం అసాధ్యం...’ తేల్చి చెప్పాను నేను.
‘ఊరుకో చంద్రం..!’ ఓదార్చాడు ఒకాయన. ‘మనం కూడా ఏమీ తెలియనట్లు ఉండిపోయి అనుకున్న రోజే సినిమా రిలీజ్ చేద్దాం...’
‘మనం ఊరుకున్నా, మీడియా ఊరుకుంటుందా? ఏ మాత్రం విషయం లీక్ అయినా మరుక్షణం రాష్ట్రం అంతా పాకిపోతుంది’
‘డోంట్‌వర్రీ! మీడియాని మేనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను...’ అన్నాడు ఒకాయన. ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏనాటి నుండో పాతుకుపోయాడు. పెద్ద మనిషిగా పేరుంది. ‘మీడియా వారి సహకారం అర్థిస్తే, ఇలాంటి మంచి పని కోసం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచటానికి మీడియా కూడా సహకరించవచ్చు..’ చెప్పాడు.
‘ఆ ఛాన్సు కూడా లేదు సార్..!’ భరత్ ల్యాప్‌టాప్ నుండి తల పైకెత్తుతూ అన్నాడు.
‘ఏం?’ అందరూ ఒక్కసారిగా అన్నారు.
అతను ఏమీ మాట్లాడకుండా ల్యాప్‌టాప్ వారి వైపు తిప్పి వాల్యూమ్ పెంచాడు. ఒక న్యూస్ టీవీ చానెల్‌లో వస్తోంది. అందులో వస్తున్న వార్తల్లో వసుంధర స్పీచ్ వినిపిస్తోంది.
‘సినిమా ఎలా ఉంది మేడమ్?’ మైకులన్నీ మొహానికి అడ్డు పెడుతూ, ఎగబడుతూ అడుగుతున్నారు మీడియా మనుషులు.
‘చాలా బాగుంది. నాకున్న సినీ పరిజ్ఞానంతో చెప్తున్నాను. ఇంత మంచి సాంకేతిక విలువలతో తీసిన సినిమాని ఈ మధ్యకాలంలో చూడలేదని మాత్రం చెప్పగలను’
‘చంద్రంగారి అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఇంకొక పదిరోజులు ఎదురు చూడలేకపోతున్నారు మేడమ్...’
‘వారి ఆత్రుత నేను అర్థం చేసుకోగలను...’ తన కారు వైపు అడుగులు వేస్తూ అంది వసుంధర.
ఇక అడగటానికి ఏమీ లేనట్లు మీడియా వాళ్లు కూడా తమ సామాగ్రి సర్దుకోబోతూ ఉంటే ఏదో గుర్తు వచ్చినట్లు ఆమె ఆగి... మరలా వెనుదిరిగి వారి దగ్గరకు వచ్చింది. ‘మీరు అడగకపోయినా చెప్పవలసిన ధర్మం నాకుంది కాబట్టి చెప్తున్నాను. పైరసీ అన్నది సినీ ఇండస్ట్రీకి పట్టిన పెద్ద జాఢ్యం అయింది. ఇన్నాళ్లుగా జరుగుతున్న పైరసీ ఒక ఎత్తయితే, ఈ రోజు వెలుగులోకి వచ్చిన విషయం పూర్తిగా సినీ ఇండస్ట్రీని కుప్పకూల్చేదిగా ఉంది. అందుకే రేపు ఉదయానే్న ముఖ్యమంత్రిగారి దగ్గరకు వెళ్తున్నాను. ఇక ముందయినా ఇలాంటి విషయాలు జరగకుండా చూడటానికి ఏమి చెయ్యాలో కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం...’ అని చెప్పి ఆ తరువాత ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా వెళ్లి తన కారులో కూర్చుని వేగంగా అక్కడ నుండి వెళ్లిపోయింది.
అది విన్న విలేకర్లందరూ విషయం తెలిసీ, తెలియక తమలో తాము చర్చించుకుంటున్నారు.
ఆ మాత్రం క్లూ ఇస్తే మిగిలిన సమాచారం వారే బయటకు తీస్తారని నాకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం అయింది. వసుంధర నన్ను గుర్తు పట్టటమే కాదు, నా పతనాన్ని కోరి కావాలనే ఇలా చేసిందని.
నాకు ఇంకో విషయం కూడా అర్థం అయింది - ఈ భూమీద నన్ను ఈ కుట్ర నుండి బయట పడేయగలిగింది ఒక్క వసుంధరే అని.
* * *
వసుంధర ఇంటికి వెళ్లిన నన్ను గేటు దగ్గరే ఆపేశాడు సెక్యూరిటీ ఆఫీసర్.
ఎంత పెద్ద హీరో అయినా మినిస్టర్ ఇంటి ముందు మామూలు మనిషే! అతను ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుని నన్ను లోపలకు పంపాడు.
అసలు ఆమె నన్ను లోపలకు రానిస్తుందనుకోలేదు. బహుశా నా బాధ ప్రత్యక్షంగా చూసే ఛాన్సు వదులుకోవటం ఇష్టంలలేక నన్ను అనుమతించిందేమో... అనుకున్నాను.
లోపలకు వెళ్లి హాలులోని సోఫాలో కూర్చున్నాను. ఎప్పటికో వచ్చింది ఆమె.
‘మీరు నన్ను గుర్తుపట్టారో లేదో తెలియదు. నేను మాత్రం మిమ్మల్ని నిన్న ప్రివ్యూ దగ్గర చూసేవరకూ ఆనాడు నేను అవకాశం ఇవ్వబోయిన అమ్మాయి, మీరు ఒకరేనని అనుకోలేదు...’ అన్నాను.
ఆమె నా కళ్లలోకి లోతుగా చూసింది. ఆ చూపు నా మనసును చదవటానికి అన్నట్లు తీక్షణంగా ఉంది. నేను కూడా అంత తిన్నగా ఆమె కళ్లలోకి చూశాను.
కాసేపటికి ఈ చూపుల యుద్ధం అయిపోయాక... నేను మాట్లాడుతున్న విషయం వినటం ఇష్టం లేనట్లు ‘ఆ సంగతి వదిలెయ్యండి. మీ సినిమాకి వచ్చిన నష్టం గురించి చెప్పండి... రాత్రి నేను వచ్చిన తరువాత ఏమి జరిగింది?’ అంది.
‘సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో కంప్లయింట్ ఇచ్చాను. పరిశీలిస్తామన్నారు. కానీ, వారు ఈ విషయం గురించి సీరియస్‌గా పరిశోధిస్తారని నేనయితే అనుకోవటం లేదు...’ అన్నాను. నా మాటలు వద్దన్నా దీనంగా వినిపించాయి.
వసుంధర మొహం మీద వంకరగా ఒక నవ్వు కనిపించీ కనిపించనట్లు మెరిసింది. ‘పోనీ ఆ బ్లాక్‌మెయిలర్లు అడిగిన డబ్బు ఇచ్చే అవకాశం...’
ఆమె మాట పూర్తి కాకముందే చివుక్కున తలెత్తి చూశాను.
నా భావం అర్థం చేసుకున్నట్లు ఆమె, ‘ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నేను ఇలా మాట్లాడకూడదని తెలుసు. అయినా న్యాయం, ధర్మం అని ఆలోచిస్తే చివరకు హాని జరిగేది మనకే కదా!...’
‘ఇచ్చే స్తోమత, అవకాశం ఉంటే నేనూ ఆలోచించేవాడినే! కానీ అది ప్రస్తుతం నావల్ల కాని పని. నేను ఇప్పుడు ఏ మాత్రం డబ్బులు మొబలైజ్ చెయ్యలేను...’
‘ఆ బ్లాక్‌మెయిలర్లను పట్టుకోవాలంటే రాత్రిలోపు పట్టుకోవాలి. లేకపోతే వారు నీ సినిమాని ఇంటర్‌నెట్‌లో పెడతారు. అంతేనా?’
‘అంతే మేడమ్’
‘మరి పోలీసులు ఏ ప్రయత్నం చెయ్యకపోతే ఎలా?’
ఆమె ఆ ప్రశ్న ఎవరిని అడుగుతుందో నాకు అర్థం కాలేదు. ‘మీరు వారిని ఆదేశిస్తే, వారి అప్రోచ్ మారవచ్చు మేడమ్! ఆ విషయంలో మీ సహాయం అర్థించటానికి వచ్చాను’
‘మీ కేస్ డీల్ చేస్తోంది ఎవరు?’
‘ఎస్.పి. శ్రీనివాస్’
‘అతనికి నేను చెప్తాను. ‘ప్రత్యేక’ శ్రద్ధ పెట్టి కేసు డీల్ చెయ్యమని...’ ‘ప్రత్యేక’ అన్న పదం ఒత్తి పలుకుతూ అంది వసుంధర.
‘్థంక్యూ మేడమ్..’ లేస్తూ అన్నాను.
నేను ఆమె ఆశించినంత ప్రాధేయపడలేదేమో ఆమె మళ్లీ మాట్లాడించింది. ‘ఏమిటి చంద్రం! ఇన్నాళ్లూ కష్టపడి సంపాదించిన ఆస్తి పోతుంటే భయంగా అనిపిస్తోందా?’ జాలిగా అడిగినట్లు అడిగింది.
‘్భయం ఎందుకు మేడమ్? జస్ట్ పదేళ్ల క్రితం ఇదే రోడ్డు మీద ఒక్క పూట తిండికి ఇబ్బంది పడుతూ తిరిగిన వాడినే కదా!... సున్నా నుండి పైకి వచ్చిన వాడిని, ఇంకొకసారి ప్రయత్నించి పైకి రాగలనన్న నమ్మకం నాకు ఉంది. కానీ...’
‘ఊ!... కానీ’
‘పరిమళ, పిల్లలు నా పక్కన ఉంటే చాలు. వారి సహకారంతో తిరిగి ఈ పొజిషన్‌కి చేరుకోవటానికి ఎంతో కాలం పట్టదని నా నమ్మకం. అందులో... ఒకసారి పర్వతం ఎక్కి జారిన వాడిని కాబట్టి అనుభవం కూడా ఉంటుంది కదా..’
‘మరి పరిమళతో మాట్లాడావా?’
‘రాత్రంతా ఈ విషయం ఆమెకు ఎలా చెప్పాలా అన్న భయంతోనే గడిపాను. తెల్లవారేటప్పటికి నేను చెప్పకుండానే ఆమెకు తెలిసిపోయింది. తనే నాకు ధైర్యం చెప్పింది. తను నాకంటే ఎక్కువ పేదరికం నుండి వచ్చింది. కాబట్టే మాకు డబ్బు లేకపోవటం అన్నది పెద్ద సమస్యగా అనిపించటం లేదు. నా ప్రతిభ మీద నాకు నమ్మకం ఉంది. తిరిగి పైకి వస్తాను...’
‘అయామ్ సారీ చంద్రం..’ నా మాటలు ఇంకా వినాలన్నట్లు అంది ఆమె.
‘మీరెందుకు మేడమ్ బాధపడటం? ప్రభుత్వం తరఫున చేయగలిగింది చేయండి. నేను దేవుడ్ని నమ్ముకున్నాను. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు...’
ఒక్కసారిగా బరెస్ట్ అయింది వసుంధర. ‘ఉరేయ్! చంద్రం... నేను దేవుడ్నే కాదురా. నీ స్నేహితులను కూడా అవసరానికి మించి నమ్మావు. వారితో కలిసి పాపాలు చేసావు. ఆ పాపమే ఇప్పుడు ఇలా పట్టి పీడిస్తోంది...’ ఆక్రోశంగా అంది.
ఆమె ఏమి మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. ‘ఏ పాపాల గురించి మీరు మాట్లాడుతోంది? అభిమన్యు డ్రగ్స్ అలవాటు, సంతోష్ అండర్‌వరల్డ్ సంబంధాల గురించి అయితే...’
‘అది కాదు..’ పెద్దగా అరిచింది వసుంధర. ‘మనం విడిపోయిన రోజు ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకో... మీరందరూ కలిసి నాకు చేసిన అన్యాయం మాట ఏమిటి? అంతకంటే పెద్ద తప్పు ఏమి చెయ్యాలి?’
‘మనం విడిపోయిన రోజా?’ ఇంకా అయోమయంగా అడిగాను.
‘అవును. ట్రయల్ షూట్ ఆఖరి రోజు. గెస్ట్‌హౌస్ దగ్గర...’
‘ఆ రోజు ఏం జరిగిందో మాకూ అర్థంకాక మీ కోసం చాలా వెతికాం. మీ ఆచూకీ తెలియక పోవటంతో చాలా రోజులు చూసి పరిమళ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టుకుని సినిమా లాగించాం. అప్పుడు మాయమయిన మిమ్మల్ని మళ్లీ ఇప్పుడే చూడటం...’
‘అబద్ధాలు చెప్పకు. ఆ రోజు మీరు ముగ్గురూ నన్ను...’ చెప్పలేక ఆగిపోయింది.
ఆమె ఊహ నాకు అర్థం అయింది. ‘అయ్యో! లేదండీ. మీరు అలా భావించినట్లయితే అది పూర్తిగా తప్పు. అభిమన్యుకి డ్రగ్స్ అలవాటు ఉన్న సంగతి ఆ రోజు వరకూ మాకు కూడా తెలియదు. అతను కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపిన సంగతి కూడా తరువాతే తెలిసింది. మీరు ఎంత మత్తులో కూరుకుపోయారో మేమూ అంతే మత్తులో పడిపోయాం. అప్పటికీ, మీరు ఒంటరిగా బయటకు వెళ్లటం ప్రమాదమని భావించి అంత మత్తులోనూ మిమ్మల్ని ఆపటానికి నేనూ, సంతోష్ ప్రయత్నించాం. హఠాత్తుగా ఒక కారు రావటం, అది మిమ్మల్ని రాసుకుపోవటం, మీరు పడిపోవటం వెంటవెంటనే జరిగిపోయాయి. మేము తేరుకునేలోపే కారు నుండి దిగిన ఒక స్ర్తి మిమ్మల్ని కారులోకి ఎక్కించి, హాస్పిటల్‌కి తీసుకు వెళ్తున్నానని అక్కడ నుండి వెళ్లిపోయింది’
‘ఆడ మనిషా?’ ఠక్కున అడిగింది వసుంధర. నేను చెప్తున్న మాటలు ఆమెకి కూడా షాకింగ్‌గా ఉన్నాయని అప్పుడే తెలిసింది నాకు.
‘అవును. ఆడమనిషి. ఆమె ఎవరన్నది తెలియదు. కానీ మీకు బాగా తెలిసిన వ్యక్తే! ఎందుకంటే మీతోపాటు ఆమెని స్టూడియోలో చూశాను. తరువాత మీ ఆచూకీ ఎంతకీ తెలియకపోవటంతో ఆమెని విచారిద్దామనుకున్నాం. ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ గానీ, మీ ఆచూకీ గానీ తెలుసుకోలేక పోయాం...’ చెప్పాను. అంతలో ఏదో గుర్తుకు వచ్చి ‘ఒక్క విషయం మాత్రం గుర్తుంది. ఆ కారు నెంబర్ ప్లేట్ మీద ప్రభుత్వ వాహనం అన్న అక్షరాలు స్పష్టంగా కనపడ్డాయి. కాబట్టి మిమ్మల్ని తీసుకు వెళ్లింది ఎవరైనా, మీరు క్షేమంగా ఉండి ఉంటారనుకున్నాం. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. నేననే కాదు... మా ముగ్గురిలో ఎవరూ కూడా ఆడవారిని మీరనుకున్నట్లు చూసేవాళ్లు లేరు. అలా అయితే మీ స్థానంలో తీసుకున్న పరిమళని నేను పెళ్లి ఎందుకు చేసుకుంటాను?’
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా నా ఆఖరి మాటకి ఆమె బాగా కన్విన్స్ అయినట్లు ఉంది. నేను చెప్తున్న మాటలు ఆమెకు ఎంత షాకింగ్‌గా ఉన్నాయంటే కిందపడిపోకుండా నిలబడి ఉండటానికి ఆమె గోడ ఆసరా తీసుకోవలసి వచ్చింది. ‘చంద్రం!...’ మాటలు కూడగట్టుకుంటూ అంది ఆమె. ‘మనస్ఫూర్తిగా చెప్పు. నిజంగా నువు చెప్తోంది నిజమా?’ అని అడిగింది.
‘నా భార్యా, పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను...’ నేను వారిని ఎంత ప్రేమిస్తానో అందరికీ తెలుసు.
‘నా శక్తులన్నీ ఉపయోగించి, నీ సమస్య తీర్చటానికి ప్రయత్నిస్తాను. నన్ను నమ్ము... ఇక వెళ్లిరా’ అంది.
‘ఇంతకీ ఆ రోజు మిమ్మల్ని తీసుకువెళ్లింది ఎవరు?’ అని అడిగిన నాకు, ‘అనవసరపు విషయాలు తెలుసుకోవటం నీకే మంచిది కాదు చంద్రం. నువు మంచివాడివి. అలాగే ఉండు. నీకు ఏ హానీ జరగదు...’ అని లోపలకు వెళ్లిపోయింది.
మరొక గంట తరువాత పోలీసుల నుండి ఫోన్ వచ్చింది. నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యిక్తి దొరక్కపోయినా, అతని అడ్డా దొరికిందని. నా పైరేటెడ్ సి.డి. పోలీసులకు దొరికిందని. అతను ఎవరో పోలీసులు నాకు కూడా చెప్పలేదు. పేపర్లలో కూడా ఆ విషయం రాలేదు. నా సమస్య తీరింది కాబట్టి నేను ఆ విషయాన్ని అంతటితో వదిలేశాను.
వసుంధర రుణం మాత్రం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కాలేదు.

ప్రస్తుతం
‘మీ అభిమాన సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ వచ్చాడు. మిమ్మల్ని కలవాలంటున్నాడు..’ ఎవరో వచ్చి వసుంధరతో మాట్లాడుతున్న చంద్రానితో చెప్పారు.
‘ఇంత దూరం వచ్చినా ఆ సినిమాల గొడవ తప్పదా?’ విసుక్కుంటూ అన్నాడు చంద్రం.
‘విసుక్కోకు. నీకు అన్నం పెడుతుంది ఆ అభిమానుల ఆదరణే!’ చెప్పింది వసుంధర.
నిట్టూర్చి లేచి బయటకు వెళ్లాడు చంద్రం.
‘సార్! ఎన్నికల ఆఫీసుకు మీరు, మేడమ్‌గారూ ఊరేగింపుగా వెళ్లాలి. అందుకు ఏర్పాట్లు అన్నీ మేము చేస్తున్నాం. మీరు వేరే వెహికల్‌లో వెళ్లకూడదు...’
‘సరే...’ అనక తప్పలేదు చంద్రానికి.
తమతో తీసుకువచ్చిన కొందరు స్నేహితులకు ఆటోగ్రాఫులిప్పించాడు లక్ష్మణ్.
‘ఏమనుకుంటున్నారు లక్ష్మణ్! ఎవరు గెలుస్తారంట?’
‘మీరు ప్రచారం చేశాక వేరే ఎవరో ఎలా గెలుస్తారు సార్?’
‘నేను ప్రచారం చేస్తేనే అన్ని ఓట్లు పడేటట్లయితే ఆఖరి రౌండ్‌కి వచ్చాక కూడా ఫలితం ఎవరికో తెలియని ఉత్కంఠ ఎందుకు?’
‘అవన్నీ నాకు తెలియదు సార్! మేమందరం మీరు చెప్పిన గుర్తుకే ఓటు వేశాం...’
‘మిగిలిన వాళ్లందరూ సరే! నువ్వు ఓటు వేశావా? లేదా?’
‘వేశాను సార్’
చంద్రం ఆ ప్రశ్న అడగటానికి ఒక కారణం ఉంది. ఎన్నికల ప్రచారానికి ఇక్కడకు వచ్చినపుడు తన అభిమానులందరినీ వసుంధరకే ఓటు వేయమని అర్థించాడు. ‘అందరి చేతా ఓటు వేయించే బాధ్యత నీదే!’ చెప్పాడు లక్ష్మణ్‌కి.
‘అందరికీ చెప్తాను. కానీ.. నేను మాత్రం వెయ్యలేను సార్!’
‘అదేంటి?’
‘ఆ రోజు నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. ఓటెయ్యటం కుదరదు’
‘ఎలక్షన్ డ్యూటీ పడిన వారు ఓటు పోస్టు ద్వారా వెయ్యవచ్చుగా’
‘అది ఒక పెద్ద ప్రొసీజర్ సర్! ఎవరూ వెయ్యరు. ఒక్కొక్కసారి ఒక్క ఓటు కూడా పోల్ కాదు. లెక్కింపు సమయానికి మన ఓటుకి విలువ కూడా ఉండదు. ఎందుకంటే చివరికి మన ఓట్లు లెక్కపెట్టటానికి వచ్చేటప్పటికి ఎవరు గెలిచేది నిర్ణయం అయిపోయి ఉంటుంది’
‘అవన్నీ సాకులు. ఈసారి నువ్వు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నావు. సరేనా...’
‘నాకు రాజకీయాలంటే అసహ్యం సార్..’ ఓటు వెయ్యక పోవటానికి అసలు కారణం చెప్పాడు.
‘అయితే వాటిని మనమే మార్చాలి... అంతేకానీ ఓటు వెయ్యనని ఇంట్లో కూర్చోవటం పిరికితనం అవుతుంది’
‘ఏమో సార్!’ ఇంకా కన్విన్స్ కాలేదు లక్ష్మణ్.
అరగంట పట్టింది ఆ రోజు చంద్రానికి అతన్ని ఓటు వెయ్యటానికి కన్విన్స్ చెయ్యటానికి.
‘నీ బిజీ షెడ్యూల్‌లో ఒక్క ఓటు కోసం అంత సమయం వెచ్చించటం అవసరమా?’ అడిగింది వసుంధర.
‘నేను ప్రచారం చేసింది ఒక్క ఓటు కోసం కాదు. ఒక మంచి పౌరుడి కోసం...’ సమాధానం చెప్పాడు చంద్రం.
ఇప్పుడు ఆ విషయాలన్నీ గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది చంద్రానికి.
‘ఇంకా ఎంతసేపు పడుతుందట ఆఖరి రౌండ్ ఫలితాలు తెలియటానికి?’ లక్ష్మణ్‌ని అడిగాడు చంద్రం.
‘ఏ నిమిషమయినా రావచ్చు సార్! అందుకే ఊరేగింపు చేయటానికి మేము వచ్చాం...’

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002