శ్రీకాకుళం

నేటి నుంచి ‘స్థానిక’ఎమ్మెల్సీ సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 20: జిల్లాలో 43 స్థానిక సంస్థలు.. 795 మంది ఓటర్లు..శాసనమండలి సభ్యుడ్ని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది! ఇందుకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. మార్చి 17వతేదీన జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీగా అన్నీ ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి కత్తిమీదసాములా కోడ్ ఉల్లంఘన తయారైంది. దీనికోసం ప్రత్యేక విజి‘లెన్స్’విభాగాన్ని ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్‌కు ప్రతీ గంటకు నివేదికలు అందించాల్సిఉంది. స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికార పార్టీలో రాజకీయాలు వేడెక్కితే - మంగళవారం నుంచి ఈ ప్రక్రియకు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఎన్నికల కమిషన్ ఆదేశాలు తు.చ.తప్పకుండా ఆచరించేందుకు సంసిద్ధం అవుతున్నారు. 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఎన్నికల కమిషన్ ‘స్థానిక’ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ నెల 28వతేదీ వరకూ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు చివరి గడువుగా ప్రకటించింది. మార్చి 1న నామినేషన్ల పరిశీలన, 3వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనుంది. మార్చి 17న ఎన్నికలు నిర్వహించనుంది. దీనికి 45 స్థానిక సంస్థల్లో 874 మంది ఓటర్లు ఉండగా, శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించ లేకపోవడంతో ప్రత్యేక అధికారి పాలనలో కొనసాగుతుండడం వల్ల ఇక్కడ 50 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం లేకుండా పోయింది. అలాగే, రాజాం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు సకాలంలో ప్రభుత్వం నిర్వహించ లేకపోవడంతో 20 మంది కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు లేవు. జిల్లాలో ఆరు ఎంపిటిసిల స్థానాలు ఖాళీగా ఉండడంతో మొత్తంగా 43 స్థానిక సంస్థల నుంచి 795 మంది ఓటర్లు ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓట్లు వేసి వారి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. జిల్లాలో 16 జెడ్పీటిసిలు, 287 ఎంపిటిసిలు ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, గత రెండున్నర ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పాలనలో కొంతమంది ఆకర్షితులై వైకాపా నుంచి టిడిపి జంప్ చేశారు. ముఖ్యంగా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పార్టీ ఫిరాయింపుతో సుమారు 99 మంది స్థానిక సంస్థ ఓటర్లు టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థికి బోనస్‌గా చేరారు. దీంతో టిడిపి స్థానిక బలం పెరగడం, వైకాపా బలహీనపడడంతో ‘స్థానిక’సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపే జరిగే అవకాశం ఉందంటూ రాజకీయ విశే్లషకులు సుస్పష్టం చేస్తున్నారు. అందుకే - ఆశావహులు కూడా టిడిపి నుంచి జాబితా చాంతాడులా మారేందుకు అవకాశం కలిగింది. అయితే, టిడిపి జిల్లా నాయకత్వం ఈ నెల 22వ తేదీన ఆమదాలవలసలో జరగనున్న జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అభ్యర్థి ఎంపిక, అధినేత చంద్రబాబుకు పంపే జిల్లా పార్టీ తీర్మానంతో కొన్ని సంఘటనలు తారుమారయ్యే ప్రమాద రాజకీయ పరిస్థితులు లేకపోలేదు. గతంలో పీరుకట్ల విశ్వప్రసాద్, రెబల్ అభ్యర్థి గొర్లె హరిబాబునాయుడు మధ్య జరిగిన రాజకీయ ఎత్తుగడల్లో కీలకపాత్ర పోషించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి రాజకీయ కురువృద్ధుడు రెబల్ అభ్యర్థితో ‘స్థానిక’సంస్కరణలకు తెరలేపితే...మళ్లీ టిడిపికి కనిపించే బలమంతా వాపుగా మారిపోయేందుకు ఛాన్స్ లేకపోలేదు. అటువంటి పరిస్థితులు లేకుండా జాగ్రత్తలు పడాల్సిన జిల్లా మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు, విప్, సీనియర్ ఎమ్మెల్యే శివాజీ ఆచితూచి నిర్ణయం తీసుకునేందుకు పూర్తిగా వారి మేధోమదనానికి అభ్యర్థి ఎంపిక పరీక్షే!
పార్టీల వారీగా ‘స్థానిక’ బలాబలాలు
జిల్లా అంతటా 95.55 శాతం స్థానిక సంస్థలు పనిచేస్తుండగా, వాటిలో 90.96 శాతం ఓటర్లు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు అర్హులు. ఇందులో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల బలాబలాలు పరిశీలిస్తే..
తెలుగుదేశం పార్టీకి ఆమదాలవలస మున్సిపాలిటీలో 13 మంది కౌన్సిలర్లకు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిఉన్నారు. అలాగే, ఇచ్చాపురం మున్సిపాలిటీలో 10 మంది కౌన్సిలర్లు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 17 మంది కౌన్సిలర్లు, పాలకొండ మేజర్ పంచాయతీలో 12 మంది కౌన్సిలర్లకు తెలుగుదేశం తరుఫున ఓట్ బ్యాంకు ఉంది. అలాగే, 26 మంది జెడ్పీటిసిలు, 400 పైచిలుక ఎంపిటిసిల ఓట్లు టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి వెన్నువెంట ఉన్నాయి.
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ఓటర్లను పరిశీలిస్తే - ఆమదాలవలస మున్సిపాలిటీలో 10 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇచ్చాపురం మున్సిపాలిటీ నుంచి 13 మంది కౌన్సిలర్లు, పాలకొండ నగరపంచాయతీలో ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు(ఇండిపెండెంట్లుగా ఐదుగురు). ఆపైన 16 మంది జెడ్పీటిసిల ఉన్నప్పటికీ ఐదుగురు టిడిపిలోకి జంప్ చేయడంతో 11 జెడ్పీటిసిలు, 280 పైచిలుక ఎంపిటిసిలు ఉండగా, వీరిలో సుమారు 60 మందికి పైచిలుక టిడిపిలో చేరిపోవడంతో వైకాపా ‘స్థానిక’బలం గత కొంతకాలంగా చాలా బలహీనపడిపోయింది.
ఇదిలా ఉండగా, ఎన్నికల అనంతరం మార్చి 20వతేదీన ఓట్లు లెక్కింపు, మార్చి 24తో ‘స్థానిక’ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగించేలా ఎన్నికల కమిషన్ కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రక్రియలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన చాలా సులభంగా జరుగుతుంటుందని, పూర్తిగా వీడియోలో బంధించి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శి నుంచి డిఆర్వో వరకూ ఉందంటూ హుకుం జారీ చేశారు. కోడ్ ఉల్లంఘన పట్ల రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు అధికారులపై ఎటువంటి ఒత్తిడి ఇవ్వరాదంటూ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

దేశానికి వనె్న తెచ్చేలా క్రీడాకారులు ఎదగాలి
*జెసి -2 రజనీకాంతారావు
బలగ, ఫిబ్రవరి 20: జిల్లా క్రీడాకారులు దేశానికి వనె్న తెచ్చే క్రీడాకారులుగా ఎదగాలని జెసి-2 పి.రజనీకాంతారావు ఆకాంక్షించారు. జిల్లా క్రీడాపాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం 5కె రన్ నిర్వహించారు. ఈ రన్‌ను స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద జెసి-2 జెండా ఊపి ప్రారంభించారు. 5కె రన్‌లో చిన్నారులతో సహా 14,16,19 సంవత్సరాలు పైబడిన వారు పాల్గొన్నట్లు తెలియజేశారు. 35 సంవత్సరాల పైబడిన విభాగంలో విశ్రాంత జిల్లా, సెషన్ జడ్జి పప్పల జగన్నాథరావు పాల్గొన్నారు. 70 ఏళ్ల ప్రాయంలోనూ పరుగుపోటీల్లో పాల్గొని అందర్నీ ఆకర్షించారు. కోడి రామ్మూర్తి స్టేడియం నుండి పొట్టి శ్రీరాముల కూడలి వరకు అక్కడనుండి మళ్లీ స్టేడియం వరకు పరుగు కొనసాగింది. అనంతరం స్టేడియంలో సభా కార్యక్రమం, బహుమతుల ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా జెసి-2 మాట్లాడుతూ క్రీడాకారులకు జిల్లా పెట్టింది పేరు అని అన్నారు. క్రీడలపై అసక్తిని కలిగించేందుకు ప్రభుత్వం దీనిని రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడలతో మానసిక, శారీరక వికాసం కలుగుతుందన్నారు. మంచి ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. చిన్న నాటినుండే క్రీడలపట్ల అభిలాష కలిగి ఉండాలని ఆసక్తిగల క్రీడారంగంలో మంచి సాధనలు చేయాలన్నారు. విద్యతోపాటు క్రీడారంగంలో ప్రతిభ కనబర్చడంద్వారా ఉన్నత స్థానాలకు వెళ్లగలరని తెలిపారు. క్రీడాకారులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. జిల్లా, రాష్ట్ర, దేశ అంతర్జాతీయ పోటీల్లో రాణించాలని, అందుకు తగిన నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. మంచి భవిష్యత్‌పై ఆలోచించాలని, క్రీడారంగంలో సమున్నత శిఖరాలను చేరగలరన్నారు. క్రీడతోపాటు భారతీయ విధానాల్లో యోగాసనాలు అభ్యసనవలన ఒత్తిడి వంటి రుగ్మతుల నుండి దూరంగా ఉండవచ్చునన్నారు. విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కలెక్టర్ కార్యాలయ న్యాయసలహాదారు పప్పల జగన్నాథరావు మాట్లాడుతూ యోగాను అభ్యసించాలన్నారు. యోగాతో పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆనందం కలుగుతుందన్నారు. విద్యార్థులు జ్ఞాన, యోగ అభ్యసించడం వలన మంచి జ్ఞాపకశక్తి, ధారణ కలుగుతుందన్నారు. నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి ధవళ భాస్కరరావు మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించి సమాజ ఆరోగ్యం పాటించాలన్నారు. చిన్నారులుగా మంచి అవగాహన పెంచుకోవాలని, భావిభారత పౌరులుగా స్వచ్ఛసమాజాన్ని అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈసందర్భంగా 5కె రన్‌లో విజేతగా నిలిచిన విశ్రాంత జిల్లా జడ్జి పప్పల జగన్నాధరావుకు బహుమతితోపాటు యోగా సాధన చేసే మేట్‌ను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ తరఫున జెసి-2 అందించారు. 5కె రన్‌లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు జ్ఞాపికలను, బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, వెటరన్ అథ్లెట్ ఖాషిమ్‌ఖాన్, స్టార్‌వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ గవర్నర్ జి. ఇందిరప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.వాసుదేవాచారి, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి ఎన్.విజయకుమార్ పాల్గొన్నారు.

డయల్ యువర్ కలెక్టర్‌కు 13 వినతులు
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 20: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 13 వినతులు అందాయి. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.సత్యనారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వంగర మండలం జివిఆర్‌పేట నుండి ఎం.సింహాచలం మాట్లాడుతూ పనికి ఆహార పథకం కింద చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కవిటి మండలం రాజపురం గ్రామానికి చెందిన బి.సోమయ్య మాట్లాడుతూ ఉద్యానవన శాఖకు 2013లో మామిడి మొక్కలు పెంపకానికి ఇచ్చామని, దాని నిర్వహణ ఖర్చులు మాత్రం ఇప్పటివరకు మంజూరు చేయలేదన్నారు. గార మండలం ఆడవరం గ్రామానికి చెందిన ఎం.సన్యాసిరావు మాట్లాడుతూ అంపోలు నుండి రామకృష్ణాపురం రోడ్డు మధ్యలో వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నందున విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్ అంతరాయం కలుగుతుందని, చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తూరు మండలం వసప నుండి వి. ఆఫీసురావు ఫోన్ చేస్తూ తమ మండలంలో ఇసుక అక్రమరవాణా జరుగుతున్నందున బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. పి.సతీస్‌మాట్లాడుతూ యూత్‌ప్యాకేజ్ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరారు. వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన వి.తిరుపతిరావు మాట్లాడుతూ ఎస్సీ కాలనీకి రహదారి ఏర్పాటు చేయాలని కోరారు. పోలాకి నుండి మహ్మద్ ఫకృద్ధీన్ మాట్లాడుతూ 10 నాణేల చెలామణిపై కలుగుతున్న ఇబ్బందులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వంగర మండలం మగ్గూరునుండి పి.త్రినాథ మాట్లాడుతూ 2016 నవంబర్ పింఛన్ తనకు ఇంతవరకు తమ ఖాతాలో జమ కాలేదని, మంజూరు చేయాలని కోరారు. జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామానికి చెందిన ఎన్.రాజశేఖర్ ఫోన్ చేస్తూ వంశధార నదిలో నీరు లేనందున మహాశివరాత్రి స్నానాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున నీటిని విడుదల చేయాలని కోరారు. భక్తుల కోసం విశ్రాంతి భవనాలను ఏర్పాటు చేయాలన్నారు. పలాస మండలం రెంటికోట గ్రామానికి చెందిన వి.వేణు మాట్లాడుతూ తల్లిదండ్రుల తరఫున మహిళా సంఘంలో ఉన్న పిల్లలకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని కోరారు. ధనుంజయరావు, వయోజన విద్య ఉపసంచాలకుడు జి.కృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణ నిర్వాహక సంచాలకుడు కె.వి.ఆదిత్యలక్ష్మీ, జిల్లా పౌరసరఫరాల అధికారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ఎస్పీ గ్రీవెన్స్‌కు 14 అర్జీలు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 20: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 14 అర్జీలు వచ్చాయి. ఇందులో కుటుంబ వ్యవహారాలకు చెందినవి 1, సివిల్ తగాదాలపై 5, పాత కేసులు 2, ఇతర కారణాలకు చెందినవి 6 వినతులు వచ్చాయి. పై అర్జీలపై ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి సంబంధిత ఎస్‌ఐ , సిఐ, డిఎస్పీలకు సూచనలు చేశారు. ఓఎస్‌డి తిరుమలరావు ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 6 అర్జీలు రాగా, అందులో రెండు అర్జీలు రాజీ కుదిర్చారు. మిగిలిన 4 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈకార్యక్రమం లో ఉమెన్ పిఎస్‌ఎస్‌ఐ శ్యామలరావు, న్యాయవాది వరప్రసాదరావు, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.