డైలీ సీరియల్

ట్విన్‌టవర్స్ 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఎయిర్ ఇండియా ప్రయాణికులు వెయిట్ చేసే లాంజ్, ప్రయాణీకుల్లో చాలాభాగం భారతీయులే! కొద్దిమంది మాత్రం ఫారినర్స్ ఉన్నారు.
అర్థరాత్రి దాటితే కానీ ఏ ఇంటర్నేషనల్ ఫ్లైట్ బయలుదేరదు. అలా ఎందుకో నాకు తెలియదు కానీ, ఏదో షెడ్యూలింగ్‌లో అది సులువు అయి వుంటుంది. కొద్దిమంది చిన్న చిన్న పిల్లలతో ట్రావెల్ చేస్తున్నారు. పిల్లల తోవన పిల్లలు హాయిగా నిద్రపోయారు. భుజాన వేసుకున్న తల్లిదండ్రులు మాత్రం అలసిపోయి ఉన్నారు.
మరికొద్దిమంది బాగా పెద్దవాళ్ళున్నారు. పిల్లల దగ్గరకు కాబోలు. ఈ వయసులో స్వంత దేశం విడిచి పిల్లలకోసం, పరాయి దేశం వెళ్లి సెటిల్ అవ్వాల్సి రావటం మామూలు విషయం కాదు. ఏళ్ల తరబడి తమదీ అనుకున్నది వదలి, పిల్లల ఇళ్లల్లో ఉండడం కూడా కష్టమే! స్నేహితులు, పరిచయస్తులు ఉండరు.. చాలామందికి భాష రాదు. అయినా తప్పదు! వార్థక్యంలో తోడు కావాలంటే పిల్లల పంచన చేరాల్సిందే! అందుకు ఇష్టపడే పిల్లలు ఉంటే!
అక్కడ ఉన్న వాళ్లల్లో కొంతమంది ఇండియా విజిట్‌కి వచ్చినవాళ్ళున్నారు. లాంజ్‌లోకి రాగానే, అంతవరకూ కట్టుకున్న చీర విప్పేసి, వెంటనే బ్లూజీన్స్, టీషర్ట్ వేసుకు వచ్చేసారు. వాళ్లను చూస్తే వాళ్ల మానరిజమ్స్‌లో తేడా తప్పకుండా తెలుస్తుంది. సంవత్సరాలుగా పైదేశాల్లో ఉండిపోయి నిత్యం అక్కడి జీవితానికి అలవాటుపడిపోయి అమ్మా, నాన్నల కోసం వచ్చి వెడుతూ ఉంటారు.
మా ఇంటి పక్కన ప్లీడర్‌గారి అమ్మాయి అంతే! ప్రతి ఏటా తల్లిదండ్రుల కోసం వచ్చేది ఒక నెల ఉండి వెళ్లేది. నేనింతకంటే ఏం చేయగలను అనేది. వాళ్లను తీసుకువెళ్లి అక్కడుంచుకోవడం అనేది చాలా కష్టం. పనిమనుషులు దొరకరు. మేమిద్దరం పనికివెడితే రోజంతా ఒంటరిగా వాళ్లకు కష్టం అనేది.
అందరం బస్సు ఎక్కి విమానం దగ్గరకు చేరాం. నా సీట్ నెంబర్ చూసుకుని, బాగ్ పైన పెట్టి సీటులో కూలబడ్డాను. అమ్మయ్య, ఫైనల్‌గా ఇంతవరకూ వచ్చాను అనుకున్నాను.
మరో అరగంటకు కలకలం ఆగింది. అందరూ సర్దుకున్నారు. అనౌన్స్‌మెంట్‌లు అన్ని మొదలయ్యాయి. విమాన చక్రాలు కదులుతున్నట్లు అనిపించింది.
ఎయిర్ హోస్టెస్ ముందు విమానంలో బాగోగులు చెప్తోంది. ఆక్సిజన్ ఎలా పెట్టుకోవాలో, లైఫ్ జాకెట్స్ ఎక్కడున్నాయో అవీను. ఎన్నోసార్లు వాళ్లు మొత్తుకుంటారు. చివరకు ఏదైనా ప్రమాదం వచ్చి, ఈ పరికరాలు వాడాల్సి వస్తే ఎంతమందికి గుర్తుంటుందా అనిపించింది.
నాకు తెలియకుండానే పెదవులమీద చిరునవ్వు వచ్చింది. నాకు మాత్రం చీమంత కూడా గుర్తుండదు అనుకున్నాను. నా పక్క సీట్స్‌లో ఓ దంపతులు కూర్చున్నారు. వాళ్ల చేతుల్లో ఓ చిన్న పిల్ల. ఆ పిల్లను చూసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. పక్కన కూర్చుని చూడటానికి ముచ్చటేసింది. వాళ్ల వంకే తదేకంగా చూస్తే బాగుండదని, కూడా తెచ్చుకున్న మాగజైన్స్‌లోకి చూస్తూ ఉండిపోయాను.
విమానం పైకి ఎగిరింది. పైకి లేవడంతోబ్లడ్ సర్క్యులేషన్‌లో వచ్చిన మార్పులేమో! కొద్ది నిమిషాలు నిద్ర వస్తుందా అనిపించింది. రెండు మూడు నిమిషాలు మాత్రమే! ఆ తరువాత మామూలుగా అనిపించింది.
ఎయిర్‌హోస్టెస్ మంచినీళ్లు, సాప్ట్‌డ్రింక్ ఇవ్వడంలో నిమగ్నమయి ఉన్నారు. తల వంచి విండో లోంచి కిందకు చూశాను. చీకట్లో ఏమీ కనిపించడంలేదు. బాగా పైకి వెళ్లడం మూలంగా భూమికి విమానానికి మధ్య మేఘాలు పరచుకున్నాయి. పెను చీకటి అంటే ఇదే కాబోలు. యుగాంతం అయినపుడు ఆవరించే పెనుచీకటి.
అదేంకాదు! అంటూ దూరంగా వెడుతున్న మరో విమానం తాలూకు టైల్‌మీద ఎర్ర లైట్స్ కనిపించాయి.
నాకెప్పుడూ ఇదో ఈ అలవాటు. ఏది నా దృష్టిలో పడినా, దానిని గురించి కూలంకషంగా ఆలోచించకుండా ఉండలేను.
ఒకప్పుడు గలగలా మాట్లాడేదాన్ని. ఆ తరువాత కొద్ది కొద్దిగా తగ్గిపోయింది. ఆ తరువాత మాట్లాడటం తక్కువ, వౌనం ఎక్కువ అయిపోయింది. కాలేజీలో పాఠాలు చెప్పే సమయం తప్ప, అవసరాన్ని మించి మాట్లాడటం పూర్తిగా తగ్గిపోయింది.
అది నేను ఈమధ్యనే గమనించాను. నా అంతట నేను కాదు, మా ఇంటికివచ్చిన బంధువులు ఎవరో నన్ను చూసి చేసిన కామెంట్స్ విన్నాక.
‘‘ఎంత చలాకీగా ఉండేది ఇది. ఇంత గంభీరంగా మారిపోయింది’’ అన్నారు. అమ్మ వెంటనే సమర్థించింది. ‘‘పెద్ద ఉద్యోగం, రోజంతా గొంతు చించుకు వస్తుంది కదా!’’ అని.
పిచ్చి అమ్మ! ఏదో ఊహించుకుంటుంది నా ఉద్యోగం గురించి. నేనేమీ అంత కష్టపడటంలేదని తనకు తెలియదు.
నాకెందుకో ఎవరితోనూ ఎక్కువ సంభాషణ జరిపించాలని అనిపించడం మానేసింది. ఎవరు ఏం మాట్లాడటం మొదలుపెట్టినా చివరకు నా వ్యక్తిగత జీవితం మీదకు వెళ్ళేది. అవసరం లేని సానుభూతి కావలసినంత లభించేది. అది పైవారి దృష్టిలో వారి విచక్షణకు నిదర్శనమేమో. కాని సానుభూతి నా దృష్టిలో చేతకానితనమే! నా జీవితంపై నాకు కావలసినంత సానుభూతి!
జీవితమంతా ఒకరి సలహాలతో నడిచేవాళ్లకు సానుభూతి పొందే అర్హత లేదు! నాకూ అంతే! అందుకే క్లుప్తంగా, అవసరమయినంతగా మాత్రమే మాట్లాడేదాన్ని!

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి