శిప్ర వాక్యం

భాజపా ఖాతాలో కర్నాటక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటకలో జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు ఎ.హెచ్.విశ్వనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. అందుకు ఆయన చూపిన కారణాలు ఇలా ఉన్నాయి. కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరో సీటును గెలుచుకున్నాయి. భాజపా 25 సీట్లు సాధించగా, సినీనటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. కర్నాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్- కాంగ్రెస్ కూటమి లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. వృద్ధనేత, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఓడిపోవడాన్ని జేడీఎస్ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. దేవెగౌడను కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య వ్యూహం ప్రకారం ఓటమి పాలు చేశారన్నది జేడీఎస్ కార్యకర్తల ఆరోపణ. జేడీఎస్ నేత ఎ.హెచ్.విశ్వనాథ్ తనను సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆవేదన చెందుతున్నారు. ఆయన రాజీనామాతో జేడీఎస్‌లో ముసలం పుట్టింది. ఇటీవల బెంగళూరు రిసార్ట్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పతాగి, సీసాలతో ఒకరినొకరు పొడుచుకుంటే అందులో హంపీ ఎం.ఎల్.ఏను హాస్పిటల్‌లో చేర్పించారు.
మునిగిపోయే పడవలోనుండి దూకి ప్రయాణీకులు ప్రాణాలు రక్షించుకోవాలని అనుకోవటం సహజం. అలా కర్నాటకలో, మధ్యప్రదేశ్‌లో, పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీల నుంచి భాజపాలోకి వలసలు మొదలైనాయి. ఈ పరిణామాన్ని ఎవరూ ఆపలేరు. కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో త్వరలోనే భాజపా ప్రభుత్వాలు ఏర్పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక, భాజపా ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తన దృష్టిని ఉభయ తెలుగు రాష్ట్రాలపై కేంద్రీకరించబోతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి వలసలు మొదలైనాయి. కొందరు తెదేపా ఎమ్మెల్యేలు భాజపాలో చేరడానికి సుముఖత చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2024 నాటికి తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలను తన ఖాతాలోకి వేసుకోవాలని భాజపా ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోంది.
***
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల ముందు పొత్తు కుదిరింది. ఓటమి అనంతరం ఈ పొత్తు మూన్నాళ్ల ముచ్చటైంది. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు రద్దయినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. దీనికి ఆమె చెప్పిన సమాధానం ఇలా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఓట్లు బట్వాడా కాలేదు అని ఆమె ఆగ్రహం చెందారు. యూపీలో ఎప్పుడూ కుల రాజకీయాలు మాత్రమే నడుస్తూ ఉంటాయి. అక్కడ చాలా శతాబ్దాలుగా బ్రాహ్మణులు లేదా వైశ్యులు రాజ్యమేలేవారు. పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మణుడు. ఇతను బృహద్రధుణ్ణి ఓడించి రాజైనాడు. గుప్తుల కాలం స్వర్ణయుగం అని అందరికీ తెలిసిందే. కాలగతిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ప్రాంతాలు ఎక్కువగా ముస్లిం ప్రభువుల దురాక్రమణ ప్రభావాన్ని చవిచూచాయి. అందుకే ఈ ప్రాంతాల్లో నేటికీ హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. దళితులు శతాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురి అయినారు. యాదవులు ముస్లిములతో కలిసి దళితులను హింసించటం యూపీ రాజకీయాల్లో ప్రధానాంశం. అందుకని అక్కడ బహుజన సమాజ్ పార్టీ అవతరించింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అంతరించినట్లే ఉత్తర ప్రదేశ్‌లోనూ తన అస్తిత్వాన్ని కోల్పోయింది.
భారతీయ జనతాపార్టీ 1980లో కొత్తగా పుట్టుకొని వచ్చింది. ఇది హిందూ జాతీయ పార్టీ. కాబట్టి ముస్లిములు, క్రైస్తవులు సంఘటితమై యూపీలో భాజపాను ఓడించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముస్లిం, యాదవ సామాజిక వర్గాలు ఒకవైపు, కమ్యూనిస్టులు, బిఎస్పీ, క్రైస్తవ వర్గాలు మరొకవైపు జత కట్టాయి. తాజా లోక్‌సభ ఎన్నికలలో భాజపాను ఓడించేందుకు ‘సైకిల్’ (సమాజ్‌వాదీ) ఏనుగు (బిఎస్పీ)పైకి ఎక్కింది. సైకిల్ టైర్లు పంక్చర్ అయ్యాయి. ఏనుగు నీరసపడింది. మాయావతి, అఖిలేశ్ యాదవ్‌ల పొత్తు కుదిరినా, గ్రామస్థాయిలో ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు కలియలేదు. సరికదా బిఎస్పీ కార్యకర్తలను యాదవులు హింసించటం ఆపలేదు.
నరేంద్ర మోడీ సాధించిన అసాధారణ విజయంతో ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్షాలు కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నాయి. ఇక రాజ్యాధికారం కల్ల అని తేలడంతో- ఎస్పీ, బిఎస్పీల మైత్రి ఇక అంతరించినట్లే అని మాయావతి ప్రకటించింది. దీనివలన జరిగే పరిణామాలేమిటి? మొదటిది- రాబోయే కాలంలో తన అస్తిత్వం కోసం భాజపాతో బిఎస్పీ జత కట్టవచ్చు. అదే జరిగితే బిఎస్పీ మద్దతుతో నడుస్తున్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవచ్చు. ఇక రెండవ అంశం- ఏచూరి సీతారామ్ వంటి వామపక్ష నేతలు ఇచ్చిన ‘లాల్-నీల్ జిందాబాద్’ నినాదం గాలిలో కలిసిపోతుంది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీలోని శివపాల్ యాదవ్ వర్గం భాజపాకు దగ్గర కావచ్చు. ఏవిధంగా చూసినా యూపీలో భాజపా మాత్రమే అజేయశక్తిగా కొనసాగే అవకాశం ఉంది.
***
కోల్‌కతలో ‘జై శ్రీరామ్’ అనే మాట ఓ బూతు మాటగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విన్పడింది. ఆమె కారులో వెళ్తుండగా ఎవరో రోడ్డుపక్కన ‘జై శ్రీరామ్’ అన్నారు. వెంటనే వారిని బంధించి జైలులో వేయించిన వార్త పత్రికల్లో ప్రచురితమైంది. జైశ్రీరాం అంటే ఏమిటి? ఈ ‘శ్రీరామా నీకు విజయము కలుగుగాక’ అని అర్థం. ‘్భరత మాతాకీ జై’ అంటే ఏమిటి? భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజలకు జయము కలుగుగాక అని అర్థం. మరి ఇవి బూతుమాటలు ఎట్లా అయినాయి? అంటే భారతీయ జనతాపార్టీవారు శ్రీరామ భక్తులు. మమతాబెనర్జీ బంగ్లాదేశ్ భక్తురాలు. దాదాపు రెండు కోట్ల మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశించారు. మల్దా వంటి జిల్లాల్లో వారి స్వపరిపాలన సాగుతున్నది. ఇక రోహింగ్యాలు అనబడే మయన్మార్ ప్రజలు అస్సాం, బెంగాల్, హైదరాబాదు నగరాలకు ఎందుకు వచ్చినట్లు? వీరిని వారి స్వదేశాలకు పంపాలని భాజపా కోరుతోంది. అలాంటి కోరికలు పనికిరావు. చొరబాటుదార్లను బయటకు పంపితే అంతర్యుద్ధం వస్తుందని మమతా బెనర్జీ బెదిరిస్తున్నది. ఈమె చొరబాటుదార్ల మద్దతుతో బెంగాల్‌లో రాజ్యాధికారం సాధించింది. ఈ దశలో కమ్యూనిజం బెంగాల్‌లో బలహీన పడగానే, ఆ స్థానాన్ని భాజపా ఆక్రమించటం ఒక సహజ పరిణామం. దీనిని మమతాబెనర్జీ జీర్ణించుకోలేక హత్యా రాజకీయాలకు దిగింది. తృణమూల్ కాంగ్రెస్ నుండి మాత్రమే కాదు, వామపక్ష పార్టీల నుంచి సైతం కార్యకర్తలు భాజపాలో చేరటం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అనూహ్య పరిణామం. సీపీఐ నేత కె.నారాయణ ఇటీవల కోల్‌కత వెళ్లి లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ పార్టీ కోలుకోనంత నష్టాన్ని పొందిందని సీపీఐ జాతీయ సమావేశాల్లో ప్రకటించారు. ‘ప్రజల సమస్యల మీద కాకుండా భావోద్రేకాల మీద ఎన్నికలు నడిచాయి’ అని ఆయన చేసిన విశే్లషణ ఆ పార్టీ ఆలోచనలకు అద్దం పట్టింది. జై తెలంగాణా అనేది ప్రజల భావోద్రేకాలకు సంబంధించిన నినాదం. జైశ్రీరామ్ కూడా అలాంటిదే. విచిత్రమేమంటే శ్రీరాముడు అందరికీ చెందినవాడే అయినప్పటికీ రాముడి మీద అన్ని పార్టీలు కలిసి పేటెంటు హక్కును భాజపాకు కట్టబెట్టాయి. అలనాడు లంకలో హనుమంతుడు జైశ్రీరాం అన్నప్పుడు రాక్షసులకు ఎలా భయం కలిగిందో, ఇపుడు అదే మాట వింటుంటే మమతకు గుండెదడ మొదలయింది. జై శ్రీరాం నినాదం ఇచ్చినవారు బెంగాలీలు కాదు పక్క రాష్ట్రం నుండి వచ్చినవారు అని మమతా బెనర్జీ ఆరోపించింది. బెంగాల్‌లో దుర్గాపూజల మీద ఈమె గతంలో నిషేధం విధించింది. ఇది భాజపాకు బాగా లాభించే అంశంగా మారింది. బెంగాల్ ప్రజలు మొదటినుండి ఉద్రేక స్వభావులు. భారత జాతీయోద్యమం 1905లో బెంగాల్ విభజనను కర్జన్ ప్రభువు చేయటంతో మొదలైంది. అరవిందుడు, స్వామి వివేకానందుడు, శ్యామప్రసాద్ ముఖర్జీ వంటివారు జన్మించిన వంగభూమిని బంగ్లాదేశీ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలతో మమతా బెనర్జీ ఇక ఎక్కువకాలం పాలించజాలదు.
***
మహారాష్టక్రు చెందిన ఎన్.సి.పి. నాయకుడు ప్రఫుల్ పటేల్ యూపీఏ-2 హయాంలో విమానయానశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఎయిర్ ఇండియా కోటానుకోట్ల నష్టంలో కూరుకొనిపోవడానికి కారణం మనీ లాండరింగ్, హవాలా అక్రమాలు అని తేలింది. ఈ సందర్భంగా దీపక్ తల్వార్‌ అనే వ్యక్తిని లోగడ అరెస్టుచేశారు. ఇప్పుడు ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్ ప్రఫుల్ పటేల్‌ను విచారిస్తున్నది. యూపీఏ కాలంలో జరిగిన అక్రమాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ ప్రభుత్వంలో పనిచేసిన కీలక నేతలు అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోలేరు. యూపీఏకు ఈసారి కూడా అధికారం దక్కకపోవడానికి ఈ అవినీతి వ్యవహారాలే కారణం. ఆరోపణలు రుజువైన పక్షంలో ప్రఫుల్ పటేల్ వంటి వారు జైలుకు పోక తప్పదు. శరద్ పవార్ కాలం కలిసివస్తే ప్రధాని కావాలని ఉద్విళ్లూరాడు. కానీ ఆయన ఆశించినట్లు జరగలేదు. *

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్