క్రీడాభూమి

ఫైనల్ రౌండ్‌కు చేరకుండానే సీమా ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 16: రియో ఒలింపిక్స్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించడంలో భారత డిస్కస్ త్రోవర్ సీమా అంటిల్ పునియా (33) విఫలమైంది. మంగళవారం ఇక్కడి ఒలింపిక్ స్టేడియంలో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల నడుమ జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ పోటీల్లో కేవలం 57.58 మీటర్ల దూరం మాత్రమే డిస్కస్‌ను విసిరి 20వ స్థానంతో సరిపెట్టుకున్న ఆమె ఈ పోటీల నుంచి నిష్క్రమించింది. ఒలింపిక్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో క్యూబాకు చెందిన యామీ పెరెజ్ 65.38 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి అగ్రస్థానంలోనూ, చైనాకు చెందిన డిస్కస్ త్రోవర్ సూ జినెయు 65.14 మీటర్ల మార్కుతో ద్వితీయ స్థానంలోనూ నిలువగా, నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని కైవసం చేసుకుని ప్రస్తుతం హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన క్రొయేషియా డిస్కస్ త్రోవర్ శాండ్రా పెర్కోవిచ్ 64.81 మీటర్ల మార్కుతో మూడో స్థానానికి పరిమితమైంది. తీవ్రమైన గాలి, ఎడతెరిపి లేని భారీ వర్షం మధ్య జరిగిన ఈ పోటీల్లో తొలి ప్రయత్నంలో 57.58 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి రెండో ప్రయత్నంలో ఫౌల్ అయిన సీమా చివరి ప్రయత్నంలో కేవలం 56.78 మీటర్ల దూరం మాత్రమే డిస్కస్‌ను విసరడంతో ఆమె గ్రూప్-బిలో తొమ్మిదో స్థానానికి, మొత్తం మీద 20వ స్థానానికి పరిమితమైంది. గతంలో 62.62 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో అలరించిన సీమా పునియా ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఆ మార్కు కంటే ఎంతో వెనుకబడటం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న సీమా అంటిల్ పునియా రియో ఒలింపిక్స్‌కు ముందు అమెరికా, రష్యాలో శిక్షణ పొందిన విషయం తెలిసిందే. కెరీర్‌లో ఇప్పటివరకూ మూడుసార్లు ఒలింపిక్స్ బరిలోకి దిగిన ఆమె తాజా వైఫల్యంతో అన్ని ఒలింపిక్స్‌లోనూ క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే నిష్క్రమించినట్లయింది. ఇంతకుముందు ఆమె 2004లో జరిగిన ఏథెన్స్ ఒలింపిక్స్‌తో పాటు 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో కూడా క్వాలిఫికేషన్ రౌండ్‌ను దాటలేదు.

చిత్రం..భారత డిస్కస్ త్రోవర్ సీమా అంటిల్ పునియా