క్రీడాభూమి

చెంగ్డూలో ‘తెలుగు తేజం’ హారికకు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెంగ్డూ (చైనా), జూలై 14: చైనాలోని చెంగ్డూలో జరిగిన మహిళల ఫైడ్ గ్రాండ్ ప్రీ చెస్ టోర్నమెంట్‌లో ‘తెలుగు తేజం’ ద్రోణవల్లి హారిక విజేతగా నిలిచింది. గురువారం ఆమె రష్యాకు చెందిన ఓల్గా గిర్యాతో ఉత్కంఠ భరితంగా జరిగిన చివరి రౌండ్ గేమ్‌ను డ్రాగా ముగించి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 12 మంది మేటి క్రీడారులతో మొత్తం 11 రౌండ్ల పాటు సాగిన ఈ టోర్నీలో హారిక 7 పాయింట్లతో పోరాటాన్ని ముగించింది. ఈ టోర్నీ చివరి గేమ్‌లో ప్రత్యర్థిని ఓడించి మొత్తం 7 పాయింట్లు రాబట్టుకున్న మరో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కూడా హారికతో సరిసమానంగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో హంపి కంటే హారిక ఉత్తమ టైబ్రేక్ రికార్డును కలిగి ఉండటంతో ఆమెనే విజేతగా ప్రకటించారు. తొలి రెండు గేముల్లో విజయాలు సాధించి ఆదిలోనే ఆధిక్యతను కూడగట్టుకున్న హారిక ఆ తర్వాత వరుసగా నాలుగు డ్రాలతో రెండో స్థానానికి దిగజారినప్పటికీ ఏమాత్రం తొణకలేదు. ఏడో రౌండ్‌లో కోనేరు హంపిని ఓడించి మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లిన హారిక ఆ తర్వాత ప్రశాంతంగా నాలుగు గేమ్‌లను డ్రాగా ముగించి ఈ విజయాన్ని అందుకుంది. వత్తిడి వలన చివరి గేమ్‌లో తప్పిదాలకు పాల్పడి తీవ్ర ఉత్కంఠకు గురైన హారిక మొత్తం మీద తన పోరాటాన్ని విజయవంతంగా ముగించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత హారిక మాట్లాడుతూ, తాను గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ చివరి గేమ్‌లో తీవ్రమైన వత్తిడికి లోనవడం వలన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయానని, ఏది ఏమైనప్పటికీ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను గెలుచుకోవడం ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చెంగ్డూ ఎరీనాలో జాతీయ గీతాలాపన జరుగుతున్నప్పుడు కూడా హారిక ఎంతో భావోద్వేగానికి గురైంది.

చిత్రం.. తొలిసారి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను కైవసం చేసుకున్నహారిక