క్రీడాభూమి

చాలా కాలం ఆగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: టెస్టు క్రికెట్ మ్యాచ్‌ల పట్ల అభిమానుల్లో ఆసక్తిని నిలబెట్టేందుకు మున్ముందు పింక్ బాల్స్‌తో డే/నైట్ టెస్టులు నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉందని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే అంగీకరించాడు. అయితే పింక్ బాల్ టెస్టుల కోసం భారత అభిమానులు ఇంకా చాలా కాలం ఆగాల్సిందేనని అతను మంగళవారం స్పష్టం చేశాడు. ఉపఖండంలోని పిచ్‌లపై భారత స్పిన్నర్లు పింక్ బాల్స్‌తో ఎలా నెట్టుకొస్తారన్న ప్రశ్నకు కుంబ్లే సమాధానమిస్తూ, ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో భారత ఆటగాళ్లు ‘రెడ్ డ్యూక్’ బంతులతో ఎలా రాణిస్తారన్న దానిపైనే దృష్టి కేంద్రీకరించానన్నాడు. ‘పింక్ బాల్స్‌తో టెస్టులు ఆడటం గురించి నిజంగా మేము ఇప్పటివరకూ ఆలోచించలేదు. డే/నైట్ టెస్టుల కోసం భారత అభిమానులు ఇంకా చాలా కాలం వేచిచూడాల్సిందే. కరీబియన్ దీవుల్లో ప్రస్తుతం మేము రెడ్ డ్యూక్ బంతులతో విండీస్‌తో ఆడబోతున్నాం. ఈ సిరీస్ మాకు ఎంతో ముఖ్యమైనది. అందుకే గత ఆరు రోజులుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)లో రెడ్ డ్యూక్ బంతులతో సాధన చేశాం. గులాబీ రంగు బంతులతో డే/నైట్ టెస్టులు ఆడాలని అనుకున్న తర్వాత ఆ విషయంపై దృష్టి సారిస్తాం’ అని ట్విట్టర్ ద్వారా పిటిఐ వార్తా సంస్థ నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కుంబ్లే తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కిన కుంబ్లే ప్రస్తుతం ఐసిసి (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) క్రికెట్ కమిటీకి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న విషయం విదితమే. అయితే మున్ముందు టీమిండియా సహా ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లు డే/నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడకతప్పదని అతను అంగీకరించాడు. ‘టెస్టు క్రికెట్ మ్యాచ్‌లకు మళ్లీ భారీ సంఖ్యలో అభిమానులను రప్పించాలంటే డే/నైట్ టెస్టులను ప్రోత్సహించాల్సిందే. ఇటువంటి మ్యాచ్‌లను నిర్వహిస్తే ఆఫీసుల్లో పనులు పూర్తయ్యాక ప్రజలు భారీగా స్టేడియంలకు తరలివస్తారు’ అని కుంబ్లే ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
ఇదిలావుంటే, భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని, గొప్ప నాయకుడని కుంబ్లే ప్రశంసల జల్లు కురిపించాడు. అతనితో కలసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని కుంబ్లే తెలిపాడు. ‘కోహ్లీతో కలసి పనిచేయాలని ఎంతో ఆసక్తితో ఉన్నా. అండర్-19 ఆటగాడిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చోటు దక్కించుకున్నప్పటి నుంచే కోహ్లీ ఆటతీరును పరిశీలిస్తున్నా. గత రెండేళ్లలో అతను ఎంతో పరిణితి సాధించాడు. అద్భుతమైన బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్న కోహ్లీ గొప్ప నాయకుడు కూడా. నా మాదిరిగానే కోహ్లీ కూడా దూకుడును ప్రదర్శించే ఆటగాడు. అతనితో కలసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా’ అని కుంబ్లే చెప్పాడు. కాగా, టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ తీరుకు కరీబియన్ దీవుల్లోని పిచ్‌లు చక్కగా నప్పుతాయని, కనుక విండీస్ పర్యటనలో అతను మంచి ఫలితాలను అందిస్తాడని ఆశిస్తున్నానని కుంబ్లే తెలిపాడు.