స్మృతి లయలు
ఛందమామ కోసం ఆరో నెం. ప్లాట్‌ఫాం మీదకి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మా చిన్న అమ్మమ్మ - ప్రక్క బిల్డింగేగా పరిగెట్టాను.
ఆ మాస్టారి పిలక తీసేసి అతని చేతిలోనే దిబ్బరొట్టెతో కలిపి పెడతానంటూ ఆవిడ నన్ను వెనుక వేసుకురావడం-
- నన్ను బుర్ర తడుముకొనేలాగా చేస్తుంది ఇవాళ్టికి.. వాళ్లు ‘బుర్ర’ అంటారు మేం బెజవాడలో తలకాయ అంటాము. మొట్టికాయకా తేడా తెలియదుగా.. తొడపాశాలు మొట్టికాయలు వగైరా ‘మజా’ అదృష్టవశాత్తూ నాకు తెలియదు ఎందుకంటే - ఏడో క్లాసుదాకా ‘గెస్టు’గా మాత్రమే వేర్వేరు స్కూల్స్‌కి వెళ్లడం జరిగింది. ఆనక మరి నాగాల్లేవ్!
అప్పటి నుంచి ఆదివారాలు కూడా వాలీబాల్ లేదా బేస్‌బాల్ గ్రౌండ్‌లోనే.. ఈవినింగ్ మాత్రం - బెజవాడ వన్‌టౌన్ శివాలయం స్ట్రీట్ - భ్రమరాంబ మల్లికార్జున గ్రంథాలయం మేడ మీదే... ఈ లైబ్రరీ.. నాకు ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ - మన శివాలయం నెత్తి మీద ఉన్న ఒకేఒక్క పెద్ద పాత రీడింగు రూమ్ ప్లస్ గ్రంథాలయం.
-వాడా? మిత్ర కృష్ణమూర్తేనా? - గ్రౌండ్‌లో లేడా? ఆ గ్రంథాలయంలో ఉంటాడు అని ఆవేపు చూపించేవారుట మా దేవరకొండ సుబ్రహ్మణ్యం మాస్టారుగారు. ఆయన లెక్కల మాస్టారు అయినా - మాకు ఇంగ్లీష్‌కి వేశారు. గొప్ప ఇష్టం మా అందరికీ.
అన్నట్టు అనుకోకుండా స్కూల్‌కి వచ్చేశాం. ఇస్మాయిల్ కొట్టుకి పోదాం. కోపిష్టి సుభాన్ భాయి.. పిల్లలు - పెద్దలు అందరూ ఏది కావాలని అడిగేవారో - అడిగినప్పుడు ఆ మాట శ్రద్ధగా వినడం - ఆ సరుకు ఏమిటో చూడడం - అలాగా - ఉర్దూ భాషని పట్టేసుకున్నాను. వోయ్ భామ్జా (అల్లుడూ), ఏ, లో గుడ్.. వెనక్కి పిలచి బెల్లం కొసరు ఇచ్చేవాడు. కాని నాకు నామోషీ ‘నక్కో లేవ్’ అనేసి పారిపోయేవాణ్ణి. నారాయణరావ్ పహిల్వాన్ కా భంజా - కనుక నాకూ మేనల్లుడీవే పర్వానై ‘లెవ్’ అనేవాడు సుభాన్.. మా ‘రాక్షసుడు ‘సారీ! బడా మామూ - అతను పహీల్వానా? కరెక్టే.. ఖాసిం పహిల్వాన్ దగ్గర కుస్తీ పట్టడం నేర్చుకొనేవాడు. అఫ్‌కోర్స్.. ఖాసిం భాయి - భలే కుస్తీలు గెలుస్తాడు.. ఇతని సంగతి చెప్పాలి...
-అగలే హఫ్తే.. బాకీ ఖిస్సా...
* * *
హైదరాబాద్ వచ్చాక, విద్యానగర్‌లో మేడ మీద ఇంట్లో వున్నప్పుడు - ఉదయపు నడకకి మాత్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం (మార్నింగ్ వాక్‌కి) గొప్ప సదుపాయంగా ఉండేది. ఆంధ్రా యూనివర్సిటీ కన్నా ఇది విస్తీర్ణంలో చాలా పెద్దది - ఒక్కోసారి, వెనక నుంచి క్యాంపస్‌లోకి పోయేవాణ్ణి. పగులగొట్టబడిన రైల్వే గోడ కంతలో నుంచి (నేరమే మరి) దూరి వెళ్లడం కోసం స్థానికులు చేశారు ఆ పని.. లోకల్ రైలుస్టేషన్ జామియా ఉస్మానియా స్టేషన్ మీదుగా అటు వెళ్లి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించడం అదో మజా.. చాలామంది ప్లాట్‌ఫారం మీదనే పచార్లు చేసేసేవారు. ఓసారి అలాగే చేసేవాణ్ని. వెంటనే మా బెజవాడ ఫ్లాట్‌ఫారం జ్ఞాపకం వచ్చేది. అదో మైలు పొడుగుంటుంది.. దాన్నిండా పార్సిల్స్, ట్రాలీలు - నడిచే ఫలహార శాలలు, జనాలు - వచ్చే రైళ్లు పోయే రైళ్లు.. ఇదంతా చూడ్డానికే కళ్లు పీకుతాయి - ఆ కాలంలో మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ లాంటివి లేవు. ‘కైకూ’ అంటే అవి ఎందుకు?.. ఎక్కడికి వెళ్లాలన్నా నడక మీదేగా.. డబ్బున్న వాళ్లు చెప్పుల మీద, అవి లేనివాళ్లు సొంత పాదాల మీద.. ఎందరికో పాదరక్షలుండేవి కావు..
‘మీకు తెలుసా?’ అని రాసి బాలకి పంపిన ‘రచన’లలో వింతలు విశేషాలు ఎన్నో ప్రోగు చేసి రాసేవాన్ని.. అవిగాక బాలిండియా రేడియో వార్తలు చదువుతున్నది పిళ్లా వీర వెంకట అప్పల సూర్య కృష్ణకుమారి అని పంపే ఈ వార్తలు మాత్రం కల్పితాలు. నా పేరు మద్రాసు వౌంట్ రోడ్డంత పొడుగు ఎందుకు ఉన్నదీ? అంటే మా మామ్మ అరసవిల్లి సూర్యనారాయణ పేరు కలపాలనుకుందిట. నా పుట్టు జుట్టు సింహాచలం కొండ మీద తీయించింది. అందుకు ‘అప్పల’ కలిపింది. తను ఉపమాక వెళ్లినప్పుడు అనుకుందిట వేంకట కలపాలని.. సరే వియ్యంకుడి పేరు కృష్ణమూర్తి మస్టూ.. సరే ‘బాల’లో ఇష్టమైన నాకు బాగా సీనియర్‌లు వుండేవారు - తన బొమ్మ తనే వేసుకొని పంపిన బాపు అను సత్తిరాజు.. రాజమండ్రి కొక్కేరగడ్డ కామేశ్వర శర్మ.. ఈ కొక్కేరగడ్డ తరువాత కాగడా శర్మ (సినిమా) అయ్యాడు. మద్రాసులో కలిశాము.. షార్ప్ కలం.. అక్కినేనిని ఎక్కడా బ్రతకనిచ్చేవాడు కాదుట ఈ సినీ జర్నలిస్టు.
ఆంధ్ర సర్వస్వం సౌజన్యంతోనే, బెజవాడ ప్లాట్‌ఫారం నివిడిలో ఈ లోకంలోనే ఆరవది.. అని తెలుసుకున్నాను. ఇప్పుడది బెజవాడ జంక్షన్ గొప్ప స్టేషను ఒక పన్నిన పద్యవ్యూహంలా ఉంటుంది. కాని అప్పుడు నేరుగా ఆరో నంబర్‌కి వెళ్లి పోడమే. అప్పుడు ఇండియాకి ఇంగ్లండు అసలు రాజధాని అన్నట్లుగా.. మన ఆంధ్రకి మద్రాస్ క్యాపిటల్ ఆ కాలంలో. స్వతంత్ర భారత్ అవతరించేకా - మనకి ఇంగ్లండ్‌తో పనిలేదు కాని మన పత్రికలూ సినిమాలు అన్నీ ఇంకా మద్రాస్ నుంచే వచ్చేవి. ఏది రావాలన్నా ఒక్కటే రైలు. మద్రాసు హౌరా మెయిలు - ప్రభ, పత్రిక అనే కాదు చందమామ పాపాయి బాల రూపవాణి, ఆనంద వాణి కూడా మద్రాస్ నుంచే దిగడాలి. ఉదయం బెజవాడ ఆరో నంబర్ ప్లాట్‌ఫారం మీదకి నేను - తమ్మూడూ - ఏజెంటుకన్నా ముందే చేరేవాళ్లం. బండిల్స్ దిగటమే ఆలస్యం, ఇట్లా ఎగరేసుకుపోయే వాళ్లు పత్రికలు జనం.
‘చందమామ రాలేదా?’
‘లేదు. సూర్యం బాబాయ్ వచ్చాడు అదుగో, అటు చూడు’ అని ఆకాశంలోకి చూపించి, తన జోకుకి తనే నవ్వేసి - పేపర్లు ఓ చేత్తో విసిరేస్తూ, పైసలు మరో చేత్తో అందుకుంటూ చెప్పేవాడు పేపరబ్బాయ్ - అతనికి చెవికి కాడ వుండేది.
(ఇంకా బోలెడుంది)