డైలీ సీరియల్

ట్విన్‌టవర్స్ 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజు మాత్రం నాకు నిన్న మొన్న జరిగినంత వివరంగా గుర్తు ఉంటుంది. ఇప్పటికీ నాకు నీళ్ళు అంటే భయమే! అని నవ్వాడు. అతని నవ్వును చూస్తూ ఎంతసేపైనా గడపవచ్చు అనుకున్నాను.
‘‘ఇంటికి తిరిగి వెళ్లాక, నాన్నకి ఎంత కోపం వచ్చిందో- అమ్మమీద. ఎప్పుడూ ఏమీ అనని అమ్మమీద చాలా కోప్పడ్డారు. వాడు అసలే అర్భకం. వాడిని నీళ్ళల్లోకి ఎందుకు తీసుకువెళ్ళావని- నేను పెరిగి పెద్దవుతానన్న నమ్మకం వాళ్లెవరికీ ఉండేది కాదు- అంటూ మళ్లీ నవ్వాడు.
అతని బంధువులంతా మా వైపుకు నడవడంతో ఏదో అనబోయిన దాన్ని చటుక్కున మానేసాను.
మర్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ చాలా హడావిడిగా గడిచిపోయింది. ఉదయం వ్రతం భోజనాలు, ఇంటినిండా బంధువులు.
అతని తల్లితో ఒకళ్లిద్దరు మాత్రం ‘‘ఆస్తులు, అంతస్తులూ అని చూడక చక్కని కోడలిని తెచ్చుకున్నావు’’ అని పొగడ్తలు కూడా చేశారు.
మనసు మళ్లీ ఎప్పటిలా ఆలోచనలోకి జారిపోకుండా ఉండలేకపోయింది.
వివాహ వ్యవస్థ ఎవరి జీవితంపైన అయినా ఇలాగే ప్రభవిస్తుందా? ఆడపిల్ల జీవితం నిజంగా ఎవరిదీ? పెండ్లి అయ్యేవరకూ తల్లిదండ్రులది- తర్వాత, భర్త, అత్తమామలు, ఆ తర్వాత పిల్లలు- తన జీవితం తనది అని అనుకునేదెప్పుడు?
ఈ వ్యవస్థలో ఏదో అపశ్రుతి ఉందనిపించింది. ఒక పక్క పెళ్లిలో పెళ్లి దంపతులు, కాడికి కట్టిన ఎద్దుల్లా బరువు సమానంగా మోయాలంటారు. ఇద్దరు సమానం అంటారు. మళ్లీ బయట ఎనలేని హెచ్చుతగ్గులు. మళ్లీ మనసు అసంతృప్తిగా మూలిగింది.
సాయంకాలం అయిపోయింది. తలనిండా మల్లెపూలు కదిలినపుడల్లా సువాసనలు వెదజల్లుతున్నాయి. భోజనాలు అయిపోయాయి. బంధువులు ఎక్కడివాళ్ళు అక్కడ సర్దుకున్నారు. అతని తల్లి వచ్చి, ఒక పాల గ్లాసు చేతికి ఇచ్చి మెట్లదాకా తీసుకువెళ్లింది. పైకి వెళ్లి రఘు గదిలో పడుకో అంది.
క్షణకాలం తటపటాయించాను. మారు మాట్లాడకుండా వెళ్లాను. గది ఖాళీగా ఉంది. పెద్ద పందిరి మంచం, అగరవత్తుల సువాసనలు వెదజల్లుతోంది.
గది ఖాళీగా ఉండటంతో తెలియకుండానే ఒక రిలీఫ్‌తో శ్వాస వదిలాను. నన్ను నేను కూడగట్టుకునేవరకూ, ఒంటరిగా ఉంటే బాగానే ఉంటుంది.
చేతిలో ఉన్న గ్లాసు టేబుల్ మీద పెట్టి కిటికీకి దగ్గరగా నడిచాను. బయటనుంచి సన్నటి గాలులు వీస్తున్నాయి. పూల పందిరి మీంచి సువాసనలు వస్తున్నాయి. కింది నుంచి ఇంకా మాటలు వినిపిస్తున్నాయి. రైలు స్టేషన్ మరీ దూరం కాదు కాబోలు, దూరంగా రైలు కూత వినిపించింది. పొద్దుటినుంచి చూచినంతలో ఆ ఇల్లు చాలా సంపన్నంగా ఉంది. పెద్ద ఇల్లు, చుట్టూ మొక్కలు, కొబ్బరి చెట్లు, చిన్న ప్రహరీ గోడ, గోడనంతా ఆక్రమించిన బోగన్ విల్లా, పోర్టికోలో పెద్దకారు, చుట్టూ కట్టిన మామిడి తోరణాలతో చాలా అందంగా ఉంది. అతని తల్లికి మంచి అభిరుచి ఉంది. ఇంటి అలంకరణ, నా కోసం కొన్న నగలు, చీరలు, అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. అదే అన్నాను అతనితో. ఒక సంభాషణ మధ్యలో మెచ్చుకోలుగా. అతను తిరిగి నవ్వుతూ, మరి నిన్ను సెలెక్ట్ చేసుకోవడంలో తెలియడంలేదూ! మా అమ్మ టేస్ట్ అన్నాడు (మైగాడ్- అతని నవ్వే)
వెనక తలుపు తెరిచిన చప్పుడయింది. గడియపెట్టిన చప్పుడు కూడా అయింది. మళ్లీ ఒక్కసారిగా నెర్వస్ అయిపోయాను. అంతవరకూ రిలాక్స్ అయిన మనసు అలజడికి లోనయింది. వెనక్కి తిరిగి చూడాలనిపించలేదు. ఎందుకో భయం అనిపించింది. ఏమైపోతోంది నా జీవితం- క్రిందటివారం ఈపాటికి ఏ ఆలోచన లేకుండా పుస్తకంలో తలదూర్చుకుని పాఠాలు చదువుకుంటున్నాను. ఈ రోజు- భర్త అనబడే వ్యక్తితో ఒంటరిగా గదిలో ఉన్నాను.
జీవితాలు అంకితం చేయాల్సిన రాత్రి-
అనుభూతులు దాచుకోవలసిన రాత్రి-
ఒక వ్యవస్థకు నాంది పలికే రాత్రి-
ఒకరంటే ఒకరికి, ఏమీ తెలియకుండా కొత్త ఊళ్ళో, కొత్త ఇంట్లో, అంతకంటే ఒక కొత్త వ్యక్తితో.
నా నెర్వస్‌నెస్ నన్ను నిలవనీయడంలేదు. నాకు తెలియకుండానే నా చేతులు కిటికీ చువ్వలను గట్టిగా పట్టుకున్నాయి. ఒళ్ళంతా చిరుచమటలు పోయసాగాయి.
అతను కూడా కిటికీ దగ్గరగా నడిచి వచ్చి నా వెనుకగా నుంచున్నాడు. అతని గుండెలు నా భుజంకు తగులుతున్నాయి. చాలా దగ్గరగా ఉన్నాడు. నాకు నేనుగా పొడుగయినా అతని పక్క పొట్టిగానే ఉన్నాను. తల వంచి జడలో ఉన్న మల్లెపూల మీద ముక్కు ఉంచాడు. ఆ ఉంచడంలో అతని శ్వాస వేడిగా నా మెడ మీదకి సోకింది. ‘అబ్బ’ అన్నాడు వాసన చూస్తూ- అది మెచ్చుకోలో, ఫిర్యాదో తెలియలేదు. నా చేతులు కిటికీ చువ్వలమీద మరింత గట్టిగా బిగుసుకున్నాయి.
‘ఇటు తిరుగు’ అన్నాడు మెల్లిగా. నేను తిరగలేదు. రెండు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. తన చేతులు నా చేతులమీద ఉంచి నా పట్టున చువ్వల మీంచి సడలించాలని చూశాడు. అతని చేతి స్పర్శ తగలంగానే నా చేతుల్లో పట్టు సడలిపోయింది. మెల్లిగా అతని వైపునకు తిరిగాను. నా రెండు చేతులు అతని చేతుల్లోకి తీసుకుని అరచేతుల వంక చూచాడు. తెల్లని అరచేతుల్లో కెంపు రంగు గోరింటాకుతో లేత తమలపాకుల్లా ఉన్నాయి.
చేతుల్లో తడిని గమనిస్తూ, ‘నెర్వస్?’ నవ్వాడు.
నా గుండె లయ తప్పింది. తల ఊగించాను, అవునన్నట్లు.
అరచేతిలో ఉన్న ఎర్రటి చందమామను తనవేలుతో గుండ్రంగా ట్రేస్ చేస్తూ అన్నాడు.
‘మీ టూ,’

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి