ఆటాపోటీ

ఉజ్వల కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకున్న క్రికెటర్ల జాబితాలో చేరి, గత్యంతరం లేని పరిస్థితుల్లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ‘బ్యాడ్ బాయ్’ ఆండ్రూ సైమండ్స్. అసాధారణ ప్రతిభ ఉన్నా క్రమశిక్షణా రాహిత్యం అతనిని అథఃపాతాళానికి పడేసింది. అతనిది ఎంత విలక్షణమైన ఆటో అంతకంటే విపరీత ధోరణి. ప్రత్యర్థుల మాట సరేసరి.. తోటి ఆటగాళ్లతోనూ గిల్లికజ్జాలే. ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టడం అతని అలవాటు. తప్పతాగి ఎక్కడంటే అక్కడ పడిపోవడం అతని రోజువారీ కార్యక్రమం. మద్యం మత్తు తలకెక్కిన తర్వాత ఎవరినీ లక్ష్యపెట్టడు. అప్పుడు అతని కళ్లకు సెలక్టర్లు బఫూన్లుగానూ, కోచ్‌లు గొంగళి పురుగులుగానూ కనిపిస్తారు. నెట్స్‌కు హాజరుకమ్మంటే ‘నవ్వేంది నాకు చెప్పేది’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు. సెలక్టర్ల హెచ్చరికలను ఖాతరు చేయడు. కోచ్‌లు ఎంత బతిమిలాడినా బామాలినా తన దారి తనదేనంటూ కయ్యానికి కాలుదువ్వుతాడు. మూడేళ్ల క్రితం, 2009 జూన్‌లో జరిగిన ప్రపంచ టి-20 ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో సైమండ్స్ ప్రవర్తన అతని బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట. అర్థరాత్రి వరకూ పబ్‌లో మద్యం తాగి సహచరులతో ఘర్షణకు దిగాడు. అతని ప్రవర్తనపై టీం మేనేజ్‌మెంట్ ఫిర్యాదు చేయడం, క్రికెట్ ఆస్ట్రేలియా వెంటనే అతనిపై వేటు వేయడం జరిగిపోయాయి. తాను తాగుబోతును కానంటూనే, తక్కువ సయమంలో సీసాలకు సీసాలు ఖాళీ చేస్తానని గర్వంగా ప్రకటించుకొన్న సైమండ్స్ తన గోతిని తానే తవ్వుకున్నాడు. తన పతనానికి తానే కారకుడయ్యాడు.
సైమండ్స్ తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలీదు. కొంతమంది అతని తల్లిదండ్రులు వెస్టిండీస్‌కు చెందిన వారని అంటే, మరికొందరు స్వీడన్ లేదా డెన్మార్క్ దేశస్థులని వాదిస్తారు. పిల్లలులేని కెన్, బార్బరా దంపతులు మూడు నెలల వయసువున్న సైమండ్స్‌ను దత్తత తీసుకున్నారు. కొద్ది కాలానికే వాళ్లు ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వలస వెళ్లి, క్వీన్స్‌లాండ్‌లో స్థిరపడ్డారు. పెంపుడు తండ్రి కెన్ ప్రోత్సాహంతో క్రికెట్ నేర్చుకున్న సైమండ్స్ త్వరలోనే ఉత్తమ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించాడు. 1994-95 సీజన్‌లో ఆస్ట్రేలియా దేశవాళీ పోటీల్లో పాల్గొని ఐదు వేలకుపైగా పరుగులు సాధించాడు. వందకంటే ఎక్కువ వికెట్లు పరుగులు చేశాడు. టీనేజ్‌లోనే ఇంగ్లాండ్ కౌంటీల్లోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించాడు. గ్లూసెస్టర్‌షైర్ తరఫున గ్లామర్‌గాన్‌తో ఆడిన ఒక మ్యాచ్‌లో ఏకంగా 20 సిక్సర్లు కొట్టి ఔరా అనిపించుకున్నాడు. వాటిలో 16 సిక్సర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సాధించినవి. ఒక ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 1998 నవంబర్ 10న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌తో వనే్డ ఇంటర్నేషనల్స్‌లోకి, 2004 మార్చి 8న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. చాలా తక్కువ కాలంలోనే ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో ఆసీస్‌ను విజయపథంలో నడిపించాడు. ధాటిగా బ్యాటింగ్ చేయడంలో, పొదుపుగా బౌలింగ్ చేయడంలో సైమండ్స్‌ను మించిన వాడు లేడని అనిపించుకున్నాడు. అయితే, ఎంత వేగంగా ఉన్నత శిఖరాలకు చేరాడో, అంతకు రెట్టింపు వేగంతో పతనమయ్యాడు. గాయాలు అతనిని వెంటాడి వేధించాయి. మద్యం అలవాటు అతనిలోని ఆటగాడిని మరుగున పడేసింది. చివరికి అతని కెరీర్‌కు అర్థాంతరంగా తెరదించింది. క్రమశిక్షణ లేని ప్రతిభ ఎందుకూ కొరగాదని చెప్పడానికి సైమండ్స్ క్రీడా జీవితమే ఓ ఉదాహరణ.
సైమండ్స్ బలశాలి. ఎంత బలంగా ఉంటాడో అంతకంటే చురుగ్గా కదులుతాడు. మైదానంలో అతని కదలికలు చిరుతను గుర్తుకుతెస్తాయి. 1994లో ఆస్ట్రేలియన్ క్రికెట్ అకాడెమీ స్కాలర్‌షిప్ సంపాదించాడు. 1995లో ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ గ్లూసెస్టర్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అదే ఏడాది క్రికెట్ రైటర్స్ యంగ్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంపాదించాడు. సైమండ్స్ ప్రతిభను గుర్తించిన ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) అతనిని పాకిస్తాన్‌లో పర్యటించే ఇంగ్లాండ్ ‘ఎ’ జట్టుకు ఎంపిక చేసింది. కానీ, ఆస్ట్రేలియాకు వెళ్లి, అక్కడ జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ఎంచుకున్న సైమండ్స్ ఈ ఆఫర్‌ను తోసిపుచ్చాడు. ఆసీస్ వెళ్లి క్వీన్స్‌లాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లాండ్‌లో జన్మించిన కారణంగా సైమండ్స్‌కు సహజంగానే అక్కడి జాతీయ జట్టుకు ఎంపికయ్యే అర్హత ఉన్నప్పటికీ అతను ఆస్ట్రేలియా తరఫున ఆడడానికే ప్రాధాన్యం ఇచ్చాడు.
సైమండ్స్ కెరీర్‌లో 26 టెస్టులు ఆడి 1,462 పరుగులు, 198 వనే్డల్లో 5,088 పరుగులు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 14,477, లిస్ట్ ‘ఎ’లో 11,099 పరుగులు చొప్పున నమోదు చేశాడు. టెస్టుల్లో 24, వనే్డల్లో 133 వికెట్లు పడగొట్టాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపూ పరుగుల వేటను కొనసాగించడం అతని నైజం. బౌలింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు. ఫీల్డింగ్‌లోనూ సమర్థుడే. అత్యుత్తమ ఆల్‌రౌండర్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు అతనిలో కనిపిస్తాయి. క్రికెట్‌లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన అతను క్రమశిక్షణా రాహిత్యం కారణంగా సమస్యలు కొని తెచ్చుకున్నాడు. చివరికి గత్యంరం లేని పరిస్థితుల్లో అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)తో సహా అన్ని రకాల క్రికెట్ ఫార్మెట్స్‌కు గుడ్‌బై చెప్పాడు. - కౌస్త్భు
Add new comment