శ్రీకాకుళం

ట్రిపుల్ ఐటీకి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 27: ప్రభుత్వాలు మారేటప్పుడల్లా పథకాలు పేర్లు మారడం పరిపాటే. అదేమాదిరిగా రాజీవ్ స్వగృహకు కాంగ్రెస్ శ్రీకారం చుడితే బాబు సర్కార్ స్వస్తిపలికి ట్రిపుల్ ఐటికు భూకేటాయింపులు జరిపింది. నాడు వైఎస్ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగగా ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కలేదు. చంద్రబాబు ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి దోహదపడే ట్రిపుల్ ఐటి ప్రాజెక్టు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిస్తుందన్న ఆశతో ఈ విద్యాసంస్థను మంజూరు చేసింది.
రాష్ట్ర విభజన తర్వాత ఎటువంటి ప్రాజెక్టులు బాబు సర్కార్ కేటాయించలేదని విపక్షాలు విమర్శల దాడిని తిప్పికొట్టేలా ట్రిపుల్ ఐటిని జిల్లాకు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమతులు జారీ చేశారు. అనంతరం ఇక్కడ ప్రాంతీయ కార్యాలయాన్ని మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే నూజివీడు కేంద్రంగా ఉన్న రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేసిన ట్రిపుల్ ఐటి మొదటి సంవత్సరం అడ్మిషన్లను పూర్తి చేశారు. ఇక్కడితో ఆగకుండా రెండో సంవత్సరం అడ్మిషన్లకు ప్రారంభించకముందే ట్రిపుల్ ఐటికి సంబంధించిన వౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 19న 340 ఎకరాలు భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఎస్‌ఎం పురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 112లో ఈ భూమిని కేటాయించినప్పటికీ సమీపంలో ఉన్న రాజీవ్ స్వగృహ ప్రాజెక్టుకు తిలోదకాలు ఇచ్చేలా ఆ భూమిని కూడా ట్రిపుల్ ఐటికు కేటాయించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006లో మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చాలన్న సంకల్పంతో రాజీవ్ స్వగృహకు శ్రీకారం చుట్టారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి దరఖాస్తుదారులకు అందజేస్తామని తొలుత శ్రీకాకుళం నగరంలోనే నిర్మిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆరు వేల మంది మూడు వేల వంతున దరావత్తు చెల్లించి దరఖాస్తు చేస్తున్నారు.
అప్పటి మున్సిపాలిటీలో స్థల సమస్య ఉన్న దృష్ట్యా ఈ నిర్మాణాలను ఎస్‌ఎం పురం కొండపై నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకోవడంతో అనేకమంది దరఖాస్తుదారులు శ్రీకాకుళం నగరానికి దూరం కావడం, అలాగే నిర్మాణ వ్యయం భారంగా మారడంతో యూటర్న్ తీసుకున్నారు. ఈ నిర్మాణాలకు 90 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించినప్పటికీ దరఖాస్తుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండడంతో మొదట విడతగా 200 ఇళ్లను నిర్మించేలా అనమిత్ర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 189 వివిధ స్టేజిలలో నిర్మించి
నాలుగు కేటగిరిలుగా అమ్మకాలు జరిపేందుకు ఎంతో శ్రమించినప్పటికీ వాటిని కొనుగోలు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వ ధనం వృధా అయ్యిందన్న దిగులు ప్రాజెక్టు నిర్వాహకులకు మిగిలింది. అయితే, 54 మంది మాత్రమే కొనుగోలు చేసుకుని నివాసముంటున్నారు. మిగిలిన ఇళ్లన్నీ వృధాగానే పడివున్నాయి. ఇదిలా ఉండగా 50 ఎకరాల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నిర్మించిన 21వ శతాబ్దపు గురుకుల భవనాలను ట్రిపుల్ ఐటికు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కేవలం 500 మందికి మాత్రమే బోధన, వసతికి సరిపడడంతో మిగిలిన 500 మందికి స్వగృహ భవనాలను వినియోగించుకోవాలని బాబు సర్కార్ తాజాగా ఒక నిర్ణయానికి వచ్చిది. దీనితో స్వగృహ నిర్మాణాలను ప్రభుత్వ ధర చెల్లించి వీటిని ట్రిపుల్ ఐటి క్యాంపస్‌గా మార్చుకునేందుకు సంబంధిత అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మిగిలిన స్థలాన్ని కూడా ఎకరాకు ఐదు లక్షల చొప్పున చెల్లించి వీటిలో నూతన భవనాలు నిర్మించి ట్రిపుల్ ఐటి క్యాంపస్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి మొదటి వారంలో జిల్లాకు విచ్చేసి ట్రిపుల్ ఐటి భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న ఎస్‌ఎం పురం కొండ మరో విద్యా కేంద్రానికి అండగా నిలవడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అంబేద్కర్ వర్శిటీతోపాటు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు, ఫార్మశీ, వ్యవసాయ విద్యాసంస్థలు సముదాయానికి అనుసంధానంగా ట్రిపుల్ ఐటి రూపుదిద్దుకోవడం ఈ ప్రాంతం ‘విద్యాప్రాంతం’గా మారనుంది.