శ్రీకాకుళం

జగన్‌కు మహిళల బ్రహ్మరథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, డిసెంబర్ 8: ప్రజా సంకల్పయాత్ర పేరిట వై ఎస్ జగన్మోహనరెడ్డి శనివారం కొయిరాల కూడలిలో బస చేసిన ప్రాంతం నుండే పాదయాత్రను ఆరంభించారు. జగన్‌ను చూసేందుకు మహిళలు ఎగబడడమే కాకుండా బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా వాహనాలు సైతం లెక్కచేయకుండా మహిళలు జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆశీర్వాదం అందుకునేందుకు పోటీ పడడం కన్పించింది. అలాగే పలువురు నేతలు వారి వారి ప్రాంతాల సమస్యలను వినతుల రూపంలో అందించారు. ఇళ్లు మంజూరు చేయాలని, స్థలాలు కేటాయించాలని, పింఛన్లు మంజూరు చేయాలని, దివ్యాంగుల సైతం జగన్‌కు విన్నపాలు చేసుకునేందుకు ముందుకు వచ్చారు. నవభారత్ కూడలి, బైపాస్ కూడల్లో భారీగా జనాలు తరలి రావడంతో రోప్‌పార్టీ సైతం వారిని నియంత్రించలేకపోయింది. అభిమానులు మేడలు, మిద్దెలెక్కి జగన్‌కు అభివాదం చేయడమే కాకుండా పార్కింగ్ చేసిన వాహనాలపై నుంచి కూడా ఫొటోలు తీసేందుకు యువత ఉత్సాహం చూపింది. యాతపేట వద్ద పెద్ద ఎత్తున జనం రోడ్డుపైకి వచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. ఎక్కడా ఎటువంటి ప్రసంగాలు చేయకుండా జగన్మోహనరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బైపాస్ కూడలిలో ఉన్న వై ఎస్ విగ్రహానికి మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పైడి త్రిమూర్తులు, ఎంకన్నగారి శ్రీను, పైడి సాంభమూర్తిలు ఉన్నారు. దారిపొడుగునా పాదయాత్రకు విశేష స్పందన లభించింది. మహిళలు హారతులివ్వగా అనేక చోట్ల నుండి జగన్‌పై పూలవర్షం అభిమానులు కురిపించారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, గొర్లె కిరణ్‌కుమార్, రెడ్డి శాంతి, బల్లాడ జనార్థనరెడ్డి, హేమమాలిని రెడ్డి, సనపల నారాయణరావు, మొదలవలస చిరంజీవి, చిన్న శ్రీను, మామిడి శ్రీకాంత్, పైడి భాస్కరరావు, సనపల నారాయణరావు, నక్క కృష్ణమూర్తి, బొడ్డేపల్లి సుధాకర్, జరుగుల్ల శంకరరావు, కల్లేపల్లి తిరుపతిరావు, నేతింటి నీలం తదితరులున్నారు. వీరంతా జగన్ పాదయాత్ర శ్రీకాకుళం నగరంలోని ఏర్పాటుచేసిన బస వద్దకు చేరుకొని వీడ్కోలు పలికారు.
ఎస్పీ కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించిన ఎస్పీ త్రివిక్రమ వర్మ
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 8: జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీలో భాగంలో ఎస్పీ డాక్టర్ సి ఎం త్రివిక్రమ వర్మ కార్యాలయంలో వివిధ విభాగాల పనితీరుపై సంబంధిత ఉద్యోగులతో సమీక్షించి దస్త్రాలను తనిఖీలు చేశారు. ఎ సెక్షన్ తనిఖీలు పూర్తిచేసిన అనంతరం కార్యాలయ రికార్డు గదుల్లో రికార్డులను భద్రపరుచు తీరును పరిశీలించారు. అదేవిధంగా కార్యాలయం సిబ్బంది అవసరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి కావల్సిన వసతులను సమకూర్చేందుకు సుముఖత తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆస్థులను పరిశుభ్రంగా ఉంచుతూ కాపాడుకోవాలని అన్నారు. దస్త్రాలను ప్రణాళికగా క్రమ పద్ధతిలో అమర్చిన తీరుపై సంతృప్తి చెందారు. ఈ పరిశీలనలో ఏ ఎస్పీ టి.పనసారెడ్డి, పరిపాలనాధికారి పివివి సత్యన్నారాయణ, ఎ సెక్షన్ సూపరింటెండెంట్ అడపా వెంకటరావు, సీనియర్ అసిస్టెంట్ ఎల్.బాలరాజు, ఎస్పీ సీసీ సురేష్‌బాబు, సిబ్బంది ఉన్నారు.
హౌసింగ్‌బోర్డ్ కాలనీలో ఇంటింటికి బీజేపీ
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 8: నగరంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ, నక్కవీధి, కంపోస్ట్‌కాలనీలో శనివారం ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ చల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపి మహిళా మోర్ఛా జాతీయ కార్యవర్గ సభ్యురాలు గొద్దు భాగ్యలక్ష్మి నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. గత 60 ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీ లు పాలించిన జీవితాలు కాలనీ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని కాలనీ వాసులు తెలియజేశారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, దాని వలన పందులు విచ్ఛలవిడిగా తిరుగుతూ ఇబ్బందిని కల్గిస్తున్నాయని కాలనీ వాసులు తెలియజేశారు. చల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమృత పథకం ద్వారా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు రూ. 45 కోట్లు శ్రీకాకుళం నగరానికి కేటాయించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మన జిల్లాలో అమలుచేస్తున్న పథకాల గూర్చి వివరించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సోషల్‌మీడియా కో కన్వీనర్ పసుపులేటి సురేష్, వేలిపూడి అహల్య, ఉమామ హేశ్వరరెడ్డి, అల్లు మల్లేశ్వరరావు, ఎస్‌వి రమణమూర్తి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో సేవారంగం విస్తృతిపై ప్రణాళికలు ఉండాలి
* కలెక్టర్ ధనంజయరెడ్డి

శ్రీకాకుళం, డిసెంబర్ 8:జిల్లాలో సేవారంగం విస్తృతికి కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక 2019-24 పై శనివారం పర్యాటకం, విద్య, వైద్య, సంక్షేమం తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రాబోయే 5 సంవత్సరాలలో జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలని అందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అవసరాలు గుర్తించే గ్రామాలకు విజన్ డాక్యుమెంట్ తయారుచేయడం జరుగుతుందని, ఆ వివరాలతో జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఆయన అన్నారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రతీ గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నారు. విజన్ డాక్యుమెంట్‌లో తాత్కాలిక అవసరాలు, దీర్ఘకాలిక అవసరాలు గుర్తించాలన్నారు. రాబోయే 1,2 సంవత్సరాలలో పూర్తిచేసే అంశాలు, 3,4,5 సంవత్సరాలలో పూర్తిచేయాల్సిన అంశాలను పొందుపర్చాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని 5 సంవత్సరాలలో అభివృద్ధికి అవసరమగు మానవవనరులు, ఆర్థిక వనరులను గుర్తించాలన్నారు. నిధుల అంచనాలు తయారుచేయాల్సిన అవసరం వుందని అన్నారు. సామాజిక స్థాయిలో మార్పు రావాలని ఆయన ఆదేశించారు. సేవారంగంలో భాగంగా పర్యాటక రంగాన్ని విశేషంగా అభివృద్ధి చేసేందుకు ఆస్కారం వుందని అన్నారు. కళింగ పట్నం, బారువ బీచ్‌లతో పాటు శివసాగర బీచ్ ఇతర సురక్షిత బీచ్‌లను గుర్తించాలని, తేలినీలాపురం, తేలుకుంచి వంటి పక్షి విహార కేంద్రాలు, ఆధ్యాత్మిక నిలయాలుగా ఉన్న దేవాలయాలు, బౌద్ధరామాలు, ఎన్టీ ఆర్ అడ్వంచర్ పార్క్, జగతిమెట్ట టూరిజం రిసార్స్, గిరిజన మ్యూజియం, వాటర్ ఫాల్స్ ఇతర ప్రకృతి రమణీయత కల్గిన ప్రదేశాలు అనేకం ఉన్నాయని, అచ్చటకు పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైన సౌకర్యాలు, టూరిజం ప్యాకేజీలు, రవాణా ప్యాకేజీలు వంటి అంశాలను పొందుపర్చాలని సూచించారు.

కేంద్ర పథకాలు ప్రజలకు తెలియజేయాలి
టెక్కలి, డిసెంబర్ 8: బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటుందని, వాటిని ప్రజలకు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అట్టాడ రవిబాబ్జీ అన్నారు. శనివారం టెక్కలిలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బీజేపీ ప్రారంభించిన పథకాలను తెలియజేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. గ్రామాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులను విడుదల చేస్తుందన్నారు. బూత్ కమిటీ స్థాయిలో కార్యకర్తలు బీజేపీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మినారాయణ, పట్టణ అధ్యక్షుడు కె.మణిబాబు, బీజేపీ నాయకులు డి.రాజ్‌కుమార్‌రెడ్డి, మీనాకుమార్, రాజు, శ్రీనివాసరావు, వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీతోనే అభివృద్ధి, సుస్థిరపాలన
మందస, డిసెంబర్ 8: కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ పేద, బడుగు, బలహీనవర్గాలు కోసం 126 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి సుస్థిర పాలన అందిస్తున్నారని బీజేపీ కేంద్ర కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ కణితి విశ్వనాధం అన్నారు. శనివారం నారాయణపురం, చిన్ననారాయణపురం, మల్లిన్నపేట ఉద్దాన గ్రామాల్లో ఇంటింటా బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ బీజేపీ ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రాలను అందించారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా విభజన చేస్తే సీ ఎం చంద్రబాబునాయుడు ఆ పార్టీకి మద్దతు పలికి, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న బీజేపీని నిందించడం అవమానకరమన్నారు. తిత్లీ తుపాన్‌తో నష్టపోయిన బాధితులు కోసం కేంద్ర ప్రభుత్వం 530 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని, ఆ నిధులను బాధితులకు సక్రమంగా అందించాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆదరించి చేయూతను ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆర్.చిరంజీవులు, కొంచాడ సురేషు, పున్నయ్య, హరిబాబు, హరిశంకర్, నీలయ్య తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు, సేవాభావం పెంపొందించుకోవాలి
మందస, డిసెంబర్ 8: పోలీసులు ప్రజలకు సేవాభావం, సత్సంబంధాలు పెంపొందించుకోవాలని కాశీబుగ్గ డి ఎస్పీ ప్రసాదరావు అన్నారు. శనివారం మందస పోలీసుస్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించి, స్టేషన్ రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసారు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లోని ప్రజలతో సేవాభావం అలవరుచుకొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. హెల్మట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాలకు గురవుతున్నారని, హెల్మట్ ధరించాలన్నారు. డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా విధిస్తామన్నారు. ఈయనతోపాటు సోంపేట సీ ఐ సన్యాసినాయుడు, మందస ఎస్ ఐ నాగరాజులున్నారు.
తిత్లీ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
మందస, డిసెంబర్ 8: తిత్లీ తుపాన్ వల్ల సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్దాన అభివృద్ధి వేదిక అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.రామారావు, గాంధీయవర్మలు శనివారం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలను మాఫీ చేయాలని, మత్స్యకారులకు బోట్లు, వలలు అందజేయాలని, ఉద్దానంలో జీడి,కొబ్బరి, మామిడి మొక్కలను అందజేసి, రాయితీపై ఎరువులు, క్రిమిసంహారకమందులను అందజేయాలని, నష్టపోయిన బాధితరైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, మొక్కలను పెంచేందుకు రైతులకు 30 వేల రూపాయలు చెల్లించాలని, ఉద్దాన ప్రాంతాల్లోని బాధిత కుటుంబానికి ప్రతి నెల 5 వేల రూపాయలు, నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని కోరారు. వారితోపాటు రామారావు, బి.లక్ష్మణరావు, జీవన్‌రావు, కుమారస్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బోరుభద్రలో వనభోజనాలు
సంతబొమ్మాళి, డిసెంబర్ 8: మండలంలో బోరుభద్రలో కార్తీకమాసం అనంతరం కార్తీకవనభోజనాలు ఘనంగా జరిగాయి. పలు గ్రామాలకు కూడలి ప్రాంతమైన బోరుభద్రలో వేలాది మంది భక్తులు కార్తీకమాసం వనభోజనానికి తరలి వచ్చారు. గ్రామస్తులందరూ నెలరోజులు పాటు కార్తీకమాసం పర్వదినాలు భక్తిశ్రద్దలతో జరిపి శనివారం వనభోజనాలు నిర్వహించారు.

రాష్ట్ర నెట్‌బాల్ పోటీలకు మర్రిపాడు విద్యార్థిని
సంతబొమ్మాళి, డిసెంబర్ 8: మండలంలో మర్రిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్.హిందు రాష్టస్థ్రాయి నెట్‌బాల్ పోటీలకు ఎన్నికైనారు. ఈ నెల 9వ తేది నుంచి 11వ తేది వరకు విశాఖపట్నం డివిజన్‌లో జరగబోవు రాష్టస్థ్రాయి పోటీల్లో పాల్గొంటారని, ఈ ఎంపిక పట్ల మండల పి ఎసి ఎస్ అధ్యక్షుడు రాంప్రసాదరావు, హెచ్ ఎం మల్లేసు, పి ఇటి వెంకటరమణ, ఉపాధ్యాయులు అభినందనాలు తెలిపారు.
ఆకులసత్తివానిపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
సంతబొమ్మాళి, డిసెంబర్ 8: మండలంలో నర్శిపురం పంచాయతీ, ఆకులసత్తివానిపేట గ్రామంలో మంచినీటి బోర్లు మరమ్మతులు జరిపారు. శనివారం పంచాయతీ ప్రత్యేకాధికారి, ఎం ఇవో చిన్నవాడు ఆధ్వర్యంలో పాడైన మంచినీటిబోర్లుకు మరమ్మతులు జరిపి తాగునీటి సమస్యను పరిష్కారించేందుకు కృషి చేసారు. మంచినీటి బోరు పాడవ్వడంతో ఎప్పటి నుంచో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు రప్పించి బోర్లుకు మరమ్మతులు చేయించారు. పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర, గ్రామస్తులున్నారు.

దిగుబడి తగ్గిన వరి
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 8: తిత్లీ తుపాన్ కారణంగా పంట దిగుబడి 70 శాతం తగ్గిందని ఏవో నర్శింహమూర్తి తెలిపారు. శనివారం మండలంలోని బూర్జపాడు, కేసుపురం, కోఠారి, పాయితారి, ధర్మపురం, బిర్లంగి, తేలుకుంచి గ్రామాల్లో పంట కోత ప్రయోగాన్ని నిర్వహించారు. ఒక్కో ఎకరాకు 25 బస్తాలు రావాల్సి ఉన్నప్పటికి 8 నుంచి 10 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చిందని ఏవో తెలియజేసారు. ఈ దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ పంట కోత వివరాలను గణంకాశాఖ ద్వారా బీమా సంస్థలకు పంపించడం జరుగుతుందన్నారు. బీమా ప్రీమియం చెల్లించినవారికి ఆయా సంస్థలు ద్వారా నష్టపరిహారం వస్తుందన్నారు.

భూములను భూధార్‌లో నమోదు చేయాలి
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 8: రైతులు తమ భూములను భూధార్‌లో నమోదు చేసుకోవాలని తహసీల్థార్ సురేషు తెలిపారు. శనివారం తులసిగాం గ్రామంలో తహసీల్థార్ ఆదేశాలు మేరకు రెవెన్యూఅధికారులు పర్యటించి రైతుల భూముల వివరాలను నమోదు చేసారు. ఇలా నమోదు చేయడం వల్ల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలు, నష్టపరిహారం పంపిణీకి ఉపయోగపడతాయని, రెవెన్యూరికార్డుల్లో కూడ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు దొర, పాత్రో, తవిటయ్య, ఆర్ ఐ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

క్యాన్సర్ రోగికి ఆర్థికసహాయం
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 8: కవిటి మండలంలోని దూగానపుట్టుగ గ్రామానికి చెందిన నీలవేణికి 10 వేల రూపాయలు ఆర్థికసహాయాన్ని స్థానికులు అందించారు. దూగానపుట్టుకు చెందిన హేమరాజు, జాడుపూడికి చెందిన ఎల్.కామరాజులు ఈ ఆర్థికసహాయాన్ని అందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని బంధువులు తెలిపారు.
జనసేనతోనే యువతకు భవిత
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 8: జనసేన అధికారంలోకి వస్తే యువతకు భరోసా లభిస్తుందని పలాస మున్సిపల్ చైర్మన్, జనసేన నాయకుడు కోత పూర్ణచంద్రరావు అన్నారు. శనివారం పల్లివూరు పంచాయతీ, దుక్కవానిపేటలో ఎన్ ఆర్ ఐలు ఏర్పాటు చేసిన పవర్‌బోర్ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ బోరు నుంచి పైపులైన్ ద్వారా దుక్కవానిపేట, మురిపింటవానిపేట, నూకలవానిపేట, గొల్లవీధి గ్రామాలకు తాగునీరు సరఫరా జరుగుతుందన్నారు. జనసేన తరంగం కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. పవన్‌కల్యాణ్ సిద్థాంతాలకు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆకర్షితులవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బి.శ్రీనివాసరావు, విశ్రాంత ఎస్ ఐ కృష్ణారావు, తాతయ్య, హరికృష్ణ, సోమేశ్వరరావు, పుష్ప, సుమన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
చెత్త సంపద కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 8: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో తిరుమలరావు అన్నారు. శనివారం మండలపరిషత్ సమావేశమందిరంలో కార్యదర్శులు, ఫీల్డ్ ఆసిస్టెంట్‌లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. మండలంలో ఇప్పటి వరకు ఆరు చెత్త నుంచి సంపద కేంద్రాలు పనిచేస్తున్నాయని, మరో 24 వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయన్నారు. పంచాయతీల్లో ఆదాయం పెంపొందించే దిశగా ఈ కేంద్రాల పనులను పర్యవేక్షించి పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్థార్ రమణయ్య, ఇవో పి ఆర్‌డి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తిత్లీ తుపాన్ బాధితుల సహాయార్థం ఆటపాట
పలాస, డిసెంబర్ 8: తిత్లీ తుపాన్ బాధితుల సహాయార్థం న్యూస్‌ఫోకస్ ఆధ్వర్యంలో ఆటపాట కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగం నుంచి కళాకారులు విచ్చేసి తమ గానమాధుర్యంతో తిత్లీ తుపాన్ ద్వారా ఉద్దానానికి జరిగిన నష్టాన్ని కళ్లుకుకట్టినట్లు తమ ఆటపాటల ద్వారా వివరించారు. కళాకారులు అలపించిన గీతాలను పలువురు హృదయాలను కలచివేసింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, కౌన్సిలర్లు దువ్వాడ శ్రీకాంత్, మల్లా కృష్ణారావు, జిల్లా టీడీపీ వాణిజ్యవిభాగపు అధ్యక్షుడు టి.రవిశంకర్‌గుప్తా తమ శక్తి మేరకు బాధితులకు విరాళాలను ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకోవడమే లక్ష్యమని, అందుకు గాను న్యూస్‌ఫోకస్ వారు ముందుకు వచ్చి ఈ మ్యూజికల్‌నైట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రంగం కళాకారులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలను తమ ఆటపాటలు ద్వారా వివరిస్తూ సినిమా హీరో హీరో కాదని, సాటి మనిషికి సహాయం చేసేవాడు, కన్నీటికి తుడిచేవాడు హీరో అని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యూస్‌ఫోకస్ ఛానల్ అధినేతలు కొంచాడ రవికుమార్, నేతాజీ, సీనియర్ జర్నలిస్టులు రామకృష్ణ, మహారాణా, జయంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద విద్యార్థులకు దుస్తులు పంపిణీ
కొత్తూరు, డిసెంబర్ 8: మండల కేంద్రం కొత్తూరులోని ప్రముఖ వస్త్ర వ్యాపారి మల్లా విశ్వనాధం, లక్ష్మీ దంపతులు కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్తీకమాసం చివరి రోజు పాఢ్యమిని పురస్కరించుకొని విశ్వనాధం తల్లిదండ్రులైన మల్లా చంద్రయ్య, ఆరుద్రమ్మల జ్ఞాపకార్థం వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. నిరుపేదల అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు, నారాయణరావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కషాయ ఎరువులతో పురుగులు నివారణ
కొత్తూరు, డిసెంబర్ 8: ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రబీ సీజన్‌లో సాగవుతున్న మొక్కజొన్న పంటకు సోకిన కత్తెర పురుగు నివారణకు కషాయ ఎరువులతోనే సాధ్యమని వ్యవసాయశాఖ క్లస్టర్ యాక్టివిస్ట్ సూర్యనారాయణ అన్నారు. మండలంలోని కర్లెమ్మ రెవెన్యూ పరిధిలోని చోడవరపు హరిదాసు అనే రైతు మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు సోకడాన్ని గుర్తించి ఈ పురుగు నివారణకు పంట పొలంలోనే వివిధ రకాల ప్రకృతి వ్యవసాయ సామాగ్రీతో కషాయాలను తయారు చేసి ప్రత్యక్షంగా అవగాహన కల్పించినట్టు సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సీ ఆర్‌పీలు, ఎస్ ఆర్‌పీలు, పలువురు రైతులున్నారు.
ఎండిన చెట్టుతో పొంచి ఉన్న ప్రమాదం
కొత్తూరు, డిసెంబర్ 8: మండలంలోని ప్రధాన రహదారి పాలకొండ-హడ్డుబంగి రోడ్డుపక్కన మహాసింగి వద్ద ఉన్న ఎండి చెట్టుతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై వచ్చీపోయే వాహనాలపై ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ చెట్టు కింద కొందరు నివాసులు కూడా చెట్టుకొమ్మలు విరిగిపోతాయేమోనని భయాందోళనల చెందుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఈ చెట్టును తొలగించాలని కోరుతున్నారు.
శివాలయాల వద్ద అన్నసమారాధనలు
కొత్తూరు, డిసెంబర్ 8: మండలంలోని కర్లెమ్మ, కొత్త కొత్తూరు గ్రామాల్లోని శివాలయాలు వద్ద శనివారం అన్నసమారాధన కార్యక్రమం స్థానికులు నిర్వహించారు. కార్తీకమాస చివరి రోజు పాఢ్యమి కావడంతో ఆలయాల వద్ద కార్తీకమాసమంతా పూజలు చేసిన భక్తులకు అన్నసమారాధన చేశారు. మాజీ సర్పంచ్‌లు ఎద్దు కన్నంనాయుడు, ఎం.శంకరరావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎద్దు గోపాలదాసునాయుడు, స్థానిక పెద్దల ఆధ్వర్యంలో ఈ సమారాధన నిర్వహించారు. కొత్త కొత్తూరు గ్రామంలో స్థానికులు భక్తులు అన్నసమారాధన చేశారు.

ప్రతిభ కుటుంబాన్ని పరామర్శించిన కోండ్రు
సంతకవిటి, డిసెంబర్ 8: మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుటుంబాన్ని మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ శనివారం ప్రతిభాభారతి సొంత గ్రామమైన కావలి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల ప్రతిభా భారతి తండ్రి కొత్తపల్లి పున్నయ్య హఠాన్మరణానికి గురైన సంగతి తెలుసుకున్న కోండ్రు సంతాపం తెలిపారు. అలాగే ప్రతిభాభారతి ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాజాం జెడ్పీటీసీ జడ్డు ఉషారాణి, కరణం శ్రీను తదితరులున్నారు.

భారీ అన్నదానాలు
ఎల్ ఎన్‌పేట, డిసెంబర్ 8: కార్తీకమాసం ముగియడంతో శనివారం పాఢ్యమి సందర్భంగా మండలంలోని వివిధ దేవాలయాల ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమాలను నిర్వాహకులు నిర్వహించారు. యంబరాం జంక్షన్ సమీపంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణం, కోయిలాం శివాలయం ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆధునిక యంత్ర పరికరాలతో వరి కోతలు
ఎల్ ఎన్‌పేట, డిసెంబర్ 8: ఆధునిక యంత్ర పరికరాలతో వరి కోతలను చేపడుతున్నారు. ప్రస్తుతం కూలీల కొరత కారణంతో రైతలు పండించే వరి పంటలను కోతలు చేపట్టేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వరి కోత యంత్రాలను సంబంధించి యజమానులు తీసుకొచ్చి కోతలు చేపడుతున్నారు. కూలీలు అధిక ధరలు డిమాండ్ చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరానికి డిమాండ్‌ను అనుసరించి రూ.3 వేలు నిర్దేశిస్తున్నారు. దీంతో యంత్రాల వైపు రైతులు మొగ్గుచూపడం జరుగుతుందన్నారు. వరి యంత్రాలతో పాటు చిన్న చిన్న కోత యంత్రాలను కూడా వినియోగిస్తున్నారు. వీటివల్ల సమయం, ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని రైతులు భావిస్తున్నారు.

కోపం వల్లే విచక్షణ కోల్పోతాం
పాలకొండ, డిసెంబర్ 8: కోపం వల్లన వ్యక్తి విచక్షణ కోల్పోయి తప్పులు చేయడానికి అవకాశం ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరు శాంతగుణం అలవర్చుకోవాలని సత్యసాయి ప్రతినిధి ఎన్.వి.రమణ పేర్కొన్నారు. శనివారం పాలకొండ సబ్‌జైలులో ఖైదీల్లో పరివర్తన కోసం జ్ఞానబోధ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో కోపం వల్లన వ్యక్తి గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని, దీనివల్ల విశ్వామిత్రుడి వంటి మహర్షి ఎంతో నష్టపోయాడన్నారు. అందువల్లన ప్రతి ఒక్కరు సత్యసాయిబాబా చెప్పినట్టు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలు పాటించాలని బోధించారు. అలాగే స్థానిక ఇందిరానగర్ కాలనీలో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో కూడా జ్ఞానబోధ సభ జరిగింది. ఈ సందర్భంగా బి.చిన్నంనాయుడు, డి. ఆరంజ్యోతి, యు.మహేశ్వరి, టి.దుర్గాబాయి మాట్లాడుతూ పలు ఆధ్యాత్మిక విషయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సబ్‌జైలు సూపరింటెండెంట్ వి.వి.రమణ, విశ్రాంత సీ ఐ స్వామి, సాయి భక్తులు పాల్గొన్నారు.
యాత్రా దర్శనంతోనే విజ్ఞానం, వినోదం
సరుబుజ్జిలి, డిసెంబర్ 8: విహార యాత్రా దర్శనాలతోనే విద్యార్థులు విజ్ఞానం, వినోదం కలుగుతాయని రొట్టవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ ఎం ఎన్.కృష్ణ పేర్కొన్నారు. శనివారం రాజీవ్ విద్యామిషన్ సౌజన్యంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో విహారయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు శాలిహుండంలోని బౌద్దారామాలు, కళింగపట్నం లైట్‌హౌస్, సముద్రతీరాన్ని సందర్శించారు. అలాగే విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సమాజసేవే పరామర్థం కావాలి
సరుబుజ్జిలి, డిసెంబర్ 8: విద్యార్థుల అంతిమ లక్ష్యం సమాజసేవ కావాలని, తద్వారా నైతిక సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని సత్యసాయిబాబా సేవా సంస్థల జిల్లా యూత్ జాయింట్ కో- ఆర్డినేటర్ రమేష్‌సాహు అభిప్రాయపడ్డారు. సరుబుజ్జిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో షలంత్రి గ్రామంలో శనివారం ప్రత్యేకసేవా శిబిరంలో ఆయన పాల్గొని మట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు పెంపొందించకోవాలన్నారు. మాజీ జెడ్పీటీసీ శివ్వాల సూర్యనారాయణ మాట్లాడుతూ సమాజానికి మేలు చేసేలా విద్యార్థులు సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి దుగ్గివలస రాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విజయ, సాగరిక తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు షలంత్రి గ్రామంలో ఎన్ ఎస్ ఎస్ వలంటీర్లు కాలువలు శుభ్రం చేశారు. చెరువులు, బావుల్లో క్లోరినేషన్ చేశారు.
పాలకొండలో ఇరువురిని బీజేపీ నుంచి తొలగింపు
పాలకొండ, డిసెంబర్ 8: భారతీయ జనతాపార్టీ పాలకొండ పట్టణానికి సంబంధించి అర్బన్ మండలాధ్యక్షులుగా వ్యవహరించిన కందుల జగన్నాథకుమార్, బీజేపీ ట్రేడర్స్ కన్వీనర్‌గా ఉన్న ఊణ్ణ వెంకటరమణమూర్తి(పెదబాబు)లను ఆ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కోటగిరి నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. గత కొనే్నళ్లుగా వీరివురు నాయకులు పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారని రాష్ట్ర నాయకులు పాలకొండ వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే సందర్భంలో కూడా వీరు హాజరుకాకపోవడంతో ఇరువురిని పార్టీ పదవుల నుంచి తప్పించినట్టు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రతి పల్లెకు సీసీ రహదారి
*ప్రభుత్వ విప్ రవికుమార్
సరుబుజ్జిలి, డిసెంబర్ 8: ఆమదాలవలస నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీతో సహా ప్రతి పల్లెకు సీసీ రహదారి కల్పించడమే తన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. శనివారం మండలంలోని షలంత్రి గ్రామ పంచాయతీ బురుడువలస గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా బురిడివలస గ్రామంలోని కుమ్మరివీధి, దళితవాడ ప్రధాన వీధుల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటిని విప్ రవికుమార్ సందర్శించి ప్రభుత్వ పథకాల పనితీరు, సంక్షేమ పథకాల మంజూరు, లోపాలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కుమ్మరివీధిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా అక్కడే ఉన్న మండల ప్రత్యేకాధికారి ఎం.విజయభాస్కర్‌ను ఆదేశిస్తూ తక్షణమే సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో పలు శాఖలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గంలోని పొందూరు, బూర్జ, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాలతో పాటు ఆమదాలవలస మున్సిపాలిటీలో ఈ నాలుగున్నర ఏళ్లలో పక్కా రహదారులు ఏర్పాటు చేయడమైందన్నారు. సరుబుజ్జిలి మండలంలోని బప్పడాం, మిర్తివలస, కొండవలస గ్రామాలకు బీటీ రహదారులు మంజూరై టెండర్ల దశలో ఉన్నాయన్నారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు పక్కా రహదారులు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించడమైందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, గోవిందరావు, కూన గణపతిరావు, పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కులమతాలకతీతంగా వన సమారాధన
రాజాం, డిసెంబర్ 8: రాజాం అమ్మవారి కాలనీ ప్రాంతంలోని ఏ ఎం ఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం 500 కుటుంబాలతో కులమతాలకతీతంగా వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెంకి గౌరీశ్వరరావు, పెంకి చైతన్యకుమార్, లెంక శ్రీహరి, ఎ.వెంకటనాయుడు తదితరులు సారధ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైజ్ఞానిక రంగాలకు సంబంధించి క్విజ్ పోటీలు నిర్వహించారు. వన సమారాధనలు కులాల ప్రాతిపదికంగా సాగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా ఈ సమారాధన చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
చెరకు రైతులు సమస్యలపై త్వరలో ఉద్యమం
రాజాం, డిసెంబర్ 8: పాలకొండ డివిజన్‌లో చెరకు రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏపి రైతు సంఘం జిల్లా ప్రతినిధులు బుడితి అప్పలనాయుడు, పాలవలస రామినాయుడులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై డివిజన్‌లోని చెరకు సాగు చేసే రైతులను ప్రత్యేకంగా సమీకరించి ఉద్యమానికి అంకురార్పణ చేస్తామన్నారు. రైతుల బాధలు తెలుసుకొని సమస్యలను అధ్యయనం చేశామన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ప్రభుత్వం దిగి వచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.
నారాయణ తిరుమలలో పోటెత్తిన భక్త జనం
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 8: నగరంలోని పి ఎన్ కాలనీలో ఉన్న నారాయణ తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తజనం పోటెత్తారు. కార్తీకమాసం ముగింపు పోలిపాఢ్యమి సందర్భంగా శనివారం కావడంతో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేకువ జామునుంచే భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రధాన అర్చకులు గురుగుబిల్లి శ్రీనివాసరావుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర నామ పూజలు కూడా జరిపించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గోవింద నామస్మరణంతో ఆలయం మార్మోగింది. కొంతమంది భక్తులు ప్రత్యేకంగా ప్రదక్షణలు కూడా చేశారు. ముందుగా భక్తులు కార్తీక దీపారాధన పూర్తిచేసుకొని స్వామివారిని దర్శించుకున్నారు.