డైలీ సీరియల్

యమహాపురి 55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోతికి చీర కట్టొచ్చు. కోతి మనిషి అయిపోతుందా?
‘‘మనిషంటే స్వయంగా ఆలోచించాలి. ఎదుటివారి మాటలకి స్పందించాలి. తప్పొప్పులు చెప్పగలగాలి. మంచి చెడ్డలు బేరీజు వెయ్యాలి. అన్యాయాన్ని ప్రతిఘటించాలి. నువ్వు మా టామీని మనిషని ఎలా అనుకున్నావో నాకర్థం కావడంలేదు’’ అంది మాత.
ఆమె ఇలాంటి తర్కం ఉపయోగిస్తుందని రాజా ఊహించలేదు. కళ్లారా చూసిన ఓ మనిషి గురించి ఆమె అలా మాట్లాడ్డంతో షాక్ తిన్నాడు. మాత అతడి ముఖ భావాలు చదువుతూ, ‘‘నా మాటలు నీకు సరిగ్గా అర్థమైనట్లు లేదు. నువ్వు మనిషనుకుంటున్న మా టామీ మనిషి కాదనీ, మంచి శిక్షణ పొందిన జంతువనీ ఇప్పుడే ప్రత్యక్షంగానే ఋజువు చేస్తాను. సరా?’’ అని, ‘‘పుత్రా! వెళ్లి దాన్ని పిల్చకురా’’ అంది.
పుత్ర వెళ్లి తలుపు తీశాడు. అతడు చెప్పింది విని తలుపు దగ్గిరే ఉన్న ఆ యువతి లోపలకు వచ్చింది. ఆమె కాలికున్న గొలుసు చూసి రాజా నిట్టూర్చాడు. ఆమె దగ్గిరకు రాగానే, ‘‘టామీ! ఈయన నిన్ను మనిషనుకుంటున్నాడు. మనిషివైతే మరి నీకు మాటలొచ్చా?’’ అంది మాత.
ఆమె తల అడ్డంగా ఊపింది. మాత రాజావైపు చూసి ‘‘నువ్వేం చేస్తావో నీ ఇష్టం. దీని చేత ఒక్క మాట మాట్లాడించు. నరకపురి నుంచి దీనిష్టమొచ్చిన చోటికి పట్నం పంపించేస్తాను’’ అంది.
రాజా ఆమెని పేరడిగాడు. ఊరడిగాడు. రకరకాల కబుర్లలో పెట్టాడు. ఆమె శూన్యంలోకి చూస్తున్నట్లుగా మొహం పెట్టింది తప్ప ఒక్క మాటకూ స్పందించలేదు.
స్వేచ్ఛ లభిస్తుందని తెలిసినా ఆమె నోరు విప్పకపోవడం రాజాకు ఆశ్చర్యంగా ఉంది.
‘‘దీన్ని నువ్వు మనిషనుకుంటున్నావు. కానీ ఇది నోరు లేని జంతువు. కొరడాతో కొట్టినా దీని గొంతులోంచి చిన్న శబ్దం కూడా రాదు. నమ్మకం లేకపోతే..’’ అని మాత ఏదో అనబోగా-
‘‘వద్దు.. నాకు నమ్మకం కుదిరింది’’ అన్నాడు రాజా. మాత యువతిని కొడుతుందన్న ఊహకే అతడికి వళ్లంతా జలదరించింది.
‘‘సరేలే- నీకు నమ్మకం కుదురినప్పుడు- అనవసరంగా ఓ మూగప్రాణిని హింసించడమెందుకలే కానీ- నీకింకో ఋజువు చూపిస్తాను. ఇది మనిషిలాగే కనబడుతుంది. మనమేం చెప్పినా అర్థం చేసుకుంటుంది. కానీ ఇది జంతువు. చూడు- నేనిప్పుడు దీంతో ఎలా మాట్లాడతానో’’ అంది మాత.
రాజాకి మనసు కలచివేసినట్లయింది.
అమ్మాయి వయసులో ఉంది. అందగత్తె. అలాంటప్పుడు ఎంత పొగరుండాలి? పొగరు కాకపోయినా ఎంతో కొంత అభిమానవతి అయుండాలి. కానీ ఈమె...
మాత ఆమెకి బల్లమీద పదార్థాలు చూపించి వాటిలో తనకిష్టమైనవి చూపించమంది. ఆమె పాయసం చూపించింది.
మాత తను భోంచేసిన ఎంగిలి ప్లేట్లో ఆమె చేత కొంత పాయసం పోయించింది. ప్లేటు నేలమీద పెట్టమంది.
‘‘ఇప్పుడు నువ్వు కుక్కవి. కాసేపు గదిలో కుక్కలా తిరుగు’’ అంది.
ఆ అమ్మాయి చేతులు నేలకాన్చి నాలుగు కాళ్ల జంతువులా గదిలో కాసేపు పచార్లు చేసింది. కుక్కలా నాలుక ఆడించింది. అమ్మ చెప్పగా ఆ ఎంగిలి ప్లేట్లో పాయసాన్ని కుక్కలాగే నాకింది.
‘స్టాపిట్’ అన్నాడు రాజా కళ్లు మూసుకుని.
‘‘ఏమయింది నీకు? నువ్వెప్పుడూ కుక్కలు పాయసం తినడం చూడలేదా?’ అంది మాత.
‘‘మనిషిని మనిషి ఇంతలా హింసించడాన్ని జీవితంలో మొదటిసారిగా చూస్తున్నాను’’ అన్నాడు రాజా బాధగా. అతడి గొంతు ఆ బాధతో తడిసినట్లే ఉంది.
‘‘ఒక్కసారి కళ్లు విప్పి- హింసకు గురౌతున్న ఆ మనిషెవరో నాకు చూపించు’’ అంది మాత.
ఆ గొంతులో అంతవరకూ లేచి కాఠిన్యం చోటుచేసుకొనడం గమనించిన రాజా ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు.
ఆ యువతి ఇంకా ఎంగిలి ప్లేటులో పాయసం నాకుతోంది. మధ్యమధ్య కృతజ్ఞత నిండిన చూపుల్ని మాత మీద ప్రసరిస్తోంది.
‘‘నీకు పాయసం బాగా నచ్చినట్లుంది. నీ సంతోషం ముఖం చూపించు’’ అంది మాత ఆ యువతితో.
అప్పుడా యువతి ముఖంలో కనిపించిన ఆనందానికి రాజా తెల్లబోయాడు.
క్రికెట్లో వరల్డ్ కప్ నెగ్గినప్పుడు యువరాజ్‌సింగ్ ముఖంలో కూడా అంత సంతోషం ఉండి ఉండదు.
***
మాత, రాజా- ఇద్దరూ ఓ చిన్న గదిలో సోఫాల్లో ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు.
‘‘ఇక్కడికి రాక మునుపు నాది చాలా నికృష్ట జీవితం అనుకున్నాను. కానీ ఇక్కడ చాలామంది అంతకంటే నికృష్ట జీవితం గడుపుతున్నారు’’ అన్నాడు రాజా.
‘‘ఆ మాటన్నావు కాబట్టి అడుగుతున్నాను. ఇక్కడికి రాకమునుపు నీదెంత నికృష్ట జీవితమో తెలుసుకోవచ్చా?’’ అంది మాత.
రాజా ఏదో అనబోయి ఆగిపోయాడు. చెప్పాలా చెప్పకూడదా అని ఆలోచించాడు.
ఇప్పటికే తను ప్రమాదంలో ఉన్నాడు. తన వివరాలు చెప్పడంవల్ల అదనంగా వచ్చే ప్రమాదం ఏముంటుందిలే అనుకున్నాడు. నిజానికి కొంత కల్పన జోడించి ఇప్పటి సందర్భానికి అనుకూలంగా మార్చి చెప్పాలనుకున్నాడు.
‘‘చిన్నప్పుడే నాన్న పోయాడు. నేను, అమ్మ, తమ్ముడు- మేనత్త పంచన చేరాం’’ అని మొదలెట్టి తన కథంతా చెప్పి, ‘‘ఇలాంటి సందర్భంలో నాకు జగదానందస్వామి దీవెన లభించింది. ఆయన నన్నూ ఆ ఊరి అమ్మాయి రాణినీ కలిపి దీవించాడు’’ అంటూ నరకపురి చెక్‌పోస్టు దగ్గిర అప్పన్నకి చెప్పిన కథ చెప్పాడు.
‘‘నీకు జగదానందస్వామి దీవెన లభించిందా! అందుకని నా భర్త నిన్నిక్కడికి పంపించాడా! ఆశ్చర్యంగా ఉందే!’’ అని ‘‘అందుకేనేమో మా ఊరిపట్ల నీ స్పందన మావారి ఆలోచనలకు భిన్నంగా ఉంది’’ అంది మాత.
రాజా దెబ్బతిన్నాడు. ‘‘తొందరపడ్డానేమో- ఈమెకు అప్పుడే నా నేపథ్యం చెప్పకుండా ఉండాల్సిందేమో’’ అనుకున్నాడు. ‘‘ఎలాగూ చెప్పాను కాబట్టి ఈ సంభాషణ ఇలాగే కొనసాగిస్తాను. ఏవౌతుందో చూద్దాం’’ అని ధైర్యం చేసి- ‘‘నేనొక మనిషిలా ఆలోచిస్తున్నాను.

ఇంకా ఉంది

వసుంధర