క్రీడాభూమి

సఫారీలకు థ్రిల్లింగ్ విక్టరీ .. కివీస్‌పై టీ-20 సిరీస్ కైవసం

  • 23/02/2012

ఆక్లాండ్, ఫిబ్రవరి 22: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌ను 2-1 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఆక్లాండ్‌లో బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో కడదాకా పోరాడిన న్యూజిలాండ్ జట్టు నాటకీయంగా మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లక్ష్య ఛేదనకు చివరి రెండు ఓవర్లలో 10 పరుగులు సాధించాల్సిన న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. 20 బంతుల్లో 38 పరుగులు సాధించిన జె.పి. డుమినీ ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, రోబ్ నికోల్ రెండేసి వికెట్లు సాధించారు. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు రోబ్ నికోల్ (33), మార్టిన్ గుప్తిల్ (26) ఆరు ఓవర్లలో 65 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. వీరి నిష్క్రమణ తర్వాత జెస్సీ రైడర్ 42 బంతుల్లో 52 పరగులతో రాణించాడు. అయతే ఆ తర్వాత కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ (18) మినహా మిగలిన వారంతా త్వరత్వరగా పెవిలియన్‌కు చేరారు. అయనప్పటికీ 20వ ఓవర్‌లో మర్చంట్ డీ లాంగే వేసిన చివరి బంతికి ఆరు పరుగులు సాధిస్తే న్యూజిలాండ్ జట్టు విజయం సాధించేదే. అయతే ఆ బంతి ద్వారా జేమ్స్ ఫ్రాంక్లిన్ ఒక పరుగు మాత్రమే రాబట్టగలిగినప్పటికీ అది అది నో-బాల్ కావడంతో కివీస్‌కు మరో అవకాశం లభించింది. దీంతో లక్ష్య ఛేదనకు కివీస్ ఇంకా నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. కానీ చివరి బంతి ఎదుర్కొన్న టిమ్ సౌథీ ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే సాధించింది. కీలకమైన గుప్తిల్, రైడర్ వికెట్లను తీసి దక్షిణాఫ్రికా విజయంలో ముఖ్యపాత్ర పోషించిన జాన్ బోథా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading