శిప్ర వాక్యం

తెలుగు రాష్ట్రాల్లో ‘తృతీయ’ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలులేదు చూలులేదు కొడుకు పేరు సోమలింగం అని తెలుగులో ఒక సామెత ఉంది. కాంగ్రెసేతర- బిజెపి ఇతర-ప్రాంతీయ పార్టీల సంఘటనతో తృతీయ ఫ్రంట్‌కు రూపం కల్పిస్తానని తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు ఒక ప్రకటన చేయగానే దేశవ్యాప్తంగా తర్జన భర్జనలు గర్జనలు మొదలైనాయి. సీమాంధ్ర ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ ఈ తృతీయ ఫ్రంట్ ప్రతిపాదనను స్వాగతించటం లేదు. ‘మనకు ఆంధ్రా ప్రాంతం పార్టీలెందుకు?’ అని తన్నీరు హరీష్‌రావు లోగడ చేసిన వ్యాఖ్యను వీరు గుర్తుచేస్తున్నారు. తెలంగాణాలోని తెలుగుదేశం కాడర్ మాత్రం ఈ పరిణామంపై అప్పుడే నోరువిప్పవద్దు- అని అనుకుంటున్నది. తెలంగాణా కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి వంటి వారు దీనిని కెసిఆర్ కుట్రగా ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌కు దూరంచేసి బిజెపి విజయావకాశాలను మెరుగుపరిచేందుకు కెసిఆర్ ఈ కొత్త నాటకం మొదలుపెట్టాడు అని వారు వ్యాఖ్యానించారు. అంతేకాదు తెలంగాణలో తృతీయ ఫ్రంట్ పేరుతో క్యాడర్‌లో నూతనోత్సాహం నింపి మెల్లగా తన కుమారుడు కెటిఆర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే నాటకంలో ఇది అంతర్నాటకం- అని వారు (6-3-2018) వ్యాఖ్యానించారు. జార్‌ఖండ్ ముక్తిమోర్చాకు చెందిన హేమంత సరేన్ మాత్రం తృతీయ ఫ్రంట్‌లో చేరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పాడు. డిఎంకె అధినాయకుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్ తృతీయ ఫ్రంట్ ఆలోచనను స్వాగతించారు. తెలంగాణా నాయకుడు ఎం.కోదండరాం మాట్లాడుతూ ‘‘ఈ తృతీయ ఫ్రంట్ ఇది కెసిఆర్ తన కుమారుణ్ణి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే నాటకంలో అంతర్భాగం’’ అని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు) తృతీయ ఫ్రంట్ ఆలోచనను స్వాగతించింది. అంతమాత్రాన కెసిఆర్‌ను భారత ప్రధానిగా చూడడానికి ఆమె అంగీకరిస్తుందని ఈ ప్రకటనలో లేదు. వీలైతే తానే భారత ప్రధాని కావాలని అనుకుంటున్నది. ఇందలి సాధ్యాసాధ్యాలు కలకత్తా కాళీమాత కెరుక.
తృతీయ ఫ్రంట్ గురించి ఎవరెవరు ఏమంటున్నారంటే..
‘‘కెసిఆర్ విసిరిన వలలో పడే చేపలేవి? తిమింగలాలేవి? తృతీయ ఫ్రంట్ చాలా మంచి ఊహ. దీనిని మేము స్వాగతిస్తున్నాము’’ అంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 5 మార్చి 2018న పార్లమెంటు హాలులో వ్యాఖ్యానించారు. ‘‘మీ ఫ్రంటులో ఎవరు చేరుతున్నారు?’’ అని టిఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు జితేందర్‌రెడ్డిని అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు. డిఎంకె తమ ఫ్రంటులో చేరబోతున్నట్లు జితేందర్‌రెడ్డి చెప్పారు. ఇందుకు జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. ఎందుకని? అంటే తృతీయ ఫ్రంట్ ఏర్పడితే కాంగ్రెసు పార్టీకి భారీ నష్టం కలుగబోతున్నదని బిజెపి అంచనా వేస్తున్నది. ఇది పసికట్టిన తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఈ తృతీయ ఫ్రంట్ ఓ పెద్ద స్టంట్- తెలంగాణాలో ఒక్క ఓటుకూడా లేని జనసేన- తెలంగాణా రాష్ట్ర సాధనను వ్యతిరేకించిన ఎంఐఎం- ఇందులో సభ్యులట! కెసిఆర్ తన నాలుగేండ్ల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసం ఈ డ్రామా మొదలుపెట్టారు’ అని ఉత్తమకుమార్‌రెడ్డి అన్నారు.
ఎన్నికలు ముంచుకు రావటం అనేది ఎవరికైనా గుబులు కలిగించే విషయమే. అందుకు ఏంచేయాలి? ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి తిరిగి అధికారంలోకి రావాలి. అందుకు స్పష్టంగా సూచనలు కన్పడుతున్నాయి. తెలంగాణాలో లోగడ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష తీవ్రంగా ఉన్నది. ఇప్పుడా కోరిక ఫలించాక ప్రజల ముందుకు ఏ రూపంలో వెళ్ళాలి? కేంద్రం నుండి నిధులు రాలేదు. నదీ జలాల వివాదం తెగటం లేదు అంటూ పాలకులు నూతనాంశాలు అందిపుచ్చుకున్నారు. కావేరీ జలాల వివాదానికి నూరేండ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఆంధ్ర-తెలంగాణాల మధ్య కృష్ణాగోదావరీ జల వివాదం ఇలా చాలాకాలం కొనసాగవచ్చు. ఇచ్చిపుచ్చుకునే చిత్తశుద్ధి లేనప్పుడు వివాదాలు అనివార్యం. ఆంధ్రప్రదేశ్ సంగతి చూడండి. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగింది. విభజన హామీలు అమలుకాలేదు. నూతన రాజధాని నిర్మాణం చంద్రబాబుకు తలకుమించిన భారం అయింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు. ఇచ్చిన ప్యాకేజీకి లెక్క చెప్పండి- అంటూ కేంద్రం గద్దించేసరికి చంద్రబాబుకు చిరాకు వేసింది. దీనివలన జరిగే రాజకీయ పరిణామాలు 2019 ఎన్నికల మీద చూపుతాయి. నిజానికి హైదరాబాదు నగరం తెలంగాణాకు ఇచ్చినప్పుడు ఏపి నూతన రాజధాని నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రం ఇచ్చి తీరాలి. కాని అలా జరుగలేదు. బిజెపికి మాత్రమే కాదు ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా వారికి తెలుగుజాతి అంటే చాలా చులకన అభిప్రాయం ఉంది. అందుకు కారణం ఒక్కటే. తెలుగువారిలో సమైక్యత లేదు. ఇప్పుడు కొత్తగా రాదు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుమీద కాల్చి చంపండి’ అన్న ప్రతిపక్ష నాయకుడు మరే రాష్ట్రంలో అయినా ఉన్నాడా?
ఏపిలో రెడ్డి కులస్థులు, క్రైస్తవులు ప్రధానంగా జగన్మోహన్‌రెడ్డి వెనుక ఉన్నారు. కాపు కులస్థులు పవన్‌కల్యాణ్‌కు మద్దతునిస్తుంటే కమ్మ, ముస్లిం వర్గాల మద్దతు చంద్రబాబుకు ఉంది. మరి బిజెపి బలం బలగం ఏమిటి? 2019 తర్వాత మోడీ ప్రభుత్వంలో చేరే వారెవరు? ప్రతిపక్షంలో, తృతీయఫ్రంటులో ఎవరుంటారు? సీమాంధ్రలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల అస్తిత్వం నామమాత్రమే. వారు ఒక్క అసెంబ్లీ సీటు గెలుచుకునే స్థాయిలో కూడా లేరు. అందుకని తృతీయ ఫ్రంటులో చేరుతారా? వేచి చూడాలి.
తెలంగాణాలో చంద్రశేఖరరావు ‘నిధుల కొరత’ పేరుతో కేంద్రంపై యుద్ధం ప్రకటించాడు. ఐతే లోగడ సెప్టెంబరు 17న అమిత్‌షా వరంగల్‌లో మాట్లాడుతూ కొన్ని గణాంకాలు అందించారు. యుపిఏ పరిపాలనా కాలంలో జరిగిన అవినీతి మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణాకు ఇప్పటివరకు అందిన కేంద్ర సహాయం 90వేల కోట్లు. గత రెండున్నర సంవత్సరాలుగా కేంద్రంలో అవినీతి ధనం జీరో. ఇవి అధికారికంగా విడుదల చేసిన అంకెలు. ఐతే విదేశీ బ్యాంకుల్లో దాచిన 60 లక్షల కోట్ల మాటేమిటి? దీనిని ఎప్పుడు వెనుకకు తెస్తారు?
అమిత్‌షా, బండారు దత్తాత్రేయ, జి.కిషన్‌రెడ్డి లాంటి ప్రముఖ బిజెపి నాయకులు వరంగల్‌లో మాట్లాడుతూ 2019లో బిజెపి తెలంగాణాలో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. వరంగల్ సభను సురవరం సుధాకర్‌రెడ్డి ‘దొరల’ సభగా అభివర్ణించారు. అంటే సిపిఐ ఎటువంటి పరిస్థితిలోనూ తెలంగాణాలో బిజెపి అధికారంలోకి రావటానికి ఇష్టపడదు. అందరికీ కాశిం రజ్వీ అనుయాయులతో దోస్తీ కావాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బిజెపి పోరు జరుపుతున్నది. ఐతే మన దేశంలో కొన్ని పార్టీలు సెక్యులర్ పాతివ్రత్యం పాటిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ పాతివ్రత్యానికి భంగం కలుగుతుందని వారి భయం.
తృతీయ ఫ్రంట్ పేరుతో యుపిఏ భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌కు దూరమైతే ప్రస్తుతం ఉన్న స్థానాలు కూడా 2019 తర్వాతి లోక్‌సభలో కాంగ్రెస్‌కు ఉండే అవకాశం లేదు. అందువల్ల తృతీయ ఫ్రంట్ అంటే బిజెపి కన్నా కాంగ్రెసు ఎక్కువ కలవరపడుతున్నది. ‘జెండా పీకేసి తట్టాబుట్టా సర్దుకొని కెసిఆర్ నిష్క్రమిస్తున్నాడు. తన నాలుగేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటంకోసం తృతీయాధ్యాయం మొదలుపెట్టాడు’ అని ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్‌రెడ్డి అనటంలోని ఆంతర్యమేమిటి?
ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాదినుండి భారత ప్రధాని రావటాన్ని హర్షించరు. పి.వి.నరసింహారావు ప్రధాని కావటాన్ని అర్జున్‌సింగ్, సోనియాగాంధీ వంటి సీనియర్ కాంగ్రెసు నేతలే వ్యతిరేకించారు. అలాంటప్పుడు కెసిఆర్ ప్రధాని కావటం సాధ్యమేనా? ఇది కల- పగటి కల అంటున్నారు విశే్లషకులు. మరి కెసిఆర్ కేంద్రంపై ఎందుకు యుద్ధం ప్రకటించినట్లు? ఎన్‌టిఆర్ కాలంనాటి పరిస్థితులు లేవు. ఆయన బలం బలగం లేరు. అదే స్థాయిలో తర్వాతి కాలంలో చిరంజీవి తిరగబడినా మళ్లీ జెండా పీకేసి కాంగ్రెస్‌కు అమ్ముడుపోవలసి వచ్చింది. అలాంటప్పుడు కెసిఆర్ మనస్సులో ఉన్నదేమిటి?
బిజెపి నాయకుడు గంగాపురం కిషన్‌రెడ్డి ఇచ్చిన మరికొన్ని గణాంకాల ప్రకారం మిగులు రాష్టమ్రైన తెలంగాణ అప్పుల ఊబిలో చిక్కుకొని పోయింది- ఇందుకు కారణాలేమిటి?
రాష్ట్ర కాంగ్రెసు అధినాయకుడు ఉత్తమకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీకి థర్డ్‌ఫ్రంటు పేరుతో కెసిఆర్ పారిపోతున్నాడని విమర్శించారు.
1) తెలంగాణా రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా 4వేల రైతుల ఆత్మహత్యలు జరిగాయి.
2) 12 శాతం రిజర్వేషను బిల్లు సాంకేతిక కారణం చూపి కేంద్రం కొట్టివేసింది.
3) దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశారు.
4) దళితులకు మూడెకరాల భూమి ఇస్తాము అని ఎన్నికలకుముందు చెప్పి ఇప్పుడు ఆ మాట తప్పారు.
5) ఇంటికొక ఉద్యోగం ఇస్తాను అని చెప్పి మోసంచేశారు.
6) ఒక్క మహిళనూ మంత్రివర్గంలోకి తీసుకోలేదు.
7) మిషన్ కాకతీయ పేరుతో కమీషన్ కాకతీయ నిర్వహించారు.
ఈ లోపాలనుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇప్పుడు తృతీయ ఫ్రంట్ నాటకం మొదలయిందని ఉత్తమకుమార్‌రెడ్డిగారు ఆరోపించారు.
బిజెపి కేంద్ర ప్రభుత్వం పట్ల తెరాస- టిడిపి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాయి. ఐతే చంద్రులిద్దరూ ఇప్పుడు తృతీయ ఫ్రంట్ ఏర్పాటుచేసే స్థితిలో లేరు. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. అప్పుడు జమిలి ఎన్నికలు జరిగితే జాతీయ రాజకీయాంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి అనేది అందరికీ తెలిసిందే. ఈలోగా నరేంద్రమోడీ తీసుకునే కొన్ని నిర్ణయాలు భారత ఎన్నికల దృశ్యాన్ని మార్చేవిగా ఉంటాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మొన్న కెసిఆర్ కుమారుడు, మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ భారత రాజకీయాలల్లో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్నది- ఇదే ‘్ఫస్టు ఫ్రంట్’ అని అన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక సమాఖ్యగా (ఫెడరేషన్) ఏర్పడడం ఒక పగటికల. ఎందుకంటే ప్రతి ప్రాంతీయ పార్టీకి తనదైన శైలి ఆకాంక్ష ఉంటుంది. అంటే పినరాయ్ విజయన్ కేరళలో నేడు సిపియం అనే ఒక ప్రాంతీయ పార్టీ అధినేత. ఇతడు మహారాష్టల్రోని అతివాద హిందూ పార్టీ శివసేనతో జతకట్టడం అసంభవం. ‘మీరు అమరావతి కట్టుకోండి, ఆరావళి కట్టుకోండి నాకేమిటి?’ అని లోగడ చంద్రబాబునాయుడును అవమానించిన కెసిఆర్‌తో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జతకట్టగలదా? బిజెపికి గత కొన్నిరోజులుగా తెలుగుదేశం దూరమైనంత మాత్రాన చంద్రబాబునాయుడు ‘మరొక’ ప్రాంతీయ పార్టీ నాయకుణ్ణి భారత ప్రధానిగా చూపేందుకు సిద్ధంగాలేడనే విషయం రాజకీయ ప్రాథమిక పరిజ్ఞానం కల ఎవరికైనా తెలుసు. సారాంశమేమంటే లోగడ జనతాదళ్ ప్రయోగంలో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పినట్లే మరోసారి అవసరమైతే కీలకపాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాని ఏ పరిస్థితులలోను కెసిఆర్‌ను భారత ప్రధానిగా చంద్రబాబు అంగీకరించడు.
ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం త్రిపురలో మాణిక్ సర్కార్‌ను పదవీభ్రష్టుణ్ణి చేసిన రాంమాధవ్- సునీల్ దేవగణ్- బృందం రాబోయే నెలల్లో పూర్తిస్థాయిలో తెలంగాణా- కేరళ రాష్ట్రాల మీద తమ దృష్టిని కేంద్రీకరించి కెసిఆర్- పిన్నరాయ్ విజయన్‌లను పదవీ భ్రష్టులను చేయాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
కెసిఆర్ ప్రస్తుతం తెలంగాణాలో ఒక రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు. మిలియన్ మార్చి అనే మాటను 1948లో చైనా మావోసేటుంగ్ సృష్టించారు. 2014 తెలంగాణా ఉద్యమానికి ముందు ప్రొ.కోదండరామ్ టాంక్‌బండ్‌వద్ద మిలియన్ మార్చ్ నిర్వహించి పోతన- త్రిపురనేని రామస్వామి, అన్నమయ్య లాంటి వారి విహ్రాలను ధ్వంసం చేసారు. మళ్లీ 10-3-2018నాడు కెసిఆర్‌కు వ్యతిరేకంగా మిలియన్ మార్చ్ నిర్వహించాలని విఫలప్రయత్నం చేశారు. కోదండరాం వెనుక తెలంగాణాలోని అన్ని వామపక్షలు ఏకమై పనిచేస్తున్నాయి. ఈ సవాలును కెసిఆర్ ముందుగా ఎదుర్కోవలసి ఉంది. అంటే ఇటు కాంగ్రెస్, అటు బిజెపి, మరోవైపు కమ్యూనిస్టులను ఇంకా ‘ఆంధ్రోళ్ళ’ను కెసిఆర్ ఏకకాలంలో ఎదుర్కొని తృతీయఫ్రంటును ముందుకు కొనసాగించాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ఏక కాలంలో కాంగ్రెసు- బిజెపి- జనసేన జగన్ పార్టీలను ఎదుర్కొని మన రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఆ తర్వాతనే తృతీయ ఫ్రంట్.. లేకుంటే అదో పొలిటికల్ స్టంట్!

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668