క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన దీప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన దీపా కర్మాకర్ క్వాలిఫయర్‌లో చక్కటి ప్రతిభ చూపి, ఫైనల్స్‌లో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది. అత్యంత సంక్లిష్టమైన ‘ప్రొడునొవా’ వాల్ట్‌లో నైపుణ్యాన్ని కనబరచిన ఆమె మహిళల ఇండివిజువల్ వాల్ట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో మొత్తం 14.850 పాయింట్లు సంపాదించి ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించింది. హీట్స్‌లో మొదటి ఎనిమిది స్థానాలు సంపాదించిన వారికి ఆదివారం జరిగే ఫైనల్‌కు అర్హత సంపాదిస్తారు. దీప ఈ జాబితాలో చివరి స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ, మొదటిసారి ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ ఈవెంట్ ఫైనల్ చేరి రికార్డు పుస్తకాల్లో తన పేరును నమోదు చేసుకుంది. మొదటి ప్రయత్నంలో ఆమె డిఫికల్టీలో 7.0, ఎగ్జిక్యూషన్‌లో 8.1 చొప్పున పాయింట్లు సంపాదించింది. రెండో ప్రయత్నంలో డిఫికల్టీలో విఫలమైన ఆమె 6.00 పాయింట్లకే పరిమితమైంది. అయితే, మొత్తం మీద 14.850 పాయింట్లు సాధించగలిగింది. ఈ విభాగంలో అమెరికాకు చెందిన సిమోన్ బైల్స్ 16.050 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, హోంగ్ అన్ జాంగ్ (ఉత్తర కొరియా/ 15.683 పాయింట్లు), గులియా స్టెయిన్‌గ్రూబర్ (స్విట్జర్లాండ్/ 15.266 పాయింట్లు) వరుసగా ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచారు. ఆదివారం నాటి ఫైనల్‌లో దీప ఏ విధంగా రాణిస్తుందో చూడాలి. ఫలితం ఎలావున్నా జిమ్నాస్టిక్స్‌లో భారత దేశ ఉనికిని చాటిచెప్పిన దీప అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నది.
ప్రాణాలతో చెలగాటం
రష్యా మాజీ జిమ్నాస్ట్ ఎలెనా సెర్గియెన్వా ప్రొడునొవా వాల్ట్ విభాగంలో అప్పటి వరకూ ఎవరూ చేయని విన్యాసాన్ని ప్రదర్శించి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మెరుపు వేగంతో పరిగెత్తే జిమ్నాస్ట్ ఏమాత్రం తడబడకుండా చేతులను వాల్ట్‌పై బలంగా ఉంచి ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతారు. అక్కడి వరకూ అది సాధారణ వాల్ట్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ల్యాండింగ్ మాత్రం భిన్నంగా ఉంటుంది. గాల్లోనే తలను కిందకు వచ్చి, మోకాళ్లను ఛాతి దగ్గరగా చేర్చి, వాటిని చేతులతో బలంగా బంధిస్తారు. అదే పొజిషన్‌లో సామర్‌సాల్ట్స్ (పల్టీలు) కొడుతూ, చివరి క్షణాల్లో చేతులను తీసేసి, కాళ్లపై నిటారుగా ల్యాండ్ అవుతారు. ఈ మొత్తం విన్యాసం కళ్లుమూసి తెరిచేటంత సమయంలోనే పూర్తవుతుంది. అంత తక్కువ సమయంలో సంక్లిష్టమైన విన్యాసాన్ని పూర్తి చేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్ర గాయాలవుతాయి. ల్యాండింగ్ సమయంలో ఏమాత్రం తేడా జరిగినా, ముందుగా తల నేలపై బలంగా కొట్టుకుంటుంది. ఒక్కోసారి వెన్నుముక విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అంతటి సంక్లిష్టమైన, ప్రమాదకరమైన విన్యాసాన్ని తొలుత ప్రదర్శించిన ప్రొడునొవా పేరే దీనికి ఖాయమైంది. దీపసహా ఇప్పటి వరకూ మరో ముగ్గురు మాత్రమే ఈ విన్యాసాన్ని ప్రదర్శించారు. ‘ప్రొడునొవా’ అంటే జిమ్నాస్ట్‌లు ఎంత భయపడతారో చెప్పడానికి ఇంతకంటే రుజువు అవసరం ఉండదు. జిమ్నాస్టిక్స్‌కు మన దేశంలో ఎలాంటి ఆదరణ లేదు. త్రిపుర లాంటి మారుమూల రాష్ట్రాల్లో జిమ్నాస్టిక్స్ అంటే ఏమిటో కూడా చాలా మందికి తెలియదు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన దీప సాధారణ జిమ్నాస్ట్‌గా కాకుండా ‘ప్రొడునొవా’ ప్రదర్శించే సాహసిగా ఎదగడం వెనుక ఆమె కఠోర దీక్ష ఉంది. శరీరాన్ని 720 డిగ్రీల కోణంలో వంచుతూ చేసే మరో ప్రమాదకరమై ‘సుకహరా’ విన్యాసాన్ని కూడా దీప ప్రదర్శిస్తోంది. ప్రాక్టీస్ నుంచి మొదలుకొని వివిధ చాంపియన్‌షిప్స్‌లో పతకం కోసం పోటీ పడే వరకూ ప్రతిసారీ ప్రమాదకరమైన ‘ప్రొడునొవా’, ‘సుకహరా’ విన్యాసాలు చేయడం ప్రాణాలతో చెలగాటం ఆడడమే. రోజుకు తొమ్మిది గంటలు సాధన చేసే దీపను సాహసిగా చెప్పుకోవాలి. ప్రాణాలు హరించే లేదా జీవితాంతం వికలాంగులుగా మార్చే ‘ప్రొడునొవా’ విన్యాసాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, దీప మాత్రం దానినే ఎంచుకోవడం వెనుక అంతులేని ఆత్మవిశ్వాసం, జిమ్నాస్టిక్స్ పట్ల ఉన్న అంకిత భావం కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. అందుకే, ఇండివిజువల్ వాల్ట్ ఈవెంట్‌లో ఫైనల్ చేరడమే దీప సాధించిన అపూర్వ విజయంగా పేర్కోవాలి. పతకం గెలిస్తే, అది అదనపు ఆభరణం అవుతుంది. దీప పతకం సాధిస్తుందన్న ధీమా అభిమానుల్లో బలంగా ఉంది.

మహిళల ఇండివిజుల్ వాల్ట్‌లో
ఫైనల్ చేరింది వీరే..
1. సిమోన్ బైల్స్ (అమెరికా/ 16.050 పాయింట్లు), 2. హోంగ్ అన్ జాంగ్ (ఉత్తర కొరియా/ 15.683 పాయింట్లు), 3. గులియా స్టెయిన్‌గ్రూబర్ (స్విట్జర్లాండ్/ 15.266 పాయింట్లు), 4. మరియా పసెకా (రష్యా/ 15.049 పాయింట్లు), 5. ఒసాకా చసొవిటినా (ఉజ్బెకిస్తాన్/ 14.999 పాయింట్లు), 6. షలాన్ ఒస్లెన్ (కెనడా/ 14.950 పాయింట్లు), 7. వాంగ్ యాన్ (చైనా/ 14.949 పాయింట్లు), 8. దీపా కర్మాకర్ (్భరత్/ 14.850 పాయింట్లు).

చిత్రం.. మహిళల ఇండివిజువల్ వాల్ట్‌లో ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్