క్రీడాభూమి

డోపింగ్ పరీక్షలో నర్సింగ్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: రియో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న భారత క్రీడా బృందానికి ఆదివారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పక్కకు నెట్టి రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో అతనిపై ప్రాథమిక సస్పెన్షన్ విధించారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నర్సింగ్ నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినట్లు పరీక్షల్లో తేలిందని, దీంతో అతను శనివారం నాడా క్రమశిక్షణా కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యాడని నవీన్ అగర్వాల్ పేర్కొన్నాడు. నర్సింగ్ యాదవ్ మెథాన్‌డియెనోన్ అనే నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని ఉపయోగించినట్లు పరీక్షలో తేలిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘నర్సింగ్ యాదవ్ నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినట్లు పరీక్షల్లో తేలింది. అతని బి శాంపిల్‌కు నిర్వహించిన పరీక్షల్లో కూడా ఇదే విషయం వెల్లడైంది. బి శాంపిల్‌కు పరీక్ష నిర్వహించబోయే ముందు నర్సింగ్ వ్యక్తిగతంగా హాజరయ్యాడు. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వవరాలు అందజేయాలని క్రమశిక్షణా కమిటీ కోరడంతో మేము మరింత లోతుగా పరిశీలిస్తున్నాం. ఈ వ్యవహారంలో క్రమశిక్షణా కమిటీ చురుకుగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం. అప్పటి వరకూ అందరూ వేచిచూడాల్సిందే’ అని నవీన్ అగర్వాల్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు. దీంతో నర్సింగ్ రియో ఒలింపిక్స్‌కు దూరమవుతాడా? అని ప్రశ్నించగా, దీని గురించి ఇప్పుడే వ్యాఖ్యలు చేయడం తొందరపాటు అవుతుందని, సాధ్యమైనంత త్వరగా ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని, అప్పటి వరకూ ఎటువంటి ఊహాగానాలు చేయలేనని నవీన్ అగర్వాల్ చెప్పాడు.
ఇదంతా కుట్రే : నర్సింగ్
అయితే తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఎన్నడూ నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని ఉపయోగించలేదని నర్సింగ్ యాదవ్ వాపోయాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా తనను దెబ్బతీయాలన్న కుట్రతోనే ఈ కుంభకోణం జరిగిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో నర్సింగ్ యాదవ్‌కు అతని కోచ్, సపోర్ట్ స్ట్ఫాతో పాటు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) వర్గాలు బాసటగా నిలిచాయి. నర్సింగ్ యాదవ్‌కు మచ్చలేని చరిత్ర ఉందని, అతడి భవిష్యత్తును దెబ్బతీయాలన్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ కుట్ర జరిగినట్లు స్పష్టమవుతోందని డబ్ల్యుఎఫ్‌ఐ వర్గాలు పేర్కొన్నాయి.
నిగూఢార్థంతో సుశీల్ ట్వీట్
గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న నర్సింగ్ యాదవ్ ఇంతకుముందు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పక్కకు నెట్టి రియో ఒలింపిక్స్ 74 కిలోల విభాగంలో పాల్గొనేందుకు వివాదాస్పద రీతిలో బెర్తును దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరపాలని సుశీల్ కుమార్ చేసుకున్న విజ్ఞప్తులను అటు డబ్ల్యుఎఫ్‌ఐతో పాటు ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించింది. అయితే డోపింగ్ పరీక్షలో నర్సింగ్ యాదవ్ విఫలమయ్యాడన్న వార్తపై సుశీల్ కుమార్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకపోయినప్పటికీ నిగూఢార్థంతో కూడిన ఒక ట్వీట్ చేశాడు. ‘గౌరవాన్ని సంపాదించుకోవాలే తప్ప డిమాండ్ చేయకూడదు’ అని సుశీల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్‌ను ఎందుకు చేశాడో, ఎవరిని ఉద్దేశించి చేశాడో సుశీల్ వెల్లడించలేదు.

ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో గత ఏడాది కాంస్య పతకాన్ని గెలుచుకున్న నర్సింగ్ యాదవ్ (ఫైల్ ఫొటో)