శ్రీకాకుళం

అభిమానుల మధ్య కొనసాగిన జనగ్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 9: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం మండలంలో కొనసాగింది. నగర శివారు ప్రాంతమైన అయ్యప్పస్వామి టెంపుల్ నుండి ప్రారంభమైన జగన్ పాదయాత్ర అభిమానుల మద్య కొనసాగింది. ఎక్కువగా సెల్ఫీలు కోసమే ప్రాధాన్యత ఇవ్వడం కన్పించింది. అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి ప్రారంభమైన పాదయాత్ర కొత్తరోడ్ జంక్షన్ మీదుగా పాలకొండ రోడ్‌లో రాగోలు సమీపంలోని దూసి రోడ్ వరకు కొనసాగించారు. రూరల్ మండలంలో జరిగిన పాదయాత్రలో పరుగులు తప్ప ఎక్కడా ఆగిన సంఘటనలు కూడా లేవు. అభిమానులు కలవాలన్నా దగ్గరకు రానివ్వకపోవడం విశేషం. ఒక్క మహిళలను, విద్యార్థులను, చిన్నారులను మాత్రమే దగ్గరకు చేర్చుకొని ముద్దాడడం, సెల్ఫీలు దిగడం కన్పించింది. కేశవరెడ్డి స్కూల్ బాధితులు జగన్మోహనరెడ్డిని కలిసి తాము కట్టిన డిపాజిట్‌ల మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. అలాగే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని సాదారణ ఉపాధ్యాయులు మాదిరగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అంగన్వాడీ న్యూట్రీషన్లుకు కూడా జగన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జగన్ పాదయాత్రలో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి, ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజవర్గం ఇన్‌ఛార్జ్ దువ్వాడ శ్రీను, వరుదు కళ్యాణి, డిసి ఎం అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, జెడ్‌పిటిసీ చిట్టి జనార్థనరావు, తమ్మినేని చిరంజీవి నాగ్, ధర్మాన రామ్‌మనోహరనాయుడు, మామిడి శ్రీకాంత్, మూకళ్ల తాతబాబు, అంబటి శ్రీను, గంగు నరేంద్ర, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. పాలకొండ రోడ్‌లో ఇరుకు రోడ్ కావడంతో జగన్ పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్ స్తంబించి పోయింది.

ఆదిత్యుని దర్శనానికి బారులు తీరిన భక్తులు
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 9: ప్రత్యక్ష నారాయణుడు శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం పూర్తయి చివరి వారం కావడంతో ఆదిత్యుని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ప్రతీ వారం మాదిరిగానే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉచిత దర్శనం క్యూలైన్‌లోనే భక్తుల రద్దీ కన్పించింది. ముందుగా భక్తులు తల నీలాలను సమర్పించి ఇంద్ర పుష్కరిణిలోస్నానమాచరించి దర్శనం కోసం వేచియుండడం కన్పించింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కల్గకుండా ఆలయ ఈవో పుష్పనాధం అన్ని ఏర్పాట్లు చేశారు.

జగన్మోహనరెడ్డి విమర్శలు సరికావు
* టీడీపీ పూర్వపు అధ్యక్షుడు నారాయణమూర్తి
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 9: వై ఎస్ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు సరికావని టీడీపీ పూర్వపు అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంశధార, మడ్డువలస ప్రాజెక్ట్‌లు తెలుగుదేశం హాయాంలోనే ప్రారంభించడం జరిగిందని, దానిని వై ఎస్ హాయాంలో పూర్తిచేసినట్లు గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. జిల్లాలో తిత్లీ తుఫాన్ కారణంగా అపార నష్టం వాటిల్లితే పక్క జిల్లాలోనే ఉండి బాధితులను పరామర్శించేందుకు కూడా రాని జగన్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించడం సరికాదన్నారు. పాదయాత్ర ప్రజల కోసం కాదని కేవలం అధికారం కోసమేనని పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌వి రమణమాదిగ, సింతుసుధాకర్, సాధు చిన్ని కృష్ణమనాయుడు, ప్రధాన విజయరాం తదితరులు పాల్గొన్నారు.

వేట నిషేధం నాటి ఆర్థిక సహాయాన్ని అందించాలి
పోలాకి, డిసెంబర్ 9: మండలంలో గల సముద్రతీర ప్రాంతాలు అయినటువంటి రాజారాం పురం, అంపలాం, కొవిరిపేట, గుప్పిడిపేటతో పాటు మరికొన్ని గ్రామాల్లో నివసిస్తున్న మత్స్యకారులకు ఈ సంవత్సరం ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వేట నిషేదం ప్రభుత్వం ఆదేశించిందని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొమర ఎర్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లి పోషణ గడుపుకుంటున్న మత్స్యకారులు సుమారు 375 మంది ఉన్నారని గుర్తించారని వారికి ఒక్కొక్కరికి రూ.4వేలు చొప్పున ప్రభుత్వం నుండి రావల్సివున్నప్పటికి ఇంతవరకు సుమారు వంద మందికి ఈ సొమ్ములు వారివారి బ్యాంక్ అకౌంట్‌లో వారి సొమ్ము జమయినట్లు తెలిపారు. మిగిలిన ఉన్న 275 మందికి నేటికి ఆ ఆర్థిక సహాయం అందలేదని ఆయన తెలిపారు. కనుక సంబంధిత అధికారులు వీటిపై చొరవ తీసుకొని మిగిలియున్న వారందరి బ్యాంక్ అకౌంట్‌లో వారి వారి సొమ్మును జమచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కొమర పద్మ, మూర్తి, రాజారావు, కృష్ణతో పాటు మరికొంతమంది మత్స్యకారులున్నారు.

రాజారాంపురం పికినిక్‌కు బారులు తీరిన ప్రజలు
పోలాకి, డిసెంబర్ 9: మండలంలో గల రాజారాం పురం గ్రామసమీపాన జీడితోటల్లో కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా ఐదవ వారం పికినిక్ కావడం వలన పలు ప్రాంతాల నుండి వచ్చిన జనాలతో తోటలు నిండిపోయాయి. భోజనం చేసిన అనంతరం అందరూ సముద్రస్నానాలు చేసి ఎనలేని ఆనందాన్ని పొందినట్లు పలువురు తెలిపారు. కార్తీకమాసం పూర్తయిన అనంతరం సముద్రస్నానం చేయడం ఎంతో మంచిదని వారు తెలిపారు. ఇక్కడ వచ్చిన వారి జాగ్రత్తలు విషయంలో పోలీస్‌శాఖ సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్సై బంటు అప్పారావు తెలిపారు. ఈ జాగ్రత్తలో భాగంగా మద్యం సేవించడం నిషేదమని, పేకాటలు ఆడేందుకు ఎటువంటి వెసులుబాటులు ఇవ్వలేదని, సముద్రంలోనికి వెళ్లకుండా స్థానికుల సహాయ సహకారాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీలు రమేష్, రమణమూర్తిలతో పాటు మరికొంత మంది సిబ్బంది, గ్రామయువకులున్నారు.

ఇంటింటి బీజేపీ ముమ్మర ప్రచారం
పొందూరు, డిసెంబర్ 9: రాష్ట్ర భారతీయ జనతాపార్టీ పిలుపుమేరకు ఇంటింటా బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాల విస్తృత ప్రచారంలో భాగంగా మండలం రెడ్డిపేట గ్రామంలో ఆదివారం మండల భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇంటింటా పార్టీ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విపులంగా వివరించారు. పేదల సంక్షేమ పథకాలు కొరకు కేంద్ర ప్రభుత్వం అందించే పేదలకు చేయూత, అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమవేనంటూ టీడీపీ సర్కార్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని, బీజేపీ సర్కార్ ప్రజల పక్షాన నిలిచి అందరికి అందుబాటులో ప్రభుత్వ పథకాలు అందిస్తుందని బీజేపీ మండలాధ్యక్షులు గురుగుబిల్లి తేజేశ్వరరావుతో కూడిన బృందం ఇంటింటా ప్రచారం చేపట్టింది. కమలపు జెండా చేతపట్టి పురవీధుల్లో బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నినాదాలతో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ నాయకులు బండారు జయప్రతాప్, జిల్లా నేత బలివాడ సత్యన్నారాయణ, గుడివాడ జయరాం, పార్టీ ప్రధాన కార్యదర్శులు వాండ్రంగి శ్రీనివాసపట్నాయిక్, పేరూరు శ్రీనివాసరావు, కూన శ్రీరామ్మూర్తి, దుమ్మెద రామచంద్రరావు, కొంచాడ నాగేశ్వరరావు, పల్ల వెంకయ్య, వారణాసి వెంకటరావు, దుబాకుల చిట్టిబాబు, తండాపు లక్ష్మణరావు, కాలెపు భైరవి, మహిళామోర్ఛా అధ్యక్షురాలు బొడ్డేపల్లి వరహాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆనందపురంలో ఇంటింటికి బీజేపి
ఎచ్చెర్ల, డిసెంబర్ 9: నియోజకవర్గం పరిథిలోని ఆనందపురం గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ఆదివారం కన్వీనర్ సువ్వారు వెంకట సన్యాసిరావు నేతృత్వంలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్థానికులకు వివరించారు. ముద్ర రుణాలు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌లు, మరుగుదొడ్ల నిర్మాణాలకు స్వచ్ఛ్భారత్ నిధులు కేంద్ర ప్రభత్వమే అందించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని సూచించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కూడా అధిక సంఖ్యలో నిధులు కేటాయించిందన్నారు. ఉపాధి హామీ పథకం వేతనాలను కూడా మరింత పెంచిందని వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. కిశాన్ మోర్ఛా రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని గోవిందరావు, వజపర్తి రఘరాం, జల్ల కృష్ణ, వావిలపల్లి చందు, చౌదరి ధనలక్ష్మి తదితరులు ఇంటింటికి బీజేపి కార్యక్రమంలో కరపత్రాలు పంపిణీ చేశారు.

దుర్గ పుట్ట రోడ్‌ను నిర్మించుకున్న రైతులు
ఎచ్చెర్ల, డిసెంబర్ 9: ఆక్రమణలను తొలిగించి పలు గ్రామాలును అనుసంథానం చేసే గోర్జిని రోడ్‌గా నిర్మించాలని కుశాలపురంకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్ నుంచి స్థానిక వీ ఆర్వో వరకు వినతులు అందించారు. అధికారులు స్పందించకపోవడంతో రైతులంతా ముందుకు వచ్చి దుర్గ పుట్టకు వెళ్లే రోడ్‌ను ఆదివారం నిర్మించుకున్నారు. ఈరోడ్ కుశాలపురం, ఇండస్ట్రీయల్, ఫరీద్‌పేట, ఇబ్రహీం బాద్, రామ్‌దాస్‌పుర అగ్రహారం గ్రామాలను అనుసంథానం చేస్తుంది. రోడ్‌ను నిర్మించకుండా రైతులకు ఆటంకపర్చేలా ఒక రైస్‌మిల్లు యజమాని గోర్జిని ఆక్రమించి నిర్మాణం చేపట్టిని విషయం అధికారుల దృష్టికి పైడి ఆనందరావు, మాజీ ఉప సర్పంచ్ పైడి మురళి, శ్రీనివాసరావు, ప్రసాద్ తదితర రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై తహశీల్దార్ విచారణ జరిపించి ఆక్రమణలను తొలగిస్తామని స్పష్టం చేసి నప్పటికి ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తికాలేదు. అధికారులపై అభద్రతా భావంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎటువంటి ఆక్రమణలకు గురికాకుండా గోర్జిని రోడ్‌గా నిర్మించుకున్నారు. దీనిపై స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

స్వయం శక్తి సంఘాలు బలోపేతం కావాలి
సారవకోట, డిసెంబర్ 9: గ్రామాలలో గల స్వయం శక్తి సంఘాలు మరింత బలోపేతం కావాలని మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సనపల అనిత పిలుపునిచ్చారు. మండలంలోని గోవర్థనపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. సంఘాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక బృందాలు విస్తృతంగా పర్యటిస్తున్నాయన్నారు. ఈ ప్రక్రియలో స్వయంశక్తి సంఘాల మహిళలు సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు. సంఘాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగ పర్చుకొని కుటుంబాలను ముందుకు నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పరిథిలో గల స్వయంశక్తి సంఘాల మహిళలు ప్రత్యేక బృందాల సభ్యులు పాల్గొన్నారు.

తర్లి పాఠశాలలో వీడని తిత్లీ నష్టం
సారవకోట, డిసెంబర్ 9: మండలంలోని తర్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు తిత్లీ తుఫాన్ నష్టం నీడలు ఇప్పటికి వీడలేదు. తుఫాన్ సందర్భంగా పాఠశాల రెండవ అంతస్థులో గల భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ అంతస్థులో విద్యార్థులు పడుకోవడానికి వీలుగా ఏర్పాటుచేసిన ఇనుప మంచాలు తునాతునకలయ్యాయి. పైకప్పు రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. ఈ పాఠశాల విద్యార్థులు తరగతి గదులనే వసతి గృహంగా వినియోగించుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తుఫాన్ సందర్భంగా పాఠశాలలకు వాటిల్లిన నష్టాన్ని తక్షణమే భర్తీ చేసి మరామ్మత్తులు చేయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జారీచేసిన ఆదేశాలు తర్లి ఆశ్రమ పాఠశాలలో అమలుకు నోచుకోకపోవడం శోచనీయం. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, డిప్యూటీ వార్డెన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్న ఈశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఐటి డి ఏ ఈవోకు నివేదికలు సమర్పించామన్నారు. ఏది ఏమైనప్పటికి తుఫాన్ సందర్భంగా అన్ని వర్గాల బాధితులు పరిహారం పొందినప్పటికి తర్లి పాఠశాల విద్యార్థులకు మాత్రం అగచాట్లు తప్పలేదు.

స్వామినాధన్ సిఫార్సులు అమలు చేయాలి
* రైతు సంఘ నాయకులు డిమాండ్
నరసన్నపేట, డిసెంబర్ 9: రాష్ట్రంలోని రైతుల కష్టనష్టాలను పరిధిలోనికి తీసుకోవడమే కాకుండా స్వామినాధన్ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్ర చెరుకు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం విలేఖరుల సమావేశంలో సంఘనాయకులు అప్పలనాయుడు, శ్రీనివాసరావులు మాట్లాడుతూ మొక్కజొన్న పంటకు సంబంధించి రూ.200లు అదనంగా చెల్లిస్తామంటూ హామీలను ఇచ్చిందని, అంతేకాకుండా చెరుకు రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే వాటిని పక్కన పెట్టి పలు రైతులకు అన్యాయం చేస్తున్నారని, ఇది సరైన చర్య కాదని విమర్శించారు. ఎంతో లాభదాయకమైన చెరుకు పంటను నిర్వీర్యం చేస్తున్నారని, రోజురోజుకు చెరుకు పంటపై రైతులకు ఆశలు సన్నగిల్లే విధంగా రాయితీలు కల్పించడం సరైన పద్దతి కాదని పేర్కొన్నారు. చెరుకు పంటకు సంబంధించి టన్నుకు రూ. 750ల నుంచి రూ 900ల వరకు లబ్ధిచేకూరే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. డాక్టర్ ఎమ్. ఎస్ స్వామినాధన్ కమీషన్ సిఫార్సుల మేరకు టన్ను చెరుకుకు రూ. 4వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అట్రాసిటీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
నరసన్నపేట, డిసెంబర్ 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన స్వాతంత్య్రం తర్వాత దళిత వర్గాలకు ఆసరా కల్పించే దిశగా చట్టాలను చేసిందని, నేటి ప్రభుత్వాలు దానిని నిర్వీర్యం చేస్తున్నాయని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలియాద్రి తెలిపారు. ఆదివారం మండలంలోని జమ్ముపంచాయతీలోని ఎస్సీ కాలనీలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత వర్గాలకు అండగా ఆనాటి ప్రభుత్వాలు అనేక చట్టాలను పెట్టిందని, ప్రస్తుతం వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా దళితులపై దాడులు జరుగుతునే ఉన్నాయని వాటిని నివారించే దిశగా స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. ఈ సమస్యలపై ఈనెల 20వ తేదీన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నామని దీనిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, నర్శింహరావు, తదితరులు పాల్గొన్నారు.

గణిత ప్రతిభావంతులకు చేయూత
నరసన్నపేట, డిసెంబర్ 9: జిల్లా స్థాయిలో గత ఏడేళ్లుగా గణిత ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని గణిత అధ్యాపకుడు టి.ఎన్ శర్మ తెలిపారు. ఆదివారం నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థినీ విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా గణిత ఉపాధ్యాయులు ప్రముఖ గణిత శాస్తవ్రేత్త రామానుంజన్ జయంతి వేడుకలను పురష్కరించుకొని ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 22వ తేదీన ఆయన జన్మదినాన్ని పురష్కరించుకొని గణితంలో జిల్లా స్థాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట, కోటబొమ్మాళి, గార మండలంలోని 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలను నిర్వహించామని, సుమారు 90 మంది విద్యార్థులు విజయం సాధించారని తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖాధికారి యు.శాంతారావు, విశ్రాంత ఎమ్ ఈవో రత్నాలరాజు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కులరహిత సమాజం రావాలి
* ఎయిమ్ వ్యవస్థాపకులు సునీల్‌కుమార్
శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 9: దేశంలో కుల రహిత సమాజం రావాలని ఎ ఐ ఎం వ్యవస్థాపకులు, అడిషనల్ డిజిపి పివి సునీల్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక 80 ఫీట్ రోడ్డు వద్ద ఎయిమ్స్ మహాసంకల్ప మహాసభ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎయిమ్ వ్యవస్థాపకులు సునీల్‌కుమార్‌ను శ్రీకాకుళం ముఖద్వారం వద్ద ఎయిమ్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి, సభా వేదిక వరకు సాదరంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా, సమాజికంగా సంబంధిత వర్గాల వారు అభివృద్ధి చెందేందుకు చేయూతనివ్వాలని కోరారు. దళిత క్రైస్తువులను ఎస్సీలుగా గుర్తించాలని, జనాభా దమాషా ప్రకారం ఎస్సీలను ఎన్ని విధాలను ఆదుకోవాలన్నారు. రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకులు ఎస్సీలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఆ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. దళిత క్రైస్తువులను ఎస్సీలుగా గుర్తించాలని, దళిల వాడల్లో బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వం చేపట్టాలన్నారు. రాష్ట్రాన్ని మధ్య రహిత రాష్ట్రంగా చేయని పక్షంలో కనీసం బెల్ట్‌షాపులు లేకుండా చేస్తున్న హామీను ప్రభుత్వం తప్పక అమలు చేయాలన్నారు. దళిత గ్రామాల్లో పాలనను వారికి అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్ జిల్లా కన్వీనర్ తైక్వాండో శ్రీను, జిల్లా కార్యదర్శి సుధాకర్, డివిజన్ అధ్యక్షులు రవీంద్ర, హరికృష్ణ, ప్రకాష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఓపెన్ చెస్ పోటీలు
బలగ, డిసెంబర్ 9: స్థానిక పి ఎన్ కాలనీలో ఆదివారం ఆహ్వానిత ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తొమ్మిది మంది రేటెడ్ క్రీడాకారులతోపాటు 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఐదు రౌండ్లలో హోరీ హోరీగా సాగిన ఈ పోటీలను జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.్భమారావు ప్రారంభించారు. ఐదు రౌండ్లకు ఐదు పాయింట్లు సాధించి శ్రీకాకుళంకు చెందిన వై.సేతు మాధవ్ ప్రధమస్థానాన్ని కైవశం చేసుకోగా, విజయనగరంకు చెందిన సోమేష్ భట్టు (ద్వితీయ), ఎస్ ఎస్ రాజు (తృతీయ)స్థానాలు సాధించారు. అండర్-11 విభాగంలో ఎస్.హితేష్ ప్రధమస్థానం, బొమ్మాళి శ్రీనుబాబు ద్వితీయస్థానాన్ని సాధించగా, ఆర్.్ధనుష్, జె.యువన్ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఆ సంఘం కార్యదర్శి భీమారావు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గీతా చెస్ అకాడమీ డైరక్టర్ అరుణకుమారి, చంద్రవౌళి, వై.శ్రీనివాసరావు, చెస్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.

సిస్టమ్‌లో జిల్లా స్థాయి స్పోర్ట్సు అండ్ గేమ్స్
గార, డిసెంబర్ 9: మండలం అంపోలు పంచాయితీ పరిధిలోగల సిస్టమ్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి పాలిటెక్నిక్ విద్యార్ధుల స్పోర్టు అండ్ గేమ్స్ మీట్‌ను నిర్వహింపజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కళాశాల కార్యదర్శి బౌరోతు శ్రీనివాసరావు అన్నారు. గడచిన యేడాది నిర్వహింపజేసిన ఈ పోటీలు విజయవంతమైయ్యాయని, ఈ యేడాది కూడా ఆర్.జె.డి. ఆదేశాలు మేరకు ఈ నెల 10 నుండి మూడు రోజులు పాటు తమ కళాశాలలో నిర్వహింపజేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని మొత్తం 11 పాలిటెక్నిక్ కళాశాలలు నుండి విద్యార్ధులు ఈ పోటీల్లో పాల్గోంటారన్నారు. ఈ పోటీల్లో జిల్లాలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలలు విద్యార్ధులు పాల్గోని విజయవంతం చేయాలని కార్యదర్శి శ్రీనివాసరావు కోరుతున్నారు.

సాగరతీరంలో సరదాగా...
* సందడి చేసిన రెవెన్యూ
గార, డిసెంబర్ 9: మండలం కళింగపట్నం-మత్స్యలేశం (పోర్టుకళింగపట్నం) పంచాయితీ పరిధిలోని సాగరతీరంలో ఆదివారం జిల్లా రెవెన్యూ యంత్రాంగం సరదాగా సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి హాజరైయ్యారు. జిల్లా స్థాయి రెవెన్యూ యంత్రాంగం కుటుంబాలు సరదాగా సందడి చేసాయి. జిల్లాలో తితలి తుఫాను కారణంగా సహాయక చర్యలో యంత్రాంగం పనితీరును ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. కలెక్టర్‌తో పాటు జె.సి., డి.ఆర్.ఓ.లతో పాటు వివిధ విభాగాలకు చెందిన యంత్రాంగం కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గోని ఆనందంగా గడిపారు.

ఏం.. శ్రీహరన్నా బాగున్నావా... జగన్
గార, డిసెంబర్ 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఆదివారం జిల్లాలో సాగిస్తున్న పాదయాత్ర నేపథ్యంలో మండల వైసిపి కన్వీనరు పీస శ్రీహరిరావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా శ్రీహరిరావును ఉద్ధేశించి జగన్మోహనరెడ్డి పలకరింపుగా ఏం.. శ్రీహరన్నా బాగున్నావా అంటూ సంభోదించారు. అలాగే మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనితీరుపైనా.. పార్టీ విధానాలుపైనా కొద్ది సేపు చర్చించినట్లు సమాచారం.

గుమడాం రోడ్డు బిల్లు నిలుపుదల చేయండి
* హైకోర్టు ఉత్తర్వులు
ఎచ్చెర్ల, డిసెంబర్ 9: నియోజకవర్గంలోని లావేరు మండలం గుమడాం గ్రామంలో ఉపాధి హామీ 14వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డు బిల్లు నిలుపుదల చేయాలని హైకోర్ట్ మద్యంతర ఉత్తర్వులు జారీచేసినట్లు వైసీపీ లీగల్ సెల్ రాష్టక్రార్యదర్శి మొదలవలస చిరంజీవి తెలిపారు. ఆదివారం చిరంజీవి ఆయన కార్యాలయంలో విలేఖరుల మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పనులు టీడీపీ కార్యకర్తలతో టెండరు ప్రక్రియ పూర్తిచేయకుండా నిర్మించారని హైకోర్ట్‌ను ఆశ్రయించడం జరిగిందన్నారు. దీనిపై హైకోర్ట్ తక్షణమే రోడ్ బిల్లును నిలుపుదల చేయాలని, మిగతా పనులను ప్రారంభించవద్దని, మద్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
* కార్మిక సంఘాల నేతలు
శ్రీకాకుళం (టౌన్), డిసెంబర్ 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 2019 జనవరి 8,9 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పలువురు కార్మిక సంఘాల నేతలు కార్మికులకు, ఉద్యోగులకు పిలుపు నిచ్చారు. స్థానిక జిల్లా యుటి ఎఫ్ కార్యాలయంలో ఆదివారం కార్మిక సంఘాల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు కనీస వేతనాలు సవరించకుండా కార్మికుల పొట్టను కొడుతూ యజమానుల జేబులు నింపుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో అంగన్వాడీ, ఆశా, విఏవో, మధ్యాహ్న భోజన కార్మిక తదితర స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడానికి మోదీ ప్రభుత్వం నిరాకరిస్తుందని విమర్శించారు. పర్మినెంట్ స్వభావంగల పనుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. సిపి ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహారిస్తూ పెట్టుబడి దారుల కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలన్నారు. కనీస వేతనం రూ.18వేలుగా నిర్ణయించాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. అదేవిధంగా ధరల పెరుగుదలను నియంత్రించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ చేయనున్న దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సదస్సులో సి ఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, డి.గోవిందరావు, ఇన్సూరెన్స్ ఉద్యోగ సంఘ నాయకులు టి. ఆచారి, బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగ సంఘ నాయకులు టి.వెంకటరావు, మెడికల్ రిప్రజెంటిటివ్ యూనియన్ నాయకులు డి ఎమ్. ప్రసాద్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్. హిమప్రభ, మధ్యాహ్న బోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.మహాలక్ష్మి, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, ఏ ఐటియుసి జిల్లా కార్యదర్శి సి.హెచ్ గోవిందరావు, ఐఎప్‌టియు జిల్లా నాయకులు ఎన్.నీలం రాజు తదితరులు ప్రసంగించారు.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాలు రద్దుచేయాలి
* ఏపీటి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరప్రసాద్
శ్రీకాకుళం (టౌన్), డిసెంబర్ 9: ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అవసరమైన కనీస హక్కులు, ఉద్యోగ భద్రత, టైం స్కేల్‌తో కూడిన వ్యవస్థ జీవనంలో ఆసరాగా నిలవాల్సిన పెన్సన్ విధానాలను విద్యా, ఉపాధ్యాయులకు దూరం చేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆత్మగౌరవ దినం, ఉద్యోగ భద్రత, టైంస్కేల్ సాధన దినంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ మాట్లాడుతూ కేజీబివి పాఠశాలలు, మోడల్ స్కూల్‌లు, రెసిడెన్సియల్ స్కూల్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులను, లెక్చరర్స్‌ను తక్షణమే రెగ్యులర్ చేయాలన్నారు. మోడల్ స్కూల్స్‌ను ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలుగా పరిగణిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కస్తూరీబా పాఠశాలలు, మోడల్ స్కూల్స్ పేరుతో ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇది చాలా దుర్మార్గమైన చర్యని ఆయన పేర్కొన్నారు. ఏపిటి ఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు చిన్నాల అత్యుతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అట్టాహాసంగా ప్రారంభించబడిన మోడల్ స్కూల్స్‌ను రూ. 5కోట్ల నిధులతో మండలానికి ఒకటి అభివృద్ధి చేస్తామని ఆర్భాంగా పార్లమెంట్‌లో బిల్లు పాస్‌చేసి 5 సంవత్సరాల కాలంలో వారు చెప్పిన లక్ష్యాలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. ఈరోజు మోడల్ స్కూల్స్‌లో ఉపాధ్యాయులకు నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రావడం జరిగిందన్నారు. తక్షణమే మోడల్‌స్కూల్స్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉపాధ్యాయులకు మాదిరిగా సర్వీస్‌రూల్స్ నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఏపిటి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి మాట్లాడుతూ కస్తూరీభా పాఠశాల ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా ఉందని వారికి స్కేల్ ఫిక్షేషన్ చేసి శాశ్వత ప్రాతిపదికన జీతాలు ఇవ్వవలసిన అవసరముందన్నారు. ఈ సదస్సులో వక్తలుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సీనియర్ నాయకులు బి. అప్పయ్య, ఎస్.అచ్చెన్నాయుడు, బి.వెంకటప్పడు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షంగా ఉత్తరాంథ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాలక పార్టీ రఘవర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ పటిష్టత కోసం కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయలును రెగ్యులర్ చేయించడం కోసం, సిపి ఎస్ విధానం రద్దుకోసం కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా చెన్నుపాటి లక్ష్మయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సదస్సులో ఎమ్.మదన్‌మోహన్, డి.వీరాస్వామి, జివిరమణమూర్తి, టి.రమాదేవి, హెచ్‌వి సత్యన్నారాయణ, పివి రమణ, వి.నవీన్‌కుమార్, కె.పద్మజతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధిలో గ్రామసభలే కీలకం
సరుబుజ్జిలి, డిసెంబర్ 9: దేశాభివృద్ధిలో గ్రామసభల పాత్ర అత్యంత కీలకమైనదని సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక పీ ఆర్‌వో మందపల్లి రామకృష్ణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో కొత్తకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరంలో పాల్గొని మాట్లాడారు. ఆదివారం నిర్వహించిన గ్రామసభల నిర్వహణ, యువత బాధ్యత అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామన్నారు. ప్రజల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడానికి గ్రామసభలు సక్రమంగా నిర్వహించకపోవడమేనని అభిప్రాయపడ్డారు. మంచి సమాజం నిర్మాణం కావాలంటే యువత సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఆమదాలవలస కళాశాల అధ్యాపకులు సైరిగాపు దుర్గారావు అన్నారు. అనంతరం అతిధులను ఎన్ ఎస్ ఎస్ వలంటీర్లు ఘనంగా సత్కరించారు. షలంత్రి గ్రామంలో స్వచ్ఛ్భారత్, బావుల్లో క్లోరినేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పీవో దుగ్గివలస రాంప్రసాద్, వలంటీర్లు పాల్గొన్నారు.

షిర్డీసాయి ఆలయంలో అన్నదానం
పాలకొండ, డిసెంబర్ 9: మండలంలోని అన్నవరం అష్టలక్ష్మీ గాయత్రీ సహిత షిర్డీసాయి దేవాలయం ఆవరణలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెలా రెండో ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో పలువురు ఆధ్యాత్మిక వక్తలతో ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందూ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే విధంగా ప్రసంగాలు ఉండాలన్నారు. భగవద్గీతతో పాటు పలు పౌరాణిక, ఇతిహాసాలను వివరిస్తూ ప్రసంగాలు చేశారు. ఈ ప్రసంగాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ ధర్మకర్త గవర గురునాధరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వక్తలు ఎన్.వి.రమణ, ఎ.కామేశ్వరరావు, బి.రామానందం, నిత్యానందస్వామి తదితరులు ప్రసంగాలు చేశారు.

తూర్పుకాపులు విద్యతోనే అభివృద్ధి చెందాలి
రాజాం, డిసెంబర్ 9: ఉత్తరాంధ్రాలో సుమారు 35 లక్షల మంది తూర్పుకాపులు ఉన్నారని, వారంతా కష్టం, శ్రమ,కన్నీళ్లే జీవితంగా ఇంతవరకు గడిపారని, వారంతా విద్యతోనే అభివృద్ధి చెందాలని ప్రవాస భారతీయుడు గేదెల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాజాం సమీపంలోని గొలుసుల ఖానా దగ్గర తూర్పుకాపుల సంఘం ఆధ్వర్యంలో వన భోజన కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు డోల జగన్ మాట్లాడుతూ తూర్పుకాపులు రాజకీయవలలో పడకూడదని, అన్ని పార్టీలను ఆదరించి వారి వల్ల ప్రయోజనాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు కుమారుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ విద్యారంగంలో రాణించినప్పుడే తూర్పుకాపుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. పొగిరి సురేష్, శాసపు రమేష్, వంజరాపు రాము తదితరుల సారధ్యంలో ఈ వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు.