AADIVAVRAM - Others

తృప్తి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లంటి అనే ఊరిలో శివయ్య, సీతయ్య అనే వారు ఇరుగుపొరుగున ఉండేవారు. ఆస్థిపాస్తులు బాగానే ఉన్నాయి. అయినా వారికి స్వార్థం, పిసినారితనం మెండు. తమకు కలిగింది మరొకరికి పెట్టడం గానీ ఇతరుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం గానీ ఎరుగరు.
ఒకరోజు శివయ్యకి పట్నంలో పని పడింది. కిరాయి బండికి వెళితే ఖర్చవుతుందని కాలినడకన బయలుదేరాడు. పోయేటప్పుడు శివయ్య భార్య పార్వతమ్మ కొంచెం అన్నం కూర కలిపి పొట్లం కట్టి ఇచ్చింది. దారిలో ఆకలయితే తినమని చెప్పింది. అదే రోజు సీతయ్య కూడా పని మీద పట్నానికి కాలినడకనే బయలుదేరాడు. సీతయ్య భార్య రావమ్మ కూడా తన భర్తకు అన్నం కూర కలిపి పొట్లం కట్టి ఇచ్చింది. దారిలో ఆకలయితే తినమని చెప్పింది.
అలా బయలుదేరిన ఇద్దరూ దారిలో కలుసుకొని మాట్లాడుకుంటూ కలిసే ప్రయాణం సాగించారు. మధ్యాహ్నం అయ్యేసరికి అలసిన వారు ఒక చెట్టు నీడన చేరారు. ఇద్దరికీ ఆకలి వేయసాగింది. అన్నం పొట్లం విప్పి తినాలనిపించినా ఎదురుగా వున్న సీతయ్యకు పెట్టకుండా తను తినటం బాగుండదని.. ఆకలయినా భరిస్తూ వౌనంగా ఉండిపోయాడు శివయ్య. సీతయ్యది కూడా అదే ఆలోచన. అలా తమ అన్నం ఎదుట వారికి పెట్టాల్సి వస్తుందని ఎవరికి వారు అలాగే ఆకలిని భరిస్తూ ఉండిపోయారు.
ఎండ తగ్గిన తర్వాత తిరిగి ప్రయాణం సాగించి పట్నం చేరుకున్నారు. పని పూర్తయ్యేసరికి బాగా చీకటి పడటంతో తిరిగి ఊరికి వెళ్లలేక రాత్రికి ఓ సత్రంలోకి చేరారు.
ఉదయం నుండి ఆహారం లేకపోవడం, నడిచినందువల్ల బాగా ఆకలి వేయసాగింది. అయినా ఇద్దరూ ఎవరికి వారు తను బయటకు తీస్తే ఎదుటి వారికి పెట్టలనే ఆలోచనతో... తాము తెచ్చుకున్న అన్నం పొట్లాలను బయటకు తీయలేదు.
అర్ధరాత్రి తర్వాత శివయ్య ఆకలికి తట్టుకోలేక లేచి మెల్లగా చప్పుడు చేయకుండా తన సంచిలోని అన్నం పొట్లం తీసుకొని సత్రం వెనకాలకు నడిచాడు. ఆదరాబాదరాగా పొట్లం విప్పి ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోయేంతలో భళ్లున వాంతి వచ్చేలా కంపు కొట్టింది. ఉదయం అనగా పొట్లం కట్టిన అన్నం పాచిపోయింది. దానిని తినలేక గోడ అవతల పడేసి కుళాయి దగ్గరకెళ్లి నీళ్లు తాగి వచ్చి పడుకున్నాడు.
కొంచెం సేపటి తర్వాత సీతయ్య కూడా మెల్లగా లేచి వెళ్లి పొట్లం విప్పి తినబోయాడు. అతనిదీ అదే పరిస్థితి. పాచిపోయిన అన్నం తినలేక గోడ అవతల పారేసి నీళ్లు తాగి వచ్చి పడుకున్నాడు.
తెల్లవారింది. శివయ్య, సీతయ్య తిరిగి తమ ఊరికి బయల్దేరారు. క్రితం రోజంతా ఆహారం లేకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం వల్ల నీరసంగా నడవసాగారు. మధ్యాహ్నానికి బాగా నీరసపడి నడవలేక ఓ చెట్టు కింద కళ్లు బైర్లు కమ్మి పడిపోయారు. సరిగ్గా అదే సమయానికి వారి ఊరి వాడైన సోమయ్య ఆ దారిలో పట్నం వెళుతూ.. చెట్టు కింద వున్న శివయ్య, సీతయ్యను గమనించి దగ్గరకు వచ్చి చూశాడు. ఇద్దరూ ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోయారని గ్రహించి వెంటనే తన దగ్గరున్న ఆహారాన్ని, నీటిని ఇచ్చాడు. ఆకలితో వున్న వారిద్దరూ ఆవురావురుమంటూ తిని నీళ్లు తాగారు.
‘సోమయ్యా! నీవు తెచ్చుకున్న ఆహారం మాకు పెట్టావు. మరి నీకు’ అని అడిగారు ఇద్దరూ.
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిగా వున్నవారికి అన్నం పెట్టడం మానవత్వం. ఆహారాన్ని ఎదుట వారితో పంచుకొని తింటే భగవంతుడు కూడా సంతోషిస్తాడు. మన ఆకలిని మనం తీర్చుకోవడంకన్నా ఎదుట వారి ఆకలిని గమనించి ఆకలి తీర్చడంలోనే తృప్తి ఉంటుంది’ అని చెప్పి, మిగిలి ఉన్న కొంచెం ఆహారాన్ని తాను తిన్నాడు సోమయ్య.
అది చూసిన శివయ్య, సీతయ్యలు తమలోని లేకితనాన్ని తెలుసుకున్నారు. తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు. ఆ తర్వాత తమకున్న దానిని ఇతరులకు పెడుతూ.. అందరితో కలసిమెలసి ఉంటూ పంచుకోవడంలోని తృప్తిని, ఆనందాన్ని పొందారు.

-కైపు ఆదిశేషారెడ్డి