సెంటర్ స్పెషల్

మహావిజేత ( కొత్త సీరియల్ ప్రారంభం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవి దారి. చుట్టూ చిమ్మచీకటి. ఆకాశమంతా నల్లని మబ్బులు. చెట్లు, కొమ్మలు ఊగుతున్నై. చల్లటి గాలి వేగం ఎక్కువైంది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు మొదలయినై.
రాత్రి గడుస్తున్నది. ప్రయాణం సాగుతున్నది.
కుళిందకుని రథాన్ని అనుసరిస్తూ అశ్వారూఢుడై అడివప్ప, అతని పక్కగా ఉపసేనాని దక్షిణ్ణ వస్తున్నారు.
అడవిలో జంతువుల గంతులు, దూకుళ్లు, భయంకర రావాలూ మొదలైనై. చినుకు మొదలయింది.
ప్రభువేమయినా చెబుతాడేమోనని కుళిందకుని రథం పక్కకి వచ్చాడు అడివప్ప.
కుళిందకుడు రథాన్ని ఆపమని సైగ చేశాడు. రథం ఆగింది. ఆశ్వికులంతా సమీపించారు.
‘దగ్గరలో ఆవాసమేదైనా ఉందేమో అనే్వషించమనండి. త్వరగా చూడండి. వాన తీవ్రత హెచ్చేలా ఉంది. ఈ రాత్రికి మనం ఆగిపోవలసిన పరిస్థితి వచ్చింది. తప్పదు’ అన్నాడు కుళిందకుడు.
అడివప్ప తన శిష్యులను కొందరిని పంపాడు. కొద్దిసేపటిలోనే వారు తిరిగి వచ్చి, సమీపంలో పాడుబడిన పాంథశాల ఒకటి వున్నదని చెప్పారు.
ప్రభువు రథం కదిలింది. పరివారమూ కదిలింది.
ప్రభువుకు ఆ శిథిల గృహంలోనే తాత్కాలిక విశ్రాంతికి ఏర్పాట్లు చేశారు.
అశ్వాలను పాంథశాలకు ఎదురుగా ఉన్న మర్రిచెట్టు కింద నిలిపారు. పరివారమంతా పాంథశాల అరుగుల మీద సర్దుకుని కూర్చున్నారు. కుంతల గురించి, ఈ వాతావరణం గురించీ సంభాషణ సాగుతోంది.
కుంతల సామ్రాజ్యాధిపతి అగ్నివర్మ చేయించిన శాంతిస్తోమానికి ప్రభువు ఆహ్వానం మేరకు కుంతలపురికి వెళ్లి వస్తున్నాడు కుళిందకుడు. ఆయన కళింద్ర మండలాధీశుడు.
అగ్నివర్మ అనారోగ్యం ఆయనకీ, రాజ్యాధికారులకూ, ప్రజలకూ కూడా సమస్యగానే ఉంది. ఆ అనారోగ్యం ఉపశమనానికి ఈ శాంతి స్తోమాన్ని సూచించారు - రాజపురోహితులు గాలవుల వారు.
ఆ యాగం వారం రోజులు సాగింది.
కుంతల సామ్రాజ్యాధీశుని బంధువులు, మిత్రులు, హితులు, సన్నిహితులూ వచ్చారు.
కుంతలపురిలో ఒకవైపు సంభ్రమం. మరొకవైపు పండుగ. వివిధ హోమాలు, జప తప దాన క్రియలూ జరిగాయి. శాంతిస్తోమత ముగింపు రోజున అగ్నివర్మ ప్రత్యేకంగా కుళిందకుని గౌరవించి బహుమతులతో సత్కరించాడు.
ప్రభువుకు కుళిందకుడంటే ప్రత్యేకాభిమానం. దీనికి ఒక కారణం ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణి దిగువకు విస్తరించిన కొగళినాడులో ప్రధాన మహా మండలం కళింద్ర. కుంతలకు కొండ తెగల వారితో ప్రత్యేక సమస్య ఉంది. వారు అడపాదడపా ఈ రాజ్యంలోకి చొరబాటు చర్యలు నెరపుతూ మహారాజుకు కంటిలో నలుసుగా మారారు. వీరిని నిగ్రహించటానికీ, పరాజితుల్ని చేయటానికీ కుళిందకుడి బాహుబల దర్పమే కుంతలకు రక్షగా ఉంది.
చొరబాటు దారులయిన పర్వత నాయకులలో ముఖ్యుడు - కరద మండలాధిపతి వీరశివుడు. అతని దుష్ట ప్రయత్నాలన్నింటినీ అనేకమార్లు తిప్పికొట్టిన ఘనత కుళిందకునికి ఉంది. ఆ విధంగా కళింద్ర - కొండ తెగల దాడులకు అవరోధ స్తంభంగా, కుంతల క్షేమానికి ఒక ఆరక్షణ ద్వారంలా నిలిచి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదీ కుళిందకుని పట్ల అగ్నివర్మకు గల గౌరవాభిమానాలకి కారణం.
శాంతిస్తోమం ముగిసింది. కుళిందకుడూ పరివారం కుంతలపురి నుంచీ కళింద్రకు తిరుగు ప్రయాణమైనారు.
పాంథశాల లోపల -కుళిందకుడు విశ్రమించాడు. కలత నిదుర. నిదురలో స్వప్నావస్థలా ఉంది. ఏవేవో దృశ్యాలు గోచరిస్తున్నై.
ఒక విజనమైన మైదాన ప్రదేశం. తాను నడుస్తున్నాడు. ప్రక్కన గలగల పారుతున్న సెలయేరు. ఆకాశం నిర్మలంగా ఉంది. పైన పూర్ణచంద్రుడు వెనె్నలలు కురిపిస్తున్నాడు. తాను నడిచిపోతూనే ఉన్నాడు. పోయిపోయి విశాలమైన నగరంలోకి వచ్చాడు. నడక సాగుతూనే ఉన్నది. సౌధాలు, భవంతులు, ఇండ్ల నడుమ నడుస్తున్నాడు. పోగా పోగా ఏదో ఉద్యానవనం. ఫలపుష్ప భరితమైన వృక్షాలు. లతలన్నీ ననలెత్తి వున్నై. సుగంధం పరిమళిస్తున్నది.
ఉన్నట్లుండి - ఎక్కడో ఘంటానాదం వినిపిస్తున్నది.
ఉలిక్కిపడి లేచాడు కుళిందకుడు. చుట్టూ చూశాడు. పరిసరాలను పరికించాడు. శిథిల గృహమే. మొండిగోడల చుట్టూ భటులు కాపలా కాస్తున్నారు. తాను చూసిందంతా కల అని స్పష్టమైంది.
‘ఎవరక్కడ...?’ అని భటుని పిలిచాడు. అడివప్పను రాబనిచాడు. సమయం విచారించాడు. బ్రాహ్మీ ముహూర్తం జరుగుతోంది. తాను కనిన కలను విశదీకరించాడు. అడివప్ప వదనంపై సంతోషం ముపిరిగొన్నది ‘చాలా ఆనందం ప్రభూ! అన్నీ శుభ సూచనలు. శుభఫలాలేవో తమకై ఎదురుచూస్తున్నై’ అన్నాడు ఉత్సాహంగా.
కుళిందకునికీ ఆనందం కలిగింది.
బయట వాన జోరు తగ్గింది.
ఇంతలో-
ఆవాసం వెనుక వైపు నుంచీ ఏదో మూలుగు వినపడింది.
అడివప్ప వొక్క ఉదుటున ఆ వైపు పరిగెత్తాడు. ఆయనను అనుసరిస్తూ తానూ కదిలాడు ప్రభువు. భటుడు వచ్చి ఛత్రాన్ని పట్టాడు. పరుగున వచ్చి వీళ్లని కలిశాడు దక్షిణ్ణ.
అందరూ ఆవాసం వెనుకకు చేరారు.
అక్కడ ఒక పెద్ద గారచెట్టు ఉంది. దాని పక్కగా దట్టమైన అత్తిపత్తి చెట్ల గుబురు. ఆ గుబురు నుండీ వస్తున్నది మూలుగు. దక్షిణ్ణ పొదను కదిలించి చూశాడు. ఆరేడేండ్ల వయస్సున్న బాలుడు. స్పృహలోనే ఉన్నాడు. బాధతో విలవిలలాడుతున్న మాలుని చేతులతో ఎత్తి బయటకు తీశాడు. దక్షిణ్ణ నుంచీ అందుకుని దగ్గరికి తీసుకుని బాలుణ్ణి చూశాడు అడివప్ప. జాగ్రత్తగా పొదివి పట్టుకుని ప్రభువుకు చూపాడు.
ఆశ్చర్యపోయాడు కుళిందకుడు. పరీక్షగా బాలుని శరీరమంతా తడిమాడు దక్షిణ్ణ. కాలుని కదిలిస్తుంటే బాధతో పెద్దగా ‘అమ్మా’ అంటూ గొల్లుమన్నాడు బాలుడు.
అందరూ మందిరంలోనికి ప్రవేశించారు. దీపపు వెలుగులో అతని కాలుని పరీక్ష చేశారు. బాలుని ఎడమకాలి బొటనవ్రేలికి ఉండిన అంటు వేలు ఖండింపబడి ఉంది. దాని విచ్ఛేదన క్రియలో పాదానికీ గాయమైంది. రక్తం స్రవిస్తోంది. బాలుని పడుకోబెట్టి ప్రాథమిక చికిత్సగా తమ వద్ద వున్న వస్తు సంభారాల్లోని పసుపును తెప్పించి పాదానికి దట్టంగా మెత్తాడు అడివప్ప.
ఈ బాలుడు ఆరువ్రేళ్లతో జన్మించాడనీ, ఎవరో ఆ ఆరవ వ్రేలుని ఖండించి అక్కడ వదిలేసి వెళ్లిపోయారనీ అందరికీ అర్థమయింది.
అడివప్ప తన శిష్యుల నిద్దరిని పిలిచి చుట్టుపక్కల ఎక్కడైనా పరంగి సాంబ్రాణి చెట్టు ఆకులు దొరుకుతాయేమో చూసి, తెమ్మన్నాడు.
వారు వెంటనే బయలుదేరారు. క్షణాలలో తిరిగి వచ్చారు. వారి చేతుల్లో ఆ ఆకులు! బాలుని లేపి తన ఒడిలోకి చేర్చుకుని ఊరడిస్తూ, ఆకులను బాగా నమిలి రసం మ్రింగి పిప్పిని బయటకు ఉమియమని చెప్పాడు అడివప్ప. బాలునిచేత ఆ విధంగా నాలుగైదుసార్లు చేయించాడు. కొద్దిసేపటిలోనే బాలుని ముఖం తేటపడింది. బాధ తగ్గినట్లుగా తెలుస్తోంది. నెమ్మదిగా కళ్లు మూసుకున్నాడు. సావధానంగా పరుండబెట్టాడు అడివప్ప. బాలుడు నిద్రలోకి జారుకున్నాడు.
ఆ దుర్ఘటన గురించి అందరూ మాట్లాడుకుంటూ వుండగానే తెల్లవారింది.
వాన కూడా పూర్తిగా వెలిసింది.
కుళిందకుని హృదయఫలకం పైన ఆనందోదయం!
గత రాత్రి స్వప్నం... ఆ వెంటనే ఈ బాలుడు లభించటం! వింత అనుభూతి పారవశ్యాన్ని పొందాడు.
దైవకార్యాలు అయినాయి.
ప్రభువుకు పెద్ద ఉసిరిక రసమును, వేపచివురులు, ఆవాలు కలిపి నూరిన ముద్దను ముందుగా అందించారు.
అందరి ఉపాహార సేవనం పూర్తి అయింది.
మళ్లీ ప్రయాణ సన్నాహం ప్రారంభమైంది.
కుళిందకుడు పిలిచేలోగానే వచ్చారు అడివప్ప, దక్షిణ్ణలు. బాలుని తన రథంలోకి ఎక్కించమని చెప్పాడు ప్రభువు.
ముందు వెనుకల అశ్వికుల ఏర్పాటుతో రథము ముందుకు సాగింది. ఆ వెనుకనే అందరూ బయలుదేరారు.
ప్రభువు ఆహార్యాన్నీ, ఆయన ముఖ భంగిమలనూ, శిరః కంపాన్నీ గమనిస్తున్నాడు బాలుడు.
బాలుని ముఖాన్ని మాటిమాటికీ చూస్తున్నాడు కుళిందకుడు.
స్వచ్ఛంగా, నిర్మలంగా భాసిస్తున్న దేహకాంతి, చిదిమితే పాలుకారుతాయేమో నన్నట్లుగా ఉన్న చెక్కిళ్లు, చూపుల్లో సింహ దృష్టిలా గమనింపూ, దేహ దారుఢ్యమూ, మళ్లీ మళ్లీ చూడాలనిపించే ముఖ వర్ఛస్సు - అన్నీ కలిసి చిన్న వయస్సులోనే ఆ బాలుడు ఒక ప్రత్యేకతను సంతరించుకున్న వాడిలా కనిపించాడు కుళిందకునికి.
రాత్రి నుండి ఇప్పటివరకు పల్లెత్తు మాట మాట్లాడలేదు బాలుడు. ఇప్పుడు పరిపరి భంగిమల్లో ప్రభువుని చూస్తూ, చూపు మరల్చి దారికి ఇరువైపులా విస్తరించి వున్న అడవిని చూస్తూ, మధ్యన మళ్లీ ప్రభువు వైపు దృష్టి సారించి, రాజుగారు తన వైపు చూడగానే మళ్లీ ప్రక్కకి దృష్టి మరల్చడం చేస్తున్నాడు.
ఇద్దరి చూపులూ కలిసినై. మందస్మితం చేశాడు ప్రభువు. ‘కాలి నొప్పి తగ్గింది కదూ?’ అడిగాడు.
‘రాత్రే తగ్గిపోయింది. మందు చాలా త్వరితంగా పని చేసింది. ప్రభువులకు ధన్యవాదాలు’
బాలుని మాటతీరుకి ముగ్ధుడయ్యాడు కుళిందకుడు. ఈ బాలుడు సామాన్యుడు కాదనిపిస్తోంది.
ఇంతలో ప్రభువు వైపు చూపు మరల్చి ‘మనదే రాజ్యం?’ సూటిగా అడిగాడు బాలుడు. పెద్దగా నవ్వాడు కుళిందకుడు. ‘ఎందుకూ నవ్వుతున్నారు?’
‘మరేం లేదు. మీది అనకుండా మనది అంటున్నావుకదా! అందుకు’
‘అవును. మీరు నన్ను తీసుకువెళుతున్నారు కదా! ఇప్పుడు మీ రాజ్యమే నా రాజ్యం. అందువలన అది మన రాజ్యమే కదా!’
ఇతడు బుద్ధికుశలతలో కూడ సూక్ష్మగ్రాహి అనుకున్నాడు ప్రభువు. అతని తార్కికత కన్నా, ఆ మాటలు అంటున్నపుడు అతని కంఠస్వరంలో తొణికిసలాడిన ఆత్మీయత, మమేకత్వం, కుళిందకుని గుండెని పట్టేసింది. ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ తృప్తి అంతా కళ్లల్లో ప్రతిఫలించి, చేతులకు వ్యాపించింది. తటాలున బాలుని అందుకుని హృదయానికి హత్తుకుని మూర్ధాఘ్రాణం చేశాడు.
‘నేను ధన్యుణ్ణి!’ అన్నాడు బాలుడు. ఇప్పుడు మరీ దిగ్భ్రమ చెందాడు ప్రభువు.
‘ఏమి ఈ సంస్కారం. సంస్కారంతో కూడిన వినయం. వినయంతో కూడిన భాషాన్నౌత్యం. ఔన్నత్యంతో కూడిన స్వనం. అందులో ధ్వనిస్తున్న మాధురయం. మనసుని మించిన ఎదుగుదల అమితంగా ఆకట్టుకుంటోంది. అంతా అతని పూర్వజన్మ సుకృతమేమో...’ కానీ, నా సుకృత ఫలం మాత్రం ఈయని అయాచిత లబ్ధి అనుకుని ‘మనది కళింద్ర మండలం. నేను ఆ మండలాధిపతిని, నన్ను కుళిందకుడు అంటారు’ చెప్పాడు.
‘ఓహో’ చిన్నగా అని అంతా తెలుసుకున్న వాడిలా కళ్లను చక్రాల్లాగా తిప్పి, భ్రుకుటిని వంచి ప్రభువుని చూశాడు. మురిపెంగా అతని చేతిని తన చేతులలోకి తీసుకున్నాడు కుళిందకుడు.
రథం సాగుతున్నది.
క్షణం తర్వాత - ‘మీరు మీ వివరం చెప్పారు. నేనూ నా సంగతి చెప్పాలి కదా మరి...’ అన్నాడు బాలుడు. చెప్పు అన్నట్లుగా మందహాసం చేశాడు ప్రభువు.
‘నా పేరు చంద్రహాసుడు. అప్పుడు మాది చేర రాజ్యం. మా తండ్రిగారు సుధర్మిక మహారాజు. మా తల్లి సునయన మహారాణి’
‘చంద్రహాసుడు’ కుళిందకుని పెదవులు ఆ పేరును పదేపదే ఉచ్చరించుకున్నాయి. మనసుకు చల్లగా తాకిందా పేరు. అనురాగ పారవశ్యం కలిగిందాయనకు.
‘మా రాజ్యాన్ని శత్రువులు కొల్లగొట్టారు. మహారాజుని చంపేశారు. మహారాణి వారు...’ అనేసరికి దుఃఖం పొంగుకొచ్చింది. అర్ధోక్తిలో ఆపాడు. ఏడవసాగాడు. కుళిందకుడు కళవళ పడ్డాడు. బాలుణ్ణి చేతులతో పొదువుకొని వెన్నుని నిమురుతూ ఊరడిస్తూ ఉండిపోయాడు.
కొద్ది క్షణాలు వౌనంలో గతించాయి.
వెక్కిళ్లను ఆపుకుని, దుఃఖాన్ని నిలువరించుకున్నాడు చంద్రహాసుడు.
‘మా తల్లిగారు... మహారాజుగారితో సహగమనం చేశారు. మా దాది వకుళ. నన్ను తీసుకుని అక్కడ నుంచీ తప్పించుకుంది. బయటపడ్డాక చాలా కష్టాలు అనుభవించాం. చాలా ప్రదేశాలు తిరిగాం. చివరకు కుంతల దేశం చేరుకున్నాం. అక్కడ మా దాది నన్ను కాపాడుతూ, నా పోషణ కోసం చాలా కష్టపడింది’ అని క్షణం ఆగి, ‘ఎలాగో తెలుసా?’ అని కుళిందకుని అడిగాడు.
కుళిందకుని జవాబు కోసం చూడకుండా ‘్భక్షాటనంతో’ అని చెప్పి, ‘అవును’ అని మళ్లీ చెప్పి, ఈసారి భృకుటిని పైకెత్తి ‘ఆఁ’ అని ధీరంగా భుజాలెగరేసుకున్నాడు.
కుళిందకుడు నివ్వెరపోయాడు. ఏమి ఇతని ధీరత్వం. పేదరికాన్ని న్యూనతగానో, నేరంగానో భావించే సాధారణ మనుషుల మనస్తత్వానికి భిన్నమైన చిత్తస్థైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇతని స్వభావం అసామాన్యం అనిపించింది.
చంద్రహాసుడు కొద్దిసేపు మాట్లాడలేదు. ఆ తరవాత ‘మా దాది వకుళ చనిపోయింది. నాకు ఎవ్వరూ లేరు కదా! ఏం చేయాలో తెలియదు. ఆకలి వేసి భిక్షాటనం మొదలెట్టాను. ఒకరోజు కుంతలపురంలో అన్నదానం జరుగుతుంటే అక్కడికి వెళ్లాను. కుంతల మహామంత్రికి ఎవరో పురోహితులు నన్ను చూపించారు. ఆయనేమో నన్ను తనతో తీసుకువెళ్లారు’ అని ఆగి, ‘తర్వాత జరిగింది నాకు కొంత తెలిసింది. కొంత తెలియలేదు’ అన్నాడు.
కుళిందకుడు వివరాలు అడగలేదు. అతని ఆలోచనా, ఆత్రుతా అంతా ఇప్పుడు - ఎంత త్వరగా తన భార్య మేధావినీ దేవికి చంద్రహాసుని చూపుదామా అనే! ఏ భావ బంధమో, రాగబంధమో హృదయాన్ని పాదుచేసుకున్నది. దానికి దోహదక్రియలు చేయాలి. ఆ లత తీగలు సాగుతూ పెరగాలి!
రథం సాగుతూనే ఉంది.
మధ్యాహ్నపు సూర్యుడు మంకెన పూచాయలో వెలుగుతున్నాడు.
కుళిందకుడూ, చంద్రహాసుడూ ప్రకృతిని పరికిస్తున్నారు.
కర్నాట మరాఠీ ఆంధ్ర భాషా సంయుక్త సామ్రాజ్యం కుంతల. కుంతల మహా సామ్రాజ్యంలో దక్షిణ సరిహద్దులో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అల్పమేమీ కాదు. వెల్లాపురం వెళ్లినప్పుడు ఆ తెలుగు నుడి మాధుర్యాన్ని రాజసభల్లో సమావేశాల్లో వినే ఉన్నాడు కుళిందకుడు.
కుళిందకుడీ భావ పరంపరలో ఉండగానే అడిగాడు చంద్రహాసుడు. ‘మహారాజా! కుంతల మహామంత్రి పేరు దుష్టబుద్ధిట కదా?’ దుష్ట పదాన్ని వొత్తి పలికి చిత్రంగా వక్రించాడు ఉచ్చారణలో.
తటాలున తలతిప్పి చూశాడు కుళిందకుడు. నిశితంగా చంద్రహాసుని వైపు చూసి, ‘అవును. దుష్టబుద్ధి’ అన్నాడు ప్రభువు. ‘ఆయన ఆజ్ఞతోనే కటికవారు నన్ను అడవికి తెచ్చి కాలివ్రేలు నరికేశారు’
‘ఉ...హూఁ’
‘అవును. అసలు వాళ్లు నన్ను చంపేయాలి. నేను మూలానక్షత్ర జాతకుడినట. వారి మాటలనుబట్టి తెలిసింది నాకు. కానీ, ఎందువల్లనో దయతలచి వదిలేశారు’
కుళిందకుని మనస్సు చాలా గాథల్ని చదువుకుంది. ‘చంద్రహాసుడి కాలికి ఆరవ వేలు ఉండటం, అతని ముఖవర్ఛస్సులో ఉత్తమ క్షత్రియ తేజం ప్రస్ఫుటం కావటం చూసి, జ్యోతిష్కులు ఇతనికి ఏ మహారాజ యోగమో ఉన్నదని చెప్పి ఉంటారు. ఆ కారణంతోనే దుష్టబుద్ది ఇతన్ని చంపాలని ఆదేశించి ఉంటాడు’ అనిపించింది.
2
రాజధాని చేరారు.
విషయాలన్నింటినీ భార్యకు తెలిపాడు కుళిందకుడు. మేధావినీదేవి ఆనందానికి మేరలేదు. క్షత్రియ పుత్రునికి తాను పెంపుడు తల్లి అవుతోంది. అతనిని దగ్గరకి పిలిచి అక్కున జేర్చుకుంది. ఆమె స్పర్శలోని ఆప్యాయతకు అసంకల్పంగా ‘అమ్మా’ అన్నాడు చంద్రహాసుడు.
ఆ రోజు రాజధానిలో పెద్ద సంబరమే జరిగింది.
చంద్రహాసుడు రాణిని ‘అమ్మా’ అనే పిలుస్తున్నాడు. ప్రభువును మాత్రం ‘ప్రభూ’ అని పిలుస్తున్నాడు!
ఒక దశాబ్దం కాల ప్రవాహంలో కలిసిపోయింది!

( మిగతా వచ్చేవారం)

-విహారి 98480 25600