క్రీడాభూమి

ఆఖరి యుద్ధానికి బింద్రా సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 5: గతంలో ఎన్నడూ లేని విధంగా వందకుపైగా సభ్యులతో కూడిన భారత బృందం పతకాలపై భారీ అంచనాతో రియో ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నది. స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు ఇవే చివరి ఒలింపిక్స్ కావడంతో అందరి దృష్టి అతనిపై కేంద్రీకృతమైంది. ప్రారంభ వేడుకల కవాతులో భారత బృందానికి నాయకత్వం వహించిన 38 ఏళ్ల బింద్రా రియో ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్తున్నట్టు ఇది వరకే ప్రకటించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించిన అతను 2012 లండన్ ఒలింపిక్స్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ పోటీల్లో విజయ్ కుమార్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో రజత పతకాన్ని, గగన్ నారంగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడంతో భారత్ పరువు నిలబెట్టుకుంది. అయితే, రియోలో పతకాన్ని సాధించడం ద్వారా, ఒలింపిక్ కెరీర్‌ను అత్యున్నత స్థాయిలో ముగించాలని బింద్రా పట్టుదలతో ఉన్నాడు. బింద్రాతోపాటు లండన్ ఒలింపిక్స్ పతక విజేత గగన్ నారంగ్ కూడా పోటీలో ఉండడంతో షూటింగ్‌లో ఈసారి కనీసం రెండు పతకాలు లభిస్తాయని అధికారులు ధీమాతో ఉన్నారు. వీరితోపాటు క్యాన్ చెనాయ్, మైరాజ్ అహ్మద్ ఖాన్, ప్రకాష్ నంజప్ప, జితూ రాయ్, చైన్ సింగ్, గుర్‌ప్రీత్ సింగ్, మానవ్‌జిత్ సింగ్ సిద్ధు కూడా పురుషు విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తున్న జితూ రాయ్ స్వర్ణ పతకం సాధించే సత్తా ఉన్నవాడని పరిశీలకుల అభిప్రాయం. ఇలావుంటే, మహిళల విభాగకంలో అపూర్వీ చండీలా, అయోనికా పాల్, హీనా సిద్ధు షూటింగ్‌లో పతకాల కోసం పోటీపడతారు. వీరిలో అపూర్వీ, హీనాలకు తప్పక పతకాలు లభిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లండన్ కంటే మెరుగ్గా..
లండన్ ఒలింపిక్స్‌లో మొత్తం ఆరు పతకాలు సాధించిన భారత్ ఈసారి రియోలో మెరుగ్గా రాణించి అంతకంటే ఎక్కువ పతకాలను కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమాతో ఉంది. లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ (షూటింగ్), సుశీల్ కుమార్ (రెజ్లింగ్) రజత పతకాలను సాధించారు. సైనా నెహ్వాల్ (బాడ్మింటన్), మేరీ కోమ్ (బాక్సింగ్), గగన్ నారంగ్ (షూటింగ్), యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్) కాంస్య పతకాలను గెల్చుకున్నారు. లండన్ ఒలింపిక్స్‌కు మన దేశం మొత్తం 83 మందిని పంపింది. అప్పట్లో అదే రికార్డు. ఈసారి రియోకు ఏకంగా 118 మందిని పంపింది. డోపింగ్‌లో విఫలమైన స్ప్రింటర్ ధరమ్‌వీర్ సింగ్ స్వదేశంలోనే ఉండిపోయాడు. అతనికి గ్రీన్ సిగ్నల్ లభిస్తే, భారత బృందంలో సభ్యుల్లో ఒకరు పెరుగుతారు. మొట్టమొదటిసారి వందకుపైగా సభ్యులను పంపిన భారత్ ఆరు కంటే ఎక్కువ పతకాలపై కనే్నసింది. డోపింగ్ సమస్యలు చుట్టుముట్టడం ఆత్మవిశ్వాసాన్ని కొంత దెబ్బతీస్తున్నా, ఏమీ జరగనట్టే ఉండేందుకు భారత క్రీడాకారులు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. బింద్రాతోపాటు చాలా మందికి ఇవే చివరి ఒలింపిక్స్ కావడం కూడా వారి పట్టుదలకు కారణం. డోపింగ్ వివాదం నుంచి బయటపడి, రియోకు గ్రీన్ సిగ్నల్ సంపాదించిన నర్సింగ్ పంచమ్ యాదవ్‌కు పతకం లభించే అవకావాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ 65 కిలోల విభాగంలో మరోసారి పతకాన్ని సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, సుశీల్ కుమార్ మాదిరిగానే లండన్ ఒలింపిక్స్ తర్వాత అతను ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేదు. సత్తా చూపలేదు. దీనికి తోడు గాయాల సమస్య కూడా యోగేశ్వర్‌ను వేధిస్తున్నది. సుశీల్‌కు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఈ విషయంలో యోగేశ్వర్‌ను అదృష్టవంతుడిగానే చెప్పుకోవాలి. ఈ అవకాశాన్ని అతను ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. లండన్ ఒలింపిక్స్‌లో గీతా ఫొగట్ చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈసారి ఒలింపిక్స్‌లో ఆమె కజిన్స్ వినేష్ ఫొగట్ (48 కిలోల విభాగం), బబితా కుమారి (53 కిలోల విభాగం) పోటీపడుతున్నారు. వీరితోపాటు సాక్షి మాలిక్ (58 కిలోల విభాగం) కూడా రంగంలో ఉంది. పురుషులు, మహిళల విభాగాల్లో మేటి రెజ్లర్లు ఉన్నకారణంగా ఒకటిరెండు పతకాలు వస్తాయని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న ఇవోనా మట్కోవ్‌స్కాను ఓడించి రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన వినేష్‌కు పతకం ఖాయమని అంటున్నారు.
బాక్సింగ్ విషయానికి వస్తే, 2012 ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. అప్పట్లో రికార్డు స్థాయిలో మొత్తం ఎనిమిది మంది బాక్సర్లు భారత్ తరఫున పోటీకి దిగారు. అయితే, ఈసారి ఈ సంఖ్య మూడుకు పడిపోయింది. 56 కిలోల విభాగంలో శివ థాపా, 75 కిలోల విభాగంలో వికాస్ కృషన్ పతకాలు సాధించే సత్తా ఉన్నవారిగా ముద్ర పడ్డారు. 64 కిలోల విభాగంలో మనోజ్ కుమార్ పోటీలో ఉన్నాడు. మహిళల విభాగంలో ఒక్కరు కూడా క్వాలిఫై కాలేదు.
నాలుగేళ్ల క్రితం అభిమానుల అంచనాలకు తగిన స్థాయిలో రాణించడంలో విఫలమైన భారత ఆర్చర్లు ఈసారి పతకాల సాధనే లక్ష్యంగా ఎంచుకున్నారు. సుమారు రెండు వారాల ముందే వీరు రియోకి వెళ్లారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడడంతోపాటు, గాలివాటును గమనించి బాణాలు సంధించడంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలుగా రియో చేరుకున్న వారు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరిలో దీపికా కుమారిపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. బొంబాల్యా దేవి నుంచి పతకాన్ని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, వీరికి కొరియా, మెక్సికో, ఇటలీ దేశాల ఆర్చర్ల నుంచి గట్టిపోటీ తప్పకపోవచ్చు.
వివాదాల టెన్నిస్
భారత టెన్నిస్ వివాదాల్లో మునిగితేలుతున్నది. రియోకు అర్హత సంపాదించిన రోహన్ బొపన్న తన భాగస్వామిగా సాకేత్ మైనేనిని ఎంచుకున్నాడు. అయితే, అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) అతని మాటలను లక్ష్యపెట్టకుండా, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌ను అతనికి పార్ట్‌నర్‌గా ఎంపిక చేసింది. వయసు మీద పడుతున్నప్పటికీ ఇంకా కెరీర్‌ను విడిచిపెట్టని పేస్‌తో బొపన్నకు సఖ్యత లేదు. ఒకప్పుడు పేస్‌కు భాగస్వామిగా ఉండి, తర్వాత తీవ్ర స్థాయిలో విభేదించుకున్న మహేష్ భూపతితో బొపన్న సన్నిహితంగా ఉంటాడు. లండన్ ఒలింపిక్స్ సమయంలోనే పేస్, భూపతి మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. ప్రత్యక్షంగా పేస్‌తో మాటామాటా అనుకున్న బొపన్న ఇప్పుడు అతనితోనే కలిసి ఏ విధంగా ఆడతాడు? ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉంటుందా అన్న ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఈ వివాదాలను పక్కకుపెడితే సానియా మీర్జా నుంచి అభిమానులు పతకాన్ని ఆశిస్తున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఆమెకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సైనా రాణిస్తుందా?
బాడ్మింటన్ సూపర్ స్టార్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ చాలాకాలంగా నిలకడగా రాణించలేకపోతున్నది. ఒకసారి అద్భుతంగా ఆడితే, మరోసారి దారుణంగా విఫలమవుతున్నది. కాలి గాయం ఆమెను ప్రతిభను దెబ్బతీస్తున్నది. రియోలో సునాకు పతకం లభిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి అనుమానంగానే ఉంది. తెలుగు తేజం పివి సింధు, కిడాంబి శ్రీకాంత్, జ్వాలా గుత్తా కూడా పతకాలు సాధించగల సమర్థులే. వీరిలో ఎంత మంది తమ స్థాయికి తగినట్టు ఆడతారన్నదే అనుమానం.
జిమ్నాస్టిక్స్‌లో 22 ఏళ్ల దీపా కర్మాకర్ సంచలనం రేపింది. ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి భారతీయురాలిగా రికార్డు పుస్తకంలో స్థానం సంపాదించాడు. ఒలింపిక్ పతకంపై ఆమె ధీమాతో ఉంది.
సర్దార్ సింగ్‌ను తప్పించి, గోల్‌కీపర్ శ్రీజేష్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, రియోలో భారత హాకీ జట్టు తీరు మారుతుందా లేదా అన్నది ఆసక్తిని రేపుతున్నది. రోలాండ్ ఆల్ట్‌మన్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న భారత్ ఒకే తరహా ప్రదర్శనతో పతకాలను సాధించడంలో విఫలమవుతున్నది. మిగతా క్రీడల్లో మాదిరిగానే హాకీలోనూ నిలకడలేకపోవడం భారత్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య. కాగా, 36 సంవత్సరాల తర్వాత తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన భారత మహిళల హాకీ జట్టు ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగుతున్నది. ఈ జట్టు సాధించే ప్రతి విజయం అదనపు లాభంగానే పరిగణించాల్సి ఉంటుంది.
ఒలింపిక్స్‌లో 112 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి స్థానం సంపాదించిన గోల్ఫ్‌లో భారత్ తరఫున అనిర్బాన్ లాహిరి కీలక ఆటగాడిగా పోటీపడనున్నాడు. చక్కటి ఫామ్‌లో ఉన్న అతను పతకాన్ని సాధించినా ఆశ్చర్యం లేదని విశే్లషకులు అంటున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జాసన్ డే, డస్టిన్ జాన్సన్, జోర్డాన్ స్పీత్, రొరీ మెకల్‌రొయ్ రియో ఒలింపిక్స్ నుంచి వైదొలిగారు. బ్రెజిల్‌లో జికా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందన్న కారణంగా వారు ఒలింపిక్స్‌ను వదులుకున్నారు. ఈ పరిస్థితుల్లో అనిర్బాన్ విజయావకాశాలు మెరుగుపడ్డాయి.
అథ్లెటిక్స్‌లో భారత్ ప్రదర్శన ప్రతిసారీ నామమాత్రంగానే ఉంటుంది. మిల్కా సింగ్, పిటి ఉష, అంజూ బాబీ జార్జి వంటి అతిరథమహారథులే ఒలింపిక్స్‌లో పతకాలను గెల్చుకోలేకపోయారు. ప్రమాణాల విషయంలో వారి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతున్న అథ్లెట్లే ఇప్పుడు ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. ఈ మేజర్ ఈవెంట్‌లో పాల్గొనడానికి ఉన్న కనీస అర్హతను సంపాదించడానికే నానా తంటాలు పడుతున్న భారత అథ్లెట్లు పతకాలను గెల్చుకుంటారనుకోవడం అత్యాశే అవుతుంది.
రియోలో జూడో, స్విమ్మింగ్, రోయింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లోనూ భారత్ పోటీపడుతున్నది. అయితే, వీటిలో ఏ విభాగంలోనూ భారత్‌కు పతకాలు దక్కే సూచనలు లేవు.

ఏ క్రీడలో ఎంత మంది?

* రియో ఒలింపిక్స్‌లో భారత్ మొట్టమొదటిసారి వందకుపైగా అథ్లెట్లతో కూడిన బృందాన్ని పంపుతున్నది. క్రీడల వారీగా భారత జట్ల వివరాలు..
ఆర్చరీ: 4 (పురుషుడు 1, మహిళలు 3).
అథ్లెటిక్స్: 35 (పురుషులు 18, మహిళలు 17).
బాడ్మింటన్: 7 (పురుషులు 3, మహిళలు 4).
బాక్సింగ్: 3 (పురుషులు).
ఫీల్డ్ హాకీ: 36 (పురుషులు 18, మహిళలు 18).
జిమ్నాస్టిక్స్: ఒకరు.
జూడో: ఒకరు.
రోయింగ్: ఒకరు
షూటింగ్: 12 (పురుషులు 9, మహిళలు 3).
స్విమ్మింగ్: 2 (ఒక పురుషుడు, ఒక మహిళ).
టేబుల్ టెన్నిస్: 4 (పురుషులు 2, మహిళలు 2).
టెన్నిస్: 4 (పురుషులు 2, మహిళలు 2).
వెయిట్‌లిఫ్టింగ్: 2 (పురుషుడు 1, మహిళ 1).
రెజ్లింగ్: 8 (పురుషులు 5, మహిళలు 3).
మొత్తం 119 (పురుషుల 200 మీటర్ల పరుగులో పాల్గొనాల్సిన ధరమ్‌వీర్ సింగ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. అధికారులు అతనిని పంపకపో తే, భారత బృందంలో 118 మంది ఉంటారు).
(్భరత్ పోటీపడే క్రీడలు 14,
క్రీడా విభాగాలు 64).