క్రీడాభూమి

ఓపెనింగ్ అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 8: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ముంబయిలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద గల సర్ధార్ వల్లభాయ్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఆరంభ వేడుకలతో ఈ టోర్నీకి తెర లేచింది. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్లు తమ ఆట, పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. వెస్టిండీస్ క్రికెటర్ డ్వెన్ బ్రావో తన స్మాష్-హిట్ ర్యాప్ ‘చాంపియన్ డాన్స్’తో ఈ వేడుకలకు మరింత వనె్న తీసుకొచ్చాడు. 135 నిమిషాల పాటు సాగిన ఈ వేడుకలకు ప్రేక్షకులు గత ఎడిషన్ల కంటే తక్కువగా హాజరైనప్పటికీ పలువురు సినీ స్టార్లు తమ ఆట, పాటలతో వారిని ఉర్రూతలూగించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఉన్నతాధికారులు, ఐపిఎల్-9లో పాల్గొంటున్న ఎనిమిది జట్ల యజమానులు, ఆటగాళ్లు, సిబ్బంది తదితరులు హాజరైన ఈ వేడుకల్లో బాలీవుడ్ నటీనటులు రణ్‌వీర్ కపూర్, కత్రినా కైఫ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పంజాబీ ర్యాపర్ యో యో హనీ సింగ్ తదితరుల ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.
ముఖ్యంగా డ్వెన్ బ్రావో ‘చాంపియన్ డాన్స్’ ఈ వేడకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెస్టిండీస్‌కు రెండోసారి టి-20 ప్రపంచ కప్‌ను అందించిన జట్టులో సభ్యుడైన బ్రావో తెల్లటి బ్లేజర్, నల్లటి ట్రౌజర్‌ను ధరించి ‘చాంపియన్ డాన్స్’తో అందరినీ ఓలలాడించాడు. సహచర క్రికెటర్లుతో పాటు కొంత మంది వీక్షకులు అతనితో అడుగులు కలపడంతో స్టేడియం అంతటా హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇది ముగిసిన కొద్ది సేపటి తర్వాత బ్రావో ‘చలో చలో’ పాటకు కూడా డాన్స్ చేసి అభిమానులను మరింత ఉత్సాహపరచడంతో పాటు ‘చాంపియన్’ పాటకు హిందీ వెర్షన్ (హిందుస్థాన్ మే బడే బడే చాంపియన్) పాడిన బాలీవుడ్ నేపథ్య గాయకుడు అంకిత్ తివారీతో కలసి వేదికను పంచుకున్నాడు.
అయితే గత ఎడిషన్ల ఐపిఎల్ ఆరంభ వేడుకల మాదిరిగానే ఈసారి కూడా ఈ వేడుకల్లో క్రికెటర్ల పాత్ర చాలా తక్కువగా ఉంది. ఎనిమిది జట్ల కెప్టెన్లు వేదికపైకి వచ్చినప్పటికీ వారంతా కేవలం ప్రతిజ్ఞా కార్యక్రమానికి మాత్రమే పరిమితమయ్యారు. అభిమానులకు స్వచ్ఛమైన క్రికెట్ విందు అందిస్తామని వీరితో టీమిండియా డైరెక్టర్ రవిశాస్ర్తీ ప్రతిజ్ఞ చేయించాడు. ఐపిఎల్-9లో పాల్గొంటున్న ఎనిమిది జట్ల సారథులు జహీర్ ఖాన్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్), సురేష్ రైనా (గుజరాత్ లయన్స్), డేవిడ్ మిల్లర్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్), గౌతమ్ గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్), మహేంద్ర సింగ్ ధోనీ (రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్), విరాట్ కోహ్లీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), రోహిత్ శర్మ (ముంబయి ఇండియన్స్) ఒకరి తర్వాత మరొకరుగా ఈ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్టేజిపైకి ఐపిఎల్ ట్రోఫీని తీసుకురాగా, ఇతర జట్ల కెప్టెన్లతో పాటు బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అతనితో కలసి వేదికను పంచుకున్నారు.
ముంబయి ఇండియన్స్‌కు, భారత టి-20 జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో కొత్తగా రంగప్రవేశం చేసిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు మధ్య శనివారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో ఎడిషన్ టోర్నమెంట్ ఆరంభమవుతుంది.

విజయాల్లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్

ఐపిఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లను గెలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టు 132 మ్యాచ్‌లు ఆడి 79 విజయాలు సాధించింది. 51 మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొంది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ముంబయి ఇండియన్స్ 126 మ్యాచ్‌ల్లో 73 విజయాలు సాధించింది. 53 పరాజయాలను చవిచూసింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 132 మ్యాచ్‌ల్లో 66 విజయాలను నమోదు చేసింది. 63 పరాజయాలను ఎదుర్కొంది. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 119 మ్యాచ్‌ల్లో 57 మ్యాచ్‌లను గెల్చుకొంది. 61 పరాజయాలను ఎదుర్కొంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ 119 మ్యాచ్‌ల్లో 49, రాజస్థాన్ రాయల్స్ 118 మ్యాచ్‌ల్లో 61, కోల్‌కతా నైట్ రైడర్స్ 117 మ్యాజ్‌ల్లో 60, డక్కన్ చార్జర్స్ 75 మ్యాచ్‌ల్లో 29, పుణే వారియర్స్ 46 మ్యాచ్‌ల్లో 12, సన్‌రైజర్స్ హైదరాబాద్ 45 మ్యాచ్‌ల్లో 15, కొచ్చి టస్కర్స్ 14 మ్యాచ్‌ల్లో 6 చొప్పున విజయాలు సాధించాయ.

chitram...
ఐపిఎల్-9 ఆరంభ వేడుకల్లో ఒక అద్భుత ఘట్టం

వేదికపై ట్రోఫీతో ఎనిమిది జట్ల కెప్టెన్లు