AADIVAVRAM - Others

నిండుకుండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతు రామయ్య తాను పొలం పనులకు వాడుకొనే పరికరాలన్నింటినీ ఒక రేకుల షెడ్‌లో ఉంచుతాడు. ఒకరోజున రామయ్య భార్య సూరమ్మ గబగబా ఆ రేకుల షెడ్‌లోకి వచ్చి అక్కడ గుచ్చి ఉంచిన సూదిని తీసుకెళ్లి రామయ్య చిరిగిన పంచె కుట్టి, తిరిగి దాన్ని షెడ్డులో భద్రపరచింది. ఆమె వెళ్లాక సూది పక్కనే అలమరాలో ఉన్న దబ్బనం కేసి చూసి ‘బద్ధకపు దబ్బనమా? చూశావా? నేను మన యజమాని కెంత సేవ చేస్తున్నానో? యాడాదంతా ఊరికే అలమరాలో తుప్పు పట్టేలా నీలుక్కుని పంట పండినపుడు మాత్రమే పని చేస్తావు. వ్యర్థురాలివి’ అని హేళన చేసింది. దబ్బనానికి రోషం పొంగుకొచ్చింది. ‘ఏమే! చిన్న చీపురుపుల్లంత లావు లేవు ఇంత ధీమా! అసలు నేను మన యజమాని కెంత ఉపయోగిస్తున్నానో నీకేం తెల్సు? పంట పండి, కుప్పలు నూర్చగానే బస్తాల కెక్కించేటపుడు, బస్తాలకు ధాన్యం నింపి పాతరలో మాగాక, ఆ ధాన్యాన్ని మర పట్టించేటప్పుడు, ఆ ధాన్యాన్ని తిరిగి సంతకి వేసేటప్పుడు సంచులు కుట్టను ననే్నగా తీసుకువెళ్లేది? నేను లేకపోతే ఆ ధాన్యమంతా నేలపాలే. మన యజమానికి ధనం చేకూర్చను నేనేగా సహాయం చేసేది? ఏమనుకుంటున్నావే నా గురించీ. జాగ్రత్త’ అని మండిపడింది సూది మీద. సూదీ, దబ్బనం రెండూ నేల మీదకు దిగి ఎగురుతూ పోట్లాడుకుంటూ ఒక మూలనున్న గునపం దగ్గరికి వెళ్లాయి. గునపం వౌనంగా ఆ మూల నిల్చునుంది.
గునపాన్ని ఆ రెండూ ‘నీవే చెప్పన్నా! మా ఇద్దరిలో ఎవరు మన యజమానికి ఎక్కువ సేవ చేస్తున్నామో. ఎవరం బద్ధకానికి పెద్ద చుట్టాలమో చెప్పన్నా’ అన్నాయి.
గునపం ‘నాకేం తెల్సు మీ గొప్పేంటో? మీరే తేల్చుకోండి. కాస్తంత సేపు నన్ను విశ్రాంతిగా ఉండనీయండి’ అంది. అంతే! సూదికీ, దబ్బనానికీ మహా కోపం వచ్చింది. ‘నిన్నడగడమే మా తప్పు. ఊరికే నల్ల సుద్దలా కూర్చునే నీవే పెద్ద బద్ధకపుదానివి. నిన్నడిగాం చూడూ. అదే మా బుద్ధితక్కువతనం. ఐనా నీవేం సేవ చేస్తున్నావో చెప్పు యజమానికి. వింటాం’ అన్నాయి ముక్తకంఠంతో.
గునపం గొంతు సవరించుకొని ‘తమ్ముళ్లూ! నేను యజమానికి చేసే సేవ చాలా తక్కువే! మీ అంత కాదు. యజమాని పొలం దున్ని పదును చేసేటప్పుడు, నన్ను తీసుకెళ్లి తవ్వుతాడు. తన కూరల మళ్లలో పాదులు చేయనూ, మొక్కలు నాటనూ నన్ను తీసుకెళ్లి తవ్వుతాడు. పొలంలో పనికిరాని ముళ్లచెట్లు నరికేయనూ నన్ను ఉపయోగిస్తాడు. కాలువలు త్రవ్వనూ, కంచె వేయనూ, తన ఇంటికి గోడలు కట్టనూ, బావి త్రవ్వనూ నన్ను తీసుకెళతాడు. పొలం పనులు మొదలుపెట్టి నప్పటి నుండీ, కూరగాయ చేలలో విత్తులు నాటే రోజు నుంచీ నన్ను తీసుకెళతాడు. ఇంచుమించుగా ఏడాది పొడుగునా నాకు పని ఉంటుంది. ఇదో ఈ రోజే ఇలా కాస్తంత విశ్రాంతిగా ఉన్నాను’ అంది. సూదీ, దబ్బనం రెండూ ఒకదానికేసి ఒకటి చూసుకుని తమ పనికీ గునపం పనికీ ఉన్న వ్యత్యాసం చూసుకుని సిగ్గుతో తలలు వంచుకున్నాయి. నిండుకుండలా ఉన్న గునపానికి మనస్సులోనే నమస్కరించుకున్నాయి.

-హైమా శ్రీనివాస్