క్రీడాభూమి

కోపా అమెరికా టైటిల్‌ను నిలబెట్టుకున్న చిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈస్ట్ రూథర్‌ఫర్డ్ (అమెరికా), జూన్ 27: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్ చిలీ నిలబెట్టుకుంది. నిర్ణీత సమయంలో, ఆతర్వాత ఎక్‌స్ట్రా టైమ్‌లో గోల్స్ నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. స్టార్ ఆటగాడు, కెప్టెన్ లియోనెల్ మెస్సీ అనూహ్యంగా విఫలం కావడం అర్జెంటీనాను దెబ్బతీసింది. చిలీ నాలుగు గోల్స్ చేయగా, అర్జెంటీనా రెండు గోల్స్‌కే పరిమితమై పరాజయాన్ని ఎదుర్కొంది. గత ఏడాది కూడా ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్ చేరింది. ఇదే తరహాలో పెనాల్టీ షూటౌట్ తప్పనిసరిగా మారింది. అప్పుడు 4-1 తేడాతో గెలిచిన చిలీ ఈసారి 4-2 తేడాతో విజయం సాధించింది. 2014 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్, గత ఏడాది కోపా అమెరికా, ఈసారి తిరిగి అదే టోర్నీలో అర్జెంటీనా ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోవడం గమనార్హం.
డిఫెన్స్‌కే ప్రాధాన్యం
టైటిల్ నిలబెట్టుకోవడానికి చిలీ, 23 సంవత్సరాల తర్వాత మేజర్ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో అర్జెంటీనా ఫైనల్ పోరును ప్రతిష్ఠాత్మకంగా స్వీకరించాయి. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. ఫైనల్ పోరులో చిలీ, అర్జెంటీనా హోరాహోరీగా తలపడతాయని మ్యాచ్‌ని తిలకించేందుకు హాజరైన 82,026 మంది ప్రేక్షకులు ఊహించారు. చాలా మంది ప్రత్యేకంగా మెస్సీ విజృంభణను చూసేందకే స్టేడియానికి పరుగులు తీశారు. కానీ, వారి అంచనాలకు భిన్నంగా మ్యాచ్ కొనసాగింది. రెండు జట్లు మితిమీరిన డిఫెన్స్‌కు దిగడంతో మ్యాచ్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇరు జట్లకు గోల్స్ చేసే అవకాశాలు కొన్ని లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. ఎక్కువ భాగం డిఫెన్స్, చాలా తక్కువ సమయం అటాకింగ్‌లతో సమయం గడిచిపోగా, నిర్ణీత 90 నిమిషాల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీనితో 30 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. కానీ, ఎక్‌స్ట్రా టైమ్‌లోనే అదే పరిస్థితి పునరావృతమైంది. ఫలితంగా గోల్స్ లేకుండానే ఆ సమయం కూడా ముగిసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో, మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ అవసరమైంది. మొదటి కిక్ అవకాశం చిలీకి దక్కగా ఆర్టరో విడాల్ తన ప్రయత్నంలో విఫలమయ్యాడు. అర్జెంటీనా తరఫున కిక్‌కు మెస్సీ సిద్ధమైన వెంటనే స్టేడియం చప్పట్లో మారుమోగింది. కానీ, అతను గోల్ చేయడంలో విఫలమయ్యాడు. చిలీ తరఫున రెండో కిక్‌ను నికోలస్ కాస్టిల్లో గోల్‌గా మలచగా, అర్జెంటీనాకు జేవియర్ మస్కరానో గోల్‌ను అందించాడు. స్కోరు 1-1గా నిలిచింది. మూడో ప్రయత్నంలో చిలీకి చార్లెస్ అంక్విజ్ ద్వారా గోల్ లభించింది. అర్జెంటీనాకు సెర్గియో అగెరో గోల్‌ను సాధించి పెట్టాడు. చిలీ తరఫున నాలుగో అవకాశాన్ని జీన్ బిసెజర్ సద్వినియోగం చేసుకోగా, అర్జెంటీనా ఆటగాడు లూకాస్ బిగ్లియా గోల్ చేయడంలో విఫలమయ్యాడు. దీనితో చిలీ 3-2 ఆధిక్యాన్ని సంపాదించింది. చిరిదైన ఐదో కిక్‌ను తీసుకున్న ఫ్రాన్సాస్కో సిల్వ కూడా గోల్ చేయడంతో చిలీ ఆధిక్యం 4-2కు చేరింది. ఒకవేళ చివరి అవకాశాన్ని ఉపయోగించుకున్నా చిలీని ఓడించడం అసాధ్యం కాబట్టి అర్జెంటీనా ఐదో కిక్ కొట్టకుండానే మ్యాచ్ ముగిసింది.
అవార్డులు
కోపా అమెరికాలో ఈసారి అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చిలీకి చెందిన ఎడ్యూరో వర్గాస్ నిలిచాడు. అతను మొత్తం ఆరు గోల్స్ చేయగా, అర్జెంటీనా ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, గంజాలెజ్ హిగున్ వరుసగా ఐదు, నాలుగు గోల్స్‌తో రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు. మొత్తం మీద అన్ని మ్యాచ్‌ల్లో కలిపి 91 గోల్స్ నమోదయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 14,83,855 మంది ప్రత్యక్షంగా మ్యాచ్‌లను తిలకించారు. ఉత్తమ ఆటగాడిగా అలెక్స్ సాంచెజ్ (చిలీ)కి అవార్డు లభించింది. ఉత్తమ గోల్‌కీపర్‌గా కూడా చిలీకి చెందిన క్లాడియో బ్రేవో అవార్డును స్వీకరించాడు. ఫెయిర్ ప్లే అవార్డు అర్జెంటీనా జట్టుకు దక్కింది.

చిత్రం అర్జెంటీనాను ఓడించి కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను నిలబెట్టుకున్న చిలీ జట్టు