శ్రీకాకుళం

ఉపాధ్యాయులను విధులకు సమ్మన్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 14: తిత్లీ తుఫాన్ కారణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఉపాధ్యాయులను కూడా విధులకు సమ్మన్ చేయాలని పాఠశాలలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ పంట నష్టం వరికి హెక్టార్‌కు రూ.20వేలు ప్రకటించామని, గతంలో రూ.10వేలు ఉండేదని అన్నారు. జీడిమామిడికి హెక్టార్‌కు రూ.25వేలు గతంలో ఇది రూ.20వేలు ఉండేదని, కొబ్బరిచెట్టుకు రూ.1200 గతంలో ఇది రూ.వెయ్యి ఉండేదని స్పష్టం చేశారు. జీడి, కొబ్బరి పంటకు మూడు సంవత్సరాలకు నిర్వహణ ఖర్చుగా హెక్టార్‌కు రూ.40వేలు ఇప్పిస్తామని అన్నారు. కొబ్బరి పంటలో అంతర్ పంటలను ప్రోత్సహించాలని తెలియజేశారు. బోటు కోల్పోయిన మత్స్యకారులకు రూ. 2లక్షలు ఇందులో సబ్సిడీ లక్ష రూపాయలని తెలియజేశారు. పూర్తిగా ధ్వంసమైన మోటార్ బోటులకు రూ.6లక్షలని, వలలు పూర్తిగా కోల్పోయిన వారికి రూ.10వేలు ఇప్పిస్తామన్నారు. ఆక్వా కల్చర్‌కు హెక్టార్‌కు రూ.30వేలు, గతంలో ఇది రూ.8వేలు మాత్రమే ఉండేదని తెలియజేశారు. చనిపోయిన ఆవులు, గేదెలకు నష్టపరిహారంగా రూ.30వేలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. తీవ్రంగా గాయపడి చనిపోయిన స్థితిలో ఉన్న మేకలు, గొర్రెలకు రూ.3వేలు నష్టపరిహారం ఇస్తారని తెలియజేశారు. పశువుల శాలల నిర్మానానికి రెండు పశువులకు రూ.లక్ష, మూడు పశువులుంటే రూ. 1.5లక్షలు, నాలుగు పశువులకు రూ.2 లక్షలు రుణంగా ఇస్తారని తెలియజేశారు. పూర్తిగా నష్టపోయిన గృహాలకు రూ.పదివేలు పరిహారం ఇస్తూ ఎన్టీ ఆర్ గృహ నిర్మాణం కింద యూనిట్ ఖరీదు రూ.1.50 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలియజేశారు. రేకుల ఇళ్లకు అవసరమైన రేకులు, ధ్వంసమైన దుకాణాలకు రూ.10వేలు నష్టపరిహారం ఇస్తారని తెలియజేశారు. రేషన్ దుకాణాల నుండి బయోమెట్రిక్ అవసరం లేకుండా తెల్లకార్డులున్న వారికి 25కిలోలు బియ్యం, వేటకు వెళ్లే మత్స్యకారులకు 50కిలోలు బియ్యం, ఇతర సరుకులు అందిస్తారన్నారు. మంగళవారం నాటికి అన్ని పునరుద్ధరణ పనులు పూర్తికావాలన్నారు. ప్రజల్లో 90 శాతం సంతృప్తి రావాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఒక్కరిలో మానవతా దృక్పధం ఉండాలని, గ్రామాల్లో పూర్తిస్థాయిలో పరిశుభ్రత నెలకొనాలని సూచించారు. వ్యాధులు ఎక్కడ ప్రభలరాదని, తాగునీరు అందించాలన్నారు. జనరేటర్‌లతో నీటిపథకాలు నింపాలన్నారు. దూరప్రాంత గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. సహాయక చర్యల్లో బాధ్యతారాహిత్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ స్థంభాల నాణ్యతను ప్రజలు ప్రశ్నిస్తున్నారని, వాటిని పరిశీలించాలన్నారు. తీర ప్రాంతాలలో ప్రత్యేక తరహా విద్యుత్ స్థంబాల ఏర్పాటుకు అంచనాలు తయారుచేయాలని సూచించారు. బాధితులకు భోజనం అందించాలని, సహాయక చర్యల్లో ఎటువంటి లోపాలు ఉండరాదని సూచించారు.

తుఫాన్ నష్టాలను అంచనాలు వేయాలి
* జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి

శ్రీకాకుళం, అక్టోబర్ 14: జిల్లాలో 38 మండలాల్లో తిత్లీ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి సూచించారు. అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ, ఉధ్యానవన, మత్స్యకార, పశుసంవర్థక, గృహ తదితర అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు జిల్లాలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో అంచనాలు వేసి వెంటనే సమర్పించాలన్నారు. బాధ్యతారాహిత్యాన్ని సహించేది లేదని, పునరావాస, పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరగాలన్నారు. అందరికి తాగునీరు, ఆహారం విధిగా అందాలన్నారు. విద్యుత్ సరఫరా పనులు వేగవంతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను తెల్సుకొని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఉచిత బియ్యం, సరుకులు పంపిణీకి బయోమెట్రిక్ అవసరం లేదన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు నష్టపరిహారం పంపిణీ చేయాలని సూచించారు.

విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం
* రాష్ట్ర విద్యుత్‌శాఖామంత్రి కళావెంకటరావు

శ్రీకాకుళం, అక్టోబర్ 14: జిల్లాలో తుఫాన్ ప్రభావిత మండలాల్లో రెండు మినహా మిగిలిన అన్ని మండల కేంద్రాలకు ఆదివారం సాయంత్రానికి విద్యుత్ పునరుద్ధరణ జరిగిందిని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం ఈపిడి ఎల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 133కెవి సబ్‌స్టేషన్‌కు అక్కడనుండి 33కెవి సబ్‌స్టేషన్‌లకు సరఫరా చేస్తామన్నారు. అక్కడనుండి గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తుందన్నారు. తిత్లీ తుఫాన్‌కు జిల్లాలో 30వేల విద్యుత్ స్థంబాలు పోయావని, వీటిని రడీగా తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు, బెంగళూర్ నుండి 5వేల సిబ్బందిని తీసుకువచ్చి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. విశాఖపట్నం నుండి మరో 800 మంది సిబ్బంది వస్తున్నారన్నారు. మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు మండలాల్లో 133 కెవి సబ్‌స్టేషన్లకు సోమవారం సాయంత్రంకు విద్యుత్ వస్తుందన్నారు. ఈ రెండు మండలాల్లో భారీగా నష్టం జరిగిందన్నారు. పాతపట్నంలో కూడా అదే పరిస్థితి అని తెలియజేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్గిన గ్రామాల్లో పెద్దపెద్ద జనరేటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సి ఎం సూచనమేరకు విశాఖపట్నం నుండి ఈ సాయంత్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. తాత్కాలికంగా లైట్లు, సెల్‌ఫోన్లు రీఛార్జింగ్‌కు ఉపయోగపడతాయన్నారు. వెయ్యి సోలార్ ల్యాంపులు తాత్కాలికంగా సప్లై చేయడం జరిగిందన్నారు. రెండు మూడు రోజులు కరెంట్, మంచినీరు, ఆహారం అంశాలమీదే ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించామన్నారు. పంట నష్టం అంచనాకు 120 మంది డిప్యూటీ కలెక్టర్‌లు, 40మంది ఐ ఏ ఎస్ అధికారులు జిల్లాకు వచ్చారని, వారు ఇప్పటికే ఈ పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. కొబ్బరిచెట్టుకు రూ.1200, జీడిమామిడి ఎకరాకు రూ12వేలు, అరటి హెక్టార్‌కు రూ.25వేలు, విజిటబుల్, బొప్పాయికి కలిపి రూ.15వేలు ముఖ్యమంత్రి ప్రకటించామన్నారు. అంతేకాక బోటులు పోయిన వారికి సబ్సిడీ రూ.లక్ష ప్రభుత్వం పూర్తి సబ్సిడీ భరిస్తుందన్నారు. ఇంకా ఖరీదైన బోటులకు 50శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని మంత్రి కళావెంకటరావు స్పష్టం చేశారు.

తుపాన్ బాధితులు
జాతీయ రహదారి దిగ్బంధం
* మా ఆకలి కేకలు అధికారులకు వినిపించవా! * తహశీల్థార్‌ను చుట్టుముట్టిన బాధితులు
పలాస, అక్టోబర్ 14: తిత్లీ తుపాన్‌తో అతలాకుతలమైన ఉద్దాన ప్రాంతానికి సున్నాదేవి, మామిడిపల్లి, బొడ్డపాడు గ్రామాలు అధికారులకు కానరాకపోవడం విడ్డూరంగా ఉందని ఆ ప్రాంత బాధితులు ఆదివారం సున్నాదేవి వద్ద జాతీయరహదారిని మామిడిపల్లివాసులు గరుడభద్ర రహదారిని సుమారు రెండు గంటల పాటు దిగ్భందం చేసి తమ నిరసనను తెలియజేసారు. ఈ విషయం తెలుసుకున్న పలాస తహశీల్థార్ కల్యాణచక్రవర్తి, ఎంపీడీవో సూర్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, వారిని చుట్టుముట్టి గడిచిన నాలుగు రోజులుగా మా ప్రాంత ప్రజలు పడుతున్న బాధలు గుర్తించకపోవడంలో అంతర్యమేమిటి అని అధికారులపై విరుచుకుపడ్డారు. తాగునీరు, ఆహారం లేక పడుతున్న ఇబ్బందులు అధికారుల దృష్టికి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. ఇప్పటి వరకు అధికారులు గ్రామాల్లో పర్యటించకపోవడంతో మా వెతలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్దాన గ్రామాలు అంటే అధికారులకు, పాలకులకు చిన్నచూపు అని, ముఖ్యమంత్రి మాత్రం పలాసలో ఉండి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం తప్పితే పలాస కూతవేటు దూరంలో వున్న గ్రామాలకు తాగునీరు, ఆహారం సదుపాయాలు అందించలేని యంత్రాంగం ఉంటే ఏమిటీ, లేకుంటే ఏమిటీ అని నిలదీసారు. సుమారు గంట పాటు జాతీయరహదారిని దిగ్భందం చేయడంతో ఇరువైపుల మూడేసి కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోవడంతోపాటు వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. బాధితుల ఆందోళనలు, ఆక్రందనలను చూసి పోలీసుసిబ్బంది వెనుకంజ వేయడంతో తహసీల్థార్, ఎంపీడీవోలు బాధితులను బుజ్జిగించి అగమేఘాలపై ఈ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇవ్వడంతో వెనుదిరిగారు. ఈ ఆందోళనలు ప్రధానంగా అధికారులు పంపిణీ చేసిన పాలప్యాకేట్లును తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంపిణీ చేయడంతో గ్రామాల్లో ఒక్కసారి ఉద్యమంబాట పట్టే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.

ఉద్దానం ప్రతి రైతును ఆదుకోవాలి
: పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి
వజ్రపుకొత్తూరు, అక్టోబర్ 14: తిత్లీ తుపాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఉద్దానం రైతులను పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. తుపాన్ ప్రభావిత గ్రామాలు పల్లిసారధి, బాతుపురం, గుణుపల్లి, మెట్టూరు తదితర ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఉద్దానం ప్రాంతం తుపాన్ తాకిడికి మూడు దశాబ్ధాలు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రైతులకు కోలుకోలేని నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం కంటితుడుపు పరిహారం కాకుండా రైతులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ఉద్దానం రైతుల ప్రధాన ఆదాయ వనరు కొబ్బరి, జీడిమామిడి పంట పూర్తిగా తుడుచుపెట్టుకుపోయిందన్నారు. ఈ సమయంలో రైతులను ఆదుకోవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. తమకు రెండు రోజుల నుంచి నీరు, ఆహారం అందడం లేదని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని బాధితులు రఘువీరా ఎదుట ఆవేదన వ్యక్తం చేసారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తమ మొర వినిపించుకోడానికి కూడా రాలేదని వాపోయారు. ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, ద్రోణంరాజు శ్రీనివాస్, బొడ్డేపలి సత్యవతి, సత్యప్రసాద్, కె.రామ్మోహన్‌రావు, పలాస నియోజకవర్గ కాంగ్రాస్ సమన్వయకర్త డాక్టర్ దున్న వాసుదేవరావు, డి.ప్రకాశరావు, ఎం.శాంతమూర్తి తదితరులు ఉన్నారు.

తీర ప్రాంత మత్స్యకార గ్రామాలకు కోలుకోలేని దెబ్బ
: మంత్రి రవీంద్ర
వజ్రపుకొత్తూరు, అక్టోబర్ 14: తిత్లీ తుపాన్ ప్రభావంతో తీర ప్రాంత మత్స్యకార గ్రామాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం తుపాన్ ప్రభావిత మంచినీళ్లపేట, హుకుంపేట, పి ఎం పురం, నువ్వలరేవు, డోకులపాడు, బాతుపురం, బైపల్లి, అక్కుపలి, గుణుపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి బాధితులను కలుసుకొని మాట్లాడారు. ఉద్దానం గ్రామాలను తుపాన్ అతలాకుతలం చేసిందన్నారు. సి ఎం చంద్రబాబు స్థానికంగా ఉండి తుపాన్ అనంతర పునరుద్ధరణపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజలకు ఆపద సమయంలో ఆదుకోవడంలో సి ఎం ముందు వరుసలో ఉంటారని మరోసారి రుజువైందన్నారు. గతంలో హుదూద్ తుపాన్ సమయంలో విశాఖలోనే ఉండి పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడాన్ని గుర్తు చేసారు. ఈ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం పరిగణించాలన్నారు. ఆయనతో పాటు సీనియర్ టిడిపి నాయకులు వంక నాగేశ్వరరావు, టిడిపి అధ్యక్షుడు జి.పాపారావు, బి. ఆనంద్, వెంకటేష్, జి.చిన్నారరావు ఉన్నారు.

రోడ్డెక్కిన రైతన్నలు
*పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన
కొత్తూరు, అక్టోబర్ 14: తిత్లీ తుపాను కారణంగా నష్టం వాటిల్లిన పంటలన్నింటికీ పరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తూరు మండల రైతాంగం ఒక్కసారిగా రోడ్డెక్కింది. ఆదివారం ఉదయం నాలుగు రోడ్ల కూడలి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు. వచ్చీపోయే వాహనాలు రాకపోకలు సాగించకుండా నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌ను స్తంభింప చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ తుపాను ప్రభావిత మండలంగా అధికారులు గుర్తించలేదని ఆందోళన చేశారు. అధికారులు నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగానే తుఫాను బాధిత ప్రాంతంగా గుర్తించలేదని విమర్శించారు. తక్షణమే తహశీల్దార్ తగిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సి ఐ శ్రీనివాసరావుస్పందించి ఆర్డీవో రెడ్డి గున్నయ్య, తహశీల్దార్ సావిత్రిలకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకొన్నారు. రైతులు, అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తక్షణమే పంటలకు సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో గున్నయ్య మాట్లాడుతూ పారదర్శకంగా సర్వే చేస్తామని హామీనిచ్చారు.
* రైతుల ఆందోళనకు రాజకీయ రంగు...
నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళనకు రాజకీయ రంగు పులుముకున్నట్టు విమర్శలు వచ్చాయి. రైతుల చేస్తున్న ధర్నాకు వైకాపా నాయకురాలు రెడ్డి శాంతి రావడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆందోళన చేస్తున్న సమయంలో కొంతమంది రైతులు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ డౌన్.. డౌన్ అంటూ, మరికొంతమంది వై ఎస్ జగన్ జిందాబాద్ వంటి నినాదాలు చేయడంతో రాజకీయ రంగు ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

తిత్లీ తుపాను బాధితులను ఆదుకుంటాం
*విద్యుత్‌శాఖామంత్రి కళా వెంకటరావు
కొత్తూరు, అక్టోబర్ 14: ఇటీవల సంభవించిన తిత్లీ తుపాను బాధితులందరినీ ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్‌శాఖామంత్రి కిమిడి కళా వెంకటరావు హామీనిచ్చారు. ఆదివారం విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. విద్యుత్ పునరుద్దరణ, పనులు ఏ విధంగా సాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. వరద ముంపు గ్రామాల్లోని బాధితులను తక్షణమే ఆదుకొనేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
* ట్రాన్స్‌కోకు రూ.650 కోట్లు నష్టం...
తిత్లీ తుపాను కారణంగా ట్రాన్స్‌కోకు రూ.650 కోట్లు జిల్లాకు నష్టం వాటిల్లినట్టు మంత్రి కళా వెంకటరావు స్పష్టం చేశారు. ఎన్నడూ లేనివిధంగా తుపాను వల్ల మూడు వేల విద్యుత్ స్తంభాలు కూలినట్టు సమాచారం ఉందన్నారు. వీటి పునరుద్దరణ చర్యలు ఇప్పటికే తీసుకున్నామన్నారు. తుపాను బాధితులను ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్దమైందన్నారు. 5,800 మంది ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ పునరుద్దరణకు పనిచేస్తున్నారన్నారు. జీడిమామిడి పంటకు రూ.25 వేలు, వరి పంటకు రూ.20 వేలు, కూరగాయలు, పండ్ల తోటల నష్టాలకు హెక్టార్‌కు రూ.15 వేలు నష్టపరిహారం చెల్లిస్తున్నట్టు ఆయన తెలిపారు. తుపాను కారణంగా మరణించిన వారికి చంద్రన్న బీమా రూ.5 లక్షలతో పాటు అదనంగా ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, డీ ఎస్పీ స్వరూప, ఆర్డీవో రెడ్డి గున్నయ్య, వైస్ ఎంపీపీ బైరాగినాయుడు, టీడీపీ నాయకులు ఉన్నారు.