శిప్ర వాక్యం

అందలం కోసం అనైతిక పొత్తులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటలీకి చెందిన దౌత్యవేత్త, రాజ్యాంగ సిద్ధాంతకర్త మాకియావెల్లీ తన ‘ప్రిన్స్’ గ్రంథంలో ‘సాధనం కన్నా సాధ్యమే ముఖ్యమ’ని ప్రతిపాదించాడు. కానీ, మన దేశంలో మహాత్మా గాంధీ దీన్ని అంగీకరించలేదు. ‘సాధనము-సాధ్యము’ రెండూ ముఖ్యమే అని ప్రతిపాదించాడు. ఇప్పుడు భారత్‌లో గాంధీ యుగం పరిసమాప్తమైంది, రాజకీయాల్లో విశ్వసనీయత కొరవడింది. 2014 ఎన్నికల వేళ నరేంద్ర మోదీ చేసిన వాగ్దానాలు ఆచరణకు నోచుకోలేదు. విదేశాల్లోని గుప్త్ధనాన్ని వెలికితీస్తాం, నల్లకుబేరుల పేర్లను వెల్లడిస్తాం, అన్ని బ్యాంకుల్లో ప్రతి ఖాతాదారుడి ఎకౌంట్‌లో లక్ష రూపాయలు జమచేస్తాం, అయోధ్యలో రామాలయం నిర్మిస్తాం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుచేస్తాం.. ఈ హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల జాడే లేదు. ఆంధ్రప్రదేశ్‌ను విభజింపకముందు 42 మంది లోక్‌సభ సభ్యులు ఉండేవారు. వీరి బలం చూచి కేంద్ర ప్రభుత్వం తలవంచేది. ఎంపీల సంఖ్య తగ్గడంతో ఇప్పుడా భయం లేదు. విభజన హామీలు ఆచరణకు నోచుకోనందున సీమాంధ్ర ప్రజలు దారుణంగా వంచనకు గురయ్యారు.
అలాగే, తెలంగాణ తొలి సీఎంగా చరిత్రకెక్కిన కేసీఆర్ గత ఎన్నికలకు ముందు చెప్పినదేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? తెలంగాణ ఏర్పడగానే దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తాం, తెరాసను రద్దుచేసి కాంగ్రెస్‌లో విలీనం చేస్తాం, లక్ష ఉద్యోగాలు ఇస్తాం, హైదరాబాద్‌లోని 5 లక్షల మంది ఆంధ్రోళ్లను కన్నబిడ్డలుగా చూచుకుంటాం, నగర శివారులోని ఫిల్మ్‌సిటీని వెయ్యి నాగళ్లతో దున్నిస్తాం, కార్పొరేట్ విద్యాసంస్థలను మూసివేస్తాం, మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం.. ఈ హామీలన్నీ నెరవేరలేదనే చెప్పాలి. ‘డ్రగ్స్’ వ్యవహారంలో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులున్నట్లు హడావుడి చేశారు. ఆ కేసుల సంగతేమిటో తెలంగాణ ప్రభుత్వమే జవాబు చెప్పాలి. హైదరాబాద్ సెక్రటేరియట్‌లో ఆంధ్రోడు ఒక్కడూ ఉండకూడదు. ‘ఆప్షన్ లేదు’ అని గర్జించిన కెసిఆర్‌తో ఇపుడు చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడు? మరోవైపు కేంద్రం ఇచ్చిన నిధులను ‘చంద్రన్న’ కానుక పేరుతో పథకాలు మార్చి ధనం దారి మళ్లించటం తప్పు కాదా? నిన్నటివరకు ‘దేశభక్తులైన’ బిజెపివారు తెల్లారేసరికి మతతత్వవాదులు అయినారా?
సూర్యాపేట కలెక్టరేట్‌కు స్థలం ఎంపిక, ప్రైవేటు విద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోలులో అవినీతి తదితర అంశాలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ సర్కారు ఎంత మాత్రం స్పందించడం లేదు. ఎన్నికల వేడి పుట్టేసరికి మూసీ నది ప్రక్షాళనకు భారీగా నిధులు, పాతబస్తీ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇస్తున్నాం అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముస్లిం వర్గాల ఓట్ల కోసం ఈద్‌ముబారక్ చెబుతూ, షాదీ ముబారక్‌లు అందిస్తున్నారు. ఇపుడు తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ‘సామాజిక తెలంగాణ’ను ఏర్పాటు చేస్తానంటున్నారు. అట్టడుగు వర్గాలకు పాలనా ఫలాలు అందజేస్తామనడం ఆచరణ సాధ్యమేనా? తాము అడిగినన్ని నిధులు కేంద్రం ఇవ్వడం లేదని ప్రధాని మోదీని ‘ఇద్దరు చంద్రులూ’ తిట్టిపోస్తున్నారు. ఇచ్చిన డబ్బుకు లెక్క పత్రాలు లేవు. తెలంగాణలో అప్పులను ఆస్తులుగా చూపటం తప్పు అని ‘కాగ్’ నివేదిక అక్షింతలు వేసింది.
ఇక- ఎన్నికల పొత్తుల మాట ఎలా ఉన్నా, రాజకీయ పార్టీలు తమ మూల సిద్ధాంతాలను మరచిపోతే ఎలా? తెలంగాణ సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలలో తాము టిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునే విషయంలో ఆలోచిస్తామన్నారు. తమ జాతీయ నాయకత్వ నిర్ణయానుసారం సీపీఎం కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోబోతున్నది.
తెలంగాణ జనసమితి సభను అట్టహాసంగా నిర్వహించడం ద్వారా ప్రొఫెసర్ కోదండరాం తాను తాడూ బొంగరం లేని పార్టీ నాయకుడిని కాదని సామాజిక తెలంగాణకు ప్రాతినిధ్యం వహించేవాడినని చాటుకున్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా తెజస సభ విజయవంతం కావడం కెసిఆర్‌కు గుబులు పుట్టించే విషయం. ఇక తెలంగాణలో కెసిఆర్ మజ్లిస్ మద్దతుమీదనే ఆధారపడి ఉండక తప్పదు. ‘మేము ఎటువంటి పరిస్థితిలోను కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోము’ అని సీపీఎం నేత బీవీ రాఘవులు ప్రకటించాడు. ఇది నిజమేనా? 2008లో సోనియాగాంధీకి మద్దతునిచ్చి యుపిఏ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఎవరు? పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ గాంధీతో బుద్ధదేవ భట్టాచార్య వేదిక పంచుకున్నమాట నిజమా! అబద్ధమా? ఇలా ఎందుకు చేస్తున్నారంటే- ‘వ్యూహాత్మకం’ అని సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ జవాబిచ్చారు. ఇప్పుడీ రాజకీయ నేతల ఎత్తులు, పొత్తులు, జిత్తులు ఎవరు నమ్ముతారు?
భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన సీపీఎం ఇపుడు కేసీఆర్‌తో ఎన్నికల పొత్తుకు ఎందుకు సుముఖత చూపుతోంది? తెలంగాణలో 1948 ప్రాంతాలలో దొరలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఇవ్వాళ వెలమ దొరలకు ఎందుకు మద్దతునిస్తున్నట్లు? ‘మతతత్వ బిజెపిని ఓడించడానికే’- అని వామపక్షాల సమాధానం. మరి ఈ కమ్యూనిస్టులే జీహాదీ ఉగ్రవాదులతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? సిరియాలో అసద్ రసాయనిక మారణాయుధాలు నిర్మించి ప్రయోగిస్తుంటే అతనికి రష్యా ఇరాన్‌లతోబాటు భారత కమ్యూనిస్టులు మద్దతునివ్వటం ఏమిటి? లోగడ లిబియా అధిపతి గడాఫీకి మద్దతునిచ్చారు. చేగువేరా అనే విప్లవకారుణ్ణి హీరోను చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం జాతీయ మహాసభల్లో ప్రధాని మోదీని విలన్‌గా చిత్రీకరించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య లౌకిక శక్తుల పునరేకీకరణకు పిలుపునిచ్చారు. సిపిఐతో కలిసి పనిచేయలేని సీపీఎం నేతలు సమస్త లౌకికశక్తులను ఏకాటిపైకి తెస్తారా? ఇటీవల హైదరాబాద్‌లోని న్యాయస్థానం స్వామీ అసీమానంద తదితరులను మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిర్దోషులని ప్రకటించింది. దీనిని ఒప్పుకునేందుకు ‘లౌకిక శక్తులు’ సిద్ధంగా లేవు.
సీపీఎం మహాసభల్లో ఆ పార్టీ నేతలు లౌకిక ప్రజాస్వామ్య శక్తుల పునరేకీకరణకు పిలుపునిచ్చారు. చైనా అనుకూల ధోరణిని బహిరంగంగానే చాటుకున్నారు. సీపీఎం సభలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభకు కేసీఆర్ సర్కారు అనుమతిని నిరాకరించింది. కోర్టును ఆశ్రయించి తెజస వారు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి?
కష్టాలైనా, సుఖాలైనా ఎప్పుడూ ఒంటరిగా రావని అంటారు. కెసిఆర్‌కు వరుసగా ఎదురుదెబ్బలు మొదలైనాయి. ‘కాగ్’ నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తప్పుపట్టింది. అప్పులను ఆదాయంగా చూపటం విద్యుత్ కొనుగోలులో అవకతవకలు ఇత్యాదులను కాగ్ పేర్కొన్నది. ఆ తర్వాత వరుసగా మూడు కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. తెలంగాణ జన సమితి పార్టీ సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడం కేసీఆర్‌కు అనుకోని పరిణామం. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వెలి వేయడాన్ని హైకోర్టు తప్పు పట్టంది. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మక్కామసీదు పేలుళ్ల కేసులో కెసిఆర్‌కు మద్దతునిస్తున్న మజ్లీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ‘హిందూ టెర్రరిజం’ అనే సిద్ధాంతం కోర్టులో నిలబడలేదు.
కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోదీని తక్కువస్థాయి భాషలో నిందించటం వలన మేలు కంటే కీడే జరిగింది. ‘తాడూ బొంగరం లేని సన్నాసి’ అని తెరాస వారి విమర్శలకు గురైన కోదండరామ్‌కు గతంలో టీజేఏసీ పదవిని ఎందుకు కట్టబెట్టారని విపక్షాలు అపహాస్యం చేస్తున్నాయి. సొంత రాష్ట్రంలో విమర్శలకు గురవుతున్న కేసీఆర్ ఇప్పుడు కర్నాటకకు వెళ్లి దేవగౌడ పార్టీ (జనతాదళ్-ఎస్)కి ఓట్లు వేయవలసిందిగా ప్రచారం చేసి వచ్చారు. దీనివల్ల ఓట్లు చీలి కాంగ్రెస్ లాభపడే అవకాశం ఉంది. విపక్షాల విభేదాల నేపథ్యంలో కేసీఆర్ కలలు కంటున్న ‘ఫెడరల్ ఫ్రంట్’కు పురిట్లోనే సంధి ఖాయమని అతని ప్రత్యర్థులు జోస్యం చెబుతున్నారు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668