డైలీ సీరియల్

బంగారుకల 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయలవారు పట్ట్భాషిక్తులైన ఈ సంవత్సరంలో మన సైన్యం బహుధా శిక్షణపొంది ఉంది. ఇంకా కొద్ది రోజుల్లోనే బహుమనీ సుల్తాన్ రెండవ మహమ్మద్ షా, బీజాపూర్ యూసఫ్, అదిల్‌ఖాన్ షాతో కలిసి మనమీద యుద్ధం ప్రకటించబోతున్నారని వేగులవల్ల తెలిసింది’’.
‘‘మంచిది, సైన్యాన్ని ఆయత్తపరచండి. వాళ్ళు సరిహద్దు చేరగానే మన సైన్యం ఆ మ్లేచ్ఛులను చీల్చి చెండాడగలదు’’ మహామంత్రి ఆజ్ఞ కాగానే దండపాణి సమరోత్సాహంతో నిష్క్రమించాడు.
ఆ రాత్రి రెండు జాముల వరకు తిమ్మరసు దీపం వెలుగులో పలు లేఖలు రచించి వేగులతో వర్తమానాలు పంపించాడు. అవి ఎవరి కోసం రాశాడో మున్ముందు చరిత్రే చెప్తుంది.
చిన్నాదేవి మందిరంలో ప్రణయ సామ్రాజ్యంలో ఓలలాడి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాయలకీ విషయాలేవీ తెలియవు. మహామంత్రి తిమ్మరసు విజయనగర సామ్రాజ్యాన్ని కంటిరెప్పలా కాపాడుతున్నంత కాలం నిశ్చింతగా ఉండొచ్చని రాయల అచంచల విశ్వాసం.
***
అంతఃపుర సౌధాన్ని ఆనుకొని ఉన్న సుందర ఉద్యానవనంలో చాలాసేపటి నుంచి మంజరి వేచి ఉంది. చంద్రాని చూసి ఎంతకాలమైంది. తనను కలవలేనంత రాచకార్యాలేముంటాయి. తను అతని కోసం అంతగా వేదన చెందుతుంటే చంద్రాకి ఇదేమీ పట్టదా! ఈ రోజు చంద్రుడి నడినెత్తిమీదికి వచ్చే సమయానికి ఈ వసంత వాటికలో కలుస్తానని కబురు పంపాడు. ఇంతవరకు జాడలేదు.
ఆకాశం కేసి చూసింది మంజరి. మబ్బులు అడ్డగించడంవల్ల చంద్రుడు ఎంతమీదికి వచ్చాడో తెలీటంలేదు. ఉస్సురని నిట్టూర్చింది. చిన్నాదేవిదే అదృష్టం. ప్రభువు కాకముందే కృష్ణరాయని ప్రేమకి పాత్రురాలయింది. ప్రభువయినా రాయలవారి మనసు సుంతయినా మారలేదు సరికదా తిరుమలాంబతో వివాహమైనా చిన్నాదేవి పట్ల మక్కువ పెరిగిందే కానీ తరగలేదు. ఓసారి నిట్టూర్చి పాలరాతి మండపంలో స్తంభానికి చేరగిలపడి చంద్రప్ప గురించి తలపోస్తున్నది మంజరి.
‘‘ఎదుట ఉన్నవారిని మరచి ఎంతసేపా ధ్యానం మంజూ’’ చంద్రప్ప ప్రేమపూరితమైన స్వరం విని నిలువెల్లా పులకించింది.
‘‘చంద్రా!’’ ఉదుటన లేచి నిలువెల్లా అల్లుకుపోయింది.
‘‘ఇన్నాళ్ళకా చంద్రా! నేనేమైపోవాలి’’ ఆమె గొంతు మూగవోతున్నది.
‘‘మన్నించు మంజూ! అప్పాజీ వారు అప్పగించిన స్వామికార్యంలో నిమగ్నమై నిన్ను కలవలేకపోయాను’’ బుజ్జగిస్తూ చెప్పాడు ఆమె భుజంమీదుగా చేయి వేసి లతా మండపానికి తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు.
‘‘నువ్వు వినే వుంటావు. మనకీ, బహుమనీ సుల్తాను, బీజాపూర్ సుల్తాన్‌లు కలిసి జరిపిన యుద్ధం గురించి’’
‘‘అవును.. మనం సాధించిన విజయవార్త కూడా విన్నాను.. విజయనగర సైన్యం శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడిందనీ. మహమ్మద్ షాకు తీవ్ర గాయాలైనాయనీ’’.
‘‘ఆ! అంతేగాదు పిరికితనంతో పలాయనం చిత్తగిస్తున్న మహమ్మదీయ సైన్యాన్ని మనవాళ్ళు తరిమి తరిమి కొట్టారు. ఈ యుద్ధంలో బీజాపూర్ యూసఫ్ ఆదిల్ షా మరణించాడు. అతని కుమారుడు పనె్నండేళ్ళ బాలుడైన ఇస్మాయిల్ ఆదిల్‌ఖాన్ సుల్తాన్ అయ్యాడు. ఇస్మాయిల్ బాలుడు కావటాన బీజాపూర్‌లో కామల్‌ఖాన్ సర్దారు అధికారం చేజిక్కించుకున్నారు. బీదర్ ఆక్రమించి సుల్తాన్ మహమ్మద్ షాని బందీ చేశాడు. రాయచూర్‌ని జయించాక కామల్‌ఖాన్ హత్య తర్వాత రాయలు మహమ్మద్ షాని బంధ విముక్తుడ్ని చేసి మళ్లీ సుల్తాన్‌ని చేశాడు’’ సంతోషంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘ఇవన్నీ విజయననగర పౌరులందరికీ తెల్సినవే! రాయలవారికి ‘యవన సామ్రాజ్య స్థాపకాచార్య’ బిరుదు ప్రదానం అందుకే గదా’’ నవ్వింది మంజరి ఉల్లాసంగా.
‘‘మంజరీ! అన్నీ శుభవార్తలే! ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత మళ్లీ నీ సుందర వదనారవిందాన్ని చూసే అదృష్టం కలిగింది. నా దేశాంతరవాస శ్రమంతా నీ చిరునవ్వుతో, ఆలింగన స్పర్శతో తీరిపోయింది’’ చంద్రప్ప మంజరిని తన బాహువుల మధ్య మళ్లీ చేర్చుకున్నాడు. మంజరి గువ్వలా అతని కౌగిట ఒదిగిపోయింది.
‘‘చంద్రా! మరో ముఖ్య విషయం. నేను నీ ఎడల అనురాగాస్తనై ఉన్నట్లు చిన్నాజీకి తెల్సింది’’
అతను కౌగిలినుంచి విడిపడి ఆమె కళ్ళలోకి చూశాడు.
‘‘నువ్వే చెప్పావా?’’
‘‘లేదు. ఆమె గ్రహించింది. రాయలవారి అనుంగు పట్టమహిషి ఆమె. ఆమె ప్రియసఖిని నేను. నా మనసు తెలుసుకోవటం అంత కష్టమేమీ కాదులే!’’ బుంగమూతి పెట్టింది మంజరి.
‘‘అప్పాజీవారు కూడా మనకి ఆశీస్సులందిస్తారు’’ నమ్మకంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘అప్పాజీవారా’’ ఆశ్చర్యంగా చూసింది మంజరి.
‘‘అవును. ఈ రాచకార్యంమీద నేను దేశాంతరం వెళ్ళే ముందు వారు ‘కల్యాణమస్తు’ అని కూడా ఆశీర్వదించారు.
‘‘అయితే అది మన కోరిక తీరే దీవెనే’’
‘‘అయినా కొంచెం ఆగాలి సుమా’’
‘‘ఇంకానా’’ ఆమె అతని భుజంపై తలవాల్చింది.
‘‘రాయలవారు దక్షిణ దిగ్విజయ యాత్రకు బయలుదేరుతున్నారు. నీకు తెలుసు కదా! ప్రభువుతోబాటు సైన్యమే కాదు, కళాకారులు, కవులు కూడా యుద్ధరంగానికి తరలి వెళ్తున్నాం’’ ఉత్సాహంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘మీరు కూడానా! యుద్ధరంగానికా! ఇదేమిటి చంద్రా! అక్కడ మీకేం పని? వేగు పనిచేయటం వేరు. వేణుగానంతో మనసుల్ని అలరించే లలిత హృదయుడివి. రక్తపుటేరులు పారే కదనభూమిలో నిలువగలవా?’’ భయాందోళనలతో అడిగింది మంజరి.
ఆమె చేతి మధ్య అతని చేతిని బిగించి పట్టుకోవటంలోనే అతనిపట్ల ఆమెకున్న ప్రేమానురాగాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రప్ప చిన్నగా నవ్వాడు. అతనికి తెలుసు. ఆమె మనసులో చెలరేగే సంఘర్షణ జ్వాల.
‘‘రాయలవారు ఏ జైత్రయాత్ర చేసినా కవులు, కళాకారులు సైన్యంతో పాటు బయలుదేరాల్సిందే.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి