శ్రీకాకుళం

తర్రన్నకొండకు పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుబుజ్జిలి, నవంబర్ 19: మండలంలోని ఏకైక విష్ణు దేవాలయం ఉన్న తర్రన్నకొండకు సోమవారం భక్తులు పోటెత్తారు. సుభద్రాపురం, తమ్మినాయుడుపేట గ్రామాల మధ్య ఉన్న ఈ దేవాలయానికి మూడు మండలాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీకమాస ఏకాదశి పర్వదినం సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే కొండ కింద నుంచి మీద వరకు భక్తులు బారులు తీరారు. కొండపై ఉన్న విష్ణు దేవాలయంలో పూజలు నిర్వహించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అలాగే మండలంలోని మతలబుపేట, గోనిపాడు, సరుబుజ్జిలి, సరుబుజ్జిలి జంక్షన్, యరగాం, తెలికిపెంట, పురుషోత్తపురం, రొట్టవలస, కొత్తకోట, షలంత్రి గ్రామాల్లో కార్తీక ఏకాదశి సందర్భంగా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అఖండ భజనా కార్యక్రమాలు నిర్వహించారు. మతలబుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో భక్తులు 150 అరటిగెలలు వేలాడదీసి తమ మొక్కులను తీర్చుకున్నారు.

సంగమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు
వంగర, నవంబర్ 19: మండలంలోని సంగాంలో వెలిసిన ప్రసిద్ధ శ్రీసంగమేశ్వరస్వామి ఆలయానికి కార్తీకమాసం ఏకాదశి సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. పాలకొండ, రాజాం పట్టణాలకు మారుమూల సుదూరంగా ఉన్నప్పటికీ వంగర మండలంతో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన భక్తులు, అయ్యప్ప, శివ, భవానీ మాలాధారణ భక్తులు విశేషంగా విచ్చేసి స్వామి భజనలు, కీర్తనలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ప్రసిద్ధ సంగాం మూడు నదుల సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం సంగమేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఏకాదశి సోమవారం కావడంతో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సంగమేశ్వరస్వామిని మాజీ మంత్రి, వైకాపా నాయకులు తమ్మినేని సీతారాం దంపతులు, కుమారుడు తమ్మినేని చిరంజీవినాగ్‌లు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా వంగర, మగ్గూరు, బాగెంపేట, జగన్నాథవలస తదితర గ్రామాల్లోని రామాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
మీసేవ కేంద్రం ప్రారంభం
వంగర, నవంబర్ 19: మండలంలోని మద్దివలస గ్రామ పంచాయతీలో వైకాపా జిల్లా కార్యదర్శి ఉత్తరావల్లి సురేష్‌ముఖర్జీ నూతనంగా ఏర్పాటు చేసిన మీసేవా కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే పనులకు మీసేవా కేంద్రం ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈయనతో పాటు మీసేవా కేంద్రం నిర్వాహకులు రాంబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చక్కని విద్య అందించండి
వంగర, నవంబర్ 19: విద్యార్థులకు చక్కని విద్య అందించాలని ఎం ఈవో దుర్గారావు తెలిపారు. సోమవారం మండలంలోని మగ్గూరు ఎంపీపీ ఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి చిట్టిచేతులు... చక్కని రాతలపై మూడో తరగతి విద్యార్థుల పరీక్షలను పరిశీలించారు. తెలుగు, గణితంలో విద్యార్థులు ముందు ఉన్నారని, హిందీ సబ్జెక్టులో వెనుకబడి ఉండడాన్ని గమనించి వీరికి ప్రత్యేకమైన తరగతులు నిర్వహించాలని ఎం ఈవో ఉపాధ్యాయులకు సూచించారు.

పింఛన్ల కోసం విజ్ఞప్తి చేసిన వైకాపా నాయకులు
రాజాం, నవంబర్ 19: మండలంలోని ఎం.జె.వలస పంచాయతీ పరిధిలోని గొడ్డవలస గ్రామానికి చెందిన బూరాడ అప్పలనాయుడు, ముదిలి సత్యనారాయణ, చిలకలపల్లి చినరాము, బూరాడ నరసింహులు తదితరులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పింఛను మంజూరు కాకుండా కొంతమంది అడ్డకుంటున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వైకాపా నాయకులు లావేటి రాజగోపాల్, విజయకుమార్, ప్రసాద్, నరసింహులు తదితరులు సారధ్యంలో ఈ వృద్ధులను తీసుకొని ఎంపీడీవో బి.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ అర్హతలను నిర్ధారించిన తర్వాత పింఛన్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. అయినప్పటికీ 1100 నెంబర్‌కు ఫోన్ చేసి విషయం తెలుసుకోవాలని సూచించడంతో వైకాపా నాయకులు ఓకింత ఆగ్రహం చెందారు. ఆ నెంబర్‌కు ఫోన్ చేసి ఎంపీడీవో కార్యాలయంలో పరిష్కరించుకోవాలని చెబుతుందని, ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎంపీడీవో స్పష్టమైన హామీనివ్వడంతో వారంతా వెనుదిరిగారు.

ఘనంగా ఏకాదశి పూజలు
రాజాం, నవంబర్ 19: కార్తీకమాసంలో ఏకాదశి పర్వదినాన్ని రాజాం ప్రాంతంలోని వైష్ణవ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఠాణావీధి ప్రాంతంలోని రాజగోపాలస్వామి ఆలయం, రాజయ్యపేటలోని వరదరాజస్వామి ఆలయం, డోలపేటలోని ఉమాలక్ష్మీనారాయణ దేవాలయంతో పాటు రాజాం పట్టణంలోని సత్యం, శివం, సుందరం మందిరాల్లో కూడా ఏకాదశి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తులసి మాలలతో శ్రీమహావిష్ణువును పూజించారు. అలాగే రెండో కార్తీక సోమవారం కావడంతో శివాలయాల్లో కూడా విశేష పూజలను నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు చేశారు. అలాగే సత్యసాయిబాబా జన్మదినం 23వ తేదీ పురస్కరించుకొని ఏకాదశి నుంచే సాయి మందిరాల్లో కూడా విశేష కార్యక్రమాలు నిర్వహించారు.