శిప్ర వాక్యం

ఆర్థిక నేరగాళ్లకు నేతల వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలోని వైనాడ్‌లో ఈ మధ్య ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆకలితో ఒక వనచరుడు కిలో బియ్యం దొంగిలించాడు. అతణ్ణి స్థానిక మావోయిష్టులు హత్యచేయడం కేరళలో కలకలం సృష్టించింది. ‘నేరం నాది కాదు ఆకలిది’ అనడానికి వీలులేదు. షాపులో బియ్యం గాని, బ్రెడ్ గాని దొంగిలించినా నేరమే. కాని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఈ దేశంలో నేరం కాదు. వివిధ జాతీయ బ్యాంకుల్లో సామాన్యులు డబ్బు దాచుకుంటారు. వారికి బ్యాంకు ఇచ్చే వడ్డీ 7 శాతం మాత్రమే. ఈ ధనాన్ని బ్యాంకులు అధిక వడ్డీలతో వివిధ సంస్థలకు రుణాలుగా ఇస్తాయి. అప్పుతీసుకున్న బడాబాబులు అసలు సంగతి దేవుడెరుగు.. వడ్డీకూడా చెల్లించకుండా విదేశాలకు పారిపోతున్నారు. విజయ్ మాల్యా, లలిత్‌మోడీల కేసులు ఇటీవలివే. వారిని ఇండియాకు తెప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వారి ఆస్తులు జప్తుచేసినా అప్పు తీరదు. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ భారీ ఆర్థిక కుంభకోణాల్లో ఇరుక్కున్నాడు. సీబీఐ అరెస్టుచేస్తే విచారణకు సహకరించకుండా తనను బలిపశువును చేశారని కార్తీ బుకాయించడం విడ్డూరం. ఇది రాజకీయ కక్షసాధింపు అని విపక్షాలు అన్నాయి. ఆయనకు అక్రమ బ్యాంకు ఖాతాలు ఇండియాలోనే కాకుండా మారిషస్, దుబాయి, వర్జిన్ ఐలెండ్ వంటి అనేక విదేశాల్లోనూ ఉన్నాయి.
గతంలో కామన్‌వెల్త్ క్రీడలు ఢిల్లీలో జరిగినప్పుడు అప్పటి క్రీడామంత్రి సురేశ్ కల్మాడీ భారీగా నిధులు పలహారం చేశాడు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో దయానిధి మారన్, ఎ.రాజా, కనిమొళి నిందితులు. వీరిలో కొందరిని ఢిల్లీలోని తీహారు జైలులోపెట్టారు. ‘నా కుమార్తె అయిన కనిమొళి జోలికివస్తే యుపిఏ ప్రభుత్వాన్ని కూల్చివేస్తా..’ అని తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను బెదిరించాడు. ఇదే విషయమై పార్లమెంటులో విపక్షాలు ప్రశ్నించగా- ‘ఇది సంకీర్ణ ప్రభుత్వం- నేను సంకీర్ణ ధర్మం పాటించక తప్పదు’ అని ధృతరాష్ట్ర పాత్రను మన్మోహన్ సమర్ధవంతంగా పోషించాడు. కేంద్రంలో యూపీఏ పాలన ముగిశాక, బ్యాంకుల్లో జరిగిన భారీ కుంభకోణాలు ఇపుడు వెలుగులోకి వస్తున్నాయి. కర్నాటక బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో జరిగిన అవకతవకలు తాజాగా వెలుగు చూశాయి.
షేక్ మహమ్మద్ అలీ అనే యూనియన్ బ్యాంక్ సీనియర్ అధికారి సిబిఐకి ఫిర్యాదు చేయటంతో ఆ బ్యాంకులో రుణ బాగోతం వెలుగులోకి వచ్చింది. రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారిపై కఠినచర్యలు తీసుకోవలసిందిగా ఇటీవల రిజర్వు బ్యాంకు విధ బ్యాం కులకు ఆదేశాలు పంపింది. దీంతో బడాబాబుల అక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. చెన్నై నుండి నడుస్తున్న కనిష్క గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ జాతీయ బ్యాంకులను వెయ్యి కోట్ల రూపాయల మేరకు ముంచింది. భూపేష్‌కుమార్ జైన్ దంపతులు ఈ కంపెనీకి ప్రమోటర్లుగా, డైరెక్టర్లుగా ఉన్నారు. 14 బ్యాంకుల కన్సిర్టియం ఈ గోల్డ్ కంపెనీకి 842.15 కోట్ల రుణం ఇచ్చింది. వడ్డీతో కలిసి ఈ మొత్తం 1000 కోట్లకు చేరింది. 2017 మార్చిలో ఈ కంపెనీ వడ్డీ చెల్లించకపోయేసరికి బ్యాంకులు ఫిర్యాదు చేయవలసి వచ్చింది.బ్యాంకు అధికారులు 2017 మేలో గోల్డ్ కంపెనీని సందర్శింపగా ఆఫీసులు, షోరూములు మూసివేసి ఉన్నాయి. ఆ దంపతులు మారిషస్ పారిపోయినట్లు అధికారులు గుర్తించారు.
షోంజీ స్కాం: ఇది మనీ లాండరింగ్‌కు సంబంధించిన రూ. 600 కోట్ల కుంభకోణం. గురురాం సింగ్, పునీత్‌శర్మలను పంజాబ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న చిట్‌ఫండ్ ఏజెంటును అరెస్టు చేశారు.
హెచ్.పి. హవాలా కేసు:
హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, అతని భార్య ప్రతిభాసింగ్ హవాలా మార్గంలో ఏడుకోట్లు సంపాదించి దానిని వ్యవసాయ ఆదాయంగా చూపించి ఎల్‌ఐసి పాలసీలు కొన్నారు. ఈ అక్రమ ఆదాయం వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపి ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేటు తీసుకున్న చర్యల ద్వారా ఏజెంట్ ఆనంద్ చౌహాన్‌ను అరెస్టుచేశారు.
నీరవ్ మోడీ కేసు: పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రూ. 13,000 కోట్లు అప్పు తీసుకొని నీరవ్ మోదీ మోసం చేశాడు. గీతాంజలి వజ్రాల కంపెనీ ద్వారా ఈ మోసాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ, నీరవ్ మోడీలు నేరస్థులు అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయ కోణంలో ఆరోపించాడు. ఐతే, 2013 సెప్టెంబర్‌లో ఓ హోటల్‌లో జరిగిన పార్టీలో నీరవ్, రాహుల్ కలుసుకున్నారన్న ఫొటో మీడియాలో వచ్చింది. యూపీఎ హయాంలోనే గీతాంజలి వజ్రాల కంపెనీ ప్రమోట్ చేయబడింది. మెహుల్ చోక్సి నీరవ్‌కు మామ. ఇతడు రాహుల్ వంటి నేతలతో ఉన్న సాన్నిహిత్యం ద్వారా పలుకుబడి ఉపయోగించి రుణాలు పొందగలిగాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కొందరు బ్యాంకు ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇక, రొటోమాక్ పెన్నుల కంపెనీ అధినేత విక్రం కొఠారి కూడా యూపీఏ హయాంలో భారీగా రుణాలు పొందాడు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కొన్ని రుణాలు నిలిచిపోయాయి.
దుబాయి స్కాం:
ఇందులో ప్రధాన ముద్దాయి పేరు వినయ్ కోడియార్. ఇతడు కేరళకు చెందిన సిపిఎం అగ్ర నాయకుడు ప్రధాన కార్యదర్శి అయిన కోజికోడి బాలకృష్ణన్‌కు పెద్ద కుమారుడు. ఫిబ్రవరి 4 రాత్రి ఇతని పాస్‌పోర్టును దుబాయి అధికారులు జప్తుచేసి, దుబాయిలోకి ప్రవేశింపకుండా నిషేధం విధించారు. 13కోట్ల మేరకు వినయ్ మోసం చేసినట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. మూడు ఫోర్జరీ చెక్కులు, బినామీ లావాదేవీలు వంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం ఆమధ్య మీడియాతో మాట్లాడుతూ, పార్టీ పదవులను అడ్డం పెట్టుకుని ఎవరూ స్వంత ఆస్తులు కూడబెట్టుకోరాదని హెచ్చరించారు. కేరళలోని సిపిఎం ఎంఎల్‌ఏ విజయ్ పిళ్లై, అతని కొడుకు శ్రీజిత్‌విజయన్- దుబాయిలో అక్రమ వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కేరళ హైకోర్టు ఈ కేసును నిర్ధారించింది. 2015 ఎన్నికలలో పోటీ చేయకముందు పిళ్లై పేరు ఎవరికీ తెలియదు. పేద కుటుంబానికి చెందిన వీరు స్వల్పకాలంలో ఇన్ని కోట్లు ఎలా సంపాదించారు?
హైదరాబాద్‌లోని ఐడిబిఐ బ్యాంకులో 445 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నేరస్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారు. 31 మందిపై సిబిఐ ఛార్జిషీట్ దాఖలుచేసింది. సీనియర్ రీజనల్ హెడ్ అండ్ జనరల్ మేనేజర్ మంజునాథ పాయ్ గత డిసెంబర్‌లోనే ఈ స్కాంను గుర్తించి నోటీసులు పంపారు. ఇక, దావూద్ ఇబ్రహీం లాంటి అంతర్జాతీయ మాఫియా ముఠా నాయకులు తమ పెట్టుబడులను హిందీ చలనచిత్రాలకు పెట్టుబడులు పెడుతున్న సంగతి అందరికీ తెలుసు. ఇక్కడే ఆర్థిక అవినీతి నేరాలు ప్రారంభం అవుతున్నాయి.
ఇటీవల వెలుగులోకి వస్తున్న అనేక ఆర్థిక కుంభకోణాలు యుపిఏ పాలనాకాలం నాటివే. వీటిలో రక్షణ కొనుగోళ్లకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. హవాలా వ్యాపారం ద్వారా బాలీవుడ్ సినిమా తెర ఒక ముసుగుగా ఉపయోగింపబడింది. ఈ జాఢ్యం ఇటీవల టాలీవుడ్‌కు పాకుతున్నది. రాజకీయ నేతల అండదండలు లేకుండా భారీ కుంభకోణాలు జరగవు. ఉదాహరణకు నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి గత పదేళ్లుగా రుణాలు తీసుకోవడం, విదేశాల్లో వజ్రాలు కొనుగోలు చేయటం ఆనవాయితీగా మారింది. గతంలో నీరవ్ మోడీకి అలహాబాదు బ్యాంకు 1500 కోట్ల రుణం మంజూరు చేయగా, ఆ బ్యాంకు డైరెక్టర్ దినేశ్ దూబే వ్యతిరేకించారు. నిజాయితీపరుడైన దినేశ్ దూబేను కాంగ్రెస్ హయాంలోనే డైరెక్టరు పదవి నుండి తొలగించారు.
విజయ్ మాల్యాకు ఉన్నట్లే నీరవ్ మోడీకి విదేశీ పౌరసత్వం ఉంది. అందువల్ల వీరిని ఇండియాకు తీసుకురావటం కష్టమవుతున్నది. దావోస్‌లో జరిగిన ఆర్థిక నిపుణుల సభలో నరేంద్ర మోదీ ప్రసంగించినప్పుడు నీరవ్ మోదీ అక్కడే ఉన్నాడు. ఇది చూసి కాంగ్రెసువారు మోడీపైకి దాడికి దిగి ‘ఇద్దరు మోడీలూ మిత్రులే’ అని దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఐతే 2013 ఇంపీరిలయ్ హోటల్‌లో రాహుల్‌గాంధీతో కలిసి నీరవ్ మోడీ కాక్‌టైల్ నృత్యాలు చేస్తున్న దృశ్యాలను ఎన్‌డిఏ ప్రభుత్వం విడుదల చేసింది.
భారీగా పన్ను ఎగవేత
బ్యాంకుల్లో భారీ కుంభకోణాలు వెలుగు చూస్తుండగా, మరోవైపు ఆర్థిక నేరాల నేపథ్యంలో పన్ను ఎగవేతదారులకు సంబంధించిన కొంత సమాచారం కేంద్ర ప్రభుత్వం నుండి లభించింది. పన్ను ఎగవేత సుమారు 11.5 లక్షల కోట్ల రూపాయలని అంచనా. ఈ మొత్తాన్ని చూచి పార్లమెంటు స్థారుూ సంఘం భయాందోళనలకు గురైంది. భారత ఆర్థిక వ్యవస్థను కుంగదీసే విపరిణామాలల్లో ఇది ఒకటి. ఇందులో రూ. 930,741 కోట్లు ప్రత్యక్ష పన్నులు, రూ. 228,530 పరోక్ష పన్నులు. ఇవి 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు. ‘బకాయి’ అనే మాటకు ‘చాలా సంవత్సరాలుగా ఎగవేత’- అని మనం కొత్త అర్థం చెప్పుకోవాలి. ఇక రెండవ అంశం. నూతన సామ్రాజ్యవాద దేశంగా అవతరించిన నియంతృత్వ చైనా ‘ఆర్థిక యుద్ధాన్ని’ ప్రకటించింది. దీనికి ఆసియా మార్కెట్లు విలవిలలాడుతున్నాయి. ఇవ్వాళ మనం చూస్తున్నది గౌతమబుద్ధుడు, అశోకుడు జీవించిన భారత్ కాదు. కనీసం మహాత్మాగాంధీ జీవించిన దేశం కూడా కాదు. నేటి అవినీతి భారతంలో ఆర్థిక నేరాలకు పాల్పడనివాడు అసమర్ధుని కింద లెక్క.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668