ఆటాపోటీ

సొంత డబ్బా!

  • 22/02/2012

ఆలూలేదు.. చూలూలేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం. జాతీయ జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోలేక లెక్కలేనన్ని సార్లు ఉద్వాసనకు గురైన అతను తన స్థాయిని మరచిపోయి ఏకంగా కెప్టెన్సీ గురించి ఆలోచించడం వింతగా ఉంది. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి వికెట్‌కీపింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఎలాంటి సలహాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే, కెప్టెన్సీ గురించి సూచనలను వినడానికి తాను దూరమనీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యం ముంచెత్తాడు. జట్టుకు నాయకత్వం వహిస్తే ఆటపై దృష్టిని కేంద్రీకరించడం కష్టమవుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందుకే బెంగాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉండమని కోరినా తాను ఆ బాధ్యతలను స్వీకరించలేదని అన్నాడు. టి-20 లేదా పరిమిత ఓవర్ల ఫార్మెట్ విషయం ఎలావున్నా, మిగతా ఫార్మెట్స్‌లో కెప్టెన్సీని తాను కోరుకోవడం లేదన్నాడు. ఇంతకీ అతని దృష్టి బెంగాల్ జట్టుకు నాయకత్వం వహించడంపై పడిందా లేక ఏకంగా ధోనీ పదవికే ఎసరు పెట్టాలని అనుకుంటున్నాడా? వరుస వైఫల్యాలతో అల్లాడుతున్న సాహా ఇప్పటి వరకూ అద్భుతాలు ఏవీ సృష్టించలేదు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేదు. వికెట్‌కీపర్‌గా ధోనీ వ్యవహరిస్తుంటే, స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా కీపర్లు పార్థీవ్ పటేల్, దినేష్ కార్తిక్ వంటి ఆటగాళ్లు జట్టుకు సేవలు అందించారు. అదే అవకాశం పలుమార్లు సాహాకు వచ్చినా దానిని స్వాహా చేశాడేగానీ సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయాడు. అందుకే, సొంత డబ్బాను మానుకొని ఆటపై దృష్టిపెట్టాలని సహచరులు అతనికి సూచిస్తున్నారు. కెప్టెన్సీ కలలు కంటూ కూర్చుంటే, బిసిసిఐతో ఉన్న కాంట్రాక్టు కూడా ఊడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

శతాబ్దాల చరిత్ర..
ఫీల్డ్ హాకీకి శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 776లో గ్రీస్‌లోని ఒలింపియాలో మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలు జరిగాయి. అయితే, అప్పటికి కనీసం 1,200 సంవత్సరాలకు పూర్వమే అరబ్, గ్రీక్, రోమన్ తదితర ప్రాంతాల్లో హాకీ ఆట ప్రచారంలో ఉందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఈ క్రీడ అభివృద్ధి చెందింది. అందరికీ ఒకే రకమైన నిబంధనలుగానీ, స్పష్టమైన సూత్రాలుగానీ ఉండేవికావు. తర్వాతి కాలంలో రంగ ప్రవేశం చేసిన ఐస్ హాకీ, అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాల్లో ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. హాకీ అంటే ఐస్ హాకీ అనే స్థాయికి చేరింది. దీనితో బ్రిటిషర్లు హాకీని ఫీల్డ్ హాకీగా పేర్కొన్నారు. 1886లో లండన్ హాకీ అసోసియేషన్ హాకీ నియమనిబంధనలను రూపొందించింది. అప్పటి నుంచి కొద్దిపాటి మార్పులుచేర్పులతో ఈ నిబంధనలే ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్నాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఏర్పడిన తర్వాత హాకీ క్రీడకు స్పష్టమైన రూపం వచ్చింది.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading