క్రీడాభూమి

వివాదాలతో చెట్టపట్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ క్రీడా రంగం ఈఏడాది ఎన్నో వివాదాలతో చట్టపట్టాలేసుకొని సాగింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైఖేల్ ప్లాటనీపై ఎనిమిదేళ్ల వేటు పడడం సంచలనం సృష్టించింది. ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌లో పతకాలను కొల్లగొట్టడానికి వీలుగా రష్యా ప్రభుత్వం అథ్లెట్లకు ఉత్ప్రేరకాలను ఉద్దేశపూర్వకంగానే ఇచ్చి, ప్రోత్సహించిందని, ఈ ప్రక్రియ కొన్ని దశాబ్దాలుగా వ్యూహాత్మక ప్రణాళికగా సాగుతున్నదని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ చేసిన ప్రకటన యావత్ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా చోటు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో దోషులుగా తేలిన వారిపై వేటు పడడం వివాదాల క్రీడా సంవత్సరానికి ఒక గొప్ప ముగింపుగా చెప్పుకోవాలి. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ)లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిజెపి నుంచి సస్పెన్షన్‌కు గురైన పార్లమెంటు సభ్యుడు కీర్తీ ఆజాద్ చేసిన ఆరోపణలతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. డిడిసిఎలో ఇప్పటి వరకూ కుదిరిన పలు ఒప్పందాలను ఢిల్లీ సర్కారు తిరిగి తోడుతున్నది. మరోవైపు కేజ్రీవాల్‌సహా ఆరుగురిపై జైట్లీ పరువునష్టం దావా వేశాడు. డిడిసిఎ కూడా ఇలాంటి చర్యకే సిద్ధమైంది.
నడి బజారులో ఫిఫా పరువు!
ఫిఫా పరువు నడి బజారులో పడింది. రష్యా, కతార్ దేశాలకు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించే హక్కులను కట్టబెట్టేందుకు భారీగా ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఫిఫా అధికారులపై కేసులు నమోదయ్యాయి. వరల్డ్ కప్ హక్కుల కోసం పోటీపడిన అమెరికా కూడా పెద్దమొత్తాలనే సమర్పించుకుంది. ఇప్పుడు హక్కులు లభించకపోవడంతో ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. అమెరికా నిఘా విభాగం సూచనల మేరకు ఫిఫా ప్రధాన కార్యాలయం ఉన్న జ్యూరిచ్‌లో స్విట్జర్లాండ్ అధికారులు 14 మందిని అరెస్టు చేశారు. 50 బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారు. ముడుపుల వ్యవహారం బ్లాటర్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో, అతనిపై ఒత్తిడి పెరిగిచింది. ఈఏడాది మే మాసంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన అతను కొన్ని గంటల్లో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేగాక, ప్లాటినీతో కలిసి అతనిపైనా వేటు పడింది. ప్లాటినీకి భారీ మొత్తాన్ని చెల్లించిన ఆరోపణను ఎదుర్కొంటున్న బ్లాటర్ ఫిఫా ట్రిబ్యునల్ ముందు హాజరై తాను నిర్దోషినని వాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్లాటినీ మాత్రం ట్రిబ్యునల్ ముందు హాజరయ్యేందుకు నిరాకరించాడు. వివరణ ఇచ్చిన బ్లాటర్, అసలు విచారణకే హాజరుకాని ప్లాటినీపై ట్రిబ్యునల్ ఒకే రీతిలో స్పందించింది. పరస్పర ప్రయోజనాలున్న నేరానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇద్దరినీ చెరి ఎనిమిదేళ్లు నిషేధించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగనుండగా, రేసులో ఉన్న అభ్యర్థుల్లో హాట్ పేవరిట్‌గా ముద్ర వేయించుకున్న ప్లాటినీపై వేటు పడడం గమనార్హం. అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఫిఫా అధ్యక్షుడిగా అతను సరైన దిశగా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. అతని ముడుపులు, ఇతర ఆరోపణలల్లో బ్లాటర్ ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి రుజువులు లేకపోయినా, అతను అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే వివాదం తెరపైకి రావడంతో చిక్కుల్లో పడ్డాడు. 2011లో ప్లాటినీకి రెండు మిలియన్ డాలర్లను ఫిఫా ఖాతా నుంచి అక్రమంగా చెల్లింపులు జరిపాడన్న ఆరోపణలను బ్లాటర్ ఎదుర్కొంటున్నాడు. అయితే, తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నానని బ్లాటర్ వాదన. అంతకు ముందు దశాబ్దం క్రితం ఒక కాంట్రాక్టును ప్లాటినీ పూర్తి చేశాడని, దానికి సంబంధించిన చెల్లింపులే జరిగాయని అతను ట్రిబ్యునల్‌కు వివరించాడు. అయితే, అతను 2011లో ఫిఫా అధ్యక్ష పదవికి బ్లాటర్ పోటీ చేశాడు. అంతకు ముందు వరకూ అతని నమ్మిన బంటుగా ఉన్న ప్లాటినీ హఠాత్తుగా వేరు కుంపటి పెట్టడమేగాక, అధ్యక్షుడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. యూఫాలో తనకు ఉన్న పరపతిని ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలవాలన్న వ్యూహంతో మద్దతును కూడగట్టుకున్నాడు. ఈ పరిణామాలు బ్లాటర్‌ను ఆందోళనకు గురి చేశాయని, ప్లాటినీని రేసు నుంచి తప్పించడానికే అతను ఈ మొత్తాన్ని చెల్లించాడని ప్రాసిక్యూషన్ ఆరోపణ. కేసు పూర్వాపరాలు పరిశీలించి, వాదోపవాదాలు విన్న తర్వాత బ్లాటర్, ప్లాటినీపై సస్పెన్షన్ విధిస్తూ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే, బ్లాటర్, ప్లాటినీ మధ్య ఒక పనికి సంబంధించిన కాంట్రాక్టు 1999 ఆగస్టులో కుదిరింది. ఆతర్వాత తనకు అప్పచెప్పిన పనిని ప్లాటినీ 2002లో పూర్తి చేశాడని బ్లాటర్ అంటున్నాడు. అయితే, తమ మధ్య కుదిరినట్టు చెప్తున్న ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్లను బ్లాటర్ సమర్పించలేదని ట్రిబ్యునల్ ప్రకటించింది. అంతేగాక, ఆధారాలను కూడా చూపలేకపోయాడని తన తీర్పులో పేర్కొంది. వీరిద్దరిపైనా ఇతరత్రా అవినీతి ఆరోపణలు ఏవీ లేవని స్పష్టం చేసింది. పరస్పర ప్రయోజనాలను కలిగించే రీతిలో భారీ మొత్తం ఫిఫా ఖాతా నుంచి ప్లాటినీ ఖాతాకు బ్లాటర్ మళ్లించాడని తెలిపింది. ఆ కేసులోనే వీరిపై సస్పెన్షన్ విధించామని చెప్పింది. అంతేగాక, వీరికి భారీ జరిమానా విధించింది. బ్లాటర్‌కు 50,000 డాలర్లు, ప్లాటినీకి 80,000 డాలర్లు చొప్పున జరిమానా విధించింది.
సెనెగల్‌కు రష్యా ముడుపులు!
సెనెగల్ ఓటు కోసం రష్యా భారీ మొత్తాలను చెల్లించిందని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) మాజీ చీఫ్ లామిన్ డియాక్ ఆరోపించాడు. ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించే హక్కును సొంతం చేసుకోవడానికి రష్యా అక్రమ మార్గాలను ఎంచుకుందని, 2012 సెనెగల్ సార్వత్రిక ఎన్నికల్లో తమకు అనుకూలమైన శక్తులు అధికారాన్ని చేజిక్కించుకునేలా రష్యా భారీ మొత్తాలను కుమ్మరించిందని ఆరోపించాడు. లంచాలు తీసుకోవడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం వంటి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డియాక్ ఈ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనపై వచ్చిన విమర్శలను తప్పించుకొని, కేసులు, విచారణలు లేకుండా చేసుకోవాలన్న లక్ష్యంతో ఎదురుదాడికి దిగాడన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, అతను మాత్రం ఇది వాస్తవమని స్పష్టం చేస్తున్నాడు. అబ్దొలయే వేడ్ మళ్లీ ఎన్నిక కాకుండా అడ్డుకోవడానికి రష్యా 1.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేసిందని తెలిపాడు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి మేజర్ టోర్నీల్లో పతకాలను సంపాదించుకోవడానికి వ్యూహాత్మక డోపింగ్‌ను ప్రోత్సహించిందని రష్యాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్య నుంచి ఇంకా బయటపడక ముందే సెనెగల్ ఓటు కోసం ముడుపులు చెల్లించిందని డియాక్ ఆరోపించడం గమనార్హం. రష్యా క్రీడా రంగం సంక్షోభంలో పడిందని ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
బిసిసిఐ ఇష్టారాజ్యం
పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాల్సి ఉన్నప్పటికీ, చివరి క్షణం వరకూ నాన్చివేత ధోరణిని అనుసరించిన బిసిసిఐ వివాదాన్ని రాజేసింది. పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు ఇది సరైన సమయం కాదని బిసిసిఐకి తెలుసు. కానీ, దుబాయ్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్‌ను కలిసిన బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ చర్చలు జరిపాడు. సిరీస్ వివరాలను ఖరారు చేసుకోవడానికి భారత్‌కు రావాల్సిందిగా అతనిని ఆహ్వానించాడు. తీరా షహర్యార్ వచ్చేసరికి ఏం చేయాలో అర్థంగాక, అంతకు ముందు శివసేన కార్యకర్తలు బిసిసిఐ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన సంఘటనను సాకుగా చూపి అతనితో భేటీ కాలేదు. ఢిల్లీలో మాట్లాడుకుందామని సూచించి, అక్కడికి కూడా వెళ్లలేదు. ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్‌ను అనుసరించి పాక్‌తో సిరీస్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆడాల్సి ఉన్నప్పటికీ అక్కడికి వచ్చేది లేదని తేల్చిచెప్పిన బిసిసిఐ ఆతర్వాత శ్రీలంకను తటస్థ వేదికగా పేర్కొంది. అందుకు తమ దేశ ప్రభుత్వ అనుమతిని కూడా పిసిబి పొందిన తర్వాత, తమకు ఇంకా కేంద్రం నుంచి సమాచారం రాలేదంటూ చివరి వరకూ సమస్యను నాన్చింది. ఇక సిరీస్ జరిగే అవకాశం లేదని పిసిబితోనే చెప్పించింది. ముందుగా కేంద్రం అభిప్రాయం తెలుసుకోకుండా, అనుమతి తీసుకోకుండా పిసిబితో చర్చలు జరిపి, వేదికను, తేదీలను ఖరారు చేయడం బిసిసిఐ అహంకార పూరిత ధోరణికి నిదర్శనం. అందుకే, ముంబయిపై ఉగ్రవాద దాడుల తర్వాత పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోయినా భారత్‌ను ఎన్నడూ విమర్శించని వారు ఇప్పుడు బిసిసిఐ వైఖరిపై ధ్వజమెత్తుతున్నారు. ధన బలంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరితోనూ బిసిసిఐ వచ్చే నష్టం ఏమీ లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఒంటరిగా మిగిలి పోయే ప్రమాదం ఉంది.