రాష్ట్ర వార్తలు

రాష్ట్రానికి సూర్యగ్రహణం

  • 05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: రాష్ట్రానికి సూర్యగ్రహణం పట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ పి శంకర్‌రావు పరోక్షంగా ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ గ్రహణం ఎంతో కాలం ఉండదని, త్వరలో విడుస్తుందని అన్నారు. గతంలో 9 సంవత్సరాలు ‘చంద్ర’ గ్రహణం ఉండేదని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. సిబిఐ చట్టపరంగా నడుస్తున్నదని, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బాగా పని చేస్తున్నారని చెప్పారు. మంత్రులు తమ స్వలాభం కోసం చేయించిన పనులకు ఐఎఎస్ అధికారులను బలి చేయవద్దని ఆయన కోరారు. ఎమ్మార్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించి, సిబిఐ విచారణకు సహకరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐఎఎస్ అధికారుల అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. అధికారులు కేవలం అమలు చేస్తారని, నిర్ణయాలు తీసుకునేది మంత్రులని ఆయన వివరించారు. ఎవరైనా ఐఎఎస్ అధికారులు తప్పుదారి పట్టించాలనుకుంటే దానిని మంత్రులే సరిచేయాలని అన్నారు. తాను కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ఒక కార్యకర్తలా గ్రామ, గ్రామాన తిరుగుతానని ఆయన తెలిపారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్‌కు చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 4వ తరగతి చదవుకున్న దివంగత టి. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైన పాలన అందించారని ఆయన తెలిపారు.
==========
రైతుల కోసం అఖిలపక్షం
తెలుగుదేశం డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 4: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని టిడిపి నాయకుడు, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు డిమాండ్ చేశారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ధాన్యానికి మద్దతు ధర పెంచాలని కోరితే, పెంచే అవకాశం లేదని పరోక్షంగా వెల్లడించారని కోడెల తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. వ్యవసాయ లాభసాటిగా ఉండాలని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తీసుకోవలసిన చర్యల గురించి విస్తృతంగా చర్చించాలని, దీని కోసం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ పక్షాలు, రైతులతో పాటు వ్యవసాయ రంగ నిపుణులను సమావేశానికి ఆహ్వానించాలని కోడెల కోరారు.
మెస్ చార్జీలు పెంచాలి
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని టిడిపి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం టిడిఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తప్పు చేసి జైలుశిక్ష అనుభవించే వారికి తిండికి రోజుకు 30 రూపాయలు చెల్లిస్తున్న వారు, విద్యార్థులకు మాత్రం 17 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు మెస్ చార్జీలు రోజుకు 30 రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా హాస్టళ్లలో పరిస్థితులు మెరుగు పరచాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీల పెంపుదల, కనీస వసతుల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని జైపాల్ యాదవ్ తెలిపారు.
==========
ఏప్రిల్‌లోగా ట్రాన్స్‌కో, జెన్కోలలో ఉద్యోగాల భర్తీ
హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఏపి జెన్కో, ట్రాన్స్‌కో తదితర విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 8539 ఉద్యోగాల భర్తీకి చురుకుగా అన్ని సన్నాహాలు చేస్తున్నామని, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని, దళారుల మాట నమ్మవద్దని ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలు కోరాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో సిఎండి అజయ్‌జైన్, జెన్కో సిఎండి కె. విజయానంద్ శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. దళారుల మాటను వినవద్దని, ఎవరైనా దళారులు కనపడితే తమకు తెలియచేయాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 2012 ఏప్రిల్ లోపల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. రిక్రూట్‌మెంట్ పారదర్శకంగా ఉంటుందని, ఇప్పటికే మార్గదర్శకాలను ఖరారు చేశామన్నారు. పుకార్లు, వదంతులను నమ్మవద్దన్నారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading