ఈ వారం సినిమాలు

మనసుకు దగ్గర కాని స్నేహితుడు

  • - వి
  • 03/02/2012

* స్నేహితుడు ( * బాగోలేదు)

తారాగణం: విజయ్, శ్రీరామ్, జీవా, సత్యరాజ్, ఇలియానా, సత్యన్, ఎస్‌జె సూర్య తదితరులు.
సంగీతం: హేరిస్ జైరాజ్
నిర్మాత: రాజు
కథ, స్క్రీన్‌ప్లే: రాజ్‌కుమార్ హిరానీ
దర్శకత్వం: శంకర్
సంస్థ: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్
జీవితం ఓ పరుగు పందెం. అక్కడ గెలిచి తీరాలంటే పరిగెత్తడమొక్కటే మార్గం. కాళ్లలో బలం తగ్గి అలసి సొలసి ఏ క్షణాన పరుగు ఆపావో అదే క్షణాన పరాజయం పలకరిస్తుంది. ‘సో...నెవర్ గివ్ అప్... ‘రన్... రన్...రన్!’ నీ వెనుకవాళ్లు నిన్ను దాటిపోకుండా ఉండాలంటే... గుండెలు చిక్కబట్టుకుంటూ, పంటి బిగువున బాధ అణచుకుంటూ పరిగెత్తి తీరాల్సిందే. ఈ లోకంలోకి నిన్ను తీసుకొచ్చిన నీ కన్నవాళ్లు నీపై పెట్టిన బాధ్యతల్ని, కలల్ని సాకారం చేయడమొక్కటే నీ ముందున్న కర్తవ్యమైతే... నీ ఆశలు, ఆకాంక్షలు పక్కనపెట్టి మరీ ‘పరిగెత్తు... పరిగెత్తు... పరిగెత్తు!’
ఇలా పరిగెత్తడంలో నీ వ్యక్తిత్వంతో సహా నువ్వేం కోల్పోతున్నావో... ఆలోచించకు. అలా ఆలోచిస్తే గమ్యం చేరుకోలేవు...’’
ప్రస్తుత సమాజాన్ని శాసిస్తున్న ఈ ధోరణిని... ఈ ‘పరిగెత్తడా’న్ని తీవ్రస్థాయిలో ఎండగడ్తూ... ర్యాంకుల పంజరంలో... నంబర్ల సంకెళ్లలో చిక్కుకుపోయిన విద్యావ్యవస్థ తీరుతెన్నుల్ని కటువుగా విమర్శిస్తూ...కడుపున పుట్టిన పిల్లల ఇష్టాయష్టాలు, అభిరుచుల్ని అసలేమాత్రం పట్టించుకోని తల్లిదండ్రుల వ్యవహారశైలిని ఘాటుగా వ్యతిరేకిస్తూ... ‘ఇది నీ జీవితం... నీ స్వర్ణ స్వప్నాల్ని నీకు నువ్వే నిజం చేసుకోమం’టూ యువతకి సందేశమిచ్చిన చిత్రం ‘త్రీ ఇడియట్స్.’
అమీర్‌ఖాన్ హీరోగా బాలీవుడ్‌లో నిర్మితమై యావత్ భారతదేశాన్ని ఓ ఊపుఊపి రిలీజైన ప్రతిచోటా సంచలన విజయాల్ని నమోదుచేసుకున్న ‘త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని రీమేక్ చేయడం నిజంగా ఓ సాహసమే.
అయితే... ‘రోబో’లాంటి బ్లాక్ బస్టర్‌తో ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్‌కి తీసుకెళ్లిన భారీ చిత్రాల డైరెక్టర్ శంకర్ రెండు భాషల్లో ‘త్రీ ఇడియట్స్’ రీమేక్‌తో సాహసం... ఇంకో రకంగా దుస్సాహసమే చేసాడని చెప్పాలి.
తమిళ్‌లో ‘నాన్టన్’గా, తెలుగులో ‘స్నేహితుడు’గా రిలీజైన ‘త్రీ ఇడియట్స్’ చిత్ర కథాకథనాలు దేశంలోని అధిక శాతం ప్రేక్షకులకు ఇప్పటికే తెలుసు. అందువల్ల తెలుగు ‘స్నేహితుడి’ని ఎందుకు కలుసుకోవాలి... అంటే, ‘త్రీ ఇడియట్స్’లోని అమీర్‌ఖాన్ పాత్రని విజయ్ ఏ విధంగా రక్తి కట్టించాడో... మాధవన్ రోల్‌లో శ్రీరామ్ ఎంతలా ఒదిగిపోయాడో... కరీనాకపూర్‌కన్నా గోవా నెరజాణ ఇలియానా ‘ఓకే’ అనిపించుకుందా, లేక ‘సోసో’ అనిపించుకుందా... ఇలాంటి ప్రశ్నలకు ఇన్‌స్టెంట్ ఆన్సర్ కావాలంటే సినిమా చూడాల్సిందే. ఇంతకుముందు చూసిన ‘త్రీ ఇడియట్స్’ సినిమాని మనసులోంచి కంప్లీట్‌గా తొలగించి ‘స్నేహితుడు’ సినిమాని చూడడం అసాధ్యం. ఆ సినిమాని చూసిన ప్రేక్షకులు ఈ సినిమాని తప్పకుండా ఆ సినిమాతో తులనాత్మక విశే్లషణ చేసి తీరుతారు.
‘త్రీ ఇడియట్స్’ చూడని వాళ్లకి మాత్రం ‘స్నేహితుడు’ బాగానే నచ్చుతాడు.
ఎందుకంటే... ఒరిజనల్ ఎప్పటికీ ఒరిజనలే. దానికెన్ని నకళ్లు వచ్చినా... అవి కేవలం డూప్లికేట్లే. అవెప్పటికీ ఒరిజనల్ స్థాయికి చేరుకోలేవు.
అందుకే, డైరెక్టర్ శంకర్ ఓ రకంగా దుస్సాహసం చేసాడనే చెప్పాలి. తనే క్రియేటర్‌గా ఇండస్ట్రీలో ‘వండర్స్’ చేసిన శంకర్... ‘త్రీ ఇడియట్స్’ని రీమేక్ చేయడమంటే తన చుట్టూ గిరిగీసుకుని, చేతులు కట్టేసుకుని డైరక్ట్ చేయడమే. ఈ రకంగా శంకర్ సఫలీకృతుడయ్యాడు.
‘త్రీ ఇడియట్స్’ చాలామంది ప్రేక్షకులకు తెలిసిందే అయినా... స్థూలంగా కథ ఇది.
పంచభట్ల సారంగపాణి (విజయ్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తమ స్నేహితుడు పాణిని వెంకట్ (శ్రీరామ్), నిఖిల్ (జీవా) వెదకడం మొదలెట్టడంతో ప్రారంభమైన ఈ సినిమా పదేళ్లకిందటి ఫ్లాష్‌బ్యాక్‌ల్తో కథని చెప్తుంది. ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ విరూపాక్ష సుందరం ఎలియాస్ వైరస్ (సత్యరాజ్) క్రమశిక్షణకి ప్రాణమిచ్చే మనిషి. స్టూడెంట్సంతా అదుపాజ్ఞల్లో ఉండాలని... గీసిన గీత దాటకుండా చేయాలని పంతం పడ్తుంటాడు.
ఆయన దృష్టిలో కాలేజీ ఓ ఫ్యాక్టరీ... విద్యార్థులు ప్రొడక్ట్‌లు. అంతకుమించిన ఆలోచన ఆయనకు కలగదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి విషయాన్నీ హేతుబద్ధంగా ఆలోచించే సారంగపాణి ఆ కాలేజీలో చేరి... తన బిహేవియర్‌తో ఒక్కొక్కర్నీ ఆకట్టుకుంటాడు. వెంకట్, నిఖిల్, పాణి... ఈ ముగ్గురూ రూమ్మేట్స్. కాగా, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ కావాలనే ఆశ ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మాట తోసిపుచ్చలేక ఇంజనీరింగ్ చదువుతున్న
వెంకట్, తన కాళ్లపై తాను నిలదొక్కుకోలేక... ప్రతి చిన్న విషయానికి భయంతో బెంబేలుపడ్తున్న నిఖిల్... మెడిసిన్ చదువుతూ అనూహ్య పరిస్థితుల్లో సారంగపాణికి ఫియాన్సీగా మారిన రియా (ఇలియానా) కథని శరవేగంగా ముందుకు నడిపిస్తారు. పిల్లల ఇష్టాఇష్టాల్ని పెద్దలు పరిగణనలోనికి తీసుకోవాలని... అప్పుడే ఏ పనిచేసినా కష్టమనిపించదని పాణి బలంగా నమ్ముతాడు. అలా తను నమ్మిన ఆ సత్యాన్ని పది మందికి చెప్తుంటాడు. కొన్ని కారణాలవల్ల మొదట్లో పాణిని వ్యతిరేకించినా... తర్వాత్తర్వాత అతడి అంతరంగాన్ని అర్థంచేసుకున్న నిఖిల్, వెంకట్ అతడికి ప్రియమిత్రులవుతారు. ఈ క్రమంలో... వైల్డ్ ఫొటోగ్రాఫర్ కావాలనుకున్న వెంకట్ అభిరుచిని గమనించి ఆ దిశలో వెళ్లేందుకు పాణి ప్రోత్సహిస్తాడు. అలాగే, అనుక్షణం భయాందోళనల్తో కృంగిపోతున్న నిఖిల్‌కి అండగా నిలిచి... తనంతట తాను తన కాళ్లపై నిలిచేలా ఆసరా అందిస్తాడు. ఇలా... పాణి వ్యక్తిత్వానికి ప్రభావితులైన ఆ ఇద్దరు స్నేహితులు తమ జీవితాలను తమ ఇష్టాలకనుగుణంగా తీర్చిదిద్దుకుంటారు. చదువుకోవడంలోని పరమార్థం జ్ఞానం సంపాదించడంతోపాటు అందరికీ ఆనందం ఇవ్వడం...అదే, ‘ఆల్ ఈజ్ వెల్’ అనే పాజిటివ్ దృక్పథం అలవర్చడమేనన్న చక్కని సందేశాన్ని అందించే చిత్రం ఇది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎపుడో అపుడు తామేం చేయాలో కచ్చితంగా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక... అటువంటి పరిస్థితుల్లో మొక్కవోని సంకల్పబలంతో కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తుంది చిత్రం. గరిటెడు హాస్యం, చిటికెడు విషాదం, గుండెల్ని తాకే భావావేశం, కొంత సెంటిమెంట్‌తోపాటు కనువిందు చేసే పాటల్తో...‘స్నేహితుడు’ ఫర్వాలేదనిపిస్తుంది.
అయితే, అమీర్‌ఖాన్‌ని చూసిన కళ్లకి విజయ్ అస్సలానడు. శ్రీరామ్, జీవా చేయగలిగినంత చేసారు. ఇక, ఇలియానా... బెల్లీ డాన్స్ నడుం ఒంపుల్తో యువ ప్రేక్షకులకు గట్టి గాలానే్న వేసింది. ఎస్‌జె సూర్య ప్రత్యేక పాత్రలో కాసేపు కనిపించాడు. ఇక, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. గత చిత్రాల మాదిరి చెవినిల్లుకట్టుకుని ఆకట్టుకునేలా బాణీలు సమకూర్చడంలో విఫలమయ్యాడు. ఒక్కటంటే ఒక్క పాట శ్రవణానందాన్ని కలిగించకపోవడం పెద్ద లోపం. మన కామెడీ హీరో సునీల్ డబ్బింగ్ చెప్పిన చిత్రంలోని ‘సైలెన్సర్’ (సత్యన్) అంతగా అలరించలేకపోయాడు. లాస్ట్‌బట్ నాట్ లీస్ట్. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో... ఎక్కువ నిడివిగల సినిమా ‘స్నేహితుడు’. మూడుగంటలపాటు ప్రదర్శితమవుతున్న ఈ సినిమా చూసే ప్రేక్షకులది నిఝంగా సాహసమే.

Comments

review is too bad,

Yes, the film is not as bad as the review said! No comparison.. One can enjoy a worth sitting of 3hours15minutes .

the movie is good i like it the review is bad

movie is as like 3 idiots

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading