క్రీడాభూమి

బైల్స్‌కు నాలుగో స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 17: అమెరికా యువ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ రియో ఒలింపిక్స్‌ను స్వర్ణ పతకంతో ముగించింది. టీం, ఆల్‌రౌండ్, వాల్ట్ ఈవెంట్స్‌లో విజేతగా నిలిచిన ఆమె బ్యాలెన్స్ బీమ్ విభాగంలో అనూహ్యంగా కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. అయితే, చివరి ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో మళ్లీ సత్తా చాటిన ఆమె స్వర్ణాన్ని అందుకుంది. ఆమె 15.966 పాయింట్లు సంపాదించగా, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అలే రైస్మన్ 15.500 పాయింట్లతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. బ్రిటన్‌కు చెందిన అమీ టింక్లర్ 14.933 పాయింట్లు సంపాదించి కాంస్య పతకాన్ని అందుకుంది. కాగా, ఒక ఒలింపిక్స్‌లో నాలుగు జిమ్నాస్టిక్స్ స్వర్ణాలను సాధించిన ఐదో మహిళగా బైల్స్ చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది. ఇంతకు ముందు ఆగ్నెస్ కెలెటీ (హంగరీ/ 1956 ఒలింపిక్స్), లారిసా లాటినినా (సోవియట్ యూనియన్/ 1956 ఒలింపిక్స్), వెరా కాస్లవ్‌స్కా (చెక్ రిపబ్లిక్/ 1968 ఒలింపిక్స్), ఎకతరీన జబో (రుమేనియా/ 1984 ఒలింపిక్స్) గతంలో ఈ ఫీట్ సాధించగా, బైల్స్ వారి సరసన స్థానం దక్కించుకుంది.
చైనాకు షాక్
అంతర్జాతీయ వేదికలపై జరిగే ప్రతి మేజర్ జిమ్నాస్టిక్స్ ఈవెంట్‌లోనూ తిరుగులేని ప్రతిభ కనబరచే చైనాకు రియో ఒలింపిక్స్‌లో చుక్కెదురైంది. ఆ దేశానికి ఒక్క పతకం కూడా లభించలేదు. 1984లో మొట్టమొదటిసారి జిమ్మాస్టిక్స్ విభాగంలో ఒలింపిక్స్ పతకాన్ని కైవసం చేసుకున్న చైనాకు గత 32 ఏళ్లలో ఒక్క పతకం కూడా దక్కకపోవడం ఇదే మొదటిసారి. అమెరికా 4 స్వర్ణం, 6 రజతం, 2 కాంస్యాలతో మొత్తం 12 పతకాలు సాధించి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. బ్రిటన్ 2 స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్యం (మొత్తం ఆరు), జపాన్ 2 స్వర్ణం, ఒక కాంస్యం (మొత్తం మూడు) సంపాదించి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, గ్రీస్, నెదర్లాండ్స్, ఉత్తర కొరియా, బ్రెజిల్ దేశాలు కూడా జిమ్నాస్టిక్స్‌లో పతకాలను గెల్చుకున్నాయి. చైనా మాత్రం ఒక్క పతకాన్ని కూడా గెల్చుకోలేక రిక్త హస్తాలతో ఇంటిదారి పట్టింది.
రియో డి జెనీరో, ఆగస్టు 17: రియో ఒలింపిక్స్‌లో ప్రతిష్ఠాత్మకమైన పురుషుల 110 మీటర్ల హర్టిల్స్‌ను జమైకా అథ్లెట్ ఒమర్ మెక్‌లియోడ్ గెల్చుకున్నాడు. ఆర్లాండో ఒర్టెగా, డిమిట్రి బాస్కో తదితరుల నుంచి ఎదురైన తీవ్రమైన పోటీని తట్టుకున్న అతను 13.05 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. క్యూబాలో జన్మించి, స్పెయిన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒర్టెగా 13.17 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి రజత పతకాన్ని సాధించాడు. 13.24 సెకన్లలో గమ్యాన్ని చేరిన బాస్కోకు కాంస్య పతకం లభించింది.
ఖాళీ సీట్లు!
మెక్‌లియోడ్ పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌ను గెలిచి సంబరాలు జరుపుకొంటున్నప్పుడు అతనిని అభినందించడానికి స్టేడియంలో వందల సంఖ్యలో కూడా ప్రేక్షకులు లేరు. 60,000 మంది కూర్చొని పోటీలను తిలకించే అవకాశం ఉన్నప్పటికీ, ఒలింపిక్స్‌ను వ్యతిరేకిస్తున్న వర్గం ఇచ్చిన పిలుపుతో స్టేడియానికి వచ్చే వారు తక్కువయ్యారు. అథ్లెటిక్స్‌కు మంచి స్పందన ఉంటుందన్న నిర్వాహకుల అంచనాలు తల్లకిందులయ్యాయి. ఖాళీ సీట్లు వెక్కిరించడంతో, ప్రేక్షకులను ఏ విధంగా రప్పించాలో అర్థంగాక వారు మల్లగుల్లాలు పడుతున్నారు.
కొరవడిన క్రీడాస్ఫూర్తి
బ్రెజిల్ అభిమానుల్లో క్రీడాస్ఫూర్తి కొరవడింది. ఈ విషయం అనేక సందర్భాల్లో స్పష్టంకాగా, తాజాగా పురుషుల పోల్‌వాల్ట్ పోటీలు జరుగుతున్నప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఈవెంట్‌లో బ్రెజిల్ పోల్‌వాల్టర్ థియాగో బ్రాజ్ డ సిల్వ ఫైనల్స్ చేరాడు. అతనికి ఫ్రాన్స్ అథ్లెట్ రెనాడ్ లావిలెనీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. థియాగోకు మద్దతు ప్రకటించిన బ్రెజిల్ వీరాభిమానులు లావినెనీ జంప్ కోసం వచ్చిన ప్రతిసారీ అతనిని హేళన చేశారు. చివరికి థియాగో 6.03 మీటర్ల ఎత్తుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, 5.98 మీటర్లు జంప్ చేసిన లావినెనీ రజత పతకానికి పరిమితయ్యాడు. శామ్ కెండ్రిక్స్ (అమెరికా) 5.85 మీటర్లను పూర్తి చేసి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. కాగా, ప్రేక్షకుల ప్రవర్తన తన ఏకాగ్రతను దెబ్బతీసిందని, అందుకే పూర్తిస్థాయిలో రాణించలేకపోయానని లావినెనీ వాపోయాడు. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో ప్రేక్షకులు ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నిర్వాహకుల క్షమాపణ
పురుషుల పోల్‌వాల్ట్ సందర్భంగా ప్రేక్షకులు ప్రవర్తించిన తీరుపై నిర్వాహకులు బహిరంగ క్షమాపణ చెప్పారు. అభిమానుల నుంచి ఇలాంటి ప్రవర్తనను ఊహించలేదని ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని ఎవరూ హర్షించరని అన్నారు. భవిష్యత్తులో ఈ విధమైన సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
పురుషుల ఫీల్డ్ హాకీ జర్మనీ నిష్క్రమణ
పురుషుల ఫీల్డ్ హాకీలో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ ఎవరూ ఊహించని విధంగా సెమీ ఫైనల్స్‌లో ఓటమిపాలై నిష్క్రమించింది. అర్జెంటీనాతో సెమీ ఫైనల్‌ను సులభంగా గెలుస్తామన్న నమ్మకంతో మైదానంలోకి దిగిన జర్మనీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థికి ఏకంగా ఐదు గోల్స్ చేసే అవకాశం ఇచ్చిన జర్మనీ పరాజయాన్ని కొనితెచ్చుకుంది. పేలవమైన ఆటతో కేవలం రెండు గోల్స్ చేసి సంతృప్తి చెందింది. కాగా, ఫైనల్‌లో స్వర్ణం కోసం బెల్జియంతో అర్జెంటీనా ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో బెల్జియం 3-1 గోల్స్ ఆధిక్యంతో పటిష్టమైన నెదర్లాండ్స్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.

చిత్రం.. నాలుగు స్వర్ణాల సిమోన్ బైల్స్