సెంటర్ స్పెషల్

మహావిజేత 19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతలో వీరందరినీ ఆలయానికి తీసుకువెళ్లటానికి ఇతర అధికారులూ, భటులూ వచ్చారు. వారూ అక్షయునీ, విరజనీ చూసి ఆశ్చర్యచకితులైనారు.
చూపరుల్లో ఒక పెద్ద -‘ఏ అవాహిత జంట అయినా - మహర్నవమి నాడు ఈ కొలను నీటిలో మునిగి పైకి లేస్తే - ఇలాగే జరుగుతుంది. ఆ క్షణం నుంచీ వారి వివాహం అయినట్లే. వారు అప్పటి నుండీ దంపతులే. ఈ సాయంత్రం ఇక్కడ జరిగే వధూవర స్నానోత్సవం అంటే ఇదే. సాయంత్రం ఈ ఉత్సవాన్ని మీకు చూపుదామనుకున్నాం. వీరితో ఈ ఉదయమే మొదలైపోయింది. శుభం’ అన్నాడు.

అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. వజ్రసేనుడికి మనసంతా గజిబిజి అయింది. తండ్రి చండశాసన రూపం కళ్ల ముందు కదిలింది. ఎన్నో సంశయాలూ, భయాలూ పొడసూపినై. వాటి మధ్యగా సన్నని సంతోష రేఖ ద్యోతకమైంది.
అక్షయుడూ, విరజా అవ్యక్త భావోద్విగ్నతతో అవనత వదనులైనారు!
48
అష్టలో - విజయదశమి. నవరాత్రి ఉత్సవ సారమంతా ఈ రోజు మూర్తి కట్టినట్లు సంరంభం ద్విగుణీకృతంగా ఉంది.
ఉదయానే్న ఊరి మీద పడ్డారు - కుంతల రాచవారూ, వారి అనుయాయులూ, కళింద్రవారూ.
మొదటి కార్యక్రమం - వాడని పూలతోట సందర్శనం. అష్టకు యోజనం దూరంలో వున్నది ఆ తోట. అక్కడికి వెళ్లారు.
తోటలోని పూలన్నీ వింతవింత ఆకృతులలో వున్నాయి. రథచక్రమంత వున్న సూర్యకాంత పుష్పం ప్రత్యేకాకర్షణ! ఆ చెట్టు ఒకసారి ఒకటే పువ్వు పూస్తుంది. కొన్ని సంవత్సరాలపాటు వాడకుండా ఉంటుంది. వేరే కొన్ని పూలు పిట్టల ఆకారంలో ఉన్నాయి. కొన్ని పూలు - సప్తవర్ణ రేఖలతో సొంపారి వున్నై. లోగడ శతపత్ర కమలాన్ని చూశారు. కానీ, ఇక్కడ కొలనులో సహస్రదళ పద్మాలున్నాయి. అవీ ఎన్నాళ్లకోగానీ వాడవట.
మరో విచిత్రమూ ఉన్నదక్కడ. అరటి చెట్టులా ఆకులు కలిగిన చెట్టు ఒకటి కొంచెం పెడగా ఉంది. ఆ చెట్టు మొదటికి ఎవరైనా వెళ్లి నిలబడితే, ఆ ఆకులు వీరిని కౌగిలించుకున్నట్లుగా చుట్టి మళ్లీ కొన్ని క్షణాల్లో విడుస్తాయి. అందరూ ఆ ఆకుల స్పర్శని అనుభవించి ఆనందించారు.
రాచవారంతా ఈ తోటలోకి రావడం చూసిన స్థానీయులు కొందరు అక్కడికి చేరారు. వారు ‘స్ర్తి పురుష జంట ఆ ఆకుల దగ్గరికి వెళ్తే, ఒకరిపై ఒకరికి అనురాగం వున్నట్లయితే - ఆకులు ఇరువురినీ కలిపి చుట్టివేస్తాయట. ప్రేమ లేకపోతే ఒక్కరినే తమలోకి ఆహ్వానిస్తాయట’ అని చెప్పారు.
ఈ చిత్రాన్ని విని విషయలో ఉత్సాహం పెల్లుబికింది. అక్షయునీ, విరజనీ జంటగా చేర్చి అందరూ కోలాహలం చేస్తుండగా ఆ చెట్టు దరికి నడిపించింది. ఇద్దరినీ కలిపి ఆకులు కౌగిలించాయి. మామూలు సమయంకన్నా రెట్టింపు సమయం వారిని తమతో వుంచుకున్నాయా పత్రాలు. వారు బయటికి రాగానే ఒకటే కేరింతలూ, త్రుళ్లింతలూ, హాసాలూ, పరిహాసాలూ!
‘ఆ క్షణాల్లో ఏం జరిగింది విరజా’ అని కొంటె ప్రశ్న!
ఆ వనం నుంచీ అతి కష్టం మీద వెనక్కి వచ్చి భోజన సమయానికి విడిదికి తిరిగి వచ్చారు.
సాయంత్రం-
అష్టకు తూర్పున అర్ధయోజనం దూరంలో - పాప శమని గిరి మీద అన్నీ శమీవృక్షాలే. రాచవారంతా శమీ వృక్ష పూజకు బయలుదేరి వెళ్లారు.
ప్రజా సమూహం ‘జమ్మికొట్టటం’
జరుపుతున్నారు. దీనినే అపరాజితా శమీపూజ అనేది! అపరాజితాదేవిని ఊరి పొలిమేరను దాటించి, సీమోల్లంఘనం చేసి వచ్చారు. దానినే పారువేట అంటారు. ఆ తర్వాత జరిగేదంతా సామూహికా నందోత్సవమే, జాతరే, సంబరమే! రాచవారంతా పరిహాసాలతో, సరసోక్తులతో కాలక్షేపం చేశారు!
చీకటి పడింది.
దీపాలు వెలిగించారు.
గిరి ప్రాంతమంతా నీడలమయమై పోయింది. ఆడవారు బృందగానంతో దిక్కుల్ని పిక్కటిల్లజేస్తున్నారు. చుట్టూ వుండి మగవారు ఆ నృత్యానికి తగిన విన్యాసాల్ని చేస్తున్నారు. సందర్శకులంతా చూపుల్ని ఒకచోట నిలపలేక పోతున్నారు. తెలియని ఉత్తేజంతో వారి హృదయాలు ఉప్పొంగుతున్నాయి. రాచవారు కూర్చున్న వేదిక వరకూ నాట్యం చేస్తున్న స్ర్తిలూ, విన్యాసాలు చేస్తున్న పురుషులూ విస్తరించి ఉన్నారు. అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో వారంతా ఇంకా.. ఇంకా విజృంభిస్తున్నారు. ప్రాణాలు తోడేస్తున్న ఉత్కంఠ!
అదిగో - అప్పుడు,
ముఖాన్ని రంగు గుడ్డతో మరుగు చేసుకున్న యువకుడొకడు హఠాత్తుగా చేతనున్న ఖడ్గాన్ని ఝళిపిస్తూ వేదికపైకి దూకి చంపకమాలినిపై వేటు వేయబోయాడు.
అంతే మెరుపు వేగంతో మరొక ముసుగు వీరుని ఖడ్గం ఆ ఖడ్గాన్ని అడ్డుకుని విసురుగా ఒక్క వేటు వేసింది. ఆ తీవ్రతకీ, వేగానికీ మొదటి వ్యక్తి ఖడ్గం గాలిలోకి ఎగసి దూరంగా పడింది!
దిగ్గున లేచింది చంపకమాలిని. ఒడుపుగా తల పక్కకి వంచి వేదిక మీది నుంచీ నేల పైకి దూకేసింది.
పక్కనున్న విషయ రాకమార్తెతోపాటు లంఘించింది. మిగిలిన వారంతా తత్తరగా నిలబడి నిశే్చష్టులైనారు.
ఈ చర్యలకి సమాంతరంగా ముసుగు మనుషులిద్దరూ అంతే వేగంతో పారిపోయారు.
జనంలో కలకలం. కొందరు చెల్లాచెదరుగా పరిగెత్తుతున్నారు. కొందరు వేదికని చేరుకుంటున్నారు.
క్షణాల్లో అక్షయుడూ, వజ్రసేనుడూ, కుంజరుడూ, వివరీ ఆ ముసుగు మనుషుల కోసం వారు వెళ్లిన దిశగా పరిగెత్తారు. భటులు వలయంగా నిలిచి రాకుమార్తె బృందానికి రక్షణ కల్పించారు.
అర్థముహూర్త కాలం గడిచిన తర్వాత అక్షయాదులు తిరిగి వచ్చారు. ముసుగు మనుషుల జాడ తెలియలేదు. కుంజరుడూ, వివరీ జరిగిన సంభవానికి రాకుమారి బృందానికి క్షమాపణలు తెలుపుకున్నారు.
వజ్రసేనుడు వారి వివరణలతో సంతృప్తి చెందలేదు. ‘కళింద్ర వారి సాహసం, శౌర్యం - ఇంత పలచబడినాయని మాకు తెలీదు. తెలిస్తే వలసిన సంఖ్యలో కుంతల రక్షక భటుల్ని తెప్పించేవాళ్లం’ అన్నాడు.
అక్షయుడికి మనస్సు నొచ్చుకుంది. రోషం ఎగసింది. ‘కళింద్ర సాహసమేగా - ఇప్పుడు ఈ హత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నది. అది గమనించాలి’ అన్నాడు.
‘ఏమో? అన్నీ అవాంఛనీయ ఘటనలే’ అని పెదవి విరిచింది విరజ.
‘మా అన్న చంద్ర ఒక సూక్తి చెప్తూ ఉంటాడు. అంతా మన దృక్పథంలోనే ఉంటుందని. ధనధృవం - ఋణ ధృవం సామెతన్న మాట’ అన్నది పద్మిని.
‘అంత సాంకేతికంగా పోవనక్కర్లేదు గానీ, గుడ్డిలో మెల్ల అనుకుంటే సరి’ అని నవ్వేసింది విషయ. అంతా నెమ్మదించారు.
ఇంతలో - వాననీటి ముత్యాలు జలజలా రాలసాగాయి. ప్రజలు నీడలు వెదుక్కున్నారు. కొందరు వర్షపు హర్షంలో నిలుస్తున్నారు. రాచవారు రథాలలోకి చేరారు!
49
ఆ రాత్రి - రెండవ జాము దాటింది. నగరం సద్దుమణిగింది. రాచవారి విడిదిలోనూ కొన్ని దీపాలు మలిగాయి. విడిది బయట భటులు కాపలా కాస్తున్నారు.
లోపల తన గదిలో పడుకున్నదన్న మాటే గానీ రాకుమారికి నిద్ర పట్టటం లేదు. మనసు పరిపరి ఆలోచనల చుట్టూ పరిభ్రమిస్తోంది. ఎవరీ హత్యా ప్రయత్నం చేసింది? తన మీదే ఎందుకు జరిగింది? దాడిని అడ్డుకున్న ముసుగు వీరుడెవరు? అసలు అతడు ఎటు నుంచీ వచ్చాడో, ఎలా శత్రువు ఖడ్గాన్ని ఛేదించాడో అర్థం కానంత వేగం అది. లిప్తమాత్రలో గాలిలో తేలి, ఏ ఇంద్రజాలమో చేస్తున్నట్టు రక్షించాడు. అతడు అతి సాహసి మాత్రమే కాదు, అమిత యుక్తిపరుడు కూడా!
ఈ తలపుతో ఆమె భావస్పందన రాగరంజితమైంది.
సరిగా, ఇదే సమయంలో-
విషయ తన పానుపు మీద నుంచీ లేచి గదిలో నడకతో తూర్పు పడమరల మధ్య దూరాన్ని పునః పునః కొలుస్తున్నది. అక్కడ చంపకమాలినిలో సంచలించిన భావతరంగాలే ఇక్కడ ఈమె హృదయాన్నీ స్పర్శించి కలవరపరుస్తున్నాయి. ఎవరా ముసుగు వీరుడు? - జవాబులేని ప్రశ్న.

-విహారి 98480 25600