అర్చన మెయిన్ ఫీచర్

మహాశివరాత్రి చాలా విషయాలకు నిలయం. ప్రతి నెల కృష్ణపక్షంలోనే వచ్చే అమావాస్య దినమే శివరాత్రి. ‘‘శివ’’ అన్న పదానికి అర్థం శూన్యం, సర్వవ్యాపితం, సృష్టి వీటన్నిటి సారాంశమే ‘శివ’.
మన కళ్ళతో చుట్టూ పరికించిన, సూక్ష్మ పరిశీలన చేస్తే సృష్టిలోని సూక్ష్మాతి సూక్ష్మాలు గోచరిస్తాయి. అట్లే, అత్యధికం గూర్చి పరిశీలించిన, ఈ సృష్టిలో అతి పెద్దదైన శూన్యం కనబడును. కొన్ని ప్రదేశాలు నక్షత్ర ఆది మండలాలతోను, మిగిలిన విశ్వమంతా శూన్యంతో కూడి ఉంటుంది. కాని ఆ శూన్యం అందరి దృష్టికి రాదు. ఈ అనంత విశ్వంలోని అనంత శూన్యమే ‘‘శివ’’ అని పిలువబడుతోంది. ఆధునిక శాస్త్రం కూడా ప్రతి వస్తువు శూన్యంలో నుండి ఉద్భవించి, శూన్యంలో లయం అవుతున్నట్లు చెబుతోంది. ఇది శివుని విషయంలో పరిశీలించగా ఈ అనంత శూన్యమే మహేశ్వరుడు లేక మహాదేవుడు.
ఈ భూమిపైగల ప్రతి మతం, ప్రతి సంస్కృతి శుభాశుభముల గూర్చే మాట్లాడుతుంది. అన్నీ దైవత్వంలోని భాగాలే, మనం సరిగా గమనిస్తే అన్నిచోట్ల కలది చీకటి (లేక) శూన్యం మాత్రమే, యింకేమీ లేదు. మనం శుభం కోరుకుంటూ భగవంతుని ఒక వెలుగుగా భావిస్తాం, కాని మనం ఆ పరిధి దాటి జీవితాన్ని శోధిస్తే రుూ దైవత్వం అంతా శూన్యం అని తెలుస్తుంది. ఈ భూమిపై మనకు తెలిసిన కాంతి సూర్యుడు మాత్రమే. ఆ సూర్యకాంతిని కూడా చేతితో ఆపి చీకటిని లేక చీకటి ఛాయను చేయవచ్చును, కాని చీకటి అనేది అన్నిచోట్ల అల్లుకుని ఉంది.
దైవత్వం అన్నిచోట్ల వ్యాపించి యున్నదని తెలిసిననాడు ఆ దైవత్వమే రుూ అంధకారమని తెలుస్తుంది. విశ్వమంతా అంధకారమయం కనుక, వెలుగు అనేది ఒక మూలంనుంచి వస్తుంది. ఆ మూలం మండుతూ ఉంటుంది. ఆ మంటకు ఆది అంతాలు కలవు, ఆ మూలంకు ఒక నియమిత పరిమాణం ఉంది, కాని చీకటికి మూలం లేదు. దానికి అదే ఆధారం. అది అంతట వ్యాపించి యున్నది. అంతట నిండి యున్నది.
అందువలన ‘‘శివ’’ అంటే అది విశ్వంలోగల శూన్యం. ఈ శూన్యంనుండే సృష్టి వచ్చింది, ఈ శూన్యానే్న మనం ‘‘శివ’’ అంటున్నాము, మన సంస్కృతిలోని ప్రార్థనలన్నీ, మనల్ని రక్షించుకొనుటకు కాదు. మన జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి కూడా కాదు. మన ప్రధాన ప్రార్థనలన్నీ ఓ భగవంతుడా! నన్ను తీసుకొనిపో! నన్ను నీలో కలుపుకో అని మాత్రమే చెబుతున్నాయి. అందువలన ‘‘శివరాత్రి’’ అంటే ‘‘చీకటి రాత్రి’’ తమ పరిమితులను వదులుకోడానికి, సృష్టిలోని అనంతమును అనుభవించడానికి ఈ రాత్రి, ఇదే ప్రతి వ్యక్తిలో మొలకెత్తే అంకురం. ఆ విధంగా ప్రతి వ్యక్తిలోను శూన్యం తీసికొని వచ్చుటకు ఈ శివరాత్రి ఒక మంచి అవకాశం, ఇదే సృష్టి రహస్యం.
సంవత్సరంలోని ఈ 12 శివరాత్రులలో మహాశివరాత్రి చాలా విశిష్టమైనది. ఆనాటి రాత్రి ఉత్తర భూగోళంలోని శక్తులు ఊర్థ్వముఖంగా పయనించుటకు వీలుగా ఉంటాయి. ఆ రోజు మనలను ఆధ్యాత్మికతలో పురోగమించడానికి, ఉన్నత శిఖరాలకు చేర్చుటకు ఈ సృష్టి సహకరిస్తుంది. దానిని ఉపయోగించుకొని ప్రయోజనం పొందుటకు మన సాంప్రదాయంలో ఈ పండుగను ఏర్పాటుచేసేరు. అది రాత్రంతా పండుగ. ఈ పూర్ణరాత్రి పండుగ మనలను ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు తీసికొని వెళ్ళడానికి తోడ్పడుతుంది. అందుకు మనం ఆ రాత్రంతా మేల్కొని, నడుము నిటారుగా చేసి స్థిరంగా కూర్చొనాలి.
ఈ మహాశివరాత్రినాడు మనం ఒక మంత్రం జపిస్తాం, మనం మంత్రం అనగానే మంత్రార్థం కంటే మంత్రమూలం తెలిసికోవాలి. అదే ‘‘తరంగాలు’’ అంటాము. ఆ తరంగాలే మనకు ముక్తిని కలిగిస్తాయి. ఆ తరంగాలే మనలను ఈ శారీరక, మానసిక స్థితినుండి ఉన్నత శిఖరాలకు తీసికొని వెడతాయి. ఈ తరంగాలే మన పంచేంద్రియాల నుండి మనలను వేరుగా తెలియజేస్తాయి. ఆ విధంగా మనలను మోక్షస్థానానికి తీసికొని వెడతాయి. ఈ మంత్రాలను నోటితో పఠించిన చాలదు. మన శరీరంలోని ప్రతి అణువు ఈ మంత్రంతో నిండాలి. అపుడే మనకు దాని ఫలితమేమిటో తెలుస్తుంది. నోటితో మాత్రమే మంత్ర పఠనం చేసిన మనకు కొంత ఆరోగ్యం, ఆనందం కలుగవచ్చును, కాని మంత్ర మహిమ నిజంగా తెలియాలంటే, మన శరీరంలోని అణువణువూ ఈ మంత్ర తరంగాలతో నిండాలి. ఆ శక్తి ప్రతిధ్వనించాలి. మంత్రం బయటకు చెప్పడానికి కాదు, దానిని మనం మననం చేస్తే అది మన శరీరంలో ఎంత శక్తిని కలిగిస్తుందో తెలుస్తుంది. ఆ శక్తి మనం తెచ్చుకునేది కాదు, మనలో కలిగేది.
పళనిస్వామి అనే యోగి జీవితంలో జరిగిన సంఘటన ఒక చక్కని ఉదాహరణ, ఆయన తన జీవితమంతా ‘‘శంభో’’ అనే మంత్ర ధ్యానంతోనే గడిపేవాడు, అన్నివేళలా ‘‘శంభో’’ అనే మంత్రోచ్ఛారాణ తప్ప వేరే ధ్యానం లేదు. ఒక రోజు ఈ ఊరి గుడి పూజారి పళనిస్వామి కాలకృత్యములు తీర్చుకుంటూ మంత్రోచ్ఛారణ చేయడం గమనించి, పెద్దలకు చెప్పాడు. దానికి వారంతా కోపించారు. వెంటనే వారు పళనిస్వామిని సభకు పిలిచి యికపై ఆయన ‘‘శంభో’’ అనే మంత్రాన్ని ఎక్కడా ఎప్పుడూ ఉచ్ఛరించరాదని శాసించారు. ఆ మంత్రోచ్ఛారణకు ఆయన అనర్హుడని తీర్మానించారు, పళనిస్వామి ‘‘శంభో’’ మంత్రోచ్ఛారణ మానివేశాడు. అపుడు ఆ ప్రదేశమంతా మరియు పళనిస్వామి దేహంలోని అణువణువు నుండి బిగ్గరగా ‘‘శంభో’’ అనే మంత్రోచ్ఛారణ రాసాగింది. అపుడు వారు పళనిస్వామి పాదాలపై పడి, ఈ నియములు సామాన్యులకు కాని, అతీతుడవైన నీకు కాదు, నీవు నీ యిష్టము వచ్చినట్లు ప్రవర్తించవచ్చును అని చెప్పారు. ఈ ఉదాహరణ వలన మనకు మంత్రోచ్ఛారణ యొక్క శక్తి, మంత్రోచ్ఛారణ బయటకు చేయడం కంటె లోపలే చేయడంవలన ఎంత ఫలితమో, ఆ మంత్రం శరీరంలోకి ఎంత అంతర్హితము అవుతుందో తెలుస్తోంది.
ఒకవైపు ‘‘శివుడు’’ లయకారకుడు, రెండవ వైపు అతడు వరప్రియదాత, పరమశివుడు పరమ దాతృత్వం కలిగి అడిగిన వెంటనే వరములిచ్చే భోళాశంకరుడు, శివుని వరాలను గూర్చి జ్ఞానులు చెప్పిన ఆధారాలు అనేకాలు, ఆయన వరదానశైలి అత్యాశ్చర్యం, అత్యద్భుతం, ఆయన గొప్ప వరప్రదాత, అదే సమయంలో కోరికలు కోరేవారికి అందని వాడు, అట్టివారిని యిష్టపడనివాడు, కోరికలతో తపస్సుచేసే వారికి శివుడు అందడు, కనుక మహాశివరాత్రి శుభములు పొందుటకు ఒక అద్భుత రాత్రి.
ప్రపంచంలోని భక్తులు, ఆధ్యాత్మికులు, తమ జీవితాన్ని అధికమైన, తీవ్రమైన ఆధ్యాత్మికతతో గడుపుతారు. కాని సామాన్య ప్రజలకు చాలా కోరికలు ఉంటాయి, కాని అనేకమైన పనులు, బాధ్యతలు కలిగి కూడా ఆధ్యాత్మిక పథంలో సక్రమంగా నడిచి పాటించే వారిని చూస్తే మనకి ఆనందం కలుగుతుంది. మా అభిలాష, దీవెనలు ఏమనగా రుూ మహాశివరాత్రి నాటి రాత్రి అనంత శూన్యం అనే శివుని గూర్చి ఒక్క క్షణమైనా తెలిసికోకుండా మీరు గడపరాదు, మీరందరికీ ఈ రాత్రి జాగరణ రాత్రి మాత్రమేకాక, జాగృతమై నిన్ను నీవు తెలిసికున్న రాత్రి కావాలి.
- శైలజ
Add new comment