శ్రీకాకుళం

బంద్‌ను విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జూలై 23: ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చేపట్టే బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. సోమవారం వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరికి నిరసనగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి గాను బంద్‌ను చేపట్టనున్నామన్నారు. నాలుగేళ్లుగా వైసీపీ చేస్తున్న పోరాటాన్ని టీడీపీ అనుసరించి పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టిందన్నారు. అవిశ్వాస తీర్మాణానికి దేశంలో ఏ ఒక్క పార్టీ కూడ మద్దతు తెలపలేదన్నారు. చంద్రబాబునాయుడు గతంలో ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలని అసెంబ్లీలో తీర్మాణం చేయడంతోపాటు ప్రధాని నరేంద్రమోడీ, అరుణజైట్లీను ఆకాశానికి ఎత్తడాన్ని ప్రజలందరూ గమనించారన్నారు. వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మాణం పెడితే టీడీపీ గోడపై పిల్లి మాదిరిగా బీజేపీతో కుమ్మక్కై అవిశ్వాస తీర్మాణం చర్చకు రాకుండా అడ్డుకొని లోపాయికారీ ఒప్పందంతో అవిశ్వాస తీర్మాణంపై చర్చలు జరిపారన్నారు. ప్రజలంతా ఈ బంద్‌ను విజయవంతం చేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు బల్ల గిరిబాబు, బమ్మిడి సింహాలచలం, బడగల బల్లయ్య, డి.నిరంజన్, షణ్ముఖ, సన్యాసి ఆప్టో, నాగేశ్వరరావు, పులిరాజు, మల్లా సురేషు తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలు పరిశుభ్రతతోనే ఆరోగ్యం
పలాస, జూలై 23: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం చేకూరుతుందని హెల్త్ ఎడ్యుకేటర్ ఎస్.సూర్యకళ అన్నారు. సోమవారం పలాస మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మలేరియా, డెంగ్యూ అంటువ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరితే ఆ వర్షపునీరుపై ఈగులు, దోమలు మృతి చెంది అంటువ్యాధులు వ్యాప్తి చెందాయని హెచ్చరించారు. పరిసరాల్లో ప్రధానంగా కొబ్బరిచిప్పలు, పాతటైర్లు నిల్వ లేకుండా చూడాలని హెచ్చరించారు. మరుగుదొడ్లు గొట్టాలకు మూతలు, జాలిలు అమర్చుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి మనమే సరైన మార్గాలను ఎంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎలు ప్రసాదరావు, ఆర్.సోమయ్య, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఏపి ఫైబర్‌నెట్‌లో యు ఎస్‌వోలకు అన్యాయం
పలాస, జూలై 23: పలాస పరిధిలోని ఏపి ఫైబర్‌నెట్‌కు సంబంధించి కేటాయింపులో యు ఎస్‌వోలకు తీరని అన్యాయం జరుగుతుందని సీటీకేబుల్ ఎండి యు ఎస్‌వో రోణంకి వెంకటరమణ జిల్లా కలెక్టర్ ధనుంజయకు సోమవారం ఫిర్యాదు చేసారు. గడిచిన 30 సంవత్సరాలుగా కేబుల్ కనెక్షన్ వ్యాపారంలో ఉన్నానని, మారుతున్న కాలానికి అనుగుణంగా కేబుల్ కనెక్షన్ మార్చి ఏషియాన్ నెట్‌తో కలిసి కేబుల్ ప్రసారాలను అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపి ఫైబర్ నెట్ యు ఎస్‌వోగా తీసుకోవడం జరిగిందన్నారు. తన పరిధిలో సుమారు 10 మంది ఎల్ ఎంవోలు పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగా ఏపి ఫైబర్ పాన్ కావాలని కోరడం జరిగిందన్నారు. ఈ కేటాయింపుల్లో జిల్లా ఏపి ఫైబర్ నెట్ ఎగ్జిక్యూటివ్ ఫణిని కలువగా ఎమ్మెల్యేను కలవాలని, లేకుంటే విసిని కలవాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేసారు. వారితో కలిసినప్పటికి తెలుగుదేశం పార్టీలోకి చేరితేనే పాన్ ఇస్తామని చెప్పడంతో మనస్థాపానికి గురయ్యానన్నారు. తన పిల్లల చదువు దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా ఉన్నామని, తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, అప్పు చేసిన 9 లక్షల రూపాయలతో ఏపి ఫైబర్ కోసం లైన్‌లు వేసి పాన్ అడిగిన సమయంలో రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు ఆయా ప్రాంతాల్లోని సీటీకేబుల్ ఆపరేటర్లుకు ఇస్తామని చెప్పినప్పటికి పలాసలో అందుకు విరుద్దంగా రాజకీయనాయకులకు అండగా ఏపి ఫైబర్ నెట్ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

వృత్తిదారుల కోసమే ఆదరణ
రాజాం, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ పథకం కింద వృత్తిదారులకు ఆదరణ కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో రజక కులస్తులకు సంబంధించి ఆదరణ దరఖాస్తుదారుల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 16 రకాల వృత్తిదారులకు రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేలు విలువైన వివిధ రకాల వృత్తిదారులకు సంబంధించి పరికరాలు అందజేస్తామని, అందుకోసం దరఖాస్తుల పరిశీలన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉప ఎంపీపీ భీమేశ్వరరావు, సూపరిటెండెంట్ స్టీవెన్‌సన్ కార్యదర్శి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.