క్రీడాభూమి

సాక్షికి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 24: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్‌కు బుధవారం ఇక్కడ ఘన స్వాగతం లభించింది. మహిళల 58 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో ఆమె మూడో స్థానాన్ని ఆక్రమించిన విషయం తెలిసిందే. కుస్తీలో భారత్‌కు పతకాన్ని అందించిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందింది. అంతేగాక, రియోలో భారత బృందం మొత్తం వరుస వైఫల్యాలతో అల్లాడుతూ పతకంపై ఆశలు అడుగంటిపోతున్న సమయంలో సాక్షి సాధించిన పతకం అభిమానులకు ఊరటనిచ్చింది. ఆతర్వాత మహిళల బాడ్మింటన్ సింగిల్స్‌లో పివి సింధు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. రియో ఒలింపిక్స్‌లో దేశానికి లభించినవి ఈ రెండు పతకాలే. బుధవారం ఉదయం రియో నుంచి చండీగఢ్ చేరుకున్న సాక్షికి పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర బృందం చీఫ్‌గా రియో వెళ్లిన క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అనీల్ విజ్ ఆమె వెన్నంటే ఉన్నారు. విమానాశ్రయం నుంచి తల్లిదండ్రులు సుదేష్, సుఖ్‌వీర్ మాలిక్‌లతో కలిసి ఆమె జజ్జర్ జిల్లాలోని బహదూర్‌గఢ్‌కు చేరింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీనియర్ మంత్రులు కెప్టెన్ అభిమన్యు, ఒపి ధంకర్, పలువురు ఉన్నతాధికారులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బహదూర్‌గఢ్‌లో సాక్షి సన్మాన సభ జరిగింది. ఆమెకు హర్యానాలోని బిజెపి సర్కారు తరఫున 2.5 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి ఖట్టర్ బహూకరించారు. శాలువా, తలపాగాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇద్దరు ముద్దుబిడ్డలు సాక్షి, సింధు దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప చేశారని ప్రశంసించారు. సాక్షి విజయం హర్యానాకు మాత్రమేగాక, యావత్ దేశానికే గర్వకారణమని అన్నారు. ఆమెను ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమానికి రాష్ట్రం తరఫున బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. తల్లిదండ్రులు, కోచ్‌లు, రాష్ట్ర ప్రజలు గర్వించేలా సాక్షి అద్భుత ప్రదర్శనతో పతకాన్ని సాధించిందని కొనియాడారు. ప్రస్తుతం రైల్వేలో పని చేస్తున్న సాక్షికి త్వరలోనే పదోన్నతి లభిస్తుందని జోస్యం చెప్పారు. హర్యానా సర్కారు తరఫున ఆమెకు గ్రేడ్-2 స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ విషయాన్ని ఆలోచించుకొని చెప్తానని సాక్షి చెప్పినట్టు ఖట్టర్ తెలిపారు.
అందరికీ కృతజ్ఞతలు..
తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, కోచ్‌లు, హర్యానా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని సాక్షి చెప్పింది. ‘బేటీ బచావో.. బేటీ పడావో’ నినాదానికి ‘బేటీ ఖిలావో’ (అమ్మాయిలను ఆడించండి) అన్న మాటను కూడా చేర్చాలని అన్నది. ఇదే విధంగా మద్దతు లభిస్తే, భవిష్యత్తులో దేశానికి మరెన్నో పతకాలను సాధించిపెడతానని చెప్పింది.
సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె తల్లిదండ్రులతో కలిసి తన స్వస్థలమైన మోక్రా గ్రామానికి వెళ్లింది. మార్గమద్యంలో పలు ప్రాంతాల్లో స్థానికులు భారీ ఎత్తున హాజరై, ఆమెను పూలమాలలతో సత్కరించారు.
chitram...
బహదూర్‌గఢ్‌లో బుధవారం జరిగిన
ఓ కార్యక్రమంలో రెజ్లర్ సాక్షి మాలిక్‌ను సత్కరిస్తున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
chitram (2).....
తలపాగా ధరించిన సాక్షి చిరునవ్వులు