క్రీడాభూమి

దేశమంతా సింధు నామస్మరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఒక విజయం కోట్లాది మందిపై ప్రభావం చూపగలదని రియో ఒలింపిక్స్‌లో పివి సింధు సాధించిన రజత పతకం నిరూపిస్తున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాలు లేదా భారత ఒలింపిక్ సంఘం స్పందించడంలో, నజరానాలు ప్రకటించడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ, దేశం మొత్తం ఆమెకు నీరాజనాలు పలకడమే విశేషం. గతంలో మరే క్రీడాకారిణికి దక్కని గౌరవం సింధుకు లభిస్తున్నది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సినీ తారల వరకూ అందరూ సింధును ముక్తకంఠంతో అభినందించడాన్ని చూస్తుంటే, ఆమె విజయం ఎంత మందిని ఏ విధంగా ప్రభావితం చేసిందో స్పష్టమవుతుంది. ఉప్పెనలా వచ్చి పడుతున్న ప్రశంసలు.. కోట్ల రూపాయల నజరానాలు.. ఒక క్రీడాకారిణికి ఇంతటి ఆదరణ ఇంతకు ముందు ఎప్పుడూ లభించలేదు. అందులోనూ క్రికెట్ తప్ప మరే క్రీడను పట్టించుకోని మన దేశంలో బాడ్మింటన్ క్రీడాకారిణికి అభిమానులు నీరాజనం పలకడం రాబోయే మార్పులను సూచిస్తున్నది. క్రీడా రంగానికి ఇది శుభ సూచకం. ఈ మార్పు సింధు వల్లే వచ్చిందనడం వాస్తవం.
అర్హురాలు
దేశమంతటా సింధు నామస్మరణే వినిపించడంలో ఆశ్చర్యంలేదు. అందుకు ఆమె అన్ని విధాలా అర్హురాలు. ఆమె వల్లే విశ్వ క్రీడా ప్రాంగణంలో తెలుగు తేజం తళుక్కున మెరిసింది. భారత కీర్తి బావుటాను ఎగిరింది. అందుకే ఆమె పేరు దేశమంతటా మారుమోగుతున్నది. రియో ఒలింపిక్స్ మహిళల బాడ్మింటన్‌లో రజత పతకాన్ని గెల్చుకొని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సింధు చైనా అడ్డుగోడల్ని బద్దలు చేసింది. హంగరీని విలవిల్లాడించింది. కెనడాకు ఎదురొడ్డి నిలిచింది. చైనీస్ తైపీ ఆధిక్యానికి గండికొట్టింది. బాడ్మింటన్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న క్రీడాకారిణులను చిత్తుచేసింది. ఆమె ధాటికి జపాన్ విలవిల్లాడింది. గతంలో భారత మహిళలు ఎవరూ అందుకోలేని అపూర్వ విజయాలను సాధించి ఫైనల్ చేరింది. అక్కడ ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ కోట్లాది మందికి ఆదర్శప్రాయమైంది. దేశ క్రీడా రంగానికి ఆమె సరికొత్త దిశా నిర్దేశనం చేసింది. బాడ్మింటన్‌ను ఏలుతున్న చైనా, జపాన్, ఇండోనేషియా వంటి దేశాలను దెబ్బతీయడం సాధ్యం కాదన్న వాదన తప్పని ఆమె నిరూపించింది. కోట్లాది మంది భారతీయులు కలలుగన్న ఓ అద్భుతాన్ని కళ్ల ముందు ఆవిష్కరించింది. సింధు సాధించింది ఆషామాషీ విజయమేమీ కాదు. 13 గ్రూపుల నుంచి పోటీపడిన మిగతా 39 మంది క్రీడాకారిణుల్లో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడమే వారి ప్రతిభకు నిదర్శనం. అంత మందిలో సింధు ఒక్కో మెట్టు ఎక్కడానికి అవిశ్రాంతంగా సాధన చేసింది. సర్వశక్తులు ఒడ్డింది. ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌లు ఆడింది. మొదటి రౌండ్‌లో హంగరీ మేటి లారా సరోసీని ఓడించడంతో జైత్ర యాత్రను ఆరంభించింది. మిచెల్ లీ, తైజూ ఇంగ్ వంటి ప్రతిభావంతులను సైతం పక్కకు నెట్టేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న వాంగ్ ఇహాన్‌ను క్వార్టర్ ఫైనల్‌లో ఓడించి ఔరా అనిపించింది. సెమీస్‌లో నొజోమీ ఒకుహరాపై గెలిచి, క్వార్టర్స్ విజయం అదృష్ట వశాత్తు లభించింది కాదని నిరూపించింది. టైటిల్ పోరులో సింధు ఓడడం నిరాశ పరచినా, దేశానికి ఒలింపిక్స్ ఇండివిడ్యువల్ ఈవెంట్‌లో తొలిసారి రజత పతకాన్ని అందించిన మహిళగా రికార్డు సృష్టించడం అందరికీ గర్వకారణమైంది. తెలుగువాళ్లకే కాదు.. యావత్ దేశానికే ఆమె ప్రస్థానం మార్గదర్శకం.