రాష్ట్రీయం

విశాఖమీదుగా సిల్క్ రూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన
చైనా మంత్రి చెన్‌తో అమరావతిపై చర్చలు
నిర్మాణంలో భాగస్వామ్యానికి పిలుపు
ఏపీకే తొలి ప్రాధాన్యమని చెన్ హామీ

విజయవాడ, నవంబర్ 23: చైనా ప్రతిపాదిత సిల్క్ రూట్‌ను రాష్ట్రంలోని విశాఖపట్నం మీదుగా తీసుకెళ్లాలని సిఎం చంద్రబాబు కోరారు. కోల్‌కతా, చెన్నైలతో పోలిస్తే తూర్పు తీరానికి ఆంధ్రప్రదేశ్ సరిగ్గా మధ్యభాగంలో ఉందని, మేరీటైమ్ సిల్క్ రోడ్డుకు ఈ రాష్ట్రం అన్నివిధాలా ఆకర్షణీయమైందని చైనా బృందానికి వివరించారు. పెట్టుబడులకు షాంగై తరువాత అమరావతిని సెకండ్ హోమ్‌గా భావించాలని కూడా సిఎం సూచించారు. సోమవారం ఉదయం విజయవాడ వచ్చిన చైనా ప్రభుత్వ ఇంటర్నేషనల్ డిపార్ట్‌మెంట్ ఉప మంత్రి చెన్ పెంగ్జియాంగ్, మరో ఆరుగురు ప్రతినిధుల బృందానికి క్యాంప్ కార్యాలయంలో సాదరంగా స్వాగతం పలికిన సిఎం, వివిధ అంశాలపై తరువాత చర్చలు జరిపారు. పెట్టుబడులు పెట్టి రాజధాని నగర నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం అరుదైనదిగా బాబు అభివర్ణించారు. అమరావతి రూపంలో ఆ అవకాశం ఇప్పుడు దక్కిందన్నారు. ఆంధ్ర నవీన రాజధాని నగర నిర్మాణంపట్ల ఆసక్తివున్న వారెవరైనా ముందుకు రావొచ్చని సూచించారు. ప్రపంచంలోని మొదటి 5 ఉత్తమ నగరాల్లో అమరావతి కూడా ఒకటిగా నిలవబోతోందని, అత్యుత్తమ ప్రమాణాలతో బ్లూ, గ్రీన్ సిటీగా భాసిల్లనుందని చెప్పారు. 40 కిలోమీటర్లకు పైగావున్న నదీమార్గం వెంబడివున్న నగరంలో జలరవాణా ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని చైనా కంపెనీలకు బాబు పిలుపునిచ్చారు. వేగవంతమైన నిర్మాణాలు జరపడంలో చైనీయుల్ని మించినవారు ప్రపంచంలో ఎవరూలేరంటూ, అమరావతి నిర్మాణంలో ఈ నైపుణ్యమే తమకు అవసరమన్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములవ్వడం ద్వారా చైనా పేరు ఇండియాలో శాశ్వతంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
ఏపీకే తొలి ప్రాధాన్యం
భారత్ పర్యటనలో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌కే రావాలని అనుకున్నానని, ఇక్కడ తమ తొలి ప్రాధాన్యం ఏపీయేనని చైనా ప్రభుత్వ ఇంటర్నేషనల్ డిపార్ట్‌మెంట్ ఉప మంత్రి ఛెన్ పెంగ్జియాంగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణాన్ని అతిపెద్ద ప్రాజెక్టుగా చెన్ అభివర్ణించారు. తెల్లకాగితంపై అద్భుతమైన చిత్రాన్ని గీసే అవకాశం ఉన్నట్టే రాజధాని కట్టుకునే అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుని అద్భుతమైన నగరాన్ని నిర్మించవచ్చని వ్యాఖ్యానించారు. చైనా- భారత్ మధ్య సహకార సంబంధాలు మరింత బలపడాలని ప్రగాఢంగా కోరుకుంటున్నట్టు చెప్పారు. మీ దార్శనికత, దృఢ సంకల్పం, సమర్థ నాయకత్వం ముగ్దుల్ని చేస్తున్నాయని చంద్రబాబును ప్రశంసించారు. ఇదే చొరవతో రాజధాని నిర్మాణాన్ని శీఘ్రగతిన పూర్తిచేయగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనేక రాజధాని నగరాల్ని చూశామని, అమరావతి వాటన్నింటికంటే విలక్షణమైనదిగా రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. తొలుత సిఆర్‌డిఏ కార్యదర్శి అజయ్‌జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఏపిలో వనరులు, ఆకర్షణల గురించి చైనా బృందానికి ప్రజంటేషన్ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉన్న ఏపి, ఇప్పుడు సరికొత్త విధానాలతో పారిశ్రామికంగా పరుగులు తీస్తోందని వివరించారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రావెల కిషోర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సిఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, కార్యదర్శి సాయిప్రసాద్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.(చిత్రం) విజయవాడలో చైనా, ఆంధ్ర ప్రతినిధి బృందాలతో జరిగిన భేటీలో మాట్లాడుతున్న చైనా మంత్రి ఛెన్ పెంగ్జియాంగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు