డైలీ సీరియల్

యమహాపురి 60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటికొస్తే సుమిత్ర అల్లుణ్ణి తీసిపారేసేది. అతడు మామగారికి చెప్పుకుని కొంత ఊరట పొందాలనుకునేవాడు. ఆయన కర్ర విరక్కుండా పాము చావకుండా ఇరుపక్షాలనీ సమర్థిస్తూ మాట్లాడేవాడు. చిట్టచివరకు, ‘‘సుమిత్రకి మాట దురుసు కానీ మనసు మంచిది. లేకపోతే- నిన్నసలు ఇంటికి రమ్మనే అవకాశమే నాకుండేది కాదు’’ అని భార్యనే మెచ్చుకునేవాడు. కృష్ణమూర్తికి ఉక్రోషమొచ్చి భార్యకు చెప్పుకుంటే- ‘‘నాకు మీరు, మీకు నేను. మావాళ్లతో మనకు పనేమిటి?’’ అనేది శాంత.
కృష్ణమూర్తికి అత్తింటిమీద కోపమొచ్చింది. ఎవరూ తనని లెక్కచెయ్యరు కాబట్టి- క్రమంగా ఆ కోపం భార్యమీదికి మళ్లింది. ‘‘పుట్టింటి వాళ్లవి వంకర బుద్ధులైతే- ఆ వంకర నువ్వు తీర్చాలి. అందుకు ముందు నేను నీ వంకర తీర్చాలి’’ అన్నాడు. ఆ వంకర తీర్చుకోవడానికి అతడెన్నుకున్న మార్గం దురలవాట్లు.
ప్రతి మనిషికీ దురలవాట్లపట్ల ఆకర్షణ వుంటుంది. మిగతా విషయాల్లో ఎలా వున్నా, ఆ ఆకర్షణను ప్రోత్సహించడానికి మాత్రం శాయశక్తులా కృషి చెయ్యడానికి ఓ మిత్ర బృందముంటారు. దురలవాట్లకు ఆకర్షణకు లొంగిపోవడానికి సంజాయిషీ కోసం వెతికేవారితో పోల్చితే- దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలనుకునే మనుషులు అరుదు. కృష్ణమూర్తి అరుదైన వ్యక్తి కాదు.
అతడికి తాగుడు అలవాటై క్రమంగా వ్యసనంగా మారింది. అలాగే దాంపత్యం నెరవేరుస్తూ ఇద్దరు పిల్లలకి తండ్రి కూడా అయ్యాడు.
మన సంప్రదాయంలో కూతరి పెళ్లి- తండ్రి బాధ్యత. పెళ్లయ్యాక ఆ కూతురి భర్త సంప్రదాయంగా ఉండకపోతే మాత్రం- ఆ ఇంటి బాధ్యత ఇల్లాలిది.
శాంత నెరవేర్చిన బాధ్యతల మేరకు- ఆమె పెద్దకూతురు శ్రీదేవి ఇంటర్ పాసై ఇంట్లో కూర్చుని పెళ్లికోసం ఎదురుచూస్తోంది. శ్రీదేవి తమ్ముడు వ్యాగ్రేశ్వరుడు ఇంటర్ పాసై ఇంజనీరింగు చదవడమెలా అని మధనపడుతున్నాడు.
కృష్ణమూర్తికప్పుడు ఇంటి బాధ్యతలు బొత్తిగా పట్టడంలేదు. ఊరినిండా అప్పులు. అవెలా తీర్చాలన్న ఆలోచన సరి లేదు కదా, రోజూ తాగొచ్చి భార్యని చావకొట్టేవాడు. ఎదిగిన పిల్లలు చూస్తూ ఊరుకోలేక- అడ్డుపడితే ఆ దెబ్బల్లో కొన్ని వాళ్లకీ తగిలేవి.
అంతవరకూ నోటి మంచితనంతో ఎలాగో ఇల్లు నడుపుకొస్తున్న శాంత కూడా కొడుకు చదువు విషయంలో చేతులెత్తేసింది.
కృష్ణమూర్తికి ఊళ్ళో అప్పులు పుట్టడం మానేశాయి. తనకెవ్వరూ ఇవ్వడంలేదని పెళ్లాం చేత అడిగించేవాడు. ఆడకూతురు నోరు విడిచి అడిగిందని ఎవరైనా ఒకటి రెండుసార్లిచ్చినా అది చావు బాకీ అని రూఢీ అయ్యాక ఆమెకూ ఇవ్వడం మానేశారు. పైగా వెడితే- ‘‘ఆయన పంపితే మాత్రం అడగడానికి నీకు బుద్ధి లేదా?’’ అని అవమానకరంగా మాట్లాడ్డం మొదలెట్టారు. చివరికామె ఒక రోజున అప్పుకి వెళ్లనని మొండికేసింది. దాంతో కోపం పట్టలేక కృష్ణమూర్తిఆమెను ఇష్టమొచ్చినట్లు కొట్టడం మొదలెట్టాడు.
అప్పుడు వ్యాఘ్రేశ్వరుడు ఇంట్లో లేడు. తల్లికి రక్షణగా శ్రీదేవి అడ్డుపడితే కృష్ణమూర్తి ఆమెని పక్కకు నెట్టి ‘‘చేతనైతే నువ్వెళ్లి అప్పు పుట్టించుకునిరా. మీ అమ్మని ఏమీ చెయ్యను’’ అన్నాడు.
ఆ వేడిలో అది సవాలుగా తీసుకుని తండ్రి చెప్పిన ఆసామీ వద్దకు తనే వెళ్లింది శ్రీదేవి. ఆ ఆసామీ ఆమెని చూస్తూనే పాత బాకీల్ని ప్రస్తావించాడు. కృష్ణమూర్తి గురించి చాలా అవమానకరంగా మాట్లాడేడు.
శ్రీదేవికి కోపమొచ్చింది. ‘‘ఎలాగోలా మీ బాకీ తీర్చేస్తాం. ఇలా మాటలు మిగలడం మంచిది కాదు’’ అంది.
‘‘ఎలాగోలా అనడానికి ఇంకే మార్గం మిగల్లేదు. ఈ మార్గం తప్ప. అందుకే నిన్ను పంపాడేమో మీ నాన్న’’అంటూ ఆ ఆసామి శ్రీదేవి చెయ్యి పట్టుకున్నాడు.
అప్పుడక్కడ ఆయన, శ్రీదేవి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆయనది బలం, అహంకారం, దుర్మార్గం, అధికారం. శ్రీదేవికి ఆత్మాభిమానం తప్ప మరేం లేదు. అది ఓడిపోయింది. తర్వాత ఆ ఆసామీ ఆమె చేతిలో అయిదొందలు పెట్టి- ‘‘ఇంకెప్పుడైనా మీ నాన్నకి అప్పు కావాలంటే నువ్వేరా!’’ అంటూ ఆమె అభిమానం మీద మరో దెబ్బకొట్టాడు.
జరిగింది జరిగినట్లు ఇంట్లో చెప్పడానికి ఆ అయిదొందలూ అవసరమనుకుంది శ్రీదేవి ఇంటికెళ్లి తల్లికి చెప్పింది. శాంత భోరున ఏడుస్తూ భర్తకి విషయం చెబితే, కృష్ణమూర్తికి రక్తం మరగలేదు. ఆ అయిదొందలూ తీసుకుని, ‘‘సరే, అప్పిస్తానన్నాడుగా- ఇకమీదట దానే్న పంపుదాం’’ అన్నాడు. అప్పుడతడి ముఖం చూస్తే, ‘‘మరీ అయిదొందలిచ్చాడా? ఈసారికి వెయ్యికి తక్కువ పుచ్చుకోవద్దు’’ అన్నట్లనిపించింది.
ఆ రాత్రి శ్రీదేవి ఉరేసుకుని చచ్చిపోయింది. అంతా ఏడుస్తుంటే కృష్ణమూర్తి కూడా ఏడ్చాడు. ఆ శవం అతడికి కన్నకూతరిలా కాక- బంగారు గుడ్లు పెట్టే బాతు శవంలా అనిపిస్తునట్లు తోచింది శాంతకి.
అప్పుడు శాంత ఓ నిర్ణయానికొచ్చింది. కట్టుకున్న తనకి బ్రతుకైనా చావైనా ఆ ఇంట్లోనే తప్పదు. కానీ ఆ వాతావరణంలో కొడుకుని మాత్రం ఉంచకూడదనుకుని ముందుగా తండ్రిని అడిగింది.
మనిషి ఆయనే ఐనా- ఆయన గొంతు సుమిత్రేకదా! ఆ గొంతు నో అంది.
అదే మంచిదనుకుంది తర్వాత శాంత. ఈ ఇంటినుంచి ఆ ఇంటికెడితే పెనంమీంచి పొయ్యిలో పడ్డట్లేగా మరి!
ఎందరో తెలిసిన బంధు మిత్రుల కాళ్లు పట్టుకుందామె. వాళ్ళలో చాలామంది కలిగినవారే!
రెక్కలొచ్చిన కన్నబిడ్డలకే కన్నవారు బరువనిపిస్తున్న రోజులివి. తన కొడుకుని ఆర్థికంగా ఎవరాదుకుంటారని నిరాశపడ్డ సమయంలో ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు అనంతం. ఆయన శాంతకి దూరపు వరుసలో బావ.
‘‘దేవుడి దయవల్ల నాలుగు వేళ్లూ నోట్లోకి పోతున్నాయి నాకు. పచ్చగా ఉన్నప్పుడే చెట్టు ఎవరికైనా ప్రాణవాయువునిస్తుంది. వ్యాఘ్రేశ్వరుణ్ణి మా ఇంట్లో ఉంచుకుంటాను. ఇంజనీరింగు చదివిస్తాను. మా పిల్లలింకా బాగా చిన్నవాళ్ళు. వాడు మాకు చేదోడు వాదోడుగా ఉంటాడు’’ అన్నాడాయన.
ఆ మాటకే శాంతకి ప్రాణం లేచొచ్చినట్లై ‘‘నీ ఋణం చర్మంతో చెప్పులు కుట్టిచ్చినా తీరదు బావా!’’ అంది.

ఇంకా ఉంది

వసుంధర