డైలీ సీరియల్

బంగారుకల - 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసప్ప నాయకుని ముగ్గురు భార్యలలో నాగలాంబిక కుమారుడు రాయలవారు. అందరికీ తెల్సిన విషయమే గదా!’’ మంజరి వీరేంద్రుని అపోహను ఖండించింది.
అతడు వికటంగా నవ్వాడు.
‘‘ఇదంతా మీరనుకుంటున్నది. కానీ అది నిజం కాదు. మీలాంటివారిని మభ్యపెట్టడానికి. అసలు సంగతి చెబుతాను విను జగన్నాథ!
రాయలు సత్కుల సంజాతుడు కానే కాదు. రాయల తండ్రి నరసనాయకుని చేతిలోని నీటి పాత్రలో ఓ సాయంత్రం ప్రకాశవంతమైన చుక్క రాలింది. ఆయన ఆ పాత్ర మూసి మంత్రిగారికీ విషయం కబురు చేశాడు. మంత్రిగారు ఆ నీటిని తాగమని రాజుకు వర్తమానం పంపాడు. రాజు నీటిని తాగి ఆ రాత్రి పట్టపుదేవి అంతఃపురానికి వెళ్లాడు. కానీ ఆమెను కలవలేని సందర్భంలో ఆమె పరిచారికతో కలిశాడు. కృష్ణరాయని జన్మ ఆమెవల్ల జరిగింది’’ వీరేంద్రుడు గొప్ప రహస్యం కనిపెట్టిన వాడిలా నవ్వాడు.
‘‘అంటే మీ ఉద్దేశం రాయలవారి తల్లి కులీన కాదనేగా’’
‘‘జగన్నాథ! అందుకే ఆయన బుద్ధికూడా అలాగే పెడతోవబట్టింది. భోగకాంత అయిన చిన్నాదేవిని చేరదీశాడు కదా!’’
‘‘్ఛ! మీకీ విషం ఎవరు పెట్టారు? మీరు కులీన స్ర్తికి జన్మించలేదా?’’ మంజరి బుసకొట్టింది.
ఆ క్షణంలో ఆమె పరమశివుని కంఠాభరణమైన నాగినిలా వుంది.
‘‘ఏం కూశావ్! మా గజపతుల వీర పరాక్రమం గురించి నీకు తెలీదు! కొన్నాళ్లు ఆగు. నువ్వూ, నీ రాయలు ఈ విజయనగరం మట్టిలో కలవకపోతే నా పేరు వీరేంద్రుడు కాదు’’ హుంకరించాడు.
మంజరి వెంటనే తేరుకుంది. యుక్తివంతంగా వ్యవహరించాలనుకుంది.
‘‘మీరన్నదే నిజమైతే ఇంతటి దాసీ పుత్రునికి అన్నపూర్ణాదేవినిచ్చి ఎలా వివాహం చేశారు’’ ఆరా తీసింది.
‘‘అదా! గ్రహచారం జగన్నాథా! ఇస్తే ఇల్లలకగానే పండగయిందా? గజపతుల కృష్ణసర్పం పడగ నీడలో రాయలున్నాడని మర్చిపోతున్నాడు. చూస్తావుగా ఇకనించి అంతా మా కాళ్లికింద మట్టిలాగా మిగుల్తుంది’’ వీరేంద్రుడు కాలితో నేలను తన్ని విసవిసా వెళ్లిపోయాడు.
అతని నిజస్వరూపం తెలుసుకున్న మంజరి తుఫాను ఎదుర్కొనే ఆకులా అల్లాడిపోయింది. అతనితో మాట్లాడటం మేలుకే అయింది. ఇతగాడి విషబుద్ధి మహామంత్రికి సెలవీయాలి. విజయనగర సామ్రాజ్య పరిరక్షణ కోసం తన ఆఖరి శ్వాసదాకా అంకితవౌతుంది.
తిమ్మరుసు వారికీ విషకీటకం బుసలు కన్పించకుండా ఉంటాయా? చంద్రప్ప రాగానే చర్చించాక అసలు విషయం బయటపెట్టాలి. పాపం అన్నపూర్ణాదేవి మహాసాధ్వి. గంధపు చెట్టును సర్పాలు చుట్టుకున్నట్లు ఇటువంటి నాగులెన్ని కదలినా రాయలవారి ఖడ్గానికి బలికాక తప్పదు. ఏది ఏమైనా వీరేంద్రుని కదలికలని కొంత కనిపెట్టి ఉండాల్సిన అవసరమేర్పడుతున్నది.
శత్రుదేశాన్ని తగులబెట్టు. శత్రు రాజుల కోటలను ఆక్రమించు. కానీ బందీలుగా ఉన్న శత్రువుల స్ర్తిలను పుట్టింటి తోబుట్టువులుగా భావించి మర్యాదతో ప్రవర్తించు. రాయబారులతో పరుష వాక్యాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సంధి చేసుకోవాల్సి రావచ్చు.
ఇటువంటి ఉన్నతాశయాలు కలవాడు కనుకనే రాయల సంస్కారం అదే తీరులో వుంది. కానీ తమ ఇంటి ఆడబడుచు బంధువుగా వచ్చిన వీరేంద్రుడు ఇలా ప్రవర్తించడం అతని నీచత్వానికి నిదర్శనం. ప్రతాపరుద్ర గజపతిని ఓడించిన తర్వాత అతని కొడుకైన వీరభద్ర గజపతికి రాయలవారు ప్రాణభిక్ష పెట్టకపోతే గజపతులకు వారసుడెవరుంటారు? మరుక్షణంలోనే అన్నపూర్ణాదేవి కుమారుడు తిరుమల రాయలు స్ఫురణకొచ్చాడు. అంతకుముందు రాయలవారికి పుత్రులు పుట్టినా దక్కలేదు. తిరుమలరాయడే భావి విజయనగర సామ్రాజ్యాధినేత గదా! అని మంజరి తనలో తాను వితర్కించుకుంటూ మరోమారు ప్రసన్న విరూపాక్షునికి నమస్కరించి బయలుదేరింది. మెట్లెక్కి ప్రాకారం దాటి బయటికి రాగానే వెనుకనే రామేశ్వర శాస్ర్తీ బయటికి రావడం గమనించిన మంజరి ఆశ్చర్యచకితురాలయింది.
బ్రహ్మ తేజస్సుతో అలరారే ముఖవర్చస్సు, స్ఫురద్రూపం, కాలికి కడియం, నుదుట విభూతిరేఖలు, ధీటైన వస్తధ్రారణతో పాతికేళ్ల ఆ యువకుడు మంజరి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమెపట్ల అతని ఆరాధనా భావమంతా ఆ కన్నులలో తొణికసలాడింది. మంజరికి ఈ యువకుని గుర్తించి పూర్తిగా తెలియదు. చాలాసార్లు ఇతనిని శిల్పారామంలో చూసింది. యువశిల్పిగా భావించింది. కానీ శాస్ర్తీ మంజరి సౌందర్యాన్ని ఆమె నృత్యశోభను ఆరాధిస్తున్నాడని ఆమెకి తెలిసే అవకాశం లేదు.
తనకీ వీరేంద్రునికి మధ్య జరిగిన సంవాదానికి సాక్షి పరమేశ్వర శాస్ర్తీ అనే విషయం మంజరికి అర్థమయింది. ఆమె అతనికేదో చెప్పాలనుకొంది.
అతను మాత్రం ఆమెకా అవకాశం ఇవ్వకుండా మరో దోవలో చకచకా ముందుకు సాగిపోయాడు. వెళ్తున్న అతనికేసి చూస్తుండిపోయింది మంజరి.
పరమేశ్వర శాస్ర్తీ పరమ శివభక్తుడు. ప్రశాంతంగా ఉండే భూగర్భ ప్రసన్న విరూపాక్ష మందిరంలో రోజూ కొన్ని గంటలు యోగ సాధన చేస్తుంటాడు. అతనెవ్వరివాడో ఎక్కడివాడో ఏ వివరాలు ఎవరికీ పూర్తిగా తెలియవు.
పరమేశ్వర శాస్ర్తీ తిమ్మరుసు స్నేహితుని కుమారుడని మాత్రం అంతా చెప్పుకుంటారు. కళగల మొహంతో అందంగా బలంగా కన్పించే శాస్ర్తీ అప్పుడప్పుడు రాతిరథం దగ్గర కూచుని ఎలుగెత్తి శ్రావ్యమైన స్వరంతో పాటలు పాడుతుంటాడని అందరికీ తెలుసు.
ఆ రోజు కూడా విరూపాక్ష దేవాలయం నుండి శాస్ర్తీ నేరుగా రాతి రథం దగ్గరికి వచ్చాడు. రెండు చక్రాల మధ్య స్థలంలో బాసీపట్టు వేసుకుని కూచున్నాడు. శివయోగం సాధన చేశాడు. మనసుకు శాంతి లభించటంలేదు. మంజరిని చూసినపుడల్లా తెలియని అశాంతికి లోనవుతున్నాడు.
నిలువ నీడలేని తనకు ఆశ్రయమిచ్చి సర్వశాస్త్రాలలో ముఖ్యంగా శిల్ప శాస్త్రంలో మెళకువలు అవగతం చేసిన గురువును స్మరించాడు. తనలోని సంగీత తృష్ణని పెంచి గంధర్వగానాన్ని నేర్పిన రెండవ గురువు అమ్మకి నమస్కరించాడు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి