డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు శుభ్రంగా ఉంటే మెచ్చుకోవడమే తప్ప తాను ఇంటిని శుభ్రంగా ఉంచే బాధ్యతను చేపట్టడమంటే వల్లీప్రియకు మహాచిరాకని పెళ్లయ్యాక గానీ తెలియలేదు నాకు.
పెళ్లికి ముందు ప్రతిరోజూ సాయంత్రం నాతో పార్కుకో, సినిమాకో, వాకింగ్‌కో వెళ్లడం ఎంతో ఇష్టం వల్లీప్రియకు. పెళ్లయ్యాక నాతో తాను బయటకు సరదాగా వచ్చిన రోజుల్ని వేళ్లమీద లెక్కపెట్టొచ్చిప్పుడు.
నాతో గంటల తరబడి మాట్లాడినా నిముషాల్లో గడిచిపోయేవి ఆమెకు గతంలో. ఇప్పుడు నా సమక్షంలో ఒక నిముషం గడిపితే గంటసేపు గడిపినట్లుగా ఇబ్బంది పెడుతోంది తను.
చూసేవాళ్లకూ, వినేవాళ్లకూ ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించవచ్చు. పెళ్లికి ముందు ఒకరిలో మరొకరికి గొప్పగా కనిపించిన విషయాలు కాలం గడిచేకొద్దీ వాటి విలువను కోల్పోతూంటే ఒకరికొకరం క్రమేణా దూరం కాక తప్పదు కదా!’’
‘‘నాకిప్పుడో విషయం అర్థమవుతోంది మహర్షీ. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారికి ఒకరిపట్ల మరొకరికి అంచనాలు చాలా హెచ్చు స్థాయిలో ఉంటాయి. తమ పెళ్లి తర్వాతి జీవితాన్ని గొప్పగా ఊహించుకోవడమే ఈ ఆశాభంగానికి కారణమేమో!’’ అన్నాడు సామ్రాట్.
‘‘నువ్వు చెప్పిందాంట్లో నిజం లేకపోలేదు. తమ భావి జీవితం గురించి అంచనాలు కనీస స్థాయిలో ఉన్నప్పుడు మనసుకు నచ్చే చిన్న చిన్న సంఘటనలు అనుభవంలోకి వచ్చినప్పటికీ అవి అనుకోని ఆనందాలు కావడంతో ప్రతిసారీ రెట్టింపు సంతోషం కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇటువంటి అవకాశం పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్న జంటలకే ఎక్కువగా ఉంటుందేమో!’’ అన్నాడు మహర్షి.
‘‘అది పూర్తిగా నిజమనీ అనలేం. ఇరువురి భావాల్లోనూ కొంచెమైనా సారూప్యత, సర్దుకుపోయేగుణం ఉన్నప్పుడే నువ్వు చెప్పేది సాధ్యం కావచ్చు. కానీ ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ ఎటువంటి సారూప్యతా లేని భిన్న ధృవాల వంటి వ్యక్తులమధ్య జీవితం దుర్భంగా ఉంటుందనడంలో సందేహం లేదు. సామ్రాజ్ఞితో నా మూడు రోజుల కాపురంలోనూ నా ఊహకందిన సత్యమిది’’ అన్నాడు సామ్రాట్.
‘‘తొందరపడి అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయకు! ఒకరి గురించి మరొకరు ఒక అంచనాకు రావడానికి మూడు రోజుల కాలం చాలా చాలా తక్కువ’’ అన్నాడు మహర్షి.
‘‘అన్నం ఉడికిందో లేదో తెల్సుకుందుకు ఒక మెతుకు పట్టుకు చూస్తే తెలియదూ?’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఆ మాటే నేనూ అంటున్నాను. మీ సంసారపు ఎసరింకా మరగడం ప్రారంభం కాలేదు. నీళ్లు వేడెక్కాలి. బియ్యం ఉడకాలి. ఈ రెండూ జరగాలంటే తగినంత వేడి లభించే వరకూ మంట ప్రజ్వరిల్లాలి కదా!’’ అన్నాడు మహర్షి.
‘‘కాపురం చేసే కళ కాలు తొక్కిననాడే తెల్సిందనే సామెత ఉందిగా మనకూ!’’
‘‘అవునవును. ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెత నీక్కొడా తెల్సుకదా!’’ అన్నాడు మహర్షి.
‘‘సామెతలకేంలే ఎన్నైనా చెప్పుకోవచ్చు. మన బ్రతుకే నలుగురి నోళ్లలోనూ ఒక సామెతగా నానకుండా ఉంటే చాలు, ఇక పద.. లోపలికి వెళదాం’’ అంటూ ఆఫీసులోకి దారితీశాడు సామ్రాట్.
***
బస్‌స్టాండ్‌కు చేరుకున్న సామ్రాట్‌కు ఏ ప్లాట్‌పాంమీద చూసినా గుంపులు గుంపులుగా చేరి కిక్కరిసిపోయి ఉన్న జనం కనిపించారు. ఎలాగోలా వీలు చేసుకుని జనాన్ని తప్పించుకుంటూ బస్ ఎక్కి, బ్రీఫ్‌కేసును లగేజ్ రాక్‌లో ఉంచి సీట్లో కూర్చుని కిటికీకి ఉన్న అద్దాన్ని పక్కకు జరిపి బయటకు చూడసాగాడు. అతనెక్కేసరికి ఖాళీగా ఉన్న బస్ అయిదు నిమిషాల్లో పూర్తిగా నిండిపోయింది. ఆడవాళ్లకు కేటాయించిన సీట్లలో మగవాళ్లు దర్జాగా కూర్చుని ఉంటే దాదాపు అరడజను మంది ఆడవాళ్లు తమ సహజ సిద్ధమైన నోరు లేని గుణంతో నిలబడి ఉన్నారు.
మగవాళ్ళకెలానూ బుద్ధి లేదు. ఆడవాళ్లలో ఒక్కరైనా నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడి తమ హక్కును సాధించుకోరే! బస్ ఎక్కిన సందర్భాల్లో చాలాసార్లు అతడు ఆడవాళ్ల తరఫున పోట్లాడి ఆడవాళ్ల సీట్లలోంచి మగాళ్లను లేపించి ఆడవాళ్లను కూర్చునేలా చేశాడు
అలా చేసిన ప్రతిసారీ అతడనుకునేవాడు- కనీసం ఈసారైనా ఆడవాళ్లలో చైతన్యం వస్తే బావుణ్ణని. ఈసారీ అతడలా ఆలోచిస్తోండగా, అప్పుడే బస్ ఎక్కిన ఒకావిడ బస్‌లోని పరిస్థితిని చూసి, ఆడవాళ్ళ సీట్లో కూర్చున్న మగవాళ్లనుద్దేశించి ‘‘ఏవండీ మీరు ఆ సీట్లలోంచి లేచి వెనక్కు సర్దుకుంటారా?’’ అంది.
ఆ సీట్లలో కూర్చున్న ఇద్దరూ తాము అసలా మాటల్ని విననట్టే ఎటో చూస్తూ ఉండిపోయారు.
ఈసారామె మళ్లీ అడిగింది, ‘‘ఏవండీ.. మిమ్మల్నే! ఆ సీట్లలోంచి లేచి వెనక్కు వెళ్లి సర్దుకుంటారా!?’’
ఇద్దరిలోనూ చర్మం కాస్త పలచగా ఉన్నతను తలపైకెత్తి ‘‘వెనుక సీట్లేమీ ఖాళీగా లేవు’’ అన్నాడు.
‘‘ఉన్నా లేకపోయినా మీరు ఖాళీ చేయాలి. ఇవి మా సీట్లు’’ అందామె.
అతడు లేచి నిలబడి, ‘‘బస్ కోసం గంటసేపు కాచుక్కూర్చుని సీట్లు సంపాదించుకుంటే, ఈవిడగారెవరో వచ్చిందని సీటు ఖాళీ చేయాలి. ఈ దేశమే ఇలా తగలడింది’’ అని గొణుక్కుంటూ నిలబడి ఉన్న జనం మధ్య సర్దుకుని నిలబడ్డాడు, ఆమెవైపు కోరగా చూస్తూ.
రెండో వ్యక్తి లేచే ప్రయత్నం చేయకపోగా అంతవరకూ మడిచిపెట్టబడి తన ఒళ్లో ఉన్న వార్తాపత్రికను విప్పి చదవడం ప్రారంభించాడు.
‘‘మీకు మళ్లీ విడిగా చెప్పాలా లేవమని?’’ అందామె స్వరం ఈసారి కొంచెం హెచ్చించి.
అయినా అతడిలో చలనం లేదు. అధికార పక్షం నాయకుణ్ణి ప్రతిపక్ష నాయకుడు చెప్పుతో కొట్టి బూతులు తిట్టిన వైనాన్ని రసవత్తరంగా వ్రాయబడిన ఒకానొక వార్తను కళ్లింతలు చేసుకుని మహదానందంగా.
‘‘మిమ్మల్నే! ఆ సీట్లోంచి మర్యాదగా లేస్తారా, లేవరా!’’ అందామె కోపంగా.
అతడా మాటలతో తల కొంచెం పైకెత్తి, ‘‘ఏం.. లేవకపోతే తలకొట్టి మొలేస్తారా?’’ అన్నాడు విసురుగా.

-ఇంకాఉంది

సీతాసత్య