డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే ఒక వ్యవస్థ కుప్పకూలినా మరో కొత్త వ్యవస్థ పునర్నిర్మించబడినా అది ప్రజల ఆలోచనల్లోనూ, చేతల్లోనూ వారాశించిన మార్పు వల్లే జరుగుతుంది కనుక’’ అన్నాడు గౌతమ్ లేచి నిలబడుతూ.
సామ్రాట్ లేచే ప్రయత్నం చేయకుండా ‘‘మనవాళ్లంతా మీ కోసం ఎదురుచూస్తూ ఉంటారేమో! మీరు వెళ్లండి. నేను కాస్సేపు కూర్చుని వస్తాను’’ అన్నాడు.
‘‘ఇందాకటినుంచీ మీతో మాట్లాడుతున్నానే గానీ నా మనసంతా అటే వుంది. ఇక్కడ ఒంటరిగా కూర్చుని మీకు నచ్చిన విధంగా సెలయేటి గలగలలన్నీ, చెట్ల ఆకుల రెప రెపల్నీ, పక్షుల కిలకిలారావాల్నీ మీ ఇష్టం వచ్చినంత సేపు తనివితీరా అనుభవించి తీరిగ్గా రండి.
నా నాలుక మందుకోసం, చేతులు పేకముక్కల కోసం చాలా గోల చేస్తున్నాయి. తర్వాత కల్సుకుందాం’’ అంటూ బండరాయిమీదినుంచి దిగి వాగు నీటిలో నడుచుకుంటూ మిత్ర బృందం వైపు అడుగులు వేశాడు గౌతమ్.
అతడు వెళ్లిన వైపే చూస్తోన్న సామ్రాట్‌కు గౌతమ్ చిత్రమైన మనిషిలా అనిపించాడు. అతడు చెప్పిన మాటల్ని సభ్య సమాజం హర్షించకపోయినా అతడి మాటల్లోని తర్కాన్ని కొట్టిపారవేయడనికి లేదనిపించింది సామ్రాట్.
వివాహ వ్యవస్థను సమర్థించేవాడిలా తను అతడితో మాట్లాడినదానికీ అందుకు భిన్నంగా తాను సాహిత్యంలో పరిచయం పెంపొందించుకోవడానికీ పోలికే లేదనిపించిందతడికి.
‘అతడి ప్రవర్తన సమాజం మెచ్చనిదైనపుడు తన ప్రవర్తన మాత్రం సమాజ నియమాలకు లోబడి ఉన్నట్టెలా అవుతుంది?
సాహిత్య సమక్షంలో తన మనసుకెంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆమెతో ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడ్తూనే ఉండాలనిపిస్తుంది.
వివాహితులైన ఇద్దరు స్ర్తి పురుషులు ఒకరి సమక్షంలో మరొకరు అంత సౌకర్యవంతంగా, కులాసాగా గడపడాన్ని ఈ సమాజం ఏం పేరు పెట్టి పిలుస్తుంది?
స్నేహమా? ప్రేమా? సక్రమం కాని సంబంధమా? తమ పరిచయానికి తాము పెట్టుకున్న పేరు స్నేహం. సమాజం కూడా దాన్ని స్నేహంగానే పరిగణిస్తుందా?
సాహిత్య భర్తా, తన భార్య కూడా దానిని తమలానే స్నేహంగా భావిస్తారా? తమ తమ భాగస్వాములూ తమలానే వేరొకరి సమక్షాన్ని ఇష్టపడి గంటలు గంటలు కాలం గడిపితే తామూ దాన్ని స్నేహంగానే భావించగలరా?
అంత విశాల హృదయం... తాము తమ జీవిత భాగస్వాములకు ఉండాలి అనుకున్నంత అర్థం చేసుకునే గుణం తనలోనూ, సాహిత్యలోనూ ఉన్నాయా?’’
‘‘సామ్రాట్‌గారూ.. భోజనాలు సిద్ధం!’’ అని ఎవరో పిలవడంతో రాతిమీది నుంచి దిగి వాగు నీళ్లలోంచి నడిచి గట్టెక్కి అటువైపు నడిచాడు సామ్రాట్.

6
‘‘అదీ.. అహహ.. అది కాదు.. నాలుగో వరుసలో పైనుంచి అయిదోది తీయండి’’ తన పక్కనే వినిపించిన మాటలకు తలెత్తి చూసింది సామ్రాజ్ఞి.
ఆ ఊళ్ళో అన్ని రకాల దుస్తులకూ పేరుగాంచిన అరడజను బట్టల దుకాణాలతో పోలిస్తే ఆ దుకాణమే మొదటి స్థానంలో నిలుస్తుంది.
క్రింది మధ్య తరగతి వర్గం వారినుంచి డబ్బులంటే లెక్కలేని పై తరగతివారి వరకూ అందరికీ అందుబాటులో ఉండే ధరలతో అన్ని రకాల దుస్తులూ దొరుకుతాయక్కడ.
బట్టలు కొనవలసిన అవసరం ఉండి కాక, ఇంట్లో చేసే పనేం లేక కాలక్షేపం కోసం బట్టల దుకాణానికి వచ్చింది సామ్రాజ్ఞి ఆరోజు.
అయిదంతస్తుల మేర విస్తరించి ఉన్న ఆ బట్టల దుకాణంలో వివిధ విభాగాల్లో ఉన్న వివిధ రకాలైన దుస్తుల్ని చూసుకుంటూ ఒక చోటికి వచ్చేసరికి తన ఈడుదే అయిన ఒక స్ర్తి మగవాళ్ల దుస్తుల విభాగం దగ్గర ఉన్న సేల్స్‌మాన్‌తో మాట్లాడ్డం విని అక్కడ ఆగి ఆసక్తిగా ఆమె వైపు చూసింది సామ్రాజ్ఞి.
ఎంతో పొందికగా, హుందాగా ఉందామె బాహ్యరూపం. ఛాయ కొంచెం తక్కువైనా, చూసేకొద్దీ చూడాలనిపిస్తోందామె రూపం. మెడలో మంగళసూత్రం తప్ప వేరే నగలేమీ ధరించలేదామె.
ఆమె చెవులకున్న దిద్దులు చూడముచ్చటగా అమిరాయి. ఆమె కట్టుకున్న కాటన్ చీర డిజైన్‌వల్లా, రంగు వల్లా కాక ఆమె కట్టుకున్నందుకే అందంగా ఉందా? అనిపించేలా ఉంది.
ఆమె కదలికలు ఎంతో చురుగ్గా ఉన్నాయి. మాట తీరు ఎంతో మర్యాదగానే, వినేకొద్దీ వినాలనిపించేలా ఉంది.
స్ర్తిల దుస్తుల విభాగంలో మగవాళ్లు కనబడడం ఎంత అరుదైన విషయమో, అలాగే మగవాళ్ల దుస్తుల విభాగంలో ఆడవాళ్లు కనబడడమూ అంతే అరుదు కావడంతో ఆసక్తిగా ఆమె వైపు చూడసాగింది సామ్రాజ్ఞి.
సేల్స్‌మేన్ బయటకు తీసిన షర్ట్ గుడ్డ మడతలోకి నాజూగ్గా ఉన్న తన నాలుగు వేళ్లూ పోనిచ్చి పైన బొటనవ్రేలితో కాస్సేపు దాని నాణ్యతను పరీక్షిస్తున్నట్టుగా రాస్తూ.. ‘‘ప్చ్.. వేరేరకం చూపించండి’’ అందామె.
తన అసంతృప్తిని తనలోనే దాచుకోవడంలో అప్పటికే ఎంతో అనుభవం కలిగిన ఆ సేల్స్‌మేన్ చిరునవ్వుతో ‘‘అలాగే.. ఇది మీకు నచ్చకపోతే మరో రకం చూడండి మేడమ్’’ అంటూ పక్కనే అలమారలో ఉన్న మరో దొంతర నుంచి నాలుగైదు షర్టు గుడ్డలు తీసి ఆమె ముందు పరిచాడు.
కొనుగోలుదారు వేసుకున్న బట్టల్ని పరీశీలించాక వారి అభిరుచి పట్ల ఒక ప్రాథమిక అంచనా వచ్చేస్తుంది అనుభవమున్న సేల్స్‌మెన్‌కు సాధారణంగా.
కస్టమర్లు నాలుగైదు రకాలు చూపించమని అడిగిన తర్వాత వాళ్లకు ఏ రంగు, ఎటువంటి డిజైను ఇష్టమోననే విషయంమీద ఇంచుమించు పూర్తి అవగాహనకు వచ్చేస్తారు సేల్స్‌మెన్. ఒకోసారి రెండు మూడు దుస్తుల్లో దేన్ని ఎంపిక చేసుకోవాలోనని కొనుగోలుదార్లు తటపటాయించే సందర్భాల్లో వాళ్లు కొనాల్సిన దుస్తుల ఎంపికను తమ చేతుల్లోకి తీసుకుని ఈ రంగు మీ ఒంటికి చాలా బావుంటుంది మేడమ్. ఇది లేటెస్ట్ డిజైన్. అరుదైన కలర్ కాంబినేషన్.

-ఇంకాఉంది

సీతాసత్య