శిప్ర వాక్యం

ఉగ్రవాదమే అసలు సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలోని పంజాబ్ ప్రాంతం 1947లో విభజనకు గురైంది. సగ భాగం భారత్‌లోకి, మిగతా సగం పాకిస్తాన్‌లోకి వెళ్లింది. పంజాబ్‌లోని సింధు నదికి ఐదు పాయలున్నాయి. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అని వీటికి పేర్లు. 1960లో అప్పటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు నదీ జలాలను ఉదారంగా విడుదల చేశారు. 750 మెట్రిక్ టన్నుల నీరు ఇండియా నుండి పాకిస్తాన్‌లోకి వెళ్తున్నది. నిజానికి పాక్ వాటా 250 మెట్రిక్ టన్నులు మాత్రమే. మన దేశంలో నీటిని నిల్వ చేసుకొనే డ్యామ్‌లు లేకపోవడం వల్ల, పాకిస్తాన్‌పై ఉదార వైఖరి వల్ల భారీగా సింధు నదీజలాలు అక్కడికి వెళ్తున్నాయి. ఇటీవల పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మన సీఆర్‌పీఎఫ్ జవాన్లను భారీ సంఖ్యలో హతమార్చటంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని తక్షణ చర్యలు తీసుకుంది. మొదటిది పాకిస్తాన్‌కు ప్రత్యేక హోదా రద్దుచేయటం, రెండవది డ్రైఫ్రూట్స్, సిమెంట్ వంటి దిగుమతులపై 250 శాతం అధిక సుంకం విధించటం, మూడవది అక్కడి మన రాయబారిని వెనక్కి రప్పించడం. నాల్గవది పాక్‌కు వెళ్లే ప్రయాణాలపై పరిమితులు విధించటం, ఐదవది పాక్‌కు ఇచ్చే అదనపు జలాలను ఉపసంహరించి, వాటిని రాజస్థాన్, హర్యానాలకు మళ్ళించటం. ఈ చర్యల వల్ల పరిమిత ప్రయోజనం ఉంటుంది.
నదీ జలాలను నిల్వ చేసేందుకు డ్యామ్‌ల నిర్మాణం ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం. కనీసం నరేంద్ర మోదీ ప్రభుత్వమైనా ముందుచూపుతో డ్యామ్‌ల నిర్మాణాలను ప్రోత్సహించాల్సి ఉంది. ప్రొఫెసర్ కుమార్- ‘ఏ రివర్ విత్ టూ బ్యాంక్స్’ పేరిట ఓ పుస్తకం రాశారు. సింధు నదిపై భారత్‌కు పూర్తి అధికారం ఉంది. ‘కశ్మీర్ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందంటే’- పాకిస్తాన్ అనే దేశం అంతరించినపుడే, ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం భారత్‌లో కలిసినపుడే అని జవాబు చెప్పాలి. నిజానికి కశ్మీర్‌లో సమస్య లేదు. ఇస్లామిక్ ఉగ్రవాదంలోనే ఉంది. ఈ దుర్మార్గానికి శతాబ్దాల తరబడి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. అయినా భారతీయులకు సరైన దిశానిర్దేశం లేదు.
***
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తిరుపతిలో జరిగిన సభలో మాట్లాడుతూ- ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. నిజానికి ఇది ‘చెంపమీద కొట్టి సారీ చెప్పినట్టు’ ఉంది. ఆంధ్రుల నోట్లో చంద్రబాబు, సోనియా కలిసి మట్టికొట్టారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారట. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం అనుమానమే.. గనుక ఈ హామీ కూడా ప్రశ్నార్థకమే! కాగా, తిరుమల కొండపైకి రెండు గంటల లోపున కాలి నడకన రాహుల్ చేరుకొని స్వామి దర్శనం చేసుకున్నాడట! నిజానికి రాహుల్ క్రైస్తవుడు. టీటీడీ దేవస్థానం రిజిస్టర్‌లో సంతకం చేశాడా? ముస్లిం ఉగ్రవాదం కన్నా భారత్‌లో హిందూ టెర్రరిజం ప్రమాదకరమైనది అన్న రాహుల్ తాను హిందూ బ్రాహ్మణుడినని, యజ్ఞోపవీత ధారినని గతంలో అన్నారు. ఇది- ఎన్నికల ముందు హిందువుల ఓట్లకోసం ఆడే నాటకం కాదా? ‘మేము అధికారంలోకి వస్తే చర్చిలకు ఉచిత విద్యుత్తు, నీరు ఇస్తాం.. కొత్త చర్చిలు కట్టిస్తాం..’ అని ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత జానారెడ్డి వాగ్గానం చేశారు. హిందూ దేవాలయాలకు ఉచిత విద్యుత్, నీరు ఇస్తామని ఆయన ఎందుకు హామీ ఇవ్వలేదు? కాంగ్రెస్‌కు ముస్లిం, క్రైస్తవుల ఓట్లు కావాలి గనుక ఆ పార్టీ నేతలు అలా వాగ్దానాలు చేశారు.
***
సార్వత్రిక ఎన్నికలకు ఇది సమయం కాదు. ఎన్నికలను కొన్ని నెలలు వాయిదావేసి పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలి. కశ్మీర్‌లో మన వీర సైనికులు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడుల్లో హతం కాగా, దీనికి ప్రధాని మోదీ కారకుడని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణజీత్ సుర్జీవాలా అనటం ఏమిటి? చంద్రబాబు, మమతా బెనర్జీ వంటి నేతలు తాము ముఖ్యమంత్రులమన్న స్పృహ లేకుండా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడటమేమిటి? పుల్వామా దాడి గురించి తెలిసినా మోదీ ఉపేక్షించారని ఒకరు, మోదీయే ఈ దాడి చేయించినట్లు మరొకరు మాట్లాడటం దేశద్రోహం కాదా?
***
కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, నవజ్యోత్‌సింగ్ సిద్ధూ, నటుడు కమల్‌హాసన్ వంటివారు పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం వారి నిజస్వరూపాన్ని తెలియజేస్తోంది. అంతర్గత శత్రువులను నియంత్రించకుండా, చైనా- పాక్ దేశాలపై చర్యలు తీసుకోవాలనడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. పాకిస్తాన్‌తో శాంతి చర్చలు మొదలుపెట్టాలని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కేంద్రానికి సలహా ఇవ్వడం హాస్యాస్పదం. పాక్‌కు అనుకూలంగా మాట్లాడే ఈమెతో గతంలో భాజపా ఎన్నికల పొత్తు పెట్టుకోవటమే మహాపాపం. ఆక్రమిత కశ్మీర్ నుంచి పాక్ వైదొలగితే, ఉగ్రదాడులు ఆగినపుడే- చర్చలకు సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది.
***
ప్రధాని మోదీ ఆమధ్య సియోల్ వెళ్లినప్పుడు ఆయనకు దక్షిణ కొరియా ప్రభుత్వం శాంతి పురస్కారం ఇచ్చింది. ప్రపంచ శాంతికి నోబుల్ బహుమతిని గతంలోనే అందుకున్న దలైలామా గతి ఏమైంది? టిబెట్ ప్రాంతం ఎందుకు చైనా దురాక్రమణకు గురైంది. శక్తిలేని శాంతి నిరర్థకం. మోదీజీ నిజంగా శాంతిదూత కావాలంటే తక్షణం పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదాన్ని అంతం చేయాలి. కశ్మీర్‌లో ఆర్టికల్-370 రద్దుచేయాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియాలో కలపాలి. 6 లక్షల మంది కశ్మీరీ పండిట్లకు వారి సొంతగడ్డపై పునరావాసం కల్పించాలి. కులదీప్ జాదవ్‌ను పాక్ జైలునుండి విడుదల చేయించలేని వారికి శాంతిని గురించి మాట్లాడే హక్కు లేదు. దాదాపు ఏభై ఉగ్రవాద సంస్థలు భారత్‌లో విధ్వంస కలాపాలు సాగిస్తున్నాయి. చైనా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మన దేశంలో మానవ హక్కుల సంస్థలు, రచయితల సంఘాల పేర్లతో విధ్వంస కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయమై చర్యలు తీసుకొనడానికి బదులు- రొమిల్లా థాపర్, అరుంధతీ రాయ్ వంటివారికి అంతర్జాతీయ పురస్కారాలు ఇచ్చి సామాజిక మాన్యత కల్పించారు.
***
రాజకీయ రణగొణ ధ్వనుల మధ్య భాషా సాంస్కృతిక కళారంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ పత్రికలో ‘ఆయన గొప్ప విధ్వంసుడు’ అని అచ్చయ్యింది. ‘విద్వాంసుడు’ పదానికి పట్టిన దుర్గతి ఇది. అర్హతలు లేని వారిని విద్యా సాంస్కృతిక రంగాల్లో ప్రవేశపెట్టినందున వచ్చిన ప్రమాదం ఇది. వ్యావహారిక భాష పేరుతో అపశబ్దాలు ప్రయోగిస్తే గిడుగు రామమూర్తి ఆత్మ శాంతించదు. మాండలికాలను గౌరవిద్దాం.. కానీ- వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు చేస్తే ఎలా? కొందరు తప్పులు వ్రాసి మాండలికం అంటున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ పురస్కారాలు ఎలా వస్తున్నాయో? తెలుగు భాషకు ఒక ప్రామాణిక వ్యాకరణం ఆధునిక అవసరాల దృష్ట్యా రావాలి. ల,ళ- శ ష,స- వంటి అక్షరాలకు తేడా తెలియని వాళ్లు ఆచార్యులుగా వెలిగి పోవడం మన విద్యావ్యవస్థ చేసుకున్న మహాపాపం!
*

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్